ఖమ్మం జిల్లా గంగదేవిపాడులో నాగేశ్వరరావు కుటుంబాన్ని పరామర్శిస్తున్న వైఎస్ షర్మిల
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో ఎక్కువగా నిరుద్యోగ సమస్య ఉందని వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తెలిపారు. గత ఏడేళ్లలో నిరుద్యోగిత నాలుగు రెట్లు పెరిగిందని చెప్పారు. నిరుద్యోగులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నా సీఎం కేసీఆర్ పట ్టనట్టుగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం గంగదేవిపాడు గ్రామంలో ఇటీవల ఆత్మహత్య చేసుకున్న నిరుద్యోగి నాగేశ్వరరావు కుటుంబాన్ని మంగళవారం ఆమె పరామర్శించారు. అనంతరం పెనుబల్లిలో నిరుద్యోగ నిరాహార దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు.
బతికే మార్గం లేక ఆత్మహత్యలు
తాము నిరుద్యోగులమంటూ 54 లక్షల మంది ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్నారని, ఇందులో పలువురు ఆత్మహత్య చేసుకున్నా.. ఫామ్‌హౌస్‌కే పరిమితమైన సీఎం దున్నపోతు మీద వాన పడిన చందంగా స్పందించడం లేదని షర్మిల విమర్శించారు. నిరుద్యోగులు బతికే మార్గం లేక, అవమానాలు భరించలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ రోజైనా 50 వేల ఉద్యోగాల గురించి కేసీఆర్ మాట్లాడుతున్నారంటే దానికి కారణం తాము బయటకు వచ్చి చేస్తున్న పోరాటం వల్లనే అని తెలిపారు. ఇప్పుడు ప్రతిపక్షానికి కూడా సోయి వచ్చిందన్నారు.
తాము ప్రతి మంగళవారం దీక్షలు చేస్తుంటే వ్రతాలు చేస్తున్నా మని కేటీఆర్ అంటున్నారంటూ.. ‘మేము ఆడవాళ్లం మెతుకు ముట్టకుండా వ్రతమే చేస్తున్నాం అనుకుందాం.. మరి వీరు పెద్ద మగాళ్లు కదా.. అధికారంలో ఉన్నారు కదా.. ఉద్యోగ ఖాళీలు ఎందుకు భర్తీ చేయడం లేదు’అని షర్మిల నిలదీశారు. నిరుద్యోగులు హమాలీ పనులు చేసుకోవాలనే మంత్రి.. పదవికి రాజీనామా చేసి హమాలీ పనికి వెళ్లాలని సూచించారు. తనకు ఉద్యోగం రాలేదనే నాగేశ్వరరావు ఆత్మహత్య చేసుకున్నాడని తెలిపారు. 1.91 లక్షల ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. దీక్షకు ముందు వేదిక వద్ద దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాల వేసి షర్మిల నివాళులర్పించారు.
Comments
Please login to add a commentAdd a comment