tourism place
-
ప్రకృతి ప్రియులకు స్వర్గధామం.. చుట్టూ నీరు, మధ్యలో ఊరు
చిత్తూరు నుంచి తిరుపతి ప్రత్యేక జిల్లాగా వేరుపడ్డాక ఈ ప్రాంతానికి సముద్రంతో పాటూ ఒక దీవి వచ్చి చేరింది. ఆ దీవి పేరు ఇరకం. ఇది తడ మండలంలోని పులికాట్ సరస్సు మధ్యలో ఉంది. చుట్టూ నీరు.. మధ్యలో ఊరు. ఈ దీవిలో పర్యాటకులను ఆకట్టుకునే ఎన్నో ప్రత్యేకతలున్నాయి. అక్కడి ప్రయాణం ఓ మధురానుభూతిని మిగుల్చుతుంది. చల్లటి గాలులు.. తేలికపాటి అలల మధ్య సాగే పడవ ప్రయాణం.. గాలివాటున దూసుకెళ్లే తెరచాప పడవలు.. ఓవైపు ఎగురుతూ కనిపించే విదేశీ పక్షులు.. ఈ దృశ్యాలు ఎంతో ఆహ్లాదంగా.. అద్భుతంగా కనిపిస్తాయి. మరో విశేషమేమంటే.. చుట్టూ ఉప్పునీరున్నా.. రెండు గ్రామాలున్న ఈ దీవిలో తాగేందుకు మంచినీరు పుష్కలంగా లభించడం ఇక్కడ ప్రత్యేకత. ఈ ప్రాంతానికి పర్యాటక శోభ తేవడంపై ప్రభుత్వం దృష్టి సారించింది. తడ(తిరుపతి జిల్లా): కొత్తగా ఏర్పడ్డ తిరుపతి జిల్లాకి నెల్లూరు జిలాల్లోని సముద్రం (బంగాళాఖాతం) తడ మండలం పరిధిలోని పులికాట్ సరస్సు, సరస్సు నడుమ ఉన్న అందాల ఇరకం దీవి సొంతమయింది. 4,486 ఎకరాల్లో విస్తరించి ఉన్న ఈ దీవిలోని ఇరకం గ్రామంలో మొదలియార్లు, హరిజనులు, గిరిజనులతోపాటు తిరువెంకటానగర్ కుప్పంలో సుమారు రెండు వేల మంది కలిగిన మత్స్యకారులు 580 ఇళ్లల్లో జీవిస్తూ ఉన్నారు. ఈ దీవిలో 2200 ఎకరాల వ్యవసాయభూమి ఉండగా ఇందులో వరిసాగు చేస్తారు. దీవిలో నుంచి 200 మంది విద్యార్థులు ఆరంబాకం, సున్నపుగుంట గ్రామాలకు చదువు కోసం పడవల్లో పులికాట్ సరస్సు మీదుగా రాకపోకలు సాగిస్తూ ఉంటారు. పడవలో షికారు మరో వైపు ఈ దీవి వైపు పర్యాటకుల చూపు పడింది. ఆహ్లాదంగా కనిపించే సరస్సుపై పడవలో షికారు తిరగాలంటే మక్కువ చూపుతున్నారు. పండగలు, సెలవు దినాల్లో ప్రకృతి ప్రియులు బీవీపాళెం గ్రామానికి చేరుకుని అక్కడి నుంచి పడవల ద్వారా ఇరకం వెళతారు. అక్కడ సాయంత్రం వరకు సేదతీరి ప్రకృతి అందాలను ఆస్వాదించి తిరిగి వస్తున్నారు. బీవీపాళెం నుంచి పడవ ద్వారా 11 కిలో మీటర్ల దూరం ఉన్న ఇరకం దీవికి వెళ్లాలంటే పట్టే 40–45 నిమిషాల ప్రయాణం మంచి అనుభూతిని ఇస్తుంది. సరస్సులో చేపల వేట సాగించే తెరచాప పడవలు, అక్కడక్కడ చేపల కోసం కాచుకు కూర్చున్న విహంగాలు, పడవల పక్కనే ఎగిరెగిరి పడుతూ చేపలు చేసే విన్యాసాలు పర్యాటకులకు మంచి ఆహ్లాదాన్ని అందిస్తాయి. ఇరకం తెల్లటి ఇసుకతో నిండిన గ్రామం. నీటి కోసం అక్కడక్కడ తవ్విన దొరువులు, దొరువుల చుట్టూ మొలిచిన మొగలి పొదలు, వెదురు చెట్లు సరికొత్త అనుభవాన్ని అందిస్తాయి. దెబ్బతీసిన ఉప్పునీరు దశాబ్దాలుగా బంగాళాఖాతం నుంచి పులికాట్ సరస్సుకి నీటిని అందించే ముఖద్వారాలు పూడిపోతూ రావడం, సరస్సుకి సముద్రంద్వారా వచ్చే నీటికి అడ్డుకట్ట పడడంతో సముద్రం, సరస్సు మధ్య నీటితోపాటు రాకపోకలు సాగించే చేపలు, రొయ్యల కదలికలు తగ్గి పోయాయి. దీంతో మత్స్యకారులకు వేట కష్టతరమైంది. కొందరు అత్యాశ పరులు తమ స్వార్థం కోసం సరస్సు చుట్టూ ఉన్న పొర్లుకట్టను ధ్వంసం చేయడంతో ఉప్పునీళ్లు పొలాల్లోకి చేరి పంటలు దెబ్బతిన్నాయి. ఇక్కడ చదువుకైనా, కాన్పుకైనా, పాముకరిచినా, అత్యవసర పరిస్థితిలో అయినా పడవ ప్రయాణం తప్ప మరో దారిలేదు. పర్యాటక అభివృద్ధికి చర్యలు ఇరకం దీవిని పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రత్యేక చొరవ చూపుతున్నారు. సీఎం ఆదేశాల మేరకు సూళ్లూరుపేట శాసన సభ్యులు కిలివేటి సంజీవయ్య ఇరకం దీవితోపాటు బీవీపాళెం, వేనాడు ప్రాంతాలను పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా ఆంధ్రా, తమిళనాడు పర్యాటకులు సేద తీరేందుకు బీవీపాళెంలో నిర్మించిన రిసార్టులను టెండర్ల ద్వారా సమర్థులైన వారికి అప్పగించడంతోపాటు ఇరకం దీవిలో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టి పర్యాటకులకు వసతులు కల్పిస్తున్నారు. ఈ ప్రాజెక్టు పూర్తి అయితే ఇరకం దీవిలోని ప్రజలకు స్థానికంగానే ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి లభించడంతోపాటు వారికి సంబంధించిన భూములకు మంచి గిరాకీ లభించనుంది. -
Puli Gundala Project: కనువిందు చేస్తున్న ప్రకృతి సోయగం
సాక్షి, ఖమ్మం: పచ్చని కొండలు, చిక్కని అటవీ ప్రాంతం.. ఆహ్లాదకరమైన వాతావరణానికి తోడు పక్షుల కిలకిలరావాలతో సందడిగా ఉండే పులిగుండాల ప్రాజెక్టు పర్యాటకులను రా.. రామ్మని ఆహ్వానిస్తోంది. ఇక్కడ ఎంతసేపు చూసినా తనివితీరని ప్రకృతి అందాల సోయగాలు కనువిందు చేస్తున్నాయి. పెనుబల్లి మండలం బ్రహ్మళకుంట గ్రామ సమీపాన అటవీ ప్రాంతంలో గిరిజన రైతుల భూములు సాగు అవసరాల నిమిత్తం కొండల నడుమ పులి గుండాల సాగునీటి ప్రాజెక్టు నిర్మించారు. ఈ ప్రాజెక్టు కొండల నడుమ అటవీప్రాంతంలో ఉండడంతో సాగునీటి అవసరాలు తీరుస్తూనే పర్యాటక కేంద్రంగా దినదినాభివృద్ధి చెందుతోంది. పెనుబల్లి మండలంలోని పులిగుండాల ప్రాజెక్టుతో పాటు నీలాద్రీశ్వర అటవీప్రాంతం, లంకాసాగర్ ప్రాజెక్టులు చెప్పుకోదగిన పర్యాటక ప్రాంతాలుగా రూపుదిద్దుకున్నాయి. అటవీశాఖ ఈ పులిగుండాల ప్రాజెక్టు వద్ద వాచ్ టవర్ నిర్మించి రక్షిత అటవీ ప్రాంతాన్ని కాపాడుతోంది. రెండేళ్ల క్రితం పులిగుండాల సాగునీటి ప్రాజెక్టు వద్ద పులి జాడలు సీసీ కెమెరాల్లో నమోదు కావడంతో ఇక్కడ వన్యప్రాణుల సంతతి అభివృద్ధికి కూడా అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. తద్వారా పాపికొండలు, ఇతరత్రా ప్రాంతాలకు వెళ్లాల్సిన పని లేకుండా వారాంతాల్లో జిల్లా వాసులు సరదాగా గడిపేందుకు అద్భుతమైన పర్యాటక ప్రాంతం అందుబాటులోకి వచ్చినట్లవుతుంది. చదవండి: యాక్టర్‌గా మారిన టీచర్.. ట్రెండ్ సెట్టర్‌గా మారుతున్న యూట్యూబర్ అనిల్ పులిగుండాల ప్రాజెక్టు వద్ద శివాలయం... రెండు రాష్ట్రాల నుంచి పర్యాటకులు జిల్లాలోని పెనుబల్లి, కల్లూరు, తల్లాడ, ఏన్కూరు, సత్తుపల్లితో పాటు ఏపీలోని తిరువూరు తదితర ప్రాంతాల ప్రజలు పులిగుండాల ప్రాజెక్టు అందాలను వీక్షించేందుకు బారులు తీరుతున్నారు. ఆదివారాల్లో ఇక్కడకు కుటుంబ సభ్యులతో కలిసి విహార యాత్రకు వచ్చే వారితో సందడి కనిపిస్తుంది. ఈ ప్రాజెక్టు వద్ద స్థానికులు శివాలయాన్ని నిర్మించి పూజలు చేస్తున్నారు. ఈ ప్రాంతానికి పలువురు ఐఏఎస్‌లు, ఐసీఎస్లతో పాటు ఇతర రాష్ట్ర స్థాయి అధికారులు, ప్రజాప్రతినిధులు వారంతాల్లో వచ్చి అటవీశాఖ ఆధ్వర్యాన నిర్మించిన వాచ్ టవర్ (పాలపిట్ట భవనం) నుంచి అటవీ అందాలు తిలకిస్తూ సేద తీరుతుంటారు. అటవీ ప్రాంతంలో నిర్మించిన పులిగుండాల ప్రాజెక్టును చేరుకోవాలంటే బ్రహ్మళకుంట నుండి సుమారు నాలుగైదు కిలోమీటర్ల మేర మట్టిరోడ్డుపై ప్రయాణించాల్సి వస్తోంది. ఇది కాస్త ఇబ్బందిగా ఉన్నందున... అధికారులు పరిగణనలోకి తీసుకుని బ్రహ్మళకుంట నుండి పులిగుండాల ప్రాజెక్టు వరకు రహదారి నిర్మిస్తే పర్యాటకుల సంఖ్య మరింత పెరిగే అవకాశముంది. అంతేకాకుండా పాలపిట్ట పేరిట వాచ్‌టవర్(భవనం)ను నిర్మించినా విశ్రాంతి గదులు, టాయిలెట్లు మాత్రమే ఉన్నాయి. దీనికి తోడు విద్యుత్, తాగునీటి సౌకర్యం కూడా కల్పిస్తే పర్యాటకులను ఆకట్టుకోవచ్చు. వాచ్ టవర్‌కు సోలార్ ద్వారా విద్యుత్‌సౌకర్యం, బోరు, మోటారు ఏర్పాటుచేసి తాగునీటి సౌకర్యం ఏర్పాటు చేస్తే అటవీ అందాలను తిలకించేందుకు వచ్చే పర్యాటకుల సంఖ్య మరింత పెరుగుతుంది. -
మంచు ముసుగులో అరకు అందాలు
ప్రకృతి గీసిన చిత్రంలా కనులను కట్టిపడేసే సహజ సౌందర్యం.. మనసును ఆహ్లాదపరిచి సేద తీర్చే సుందర సువిశాల సాగరతీరం.. విశ్వవిఖ్యాతినొందిన కేంద్రాల్లో ప్రశాంతతను చేకూర్చే ఆధ్యాత్మిక సమీరం.. ఇలా అనిర్వచనీయ అనుభూతిని సందర్శకులకు అందించే ఆకర్షణీయ కేంద్రం విశాఖ.. దేశవిదేశాల నుంచి వచ్చే సందర్శకులను ఆకట్టుకునేలా అరకు పర్యాటక వైభవాన్ని సంతరించుకుంటోంది. ప్రోత్సాహకాలు, రాయితీలతో పెట్టుబడులను ఆకర్షించేలా ప్రభుత్వం రూపొందించిన నూతన పాలసీతో పర్యాటకం పరుగులు తీయనుంది. సందర్శకుల మనసు దోచేలా ఈ సౌందర్యసీమను పర్యాటకంలో అగ్రభాగాన నిలిపేందుకు కొత్త ప్రాజెక్టులెన్నో పట్టాలెక్కనున్నాయి. సాక్షి, విశాఖపట్నం: పర్యాటకాభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం పక్కా ప్రణాళికతో ముందుకెళ్తోంది. టీడీపీ పాలనలో గతితప్పిన పర్యాటకానికి ఊపిరిపోసి కొత్త చిగురులు తొడిగేందుకు నూతన టూరిజం పాలసీ (2020–2025)ని ప్రవేశపెట్టంది. అనేక ప్రోత్సాహకాలు, రాయితీలతో పాటు కరోనా కారణంగా కోలుకోని టూరిజం ఆధారిత యూనిట్లకు ఊపిరి పోసే రీస్టార్ట్ ప్యాకేజీతో ప్రపంచాన్ని ఆకట్టుకునే పాలసీని రూపొందించింది. ఈ పాలసీతో ప్రతి జిల్లా ప్రముఖ పర్యాటక కేంద్రంగా భాసిల్లుతుందనడంలో ఎలాంటి అతిశయోక్తీ లేదు. చదవండి: ఆంధ్రా ఊటి అరకు స్టార్ హోటల్స్.. రిసార్టులు సాధారణంగా ఒక పర్యాటక రంగ ప్రాజెక్టు స్థాపించాలంటే 6 ప్రభుత్వ కార్యాలయాల నుంచి అనుమతులు తప్పనిసరి. దీనికి మూడు నుంచి ఆరు నెలల సమయం పడుతుంది. దీని బదులు సింగిల్ డెస్క్ విధానం మాదిరిగా కేవలం 30 నుంచి 90 రోజుల్లోపునే అనుమతులు వచ్చేలా విధానాన్ని మార్చారు. అదేవిధంగా.. 90 ఏళ్ల లీజుగడువు, పలు విభాగాల్లో 100 శాతం రీయింబర్స్మెంట్, యూనిట్ విద్యుత్ రూ.2 కే అందివ్వడం.. ఇలా ఎన్నో కొత్త రాయితీల కారణంగా విశాఖ జిల్లాకు సరికొత్త ప్రాజెక్టులు వచ్చే అవకాశాలున్నాయి. జిల్లా చుట్టూ.. పర్యాటకానికి కావల్సినంత ప్రకృతి సంపద ఉంది. దీన్ని అభివృద్ధి చేసేందుకు అనుగుణంగా ఉన్న భూములపై ఇప్పటికే దృష్టి సారించారు. టూరిజం శాఖకు సంబంధించిన 650 ఎకరాల స్థలాల్లో కొత్త ప్రాజెక్టులు తీసుకొచ్చేందుకు కసరత్తులు చేస్తున్నారు. ఇందులో ఏయే ప్రాంతాల్లో ఎలాంటి ప్రాజెక్టులు అమలు చేస్తే పర్యాటకుల నుంచి మంచి స్పందన వస్తుందనే అంశంపై ఇప్పటికే నివేదిక సిద్ధం చేసి పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావుకు పంపించారు. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతంలో హోటల్స్, రిసార్టులతో కొత్త కళ తీసుకువచ్చేలా, నగర పరిధిలోనూ వినూత్న ప్రాజెక్టులకు అనుమతులిచ్చి దేశ విదేశీ పర్యాటకులను ఆకట్టుకునే దిశగా పాలసీలో పొందుపరిచిన అంశాలు అనుకూలిస్తాయి. త్వరితగతిన ప్రాజెక్టులు వచ్చి పర్యాటక విశాఖ మరింత అభివృద్ధి చెంది పెద్ద ఎత్తున ఆదాయం వచ్చే అవకాశాలున్నాయని అధికారులు చెబుతున్నారు. చదవండి: ఎగసిన ఉత్తేజం.. పర్యాటకం కళకళ.. ఫ్లోటింగ్ రెస్టారెంట్.. వాచ్ టవర్.. జిల్లాలో మూడు టూరిజం సర్క్యూట్లు అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇప్పటికే దీనికి సంబంధించిన ప్రణాళికలు సిద్ధం చేసింది. అరకు టూరిజం సర్క్యూట్‌కు కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతుల రావాల్సి ఉండగా మిగిలిన సర్క్యూట్లు కూడా కొత్త పాలసీ వచ్చాక ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే రూ.156 కోట్లతో అరకు ఎకో టూరిజం సరూŠయ్క్ట్ త్వరలోనే అమల్లోకి రానుంది. బౌద్ధ కేంద్రాలైన బొజ్జనకొండ, తొట్లకొండ, బావికొండను సందర్శించేలా రూ.20.70 కోట్లతో బుద్ధిస్ట్ సర్క్యూట్ అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు సిద్ధమయ్యాయి. అదేవిధంగా తెన్నేటి పార్కు సమీపానికి కొట్టుకొచ్చిన బంగ్లాదేశ్ షిప్‌ను ఫ్లోటింగ్ రెస్టారెంట్‌గా మార్చేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు మంత్రి అవంతి ప్రకటించారు. షిప్ యాజమాన్యంతో చర్చలు చివరిదశలో ఉన్నాయని, అవి కొలిక్కి వచ్చాక స్పష్టత వస్తుందని తెలిపారు. కైలాసగిరిపై నుంచి సాగర తీరం అందా లు, విశాఖ నగర సొగసులు చూసేందుకు వాచ్ టవర్ నిర్మాణానికి సన్నాహాలు చేస్తున్నట్లు తెలిపారు. ఈ ప్రాజెక్టులు సిద్ధమైతే విశాఖ పర్యాటకానికి మరింత సొబగులు చేకూరనున్నాయి. ఎస్పీవీ ద్వారా పారదర్శకంగా.. టూరిజం పాలసీ చాలా అద్భుతంగా ఉందని ఇప్పటికే స్టేక్ హోల్డర్లు, టూరిజం ఆపరేటర్లు కితాబిచ్చారు. పెట్టుబడులను ఆకర్షించేలా ఫ్రెండ్లీ పాలసీ రూపొందించాలన్న ముఖ్యమంత్రి సూచనలకు అనుగుణంగా కొత్త పర్యాటక విధానం తీసుకొచ్చాం. స్పెషల్ పర్పస్ వెహికల్(ఎస్పీవీ) ద్వారా పెట్టుబడులకు పారదర్శకంగా, అవినీతికి తావులేకుండా అనుమతులిస్తాం. చిన్న హోటల్స్, రెస్టారెంట్లు రీస్టార్ట్ ప్యాకేజీ ద్వారా తీసుకునే రుణాలపై 4.5 శాతం వడ్డీ ప్రభుత్వమే భరిస్తుంది. ప్రస్తుతం అసంఘటితంగా ఉన్న టూర్ ఆపరేటర్లు, గైడ్లకు వృత్తిపరమైన శిక్షణ ఇచ్చి ప్రొఫెషనలిజం ఉండేలా మారుస్తాం. అతిథి దేవోభవ సంప్రదాయాన్ని పాటిస్తాం. రాష్ట్రంలోని అన్ని పర్యాటక కేంద్రాలు కొత్త పాలసీతో టూరిజం పరంగా భాసిల్లుతాయి. ముఖ్యంగా విశాఖ జిల్లా పర్యాటక ఖిల్లాగా మారుతుంది. – ముత్తంశెట్టి శ్రీనివాసరావు, పర్యాటక శాఖ మంత్రి -
టూరిజం స్పాట్.. హార్టికల్చర్ హబ్‌గా జిల్లా
కడప సెవెన్‌రోడ్స్ : జిల్లాను టూరిజం స్పాట్‌గా, హార్టికల్చర్ హబ్‌గా మార్చేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు దృష్టి సారించారని రాష్ట్ర పర్యాటకాభివృద్ధి సంస్థ చైర్మన్ వీరపురెడ్డి జయరామిరెడ్డి అన్నారు. టూరిజం ఎక్స్‌లెన్స్ అవార్డు–2017 గ్రహీత పంతుల పవన్‌కుమార్ అభినందన సభ సందర్భంగా ఆదివారం సీపీ బ్రౌన్ భాషా పరిశోధనా కేంద్రంలో కొండూరు పిచ్చమ్మ, వెంకట్రాజు స్మారక సంస్థ అధ్యక్షుడు కొండూరు జనార్దన్‌రాజు ఆధ్వర్యంలో జిల్లాలో పర్యాటకాభివృద్ధిపై నిర్వహించిన సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా విచ్చేశారు. గండికోటకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకు వచ్చేందుకు కృషి చేస్తామని, యునెస్కో నిధులు వస్తే మరింత అభివృద్ధి అవుతుందన్నారు. గండికోటలో సాహస క్రీడల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామని, వంతెన నిర్మాణానికి ఇప్పటికే రూ. 3 కోట్లు విడుదల చేశామన్నారు. బ్రౌన్ నివసించిన స్థలంలో ఏర్పాటైన పరిశోధన కేంద్రాన్ని రాష్ట్ర పర్యాటక ప్రదేశాల జాబితాలో చోటు కల్పిస్తామని, అలాగే అధికారిక వెబ్సైట్లో పొందుపరుస్తామని హామీ ఇచ్చారు. ఒంటిమిట్ట చెరువును నీటితో నింపి బోటింగ్ ఏర్పాటు చేస్తామన్నారు. టూరిస్టులు జిల్లాలోని పర్యాటక ప్రదేశాలను సందర్శించి సాయంత్రానికి తిరిగి తిరుపతి వెళ్లే విధంగా బస్సులను ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలిస్తామన్నారు. సదస్సుకు అధ్యక్షత వహించిన విద్వాన్ కట్టా నరసింహులు మాట్లాడుతూ జిల్లాలో ఎంతో ప్రాధాన్యత ఉన్న మోపూరు, నందలూరు సౌమ్యనాథస్వామి ఆలయాల శాసనాల్లోని చరిత్రను వెలికి తీయాల్సిన అవసరం ఉందన్నారు. రాయలసీమలో నందలూరులో ఏకైక బౌద్ధారామం ఉందని, దాన్ని అభివృద్ధి చేయాలని కోరారు. ప్రభుత్వ విప్ మేడా మల్లికార్జునరెడ్డి మాట్లాడుతూ తిరుపతి నుంచి గండికోట వరకు పర్యాటక హబ్‌లు ఏర్పాటు చేస్తామన్నారు. శాసనమండలి మాజీ డిప్యూటీ చైర్మన్ ఎస్వీ సతీష్‌రెడ్డి మాట్లాడుతూ ప్రకృతిని ధ్వంసం చేయకుండా పర్యాటక ప్రదేశాల అభివృద్ధి జరగాలన్నారు. పర్యాటకశాఖ రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మేడా బాలసుబ్రమణ్యంరెడ్డి మాట్లాడుతూ గండికోట అభివృద్దికి మాస్టర్‌ప్లాన్ రూపొందించి ప్రపంచ వారసత్వ ప్రదేశంగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నామన్నారు. రీజినల్ డైరెక్టర్ జి.గోపాల్ మాట్లాడుతూ గండికోటకు సంబంధించి 20 మంది టూర్ గైడ్స్‌కు శిక్షణ ఇచ్చామన్నారు. యునెస్కో గుర్తింపునకు చర్యలు ప్రారంభించామన్నారు. ప్రభుత్వం గండికోట అభివృద్ధికి రూ. 500 కోట్లతో పలు చర్యలు చేపట్టిందని టీడీపీ జిల్లా అధ్యక్షుడు ఆర్.శ్రీనివాసులురెడ్డి పేర్కొన్నారు. జానమద్ది విజయభాస్కర్ నిర్వహణలో సాగిన ఈ కార్యక్రమంలో అలపర్తి పిచ్చయ్యచౌదరి, మూల మల్లికార్జునరెడ్డి మాట్లాడారు. యలమర్తి మధుసూదన్ ప్రార్థనా గీతాన్ని ఆలపించారు. తొలుత పర్యాటకాభివృద్ధి సంస్థ చైర్మన్ జిల్లా పర్యాటక ప్రాంతాల ఫొటో ఎగ్జిబిషన్‌ను ప్రారంభించారు. ‘పంతుల’కు ఘన సన్మానం టూరిజం ఎక్స్‌లెన్స్ అవార్డు–2017 అందుకున్న పాత్రికేయుడు పంతుల పవన్‌కుమార్‌ను రాష్ట్ర టూరిజం అభివృద్ధి సంస్థ చైర్మన్ వీరపురెడ్డి జయరామిరెడ్డి ఘనంగా సన్మానించారు. ఆయనతోపాటు పలు పర్యాటక సంఘాల ప్రతినిధులు, పర్యాటకాభిమానులు పాల్గొన్నారు. -
దేవరకొండ చూసొద్దాం.. రండి
జిల్లాలో ప్రసిద్ధిగాంచిన ఆధ్యాత్మిక క్షేత్రాల్లో దేవరకొండ ఒకటి. జిల్లా కేంద్రం అనంతపురానికి ఐదు కిలోమీటర్ల దూరంలో బుక్కరాయసముద్రం మీదుగా సిద్దరాంపురం రోడ్డు మార్గంలో ఉన్న ఈ కొండపై శ్రీదేవి, భూదేవి సమేత వేంకటేశ్వర స్వామి కొలువుదీరాడు. ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణంలో దేవరకొండ శిఖర భాగాన వెలిసిన ఈ ఆలయం వద్ద పూర్వం గార్గేయ మహర్షి తపస్సు చేసినట్లు ఆలయ చరిత్ర చెబుతోంది. మూలవిరాట్ వెనుక ఉన్న గుహ గురించి పలు కథనాలు ఉన్నాయి. గుహ ప్రవేశద్వారం చిన్నగాను.. పోనుపోను విశాలంగాను ఉన్నట్లు సమాచారం. విజయనగర రాజుల పాలన కాలం నుంచి ఈ ఆలయంలో బ్రహ్మోత్సవాలను నిర్వహిస్తూ వస్తున్నట్లు తెలుస్తోంది. కొండపై చేరుకునేందుకు మెట్ల దారితో పాటు వాహనాలు వెళ్లేందుకు ఇటీవల రోడ్డు కూడా వేశారు. కొండ చుట్టూ గిరిప్రదక్షణ కోసం రోడ్డు మార్గం ఉంది. మెట్లదారి గుండా వెళుతుంటే తిరుమల గిరిని ఎక్కుతున్నంత అనుభూతిని భక్తులు పొందుతుంటారు. కొండ కింద ఆంజనేయస్వామి ఆలయంలోనూ నిత్యపూజలు జరుగుతుంటాయి. - బుక్కరాయసముద్రం (శింగనమల) -
పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయడానికి కసరత్తు
లేపాక్షి : లేపాక్షిని పర్యాటక కేంద్రంగా మరింత అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం కసరత్తు చేస్తోందని ఏపీ టూరిజం శాఖ రీజినల్ డైరెక్టర్ గోపాల్ వెల్లడించారు. ఆయన లేపాక్షిని మంగళవారం సందర్శించారు. పర్యాటక రంగంగా తీర్చిదిద్దడానికి ఆలయం వెనుక భాగంలోని గజాగుండం కోనేరును పరిశీలించారు. అక్కడి మురుగునీరు తొలగించి సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దడానికి అవకాశంపై ఆరా తీశారు. అనంతరం విరుపణ్ణ, వీరణ్ణ పార్కులు, ఆలయానికి కిలో మీటరు దూరంలోని జఠాయువు మోక్షఘాట్ సందర్శించారు. అక్కడ ఎలాంటి వసతులు కల్పిస్తే పర్యాటకులను ఆకర్షిస్తారనే కోణంపై ఆరా తీశారు. డివిజినల్ మేనేజర్ బాపూజీ, జిల్లా ఇన్చార్జ్ బాలభాస్కర్, ఈఈ ఈశ్వరయ్య, డీఈఈ కుమార్, ఏఈఈ నారాయణరావు, స్థానిక మేనేజర్ లక్ష్మణ్‌రావు, తహశీల్దార్ ఆనందకుమార్, ఎంపీపీ హనోక్, గ్రామసర్పంచ్ జయప్ప, ఎంపీటీసీ సభ్యులు చలపతి, చిన్న ఓబన్న ఆయన వెంట ఉన్నారు.