సాక్షి, ఖమ్మం: పచ్చని కొండలు, చిక్కని అటవీ ప్రాంతం.. ఆహ్లాదకరమైన వాతావరణానికి తోడు పక్షుల కిలకిలరావాలతో సందడిగా ఉండే పులిగుండాల ప్రాజెక్టు పర్యాటకులను రా.. రామ్మని ఆహ్వానిస్తోంది. ఇక్కడ ఎంతసేపు చూసినా తనివితీరని ప్రకృతి అందాల సోయగాలు కనువిందు చేస్తున్నాయి. పెనుబల్లి మండలం బ్రహ్మళకుంట గ్రామ సమీపాన అటవీ ప్రాంతంలో గిరిజన రైతుల భూములు సాగు అవసరాల నిమిత్తం కొండల నడుమ పులి గుండాల సాగునీటి ప్రాజెక్టు నిర్మించారు.
ఈ ప్రాజెక్టు కొండల నడుమ అటవీప్రాంతంలో ఉండడంతో సాగునీటి అవసరాలు తీరుస్తూనే పర్యాటక కేంద్రంగా దినదినాభివృద్ధి చెందుతోంది. పెనుబల్లి మండలంలోని పులిగుండాల ప్రాజెక్టుతో పాటు నీలాద్రీశ్వర అటవీప్రాంతం, లంకాసాగర్ ప్రాజెక్టులు చెప్పుకోదగిన పర్యాటక ప్రాంతాలుగా రూపుదిద్దుకున్నాయి. అటవీశాఖ ఈ పులిగుండాల ప్రాజెక్టు వద్ద వాచ్ టవర్ నిర్మించి రక్షిత అటవీ ప్రాంతాన్ని కాపాడుతోంది.
రెండేళ్ల క్రితం పులిగుండాల సాగునీటి ప్రాజెక్టు వద్ద పులి జాడలు సీసీ కెమెరాల్లో నమోదు కావడంతో ఇక్కడ వన్యప్రాణుల సంతతి అభివృద్ధికి కూడా అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. తద్వారా పాపికొండలు, ఇతరత్రా ప్రాంతాలకు వెళ్లాల్సిన పని లేకుండా వారాంతాల్లో జిల్లా వాసులు సరదాగా గడిపేందుకు అద్భుతమైన పర్యాటక ప్రాంతం అందుబాటులోకి వచ్చినట్లవుతుంది.
చదవండి: యాక్టర్‌గా మారిన టీచర్.. ట్రెండ్ సెట్టర్‌గా మారుతున్న యూట్యూబర్ అనిల్
పులిగుండాల ప్రాజెక్టు వద్ద శివాలయం...
రెండు రాష్ట్రాల నుంచి పర్యాటకులు
జిల్లాలోని పెనుబల్లి, కల్లూరు, తల్లాడ, ఏన్కూరు, సత్తుపల్లితో పాటు ఏపీలోని తిరువూరు తదితర ప్రాంతాల ప్రజలు పులిగుండాల ప్రాజెక్టు అందాలను వీక్షించేందుకు బారులు తీరుతున్నారు. ఆదివారాల్లో ఇక్కడకు కుటుంబ సభ్యులతో కలిసి విహార యాత్రకు వచ్చే వారితో సందడి కనిపిస్తుంది. ఈ ప్రాజెక్టు వద్ద స్థానికులు శివాలయాన్ని నిర్మించి పూజలు చేస్తున్నారు. ఈ ప్రాంతానికి పలువురు ఐఏఎస్‌లు, ఐసీఎస్‌లతో పాటు ఇతర రాష్ట్ర స్థాయి అధికారులు, ప్రజాప్రతినిధులు వారంతాల్లో వచ్చి అటవీశాఖ ఆధ్వర్యాన నిర్మించిన వాచ్ టవర్ (పాలపిట్ట భవనం) నుంచి అటవీ అందాలు తిలకిస్తూ సేద తీరుతుంటారు.
అటవీ ప్రాంతంలో నిర్మించిన పులిగుండాల ప్రాజెక్టును చేరుకోవాలంటే బ్రహ్మళకుంట నుండి సుమారు నాలుగైదు కిలోమీటర్ల మేర మట్టిరోడ్డుపై ప్రయాణించాల్సి వస్తోంది. ఇది కాస్త ఇబ్బందిగా ఉన్నందున... అధికారులు పరిగణనలోకి తీసుకుని బ్రహ్మళకుంట నుండి పులిగుండాల ప్రాజెక్టు వరకు రహదారి నిర్మిస్తే పర్యాటకుల సంఖ్య మరింత పెరిగే అవకాశముంది. అంతేకాకుండా పాలపిట్ట పేరిట వాచ్‌టవర్(భవనం)ను నిర్మించినా విశ్రాంతి గదులు, టాయిలెట్లు మాత్రమే ఉన్నాయి. దీనికి తోడు విద్యుత్, తాగునీటి సౌకర్యం కూడా కల్పిస్తే పర్యాటకులను ఆకట్టుకోవచ్చు. వాచ్ టవర్‌కు సోలార్ ద్వారా విద్యుత్‌సౌకర్యం, బోరు, మోటారు ఏర్పాటుచేసి తాగునీటి సౌకర్యం ఏర్పాటు చేస్తే అటవీ అందాలను తిలకించేందుకు వచ్చే పర్యాటకుల సంఖ్య మరింత పెరుగుతుంది.
Comments
Please login to add a commentAdd a comment