దేవరకొండ చూసొద్దాం.. రండి
జిల్లాలో ప్రసిద్ధిగాంచిన ఆధ్యాత్మిక క్షేత్రాల్లో దేవరకొండ ఒకటి. జిల్లా కేంద్రం అనంతపురానికి ఐదు కిలోమీటర్ల దూరంలో బుక్కరాయసముద్రం మీదుగా సిద్దరాంపురం రోడ్డు మార్గంలో ఉన్న ఈ కొండపై శ్రీదేవి, భూదేవి సమేత వేంకటేశ్వర స్వామి కొలువుదీరాడు. ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణంలో దేవరకొండ శిఖర భాగాన వెలిసిన ఈ ఆలయం వద్ద పూర్వం గార్గేయ మహర్షి తపస్సు చేసినట్లు ఆలయ చరిత్ర చెబుతోంది. మూలవిరాట్ వెనుక ఉన్న గుహ గురించి పలు కథనాలు ఉన్నాయి. గుహ ప్రవేశద్వారం చిన్నగాను.. పోనుపోను విశాలంగాను ఉన్నట్లు సమాచారం.
విజయనగర రాజుల పాలన కాలం నుంచి ఈ ఆలయంలో బ్రహ్మోత్సవాలను నిర్వహిస్తూ వస్తున్నట్లు తెలుస్తోంది. కొండపై చేరుకునేందుకు మెట్ల దారితో పాటు వాహనాలు వెళ్లేందుకు ఇటీవల రోడ్డు కూడా వేశారు. కొండ చుట్టూ గిరిప్రదక్షణ కోసం రోడ్డు మార్గం ఉంది. మెట్లదారి గుండా వెళుతుంటే తిరుమల గిరిని ఎక్కుతున్నంత అనుభూతిని భక్తులు పొందుతుంటారు. కొండ కింద ఆంజనేయస్వామి ఆలయంలోనూ నిత్యపూజలు జరుగుతుంటాయి.
- బుక్కరాయసముద్రం (శింగనమల)