penuballi
-
Puli Gundala Project: కనువిందు చేస్తున్న ప్రకృతి సోయగం
సాక్షి, ఖమ్మం: పచ్చని కొండలు, చిక్కని అటవీ ప్రాంతం.. ఆహ్లాదకరమైన వాతావరణానికి తోడు పక్షుల కిలకిలరావాలతో సందడిగా ఉండే పులిగుండాల ప్రాజెక్టు పర్యాటకులను రా.. రామ్మని ఆహ్వానిస్తోంది. ఇక్కడ ఎంతసేపు చూసినా తనివితీరని ప్రకృతి అందాల సోయగాలు కనువిందు చేస్తున్నాయి. పెనుబల్లి మండలం బ్రహ్మళకుంట గ్రామ సమీపాన అటవీ ప్రాంతంలో గిరిజన రైతుల భూములు సాగు అవసరాల నిమిత్తం కొండల నడుమ పులి గుండాల సాగునీటి ప్రాజెక్టు నిర్మించారు. ఈ ప్రాజెక్టు కొండల నడుమ అటవీప్రాంతంలో ఉండడంతో సాగునీటి అవసరాలు తీరుస్తూనే పర్యాటక కేంద్రంగా దినదినాభివృద్ధి చెందుతోంది. పెనుబల్లి మండలంలోని పులిగుండాల ప్రాజెక్టుతో పాటు నీలాద్రీశ్వర అటవీప్రాంతం, లంకాసాగర్ ప్రాజెక్టులు చెప్పుకోదగిన పర్యాటక ప్రాంతాలుగా రూపుదిద్దుకున్నాయి. అటవీశాఖ ఈ పులిగుండాల ప్రాజెక్టు వద్ద వాచ్ టవర్ నిర్మించి రక్షిత అటవీ ప్రాంతాన్ని కాపాడుతోంది. రెండేళ్ల క్రితం పులిగుండాల సాగునీటి ప్రాజెక్టు వద్ద పులి జాడలు సీసీ కెమెరాల్లో నమోదు కావడంతో ఇక్కడ వన్యప్రాణుల సంతతి అభివృద్ధికి కూడా అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. తద్వారా పాపికొండలు, ఇతరత్రా ప్రాంతాలకు వెళ్లాల్సిన పని లేకుండా వారాంతాల్లో జిల్లా వాసులు సరదాగా గడిపేందుకు అద్భుతమైన పర్యాటక ప్రాంతం అందుబాటులోకి వచ్చినట్లవుతుంది. చదవండి: యాక్టర్‌గా మారిన టీచర్.. ట్రెండ్ సెట్టర్‌గా మారుతున్న యూట్యూబర్ అనిల్ పులిగుండాల ప్రాజెక్టు వద్ద శివాలయం... రెండు రాష్ట్రాల నుంచి పర్యాటకులు జిల్లాలోని పెనుబల్లి, కల్లూరు, తల్లాడ, ఏన్కూరు, సత్తుపల్లితో పాటు ఏపీలోని తిరువూరు తదితర ప్రాంతాల ప్రజలు పులిగుండాల ప్రాజెక్టు అందాలను వీక్షించేందుకు బారులు తీరుతున్నారు. ఆదివారాల్లో ఇక్కడకు కుటుంబ సభ్యులతో కలిసి విహార యాత్రకు వచ్చే వారితో సందడి కనిపిస్తుంది. ఈ ప్రాజెక్టు వద్ద స్థానికులు శివాలయాన్ని నిర్మించి పూజలు చేస్తున్నారు. ఈ ప్రాంతానికి పలువురు ఐఏఎస్‌లు, ఐసీఎస్లతో పాటు ఇతర రాష్ట్ర స్థాయి అధికారులు, ప్రజాప్రతినిధులు వారంతాల్లో వచ్చి అటవీశాఖ ఆధ్వర్యాన నిర్మించిన వాచ్ టవర్ (పాలపిట్ట భవనం) నుంచి అటవీ అందాలు తిలకిస్తూ సేద తీరుతుంటారు. అటవీ ప్రాంతంలో నిర్మించిన పులిగుండాల ప్రాజెక్టును చేరుకోవాలంటే బ్రహ్మళకుంట నుండి సుమారు నాలుగైదు కిలోమీటర్ల మేర మట్టిరోడ్డుపై ప్రయాణించాల్సి వస్తోంది. ఇది కాస్త ఇబ్బందిగా ఉన్నందున... అధికారులు పరిగణనలోకి తీసుకుని బ్రహ్మళకుంట నుండి పులిగుండాల ప్రాజెక్టు వరకు రహదారి నిర్మిస్తే పర్యాటకుల సంఖ్య మరింత పెరిగే అవకాశముంది. అంతేకాకుండా పాలపిట్ట పేరిట వాచ్‌టవర్(భవనం)ను నిర్మించినా విశ్రాంతి గదులు, టాయిలెట్లు మాత్రమే ఉన్నాయి. దీనికి తోడు విద్యుత్, తాగునీటి సౌకర్యం కూడా కల్పిస్తే పర్యాటకులను ఆకట్టుకోవచ్చు. వాచ్ టవర్‌కు సోలార్ ద్వారా విద్యుత్‌సౌకర్యం, బోరు, మోటారు ఏర్పాటుచేసి తాగునీటి సౌకర్యం ఏర్పాటు చేస్తే అటవీ అందాలను తిలకించేందుకు వచ్చే పర్యాటకుల సంఖ్య మరింత పెరుగుతుంది. -
ఏడేళ్లలో 4 రెట్లు పెరిగిన నిరుద్యోగం
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో ఎక్కువగా నిరుద్యోగ సమస్య ఉందని వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తెలిపారు. గత ఏడేళ్లలో నిరుద్యోగిత నాలుగు రెట్లు పెరిగిందని చెప్పారు. నిరుద్యోగులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నా సీఎం కేసీఆర్ పట ్టనట్టుగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం గంగదేవిపాడు గ్రామంలో ఇటీవల ఆత్మహత్య చేసుకున్న నిరుద్యోగి నాగేశ్వరరావు కుటుంబాన్ని మంగళవారం ఆమె పరామర్శించారు. అనంతరం పెనుబల్లిలో నిరుద్యోగ నిరాహార దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. బతికే మార్గం లేక ఆత్మహత్యలు తాము నిరుద్యోగులమంటూ 54 లక్షల మంది ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్నారని, ఇందులో పలువురు ఆత్మహత్య చేసుకున్నా.. ఫామ్‌హౌస్‌కే పరిమితమైన సీఎం దున్నపోతు మీద వాన పడిన చందంగా స్పందించడం లేదని షర్మిల విమర్శించారు. నిరుద్యోగులు బతికే మార్గం లేక, అవమానాలు భరించలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ రోజైనా 50 వేల ఉద్యోగాల గురించి కేసీఆర్ మాట్లాడుతున్నారంటే దానికి కారణం తాము బయటకు వచ్చి చేస్తున్న పోరాటం వల్లనే అని తెలిపారు. ఇప్పుడు ప్రతిపక్షానికి కూడా సోయి వచ్చిందన్నారు. తాము ప్రతి మంగళవారం దీక్షలు చేస్తుంటే వ్రతాలు చేస్తున్నా మని కేటీఆర్ అంటున్నారంటూ.. ‘మేము ఆడవాళ్లం మెతుకు ముట్టకుండా వ్రతమే చేస్తున్నాం అనుకుందాం.. మరి వీరు పెద్ద మగాళ్లు కదా.. అధికారంలో ఉన్నారు కదా.. ఉద్యోగ ఖాళీలు ఎందుకు భర్తీ చేయడం లేదు’అని షర్మిల నిలదీశారు. నిరుద్యోగులు హమాలీ పనులు చేసుకోవాలనే మంత్రి.. పదవికి రాజీనామా చేసి హమాలీ పనికి వెళ్లాలని సూచించారు. తనకు ఉద్యోగం రాలేదనే నాగేశ్వరరావు ఆత్మహత్య చేసుకున్నాడని తెలిపారు. 1.91 లక్షల ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. దీక్షకు ముందు వేదిక వద్ద దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాల వేసి షర్మిల నివాళులర్పించారు. -
పెనుబల్లిలో వైఎస్ షర్మిల ‘నిరుద్యోగ దీక్ష’
సాక్షి, ఖమ్మం జిల్లా: ఉమ్మడి ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గం పెనుబల్లిలో వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినాయకురాలు వైఎస్ షర్మిల మంగళవారం నిరుద్యోగ నిరాహార దీక్ష చేపట్టారు. ఇటీవల ఆత్మహత్య పాల్పడిన గంగదేవిపాడుకు చెందిన నిరుద్యోగి నాగేశ్వరరావు కుటుంబాన్ని షర్మిల పరామర్శించారు. రాష్ట్రంలో ఉన్న పలువురు నిరుద్యోగులతో ఫోన్లో వైఎస్ షర్మిల మాట్లాడారు. జోహార్ వైఎస్సార్, జై తెలంగాణ అంటూ ప్రసంగం ప్రారంభించిన వైఎస్ షర్మిల.. నిరుద్యోగులు ఆత్మహత్యలకు పాల్పడుతున్న సీఎం కేసీఆర్ పట్టించుకోవడంలేదని మండిపడ్డారు.కేసీఆర్ ఫామ్‌హౌస్‌కు పరిమితం అవుతుంటే నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ధ్వజమెత్తారు. పార్టీ పెట్టకముందే నిరుద్యోగుల కోసం నిరాహారదీక్ష చేపట్టామని, 72 గంటల పాటు అవమానాలను తట్టుకుని నిరాహార దీక్ష కొనసాగించామని తెలిపారు. లక్షా 91 వేల ఉద్యోగాలను వెంటనే సీఎం కేసీఆర్ భర్తీ చేయాలని ఆమె డిమాండ్ చేశారు. వయో పరిమితి పెంచాల్సిన అవసరం ఉందన్నారు. -
పెనుబల్లిలో నేడు షర్మిల ‘నిరుద్యోగ దీక్ష’
సాక్షి,హైదరాబాద్: ఉమ్మడి ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గం, పెనుబల్లి ఎమ్మార్వో ఆఫీస్ వద్ద వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినాయకురాలు వైఎస్ షర్మిల మంగళ వా రం ఉదయం 9 నుంచి సాయంత్రం 6 గంటల వరకు ‘నిరుద్యోగ నిరాహార దీక్ష’ చేపట్టనున్నారు. ఇటీవల ఆత్మహత్య పాల్పడిన గంగదేవిపాడుకు చెందిన నిరుద్యోగి నాగేశ్వరరావు కుటుంబాన్ని షర్మిల పరామర్శించనున్నారు. -
మహిళతో సహజీవనం చేస్తున్నాడనే ఆవేదనతో..
సాక్షి, పెనుబల్లి: ఉరి వేసుకుని వివాహిత ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన పెనుబల్లి మండలంలోని గంగదేవిపాడులో శనివారం చోటు చేసుకుంది. వివరాలు.. గ్రామానికి చెందిన మల్లీశ్వరి, ధరావత్ లక్ష్మణ్‌ను ప్రేమ పెళ్లి చేసుకుంది. కొంతకాలం తర్వాత లక్ష్మణ్ మరొక మహిళతో సహజీవనం చేస్తున్నాడనే విషయంపై ఇరువురి మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో గొడవలు తీవ్రమై 15 రోజులుగా ఇద్దరు వేర్వేరుగా ఉంటున్నారు. శనివారం ఉదయం తను ఉంటున్న ఇంట్లో ఫ్యాన్‌కు మల్లీశరి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. అయితే మృతురాలి తల్లి వీఎంబంజర్ పోలీసులకు తన కుమార్తె మృతిపై తనకు అనుమానాలు ఉన్నాయని ఫిర్యాదు చేసింది. ఈ మేరకు ఎస్ఐ తోట నాగరాజు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. మల్లీశ్వరి మృతదేహానికి పెనుబల్లి ఏరియా ఆసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించి, కుటుంబ సభ్యులకు అప్పగించారు. -
టీఆర్ఎస్ నాయకుడి దారుణ హత్య
సాక్షి, పెనుబల్లి: పెనుబల్లి మండలం బ్రహ్మళకుంటలో మంగళవారం రాత్రి జరిగిన టీఆర్ఎస్ నాయకుడు ఏటుకూరి నరసింహారావు దారుణ హత్య రాజకీయ కక్షతోనే అని పోలీసులు, స్థానికులు భావిస్తున్నారు. కొట్టి, హతమార్చే ప్రాంతంలో తప్పించుకోవడానికి వీలులేని బ్రిడ్జి వద్దనున్న చెరకు తోట పరిసరాలను దుండగులు ఎంచుకోవడం అనుమానాలకు బలం చేకూరుస్తోంది. మండల పరిధిలోని బ్రహ్మళకుంటలో మంగళవారం రాత్రి చోటు చేసుకున్న టీఆర్ఎస్ నాయకుడు ఏటుకూరి నరసింహారావు దారుణహత్య రాజకీయ కక్షతోనే జరిగి ఉంటుందని పోలీసులు, స్థానికులు భావిస్తున్నారు. మంగళవారం రాత్రి తాళ్ళపెంట నుంచి బ్రహ్మళకుంటకు ద్విచక్రవాహనంపై వెళ్తున్న నరసింహారావును మార్గంమధ్యలో బ్రిడ్జి సమీపంలో చెరకు తోట వద్ద రోడ్డుపై కాపు కాసి కర్రలతో తలపై, నుదురు, మొహంపై తీవ్రంగా గాయపరిచి హతమార్చారు. పక్కా ప్రణాళికతో.. మంగళవారం రాత్రి 10 గంటల సమయంలో ద్విచక్ర వాహనంపై ఏటుకూరి నరసింహారావు (50) వెళ్తున్న విషయాన్ని తాళ్లపెంటలో ఉన్న రైతులు ఫోన్ ద్వారా దుండగులకు సమాచారం అందించినట్లు తెలుస్తోంది. నరసింహారావును కొట్టి, హతమార్చేందుకు... తప్పించుకోవడానికి ఎటువంటి వీలులేని బ్రిడ్జి వద్ద నున్న చెరకుతోట ప్రాంతాన్ని దుండగులు ఎంచుకున్నారు. మాటు వేసి, కర్రలతో కొట్టి హతమార్చారు. రాజకీయ హత్యగానే ఆయన కుటుంబ సభ్యులు, స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. గత పంచాయతీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీలోని రెండు వర్గాలలో ఓ వర్గానికి నరసింహారావు మద్దతు ఇవ్వడంతో ఆ వర్గం విజయం సాధించింది. దీంతో ఆగ్రహానికి లోనైన ప్రత్యర్థి వర్గం హత్యకు పాల్పడి ఉంటుందని నరసింహారావు కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బ్రహ్మళకుంటకు చెందిన ఓ ప్రజా ప్రతినిధి కుమారుడు స్థానికంగా అందుబాటులో లేకుండా పోవడంతో ఆయన కోసం గాలింపు చర్యలు చేపట్టారు. మృతదేహం పెనుబల్లి ఏరియా ఆస్పత్రికి తరలింపు నరసింహారావు మృతదేహం, సంఘటనా స్థలం వద్ద పడిఉన్న నరసింహారావు ద్విచక్రవాహనం మంగళవారం రాత్రి హత్యకు గురైన నరసింహారావు మృతదేహాన్ని బుధవారం ఉదయం వరకు సంఘటనా స్థలంలోనే ఉంచి పోలీస్ పహారా ఏర్పాటు చేశారు. బుధవారం ఉదయం ఖమ్మం నుంచి వచ్చిన క్లూస్ టీం , డాగ్స్ స్క్వాడ్ సిబ్బంది ఆధారాలు సేకరించాక మృతదేహాన్ని పెనుబల్లి ఏరియా ఆస్పత్రి మార్చురీకి తరలించారు. అక్కడ పోస్టు మార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. పోస్టుమార్టం సందర్భంగా నిందితులను వెంటనే అరెస్టు చేయాలంటూ పెద్ద ఎత్తున టీఆర్ఎస్ నాయకులు పోలీసులను డిమాండ్ చేశారు. డీసీసీబీ మాజీ చైర్మన్ మువ్వా విజయ్‌బాబు, ఎంపీపీ సలహాదారు లక్కినేని వినీల్, జెడ్పీటీసీ చెక్కిలాల మోహన్‌రావులతో పాటు మండల నాయకులు నిందితులను వెంటనే అరెస్టు చేయాలని పోలీసులను డిమాండ్ చేశారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని పోలీసు రక్షణలో బ్రహ్మళకుంట తరలించి, శాంతి భద్రతలకు ఇబ్బంది లేకుండా దహన సంస్కారాలు నిర్వహించేలా పర్యవేక్షించారు. విచారణ.. కల్లూరు ఏసీపీ ఎన్ వెంకటేష్ , సత్తుపల్లి రూరల్ సీఐ టి. రవికుమార్, ఎస్సై తోట నాగరాజుల ఆధ్వర్యంలో పోలీసులు బృందాలుగా విడిపోయి విచారణ ప్రారంభించారు. సంఘటనా స్థలం వద్ద వివరాలు సేకరించారు. హత్యకు ఉపయోగించిన కర్రలను పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. పోలీసుల అదుపులో అనుమానితులు ఏటుకూరి నరసింహారావు హత్యతో సంబంధం ఉన్న అనుమానంతో ఆరుగురు వ్యక్తులను వీఎంబంజర్ పోలీసులు అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టారు. తాళ్ళపెంటకు చెందిన ఓ మహిళను, ఓ వ్యక్తిని , బ్రహ్మళకుంటకు చెందిన నలుగురు వ్యక్తులను విచారిస్తున్నట్లు సమాచారం. ఈ మేరకు కేసు నమోదు చేసి, హత్యకు గల కారణాలు గుర్తించి నిందితులను అదుపులోకి తీసుకుంటామని ఎస్సై తోట నాగరాజు తెలిపారు. -
దూరం పెడుతోందన్న కోపంతోనే హత్యా...
సాక్షి, ఖమ్మం : జిల్లా వ్యాప్తంగా సంచలనం సృష్టించిన కావటి తేజస్విని హత్య కేసులో నిందితుడు బొల్లెదు నితిన్‌ను వీఎంబంజర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రేమించిన అమ్మాయి దూరం పెడుతుందన్న కోపంతో యువతిని హత్య చేసినట్లు నిందితుడు విచారణలో వెల్లడించినట్లు పోలీసులు తెలిపారు. దీనికి సంబంధించి కల్లూరు ఏసీపీ వెంకటేష్ శుక్రవారం రాత్రి వీఎంబంజర్ పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. సత్తుపల్లికి చెందిన బొల్లెదు నితిన్, పెనుబల్లి మండలం, కుప్పెనకుంట్లకు చెందిన కావటి తేజస్వినిని మూడేళ్లుగా సత్తుపల్లిలో డిప్లొమా చదువుతున్న రోజుల నుంచి ప్రేమిస్తున్నాడని, మూడు నెలలుగా నితిన్ ఫోన్ చేసినప్పటికీ తేజస్విని సరిగ్గా మాట్లాడటం లేదని, వేరే వాళ్లతో మాట్లాడుతుందనే అనుమానంతో, పథకం ప్రకారం హత్య చేసినట్లు తెలిపారు. కుప్పెనకుంట్లలోని తేజస్విని ఇంటి వద్దకు వెళ్లి ఆమెతో మాయమాటలు చెప్పి, మాట్లాడాలని ఇంటి వెనుక నుంచి తీసుకెళ్లి, ద్విచక్రవాహనంపై టేకులపల్లి వెళ్లి, అక్కడి నుంచి ముందుగా అనుకున్న నిర్మానుష్య ప్రదేశం కొత్తలంకపల్లి గుట్టల వద్దకు తీసుకువెళ్లి, మాట్లాడే పేరుతో పక్కన కూర్చోబెట్టుకుని మాట్లాడుతూ.. జేబులో కర్చీఫ్‌ను తీసి, తేజస్విని మెడకు బిగించి, చేతితో నులిమి హత్య చేసినట్లు పేర్కొన్నారు.ముందుగానే పెట్రోల్ కూడా తీసుకుని వెళ్లినప్పటికీ, రోడ్డు మీద వాహనాలు తిరుగుతుండటంతో బయపడి తేజస్విని మృతదేహాన్ని అక్కడే వదిలి వెళ్లినట్లు తెలిపారు. కేవలం ప్రేమోన్మాదంతోనే తేజస్విని హత్య చేసినట్లు ఏసీపీ పేర్కొన్నారు. హత్య అనంతరం ద్విచక్రవాహనాన్ని అక్కడి దగ్గర్లో పొదల్లో పడేసి, ఏమీ ఎరుగనట్లు బస్సు ఎక్కి ఖమ్మంలోని ప్రైవేటు హాస్టల్‌కు వెళ్లాడు. తేజస్విని తండ్రి కావటి సత్యనారాయణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు, సాంకేతిక ఆధారాలు, ఫోన్ కాల్స్, ఇతర మార్గాల ద్వారా విచారణ చేపట్టినట్లు శుక్రవారం లంకపల్లి పొదల వద్ద ఉన్న బండి కోసం వచ్చి, అది తీస్తుండగా పోలీసులు గుర్తించి, నిందితుడు బొల్లెద్దు నితిన్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తే నేరం తానే చేసినట్లు విచారణలో నితిన్ వెల్లడించినట్లు ఏసీపీ తెలిపారు. తనను దూరం చేస్తూ, మాట్లాడటం లేదని, తనను పెళ్లి చేసుకుంటుందో లేదోనని, తనకు దక్కనిది, వేరే వారికి దక్కకూడదనే అక్కస్సుతోనే తేజస్వినిని హత్య చేసినట్లు నిందితుడు ఒప్పుకున్నట్లు వెల్లడించారు. కేసును చేధించిన ట్రైనీ ఎస్ఐ శ్రీకాంత్‌ను, ఎస్ఐ తోట నాగరాజును, సత్తుపల్లి రూరల్ సీఐ రవికుమార్, సత్తుపల్లి సీఐ సురేష్లను అభినందిస్తున్నట్లు, వారికి రివార్డులు అందేలా చూస్తానన్నారు. -
జాతీయ రహదారి పైకి పరుగెత్తుకొచ్చింది..ప్రాణం పోయింది..
సాక్షి, పెనుబల్లి: రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతిచెందాడు. మండలంలోని పాతకుప్పెనకుంట్ల సెంటర్లోని జాతీయ రహదారిపై గురువారం ఇది జరిగింది. సత్తుపల్లికి చెందిన దారావత్ రత్నబాలు(27), షణ్ముఖ శ్రీనివాస్ కలిసి బైక్‌పై సత్తుపల్లి నుంచి వియంబంజర్ మీదుగా పెనుగంచిప్రోలు వెళుతున్నారు. మార్గమధ్యలోగల మండలంలోని పాత కుప్పెనకుంట్ల సెంటర్ వద్ద, ఓ గేదె ఒక్కసారిగా జాతీయ రహదారి పైకి పరుగెత్తుకొచ్చి, బైక్‌ను ఢీకొంది. ఆ వాహనం కింద పడిపోయింది. రోడ్డుపై షణ్ముఖ శ్రీనివాస్, రోడ్డు పక్కన దారావత్ రత్నబాలు పడిపోయారు. బైక్ వెనుకనే, కొత్తగూడెం నుంచి విజయవాడ వైపు వెళుతున్న ఆర్టీసీ కొత్తగూడెం డిపో బస్సు వేగంగా వచ్చింది. అది అదుపుతప్పి, రోడ్డుపై ఉన్న గేదెను ఢీకొని, రోడ్డు పక్కన పడిపోయిన దారావత్ రత్నబాలు మీద నుంచి ముందుకెళ్లి ఆగింది. హెల్మెట్ ధరించిన తల పైకి బస్సు టైర్ ఎక్కింది. అతడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. షణ్ముఖ శ్రీనివాస్‌కు గాయాలయ్యాయి. పెనుబల్లి ప్రభుత్వాసుపత్రికి స్థానికులు తరలించారు. ప్రమాద స్థలాన్ని వియంబంజర్ ఎస్సై తోట నాగరాజు పరిశీలించారు. పెనుబల్లి ఏరియా ఆసుపత్రిలో పోస్టుమార్టం అనంతరం రత్నబాలు మృతదేహాన్ని కుటుంబీకులకు అప్పగించారు. ప్రమాదానికి కారణమైన ఆర్టీసీ బస్సు డ్రైవర్‌పై కేసు నమోదు చేశారు. దర్యాప్తు జరుపుతున్నారు. -
మృత్యు పీడనం
కష్టాన్నే నమ్ముకున్న కూలీలు పనుల్లో నిమగ్నమయ్యారు.. పొద్దంతా కష్టిస్తేనే కడుపుకింత తిండి దొరికే కష్ట జీవులు పనులు చేస్తూనే ప్రాణాలొదిలారు. మొక్కజొన్న ఫ్యాక్టరీలో ఒక్కసారిగా బాయిలర్ భారీ శబ్దంతో పేలుడు ధాటికి పిట్టల్లా రాలిపోయారు. తునా తునకలైన శరీర భాగాలు.. విసిరేసినట్లుగా పడిన క్షతగాత్రులు.. రక్తమోడుతూనే ఆర్తనాదాలు, హాహాకారాలు.. ఎవరెక్కడున్నారో.. కటిక చీకట్లో ఎవరు మృతిచెందారో.. ఎవరు ప్రాణాలతో ఉన్నారో అర్థంకాని పరిస్థితి. పగిలిపోయిన ఫ్యాక్టరీ గోడలు.. పరిసరాల్లో ధ్వంసమైన కార్లు, లారీల అద్దాలు. రాష్ట్రాలు దాటొచ్చినవారు కొందరైతే.. ఉన్న ఊరిలో పని చేసుకుంటున్న వారు మరికొందరు. భయానక వాతావరణాన్ని తలపించేలా మారింది బయ్యన్నగూడెంలోని మొక్కజొన్న ఫ్యాక్టరీ ప్రాంతం. నలుగురు కార్మికులు అక్కడికక్కడే మృతిచెందగా.. పది మందికి తీవ్ర గాయాలయ్యాయి. పెనుబల్లి: మండలంలోని బయ్యన్నగూడెం పంచాయతీ పరిధిలోని నాయకులగూడెం గ్రామ సమీపంలో మొక్కజొన్న ఫ్యాక్టరీలో సోమవారం రాత్రి జరిగిన ఘోర ప్రమాదంలో నలుగురు కార్మికులు దుర్మరణం చెందారు. ఫ్యాక్టరీలోని బాయిలర్ భారీ శబ్దంతో పేలడంతో అక్కడ పనిచేస్తున్న కార్మికులు 10 మీటర్ల నుంచి 20 మీటర్ల దూరంలో చెల్లా చెదురుగా పడిపోయారు. మూడు మృతదేహాలు భయానక పరిస్థితుల్లో కనిపించాయి. పదిమందికి తీవ్ర గాయాలు కాగా సత్తుపల్లి, పెనుబల్లి ప్రభుత్వ ఆస్పత్రులకు తరలించారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ కార్మికులంతా బిహార్ వాసులా? స్థానికులా? అనేది ఇంకా నిర్ధారించలేదు. సత్తుపల్లికి చెందిన మురళీకృష్ణ అనే వ్యాపారి నెల రోజుల క్రితమే మొక్కజొన్న ఫ్యాక్టరీని ఇక్కడ ప్రారంభించారు. కంకుల నుంచి విత్తనాలను వేరుచేశాక బెండులను బాయిలర్‌లో వేడి చేస్తారు. ఈ బాయిలర్ ద్వారా వచ్చిన ఆవిరితో విత్తనాలను శుద్ధి చేసి, ప్యాకింగ్ చేసి తరలిస్తారు. అయితే..ఈ బాయిలర్ వద్ద పీడనం పెరిగి రాత్రి 7 గంటల సమయంలో ఒక్కసారిగా భారీ పేలుడు చోటు చేసుకోవడంతో 5 కిలోమీటర్ల మేర భారీ శబ్దం వినిపించి జనం ఉలిక్కిపడ్డారు. ఈ పేలుడు తీవ్రతకు ఫ్యాక్టరీలోని సగ భాగం, ప్రహరీ కుప్పకూలాయి. కర్మాగారం చట్టుపక్కల ఉన్న కార్లు, లారీల అద్దాలు పగిలి ధ్వంసమయ్యాయి. క్షత గాత్రులను పెనుబల్లి, సత్తుపల్లి వైద్యశాలలకు తరలించారు. పేలుడు రాత్రి సమయంలో చోటు చేసుకోవడంతో అప్పటికే కొందరు కార్మికులు విధులు ముగించుకుని ఇళ్లకు వెళ్లిపోవడంతో భారీగా ప్రాణనష్టం తగ్గింది. సంఘటనా స్థలాన్ని కల్లూరు ఏసీపీ బి.ఆంజనేయులు, కల్లూరు ఆర్డీఓ బి.శివాజీ, సత్తుపల్లి రూరల్ సీఐ టి.రవికుమార్, వీఎం.బంజర్ ఎస్సై తోట నాగరాజు, కల్లూరు ఎస్సై మేడ ప్రసాద్, తహసీల్దార్ వై.శ్రీనివాసులు సందర్శించి, సహాయక చర్యలు ప్రారంభించారు. జనరేటర్ వెలుగుల్లో అర్ధరాత్రి దాకా సహాయక చర్యలు కొనసాగాయి. రాత్రి 9వరకు సహాయక చర్యల్లేవ్.. మూడు షిఫ్టులు..బిహార్ కార్మికులని నిర్ధారణ బాయిలర్ పేలుడు సంఘటనలో మృత దేహాలను వెలికితీసే పనుల్లో తీవ్ర జాప్యం చోటు చేసుకుంది. రాత్రి 7 గంటలప్పుడు బాయిలర్ విధ్వంసం జరగ్గా ఆ తర్వాత సంఘటనా స్థలానికి కల్లూరు ఏసీపీ బి.ఆంజనేయులు, ఆర్డీఓ శివాజీ ఆధ్వర్యంలో పోలీసు, రెవెన్యూ సిబ్బంది చేరుకున్నారు. అయితే..సత్తుపల్లి నుంచి ఫైర్ సిబ్బంది, 108 సిబ్బంది వచ్చినప్పటికీ సింగరేణి రెస్క్యూ సిబ్బంది మాత్రం రాత్రి 9 గంటల వరకు ఎవ్వరూ చేరుకోలేదు. ఖమ్మం పోలీస్ కమిషనర్ తప్సీర్ ఇక్బాల్ చేరుకుని అప్రమత్తం చేశారు. ఈ ఫ్యాక్టరీలో బిహార్‌కు చెందిన కార్మికులతో పాటు స్థానిక కార్మికులు ఒక్కొక్క షిప్టుకు 50 మంది చొప్పున మూడు షిఫ్టుల్లో 150 మంది పనిచేస్తున్నారు. సాయంత్రం వేళ చాలామంది ఇళ్లకు వెళ్లడంతో..పెను ప్రమాదం తప్పింది. రెస్క్యూ సిబ్బంది చేరని కారణంగా సహాయక చర్యలు వేగవంతం కాలేదు. శిథిలాల కింద మృతదేహాలు, క్షతగాత్రులకు సంబంధించిన స్పష్టత రాలేదు. బాధ్యులపై చర్యలు తీసుకుంటాం: సీపీ తఫ్సీర్ మొక్కజొన్న ఫ్యాక్టరీ బాయిలర్ పేలుడు ఘటనలో యాజమాన్యంపై చర్యలు తప్పవని ఖమ్మం పోలీస్ కమిషనర్ తఫ్సీర్ ఇక్బాల్ వెల్లడించారు. సోమవారం రాత్రి ఆయన బయ్యన్నగూడెం వద్ద ప్రమాదస్థలాన్ని సందర్శించి..పేలుడు సంభవించిన తీరును స్థానికులను అడిగి తెలుసుకున్నారు. ఫ్యాక్టరీ యజమానులను అదుపులోకి తీసుకొని, విచారణ చేపట్టాలని కల్లూరు ఏసీపీ బి.ఆంజనేయులను ఆదేశించారు. -
లారీని ఓవర్ టేక్ చేయబోయి..
పెనుబల్లి: రెండు లారీలు ఢీకొన్న ప్రమాదంలో ఒక డ్రైవర్ మృతిచెందాడు. మరో డ్రైవర్‌కు, క్లీనర్‌కు గాయాలయ్యాయి. వైజాగ్ పోర్ట్ నుంచి యూరియా లోడ్‌తో సూర్యాపేట వైపు లారీ వెళుతోంది. పెనుబల్లి మండలంలోని టేకులపల్లి పవర్ ప్లాట్ ముందున్న బ్రిడ్జి వద్ద, ఎదురుగా ఖమ్మం వైపు నుంచి సత్తుపల్లి వైపు వస్తున్న లారీ, మరో లారీని ఓవర్ టేక్ చేస్తూ వేగంగా వచ్చి యూరియా లోడ్ లారీని ఢీ కొంది. యూరియా లోడ్ లారీ డ్రైవర్ కట్టా రామకృష్ణ (27) అక్కడికక్కడే మృతిచెందాడు. ఆ లారీ ముందున్న అద్దం పగిలింది. క్లీనర్ కొలిదల రాజు, క్యాబిన్ లోపలి నుంచి పగిలిన అద్దం నుంచి బయటకు ఎగిరి రోడ్డుపై పడిపోయాడు. అతడికి తీవ్ర గాయాలయ్యాయి. ఢీకొట్టిన లారీ డ్రైవర్, క్లీనర్ కూడా తీవ్రంగా గాయపడ్డారు. వీరిని కల్లూరులోని ప్రైవేటు ఆసుపత్రిలో స్థానికులు చేర్పించారు. అక్కడి నుంచి ఖమ్మం ఆసుపత్రికితరలించారు. మృతిచెందిన కట్టా రామకృష్ణది తూర్పు గోదావరి జిల్లా రాయవరం మండలం చెల్లూరు గ్రామం. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం పెనుబల్లి ప్రభుత్వాసుపత్రి మార్చురీకి పోలీసులు తరలించారు. యూరియా లోడ్ లారీ క్లీనర్ కొలిదల రాజు ఫిర్యాదుతో కేసును ఎస్సై తోట నాగరాజు దర్యాప్తు చేస్తున్నారు. రెండు లారీలు పూర్తిగా దెబ్బతిన్నాయి. కరకగూడెం: రోడ్డు ప్రమాదంలో గ్రామీణ వైద్యుడు మృతిచెందాడు. ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాలు.... కరకగూడెం మండలంలోని అనంతారం గ్రామస్తుడైన గ్రామీణ వైద్యుడు షేక్ అబ్దుల్ రహీమ్,, సహచర గ్రామీణ వైద్యుడైన గొల్లగూడెం గ్రామస్తుడు సారంగపాణి కలిసి గొల్లగూడెం నుంచి ద్విచక్ర వాహనంపై మణుగూరు వెళ్తున్నారు. కలవలనాగారం గ్రామ మూలమలుపు వద్ద వీరి వాహనాన్ని ఎదురుగా వచ్చిన లారీ ఢీకొంది. తలకు తీవ్ర గాయాలతో షేక్ అబ్దుల్ రహీమ్(43) రోడ్డుపై పడిపోయాడు. అక్కడికక్కడే మృతిచెందాడు. సారంగపాణికి తీవ్ర గాయాలయ్యాయి. అతడిని స్థానికులు భద్రాచలం ఏరియా ఆసుపత్రికి తరలించారు. అబ్దుల్ రహీమ్‌కు భార్య షేక్ మెహబూబి, ఇద్దరు కుమార్తెలు అతహర్, ఆఫ్రీన్, ఇద్దరు కుమారులు అర్షద్, అసద్ ఉన్నారు. ప్రమాద స్థలాన్ని ఏడూళ్ల బయ్యారం సీఐ బి.అశోక్ పరిశీలించారు. మృతుని సోదరుడి ఫిర్యాదుతో కేసు నమోదైంది. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం భద్రాచలం ఏరియా ఆసుపత్రికి తరలించారు. సారంగపాణి పరిస్థితి విషమించినట్టు సమాచారం. -
ఐకమత్యంతో పనిచేస్తేనే భవిష్యత్
పెనుబల్లి : రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత ఉందని మాజీ మంత్రి జలగం ప్రసాదరావు అన్నారు. కాంగ్రెస్ నాయకులు విభేదాలను పక్కనపెట్టి ఐకమత్యంతో పనిచేస్తే మంచి భవిష్యత్ ఉంటుందన్నారు. బుధవారం వీయం బంజర్‌లోని జేవీఆర్ ఛారిటబుల్ ట్రస్ట్ భవనంలో జరిగిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. పదవులకోసం కాకుండా పార్టీ బలోపేతానికి కృషి చేస్తానన్నారు. కార్యకర్తలు, నాయకులు బాగుంటేనే పార్టీకి మనుగడ ఉంటుందన్నారు. నెహ్రూ, ఇందిరాగాంధీ, రాజీవ్‌గాంధీల ఆశయ సాధనకు శ్రేణు లు కృషి చేయాలన్నారు. దమ్మపేట మండలం జలవాగు గ్రామంలో గిరిజనులకు ప్రభుత్వం 45 సంవత్సరాల క్రితం జీఓ ద్వారా 15 ఎకరాలు కేటాయిస్తే ఆ భూములకు ఇంతవరకు కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలు ఇవ్వకపోగా ఆ భూమిని వారికి అప్పజెప్పకపోవడం దారుణమన్నారు. దళితులకు ఇస్తామన్న మూడెకరాలను ఇచ్చి హామీని కేసీఆర్ నిలబెట్టుకోవాలన్నారు. రిజర్వేషన్లు 50 శాతం లోపు ఉండాలని కోర్టు తీర్పు ఇచ్చినప్పటికీ, తదనుగుణంగా గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించకుండా తాత్సారం చేస్తున్నారని ఆరోపించారు. ఎన్నికలు నిర్వహించి మిగిలిన రిజర్వేషన్ల కోసం కోర్టుకు పోతే మంచిదన్నారు. కార్య క్రమంలో నాయకులు వంకాయలపాటి వెంకటేశ్వరరావు, ముక్కర భూపాల్‌రెడ్డి, వంగా గిరిజాపతిరావు, పసుమర్తి వెంకటేశ్వరరావు, గూడూరు మాధవరెడ్డి, కోమటి ప్రసాదు, కోమటి వెంకటేశ్వరరావు, పంది వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. -
ఆర్టీసీ బస్సులో యువతి ఆత్మహత్య
పెనుబల్లి : ఆర్టీసీ బస్సులో భద్రాచలం నుంచి విజయవాడకు బయల్దేరిన ముకిలి లావణ్య (29)అనే యువతి..నురగలు కక్కుతూ చనిపోయిన ఘటన మంగళవారం చోటు చేసుకుంది. బస్సు వెళుతుండగా ఆమె నోటి నుంచి నురగలు వస్తున్న విషయాన్ని తోటి ప్రయాణికులు గమనించడంతో డ్రైవర్ బస్సును పెనుబల్లిలో ఆపాడు. పురుగుల మందు తాగిందని గ్రహించి ప్రభుత్వాస్పత్రికి తరలించగా..అక్కడ చికిత్స అందిస్తున్న క్రమంలోనే ఆమె చనిపోయింది. ఆమె చేతిపై ‘ ఐ మిస్ యూ డాడీ. నేనేమీ తప్పు చేయలేదు’ అని రాసి ఉంది. హ్యాండ్ బ్యాగ్‌లోని పుస్తకంలో ఫోన్ లభించగా..పోలీసులు ఆమె తండ్రికి ఫోన్ చేశారు. ఆంధ్ర ప్రదేశ్‌లోని గుంటూరు జిల్లా కర్లపాలెం ఏఎస్సై కూతురుగా నిర్ధారించినట్లు ఎస్సై డి.నరేష్ తెలిపారు. -
దగ్ధమైన రెండు లారీలు: ఇద్దరికి తీవ్రగాయాలు
ఖమ్మం : ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం టేకులపల్లి వద్ద శనివారం తెల్లవారుజామున రెండు లారీలు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో రెండు లారీలు పూర్తిగా దగ్థం కావడంతో లారీ డ్రైవర్లు తీవ్రంగా గాయపడ్డారు. అదే రహదారిపై వెళ్తున్న వాహనదారులు వెంటనే స్పందించి.. పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని.. క్షతగాత్రులను ఖమ్మం జిల్లా ఆసుపత్రికి తరలించారు. వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
భర్త ఇంటి ముందు భార్య మౌనదీక్ష
పెనుబల్లి (ఖమ్మం) : ప్రేమించి పెళ్లి చేసుకొని రెండేళ్ల పాటు కాపురం చేసి.. ఆ తర్వాత తనను, తన కొడుకును నడిరోడ్డుపై వదిలేసి వెళ్లిన భర్త ఇంటి ముందు భార్య మౌనదీక్షకు దిగింది. ఈ సంఘటన ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం మండాలపాడు గ్రామంలో సోమవారం వెలుగుచూసింది. గ్రామానికి చెందిని బెజ్జం బాలకృష్ణ ఏడేళ్ల క్రితం అదే గ్రామానికి చెందిన పోతురాజు ఇందిరా రాణిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. రెండేళ్లు కాపురం చేసిన అనంతరం ఆమెను కొడుకుతో సహా నడిరోడ్డుపై వదిలేసి వెళ్లిపోయాడు. అప్పటి నుంచి ఐదేళ్లుగా తల్లిగారింట్లో ఆశ్రయం పొందుతున్న ఇందిరారాణి సోమవారం తనకు న్యాయం చేయాలని భర్త ఇంటి ముందు మౌన దీక్షకు దిగింది. కాగా.. బాలకృష్ణ రెండో వివాహం చేసుకున్నట్లు సమాచారం. -
బొగ్గు టిప్పర్, బైక్ ఢీ: ఇద్దరు యువకుల దుర్మరణం
పెనుబల్లి: ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం వీఎం బంజర వద్ద జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతిచెందగా..మరో యువకుడికి తీవ్రగాయాలయ్యాయి. సత్తుపల్లి నుంచి బొగ్గులోడుతో వస్తున్న టిప్పర్, బైక్‌పై వెళ్తున్న ముగ్గురిని ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. పెనుబల్లి మండలం లంకాసాగర్ గ్రామానికి చెందిన జొన్నల శ్రీను(17), చాట్ల రాంబాబు(24) మృతిచెందగా, తీవ్రంగా గాయపడిన శివకృష్ణను ఖమ్మం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. -
ఈతకు వెళ్లి డిగ్రీ విద్యార్థి గల్లంతు
పెనుబల్లి : ఖమ్మం జిల్లా పెనుబల్లి ఎన్ఎస్పీ కెనాల్లో ఈతకు వెళ్లి ఓ డిగ్రీ విద్యార్థి గల్లంతయ్యాడు. ఈ ఘటన మండలం లోని వీఎం బంజర్ గ్రామంలో సోమవారం ఉదయం జరిగింది. బుడగజంగాల కాలనీ చెందిన పెర్లా జంపాలు (20) ఖమ్మం పట్టణంలోని ఓ కళాశాలలో డిగ్రీ ప్రథమ సంవత్సరం చదువుతున్నాడు. సోమవారం ఉదయం స్వగ్రామంలోని ఎన్ఎస్పీ కెనాల్లో ఈతక వెళ్లి గల్లంతయ్యాడు. అతడి కోసం స్థానికులు గాలింపు చర్యలు చేపట్టారు. -
తెల్లారిన బతుకులు
పెనుబల్లి : మరో ఐదు నిమిషాలైతే ఇంటికి చేరుకుంటామనే లోగానే మృత్యువు వారిని కబళించింది. తెల్లవారకుండానే వారి బతుకులు తెల్లారిపోయాయి. పొట్టకూటి కోసం గంగిరెద్దులు ఆడించే ఆ సంచార కూలీలు.. ఎల్లమ్మ దేవత కొలుపునకు మేళం వాయించేందుకు వెళ్లి తిరిగి ఇంటికి చేరుకోకుండానే అనంతలోకాలకు వెళ్లారు. పెనుబల్లి మండలం బయ్యన్నపేట వద్ద మంగళవారం తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఐదుగురు అక్కడికక్కడే మృతిచెందారు. పోలీసుల కథనం ప్రకారం... పెనుబల్లి మండలం టేకులపల్లికి చెందిన పంకు నరసింహ(45), అతడి కుమారుడు పంకు మారేష్ (18), నరసింహ సోదరుడు పంకు గోపి(30), పంకు అంజయ్య (25), కలకుంటి వీరయ్య (35) కలిసి కృష్ణా జిల్లా కంచికచర్ల మండలం పొన్నారం గ్రామంలో ఎల్లమ్మ దేవత కొలుపునకు మేళం వాయించేందుకు సోమవారం రాత్రి వెళ్లారు. అక్కడ కార్యక్రమం ముగించుకుని పంకు అంజయ్యకు చెందిన ఆటోలో మంగళవారం తెల్లవారుజామున తిరిగి బయలుదేరారు. మరో ఐదు నిమిషాలైతే ఇంటికి చేరేవారు. ఈలోగానే 4.30 గంటల సమయంలో వారు ప్రయాణిస్తున్న ఆటోను కొత్తగూడెం నుంచి విజయవాడ వైపు బొగ్గు లోడ్‌తో వెళ్తున్న లారీ(టిప్పర్) బలంగా ఢీకొట్టింది. దీంతో లారీ, ఆటో పక్కనున్న పొలాల్లోకి దూసుకెళ్లాయి. ఈ ప్రమాదంలో ఆటోలో ఉన్న ఐదుగురూ అక్కడికక్కడే మృతిచెందారు. మారేష్ ఆటోలో నుంచి కిందపడగా, లారీ అతడి తలపైనుంచి దూసుకెళ్లింది. తెల్లవారిన తర్వాత స్థానికులు ప్రమాద విషయం తెలుసుకుని పోలీసులకు, మృతుల కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. లారీకి, ఆటోకు మధ్యలో ఇరుక్కుపోయిన మృతదేహాలను జేసీబీ సహాయంతో బయటకు తీయించారు. మృతులలో ముగ్గురు కుటుంబానికి చెందిన వారు, మిగితా ఇద్దరూ వారి సమీప బంధువులే కావడంతో ప్రమాద స్థలంలో గ్రామస్తులు, మృతుల కుటుంబసభ్యుల రోదనలు మిన్నంటాయి. సత్తుపల్లి డీఎస్పీ బి. అశోక్‌కుమార్, రూరల్ సీఐ డి. చంద్రయ్య, ఎస్సై బి. పరుశురాం అక్కడికి చేరుకుని మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం పెనుబల్లి ఏరియా ఆసుపత్రికి తరలించారు. మృతుల కుటుంబాలకు పొంగులేటి ఓదార్పు... రోడ్డు ప్రమాద విషయం తెలిసిన ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి పెనుబల్లి ఏరియా ఆసుపత్రికి చేరుకుని, మృత దేహాలను పరిశీలించారు. ప్రమాద వివరాల గురించి పోలీసులను అడిగి తెలుసుకున్నారు. బాధితులను ఓదార్చి అండగా ఉంటానని ధైర్యం చెప్పారు. తక్షణ సాయంగా ఒక్కో కుటుంబానికి రూ. 5 వేల చొప్పున ఆర్థిక సహాయం అందజేశారు. వైఎస్ఆర్ సీపీ సత్తుపల్లి నియోజకవర్గ ఇన్చార్జి డాక్టర్ మట్టాదయానంద్ విజయ్‌కుమార్ మృతుల కుటుంబాలను టేకులపల్లిలో పరామర్శించి, ఒక్కొక్కరికి రూ. 2 వేల చొప్పున ఆర్థిక సహాయం చేశారు. మృత్యుంజయుడు పంకు చిన్న అంజయ్య... ఎల్లమ్మ కొలువులో మేళం వాయించడానికి పంకు చిన్న అంజయ్య కూడా వెళ్లాడు. చిన్న అంజయ్య కుమారుడు నాలుగు రోజులుగా జ్వరంతో బాధ పడుతుండగా, తిరువూరులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడే ఉన్న అంజయ్యను నరసింహ తదితరులు తమ ఆటోలో ఎక్కించుకుని పొన్నారం వెళ్లారు. తిరుగు ప్రయాణంలో మళ్లీ తిరువూరులోనే అంజయ్యను దించి మిగిలిన ఐదుగురు టేకులపల్లి వస్తుండగా జరిగిన ప్రమాదంలో వీరంతా మృతి చెందారు. ప్రమాద విషయం తెలిసిన చిన్నఅంజయ్య ఉదయాన్నే సంఘటనా స్థలానికి చేరుకుని బోరున విలపించాడు. -
పోడు సాగుపై అటవీ శాఖ అధికారుల దాడి
పెనుబల్లి : మండల పరిధిలోని భవన్నపాలెం గ్రామ సమీపంలోని గిరిజనులు సాగు చేస్తున్న పోడు భూముల్లో పత్తి పంటను అటవీశాఖ అధికారులు గురువారం ధ్వంసం చేశారు. సత్తుపల్లి రేంజ్ పరిధిలోని సుమారు 50 మంది అటవీశాఖ అధికారులు ఉదయం 6 గంటల ప్రాంతంలో గిరిజనులు సాగు చేస్తున్న పోడు భూమికి చేరుకున్నారు. సుమారు ఆరెకరాల పత్తిపంటను ధ్వంసం చేశారు. విషయం తెలుసుకున్న గిరిజనులు పెద్దసంఖ్యలో అక్కడికి చేరుకుని నిరసన తెలిపారు. ఈ క్రమంలో అటవీ శాఖ అధికారులు, గిరిజనుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఒకదశలో తోపులాట జరిగింఇ. దీంతో ఫారెస్టు అధికారులు వెనుదిరిగారు. ఏపుగా ఎదిగాక... పెరికికుంట గ్రామానికి చెందిన 25 మంది గిరిజన కుటుంబాలు సుమారు 30 ఎకరాలు పోడు భూమిలో పత్తిని సాగు చేస్తున్నారు. ఏపుగా ఎదిగి కాపుకు వచ్చే సమయంలో ఫారెస్టు అధికారులు మూకుమ్మడిగా పంటపొలాలపై పడి పత్తి పంటను పీకడం పట్ల గిరిజనులు కన్నీరుమున్నీరయ్యారు. సోడె నాగేష్, పద్దం వెంకటప్ప సాగు చేస్తున్న ఆరెకరాల పత్తిపంటను పూర్తిగా ధ్వంసం చేశారు. సంఘటనా స్థలానికి సీపీఎం మండల కార్యదర్శి జాజిరి శ్రీనివాస్ సందర్శించి అటవీ శాఖ అధికారుల తీరుపై మండిపడ్డారు. పదేళ్లుగా గిరిజనులు సాగు చేస్తున్న పోడు భూమిలోని పత్తిపంటను తొలగించడం ప్రభుత్వ దమనకాండకు నిదర్శనమని విమర్శించారు. తహశీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా తాము పోడు భూముల్లో సాగు చేస్తున్న పత్తి పంటను ఫారెస్టు అధికారులు అన్యాయంగా పీకేశారంటూ పెనుబల్లి తహశీల్దార్ కార్యాలయాన్ని గిరిజనులు సీపీఎం ఆధ్వర్యంలో ముట్టడించారు. ఫారెస్టు అధికారుల వేధింపులు ఆపాలంటూ తహశీల్దార్ తాతారావుకు ఆ పార్టీ మండల కార్యదర్శి శ్రీనివాస్ వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో రాజినేని మంగమ్మ, చిమ్మట విశ్వనాధం, పూజల పోతురాజు, ప్రసాద్, నాగేశ్వరరావు, కొర్సా సత్యం తదితరులు పాల్గొన్నారు. -
స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటాలి
పెనుబల్లి, న్యూస్‌లైన్: రానున్న స్థానిక సంస్థల ఎన్నికలతోపాటు సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సత్తాచాటాలని ఆ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ పిలుపునిచ్చారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం కొత్తగూడెం నుంచి సత్తుపల్లి వెళ్తున్న విజయమ్మకు మార్గమధ్యలో పెనుబల్లి గ్రామస్తులు ఎదురేగి స్వాగతం పలికారు. పెనుబల్లి జడ్పీటీసీ అభ్యర్థి మాలోతు రాధ, ఎంపీటీసీ -1 అభ్యర్థి కోటగిరి సుధాకర్‌లను గెలిపించాలని పట్టణంలో రోడ్ షో నిర్వహించారు. అనంతరం రింగ్సెంటర్లో విజయమ్మ ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. పెనుబల్లి రాతోని చెరువుకు మహానేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి లిప్టు మంజూరు చేయడం ద్వారా ఈ ఏడాది పంటలు పుష్కలంగా పండుతున్నాయన్నారు. ఖమ్మం జిల్లాలో స్థానిక సంస్థల నుంచి సాధారణ ఎన్నికల వరకు వైఎస్ఆర్ సీపీ అభ్యర్థులను గెలిపించి, మహానేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డికి నివాళిగా, జగన్‌కు బహుమతిగా అందించాలని కోరారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణలోనూ సత్తా చాటుతుందని, ప్రాంతాలను విడదీశారే తప్ప ప్రజల మనషులను కాదన్నారు. కార్యక్రమంలో పార్టీ ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మండల అధ్యక్షులు చెక్కిలాల మోహన్‌రావు, కీసర శ్రీనివాసరెడ్డి, మాళోతు రాధాకృష్ణ, కర్నాటి వీరభద్రారెడ్డి, శీలం వెంకటేశ్వరరెడ్డి, బీమిరెడ్డి నాగిరెడ్డి, చీపి కృష్ణారావు, బొర్రా వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.