పెనుబల్లి : మరో ఐదు నిమిషాలైతే ఇంటికి చేరుకుంటామనే లోగానే మృత్యువు వారిని కబళించింది. తెల్లవారకుండానే వారి బతుకులు తెల్లారిపోయాయి. పొట్టకూటి కోసం గంగిరెద్దులు ఆడించే ఆ సంచార కూలీలు.. ఎల్లమ్మ దేవత కొలుపునకు మేళం వాయించేందుకు వెళ్లి తిరిగి ఇంటికి చేరుకోకుండానే అనంతలోకాలకు వెళ్లారు. పెనుబల్లి మండలం బయ్యన్నపేట వద్ద మంగళవారం తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఐదుగురు అక్కడికక్కడే మృతిచెందారు.
పోలీసుల కథనం ప్రకారం...
పెనుబల్లి మండలం టేకులపల్లికి చెందిన పంకు నరసింహ(45), అతడి కుమారుడు పంకు మారేష్ (18), నరసింహ సోదరుడు పంకు గోపి(30), పంకు అంజయ్య (25), కలకుంటి వీరయ్య (35) కలిసి కృష్ణా జిల్లా కంచికచర్ల మండలం పొన్నారం గ్రామంలో ఎల్లమ్మ దేవత కొలుపునకు మేళం వాయించేందుకు సోమవారం రాత్రి వెళ్లారు.
అక్కడ కార్యక్రమం ముగించుకుని పంకు అంజయ్యకు చెందిన ఆటోలో మంగళవారం తెల్లవారుజామున తిరిగి బయలుదేరారు. మరో ఐదు నిమిషాలైతే ఇంటికి చేరేవారు. ఈలోగానే 4.30 గంటల సమయంలో వారు ప్రయాణిస్తున్న ఆటోను కొత్తగూడెం నుంచి విజయవాడ వైపు బొగ్గు లోడ్‌తో వెళ్తున్న లారీ(టిప్పర్) బలంగా ఢీకొట్టింది. దీంతో లారీ, ఆటో పక్కనున్న పొలాల్లోకి దూసుకెళ్లాయి. ఈ ప్రమాదంలో ఆటోలో ఉన్న ఐదుగురూ అక్కడికక్కడే మృతిచెందారు.
మారేష్ ఆటోలో నుంచి కిందపడగా, లారీ అతడి తలపైనుంచి దూసుకెళ్లింది. తెల్లవారిన తర్వాత స్థానికులు ప్రమాద విషయం తెలుసుకుని పోలీసులకు, మృతుల కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. లారీకి, ఆటోకు మధ్యలో ఇరుక్కుపోయిన మృతదేహాలను జేసీబీ సహాయంతో బయటకు తీయించారు.
మృతులలో ముగ్గురు కుటుంబానికి చెందిన వారు, మిగితా ఇద్దరూ వారి సమీప బంధువులే కావడంతో ప్రమాద స్థలంలో గ్రామస్తులు, మృతుల కుటుంబసభ్యుల రోదనలు మిన్నంటాయి. సత్తుపల్లి డీఎస్పీ బి. అశోక్‌కుమార్, రూరల్ సీఐ డి. చంద్రయ్య, ఎస్సై బి. పరుశురాం అక్కడికి చేరుకుని మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం పెనుబల్లి ఏరియా ఆసుపత్రికి తరలించారు.
మృతుల కుటుంబాలకు పొంగులేటి ఓదార్పు...
రోడ్డు ప్రమాద విషయం తెలిసిన ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి పెనుబల్లి ఏరియా ఆసుపత్రికి చేరుకుని, మృత దేహాలను పరిశీలించారు. ప్రమాద వివరాల గురించి పోలీసులను అడిగి తెలుసుకున్నారు. బాధితులను ఓదార్చి అండగా ఉంటానని ధైర్యం చెప్పారు. తక్షణ సాయంగా ఒక్కో కుటుంబానికి రూ. 5 వేల చొప్పున ఆర్థిక సహాయం అందజేశారు. వైఎస్‌ఆర్ సీపీ సత్తుపల్లి నియోజకవర్గ ఇన్‌చార్జి డాక్టర్ మట్టాదయానంద్ విజయ్‌కుమార్ మృతుల కుటుంబాలను టేకులపల్లిలో పరామర్శించి, ఒక్కొక్కరికి రూ. 2 వేల చొప్పున ఆర్థిక సహాయం చేశారు.
మృత్యుంజయుడు పంకు చిన్న అంజయ్య...
ఎల్లమ్మ కొలువులో మేళం వాయించడానికి పంకు చిన్న అంజయ్య కూడా వెళ్లాడు. చిన్న అంజయ్య కుమారుడు నాలుగు రోజులుగా జ్వరంతో బాధ పడుతుండగా, తిరువూరులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడే ఉన్న అంజయ్యను నరసింహ తదితరులు తమ ఆటోలో ఎక్కించుకుని పొన్నారం వెళ్లారు. తిరుగు ప్రయాణంలో మళ్లీ తిరువూరులోనే అంజయ్యను దించి మిగిలిన ఐదుగురు టేకులపల్లి వస్తుండగా జరిగిన ప్రమాదంలో వీరంతా మృతి చెందారు. ప్రమాద విషయం తెలిసిన చిన్నఅంజయ్య ఉదయాన్నే సంఘటనా స్థలానికి చేరుకుని బోరున విలపించాడు.
తెల్లారిన బతుకులు
Published Wed, Nov 5 2014 3:20 AM | Last Updated on Thu, Aug 30 2018 3:56 PM
Advertisement