దెబ్బతిన్న లారీ (ఇన్‌సెట్) కట్టా రామకృష్ణ మృతదేహం
పెనుబల్లి: రెండు లారీలు ఢీకొన్న ప్రమాదంలో ఒక డ్రైవర్ మృతిచెందాడు. మరో డ్రైవర్‌కు, క్లీనర్‌కు గాయాలయ్యాయి. వైజాగ్ పోర్ట్ నుంచి యూరియా లోడ్‌తో సూర్యాపేట వైపు లారీ వెళుతోంది. పెనుబల్లి మండలంలోని టేకులపల్లి పవర్ ప్లాట్ ముందున్న బ్రిడ్జి వద్ద, ఎదురుగా ఖమ్మం వైపు నుంచి సత్తుపల్లి వైపు వస్తున్న లారీ, మరో లారీని ఓవర్ టేక్ చేస్తూ వేగంగా వచ్చి యూరియా లోడ్ లారీని ఢీ కొంది. యూరియా లోడ్ లారీ డ్రైవర్ కట్టా రామకృష్ణ (27) అక్కడికక్కడే మృతిచెందాడు. ఆ లారీ ముందున్న అద్దం పగిలింది. క్లీనర్ కొలిదల రాజు, క్యాబిన్ లోపలి నుంచి పగిలిన అద్దం నుంచి బయటకు ఎగిరి రోడ్డుపై పడిపోయాడు. అతడికి తీవ్ర గాయాలయ్యాయి. ఢీకొట్టిన లారీ డ్రైవర్, క్లీనర్ కూడా తీవ్రంగా గాయపడ్డారు. వీరిని కల్లూరులోని ప్రైవేటు ఆసుపత్రిలో స్థానికులు చేర్పించారు. అక్కడి నుంచి ఖమ్మం ఆసుపత్రికితరలించారు. మృతిచెందిన కట్టా రామకృష్ణది తూర్పు గోదావరి జిల్లా రాయవరం మండలం చెల్లూరు గ్రామం. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం పెనుబల్లి ప్రభుత్వాసుపత్రి మార్చురీకి పోలీసులు తరలించారు. యూరియా లోడ్ లారీ క్లీనర్ కొలిదల రాజు ఫిర్యాదుతో కేసును ఎస్సై తోట నాగరాజు దర్యాప్తు చేస్తున్నారు. రెండు లారీలు పూర్తిగా దెబ్బతిన్నాయి.
కరకగూడెం: రోడ్డు ప్రమాదంలో గ్రామీణ వైద్యుడు మృతిచెందాడు. ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాలు.... కరకగూడెం మండలంలోని అనంతారం గ్రామస్తుడైన గ్రామీణ వైద్యుడు షేక్ అబ్దుల్ రహీమ్,, సహచర గ్రామీణ వైద్యుడైన గొల్లగూడెం గ్రామస్తుడు సారంగపాణి కలిసి గొల్లగూడెం నుంచి ద్విచక్ర వాహనంపై మణుగూరు వెళ్తున్నారు. కలవలనాగారం గ్రామ మూలమలుపు వద్ద వీరి వాహనాన్ని ఎదురుగా వచ్చిన లారీ ఢీకొంది. తలకు తీవ్ర గాయాలతో షేక్ అబ్దుల్ రహీమ్(43) రోడ్డుపై పడిపోయాడు. అక్కడికక్కడే మృతిచెందాడు. సారంగపాణికి తీవ్ర గాయాలయ్యాయి. అతడిని స్థానికులు భద్రాచలం ఏరియా ఆసుపత్రికి తరలించారు. అబ్దుల్ రహీమ్‌కు భార్య షేక్ మెహబూబి, ఇద్దరు కుమార్తెలు అతహర్, ఆఫ్రీన్, ఇద్దరు కుమారులు అర్షద్, అసద్ ఉన్నారు. ప్రమాద స్థలాన్ని ఏడూళ్ల బయ్యారం సీఐ బి.అశోక్ పరిశీలించారు. మృతుని సోదరుడి ఫిర్యాదుతో కేసు నమోదైంది. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం భద్రాచలం ఏరియా ఆసుపత్రికి తరలించారు. సారంగపాణి పరిస్థితి విషమించినట్టు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment