bukkarayasamudram
-
మనోజ్ 'ఖజానా' చూస్తే కళ్లు తిరగాల్సిందే..
సాక్షి, అనంతపురం : తీగ లాగితే డొంక కదిలినట్లుగా ట్రెజరీ ఉద్యోగి మనోజ్ అక్రమాలు వెలుగులోకి వస్తున్నాయి. విలాసవంతమైన జీవితం గడుపుతున్న అతగాడి నుంచి ఏడు బైక్‌లు, రెండు కార్లు, నాలుగు ట్రాక్టర్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తన అవినీతి సొమ్ము భద్రంగా ఉండేందుకే డ్రైవర్ ఇంట్లో 3.5 కోట్ల రూపాయల విలువైన బంగారం, వెండిని దాచిపెట్టినట్లు అనంతపురం జిల్లా పోలీసుల విచారణలో వెల్లడైంది. బుక్కరాయసముద్రంలో వెలుగుచూసిన నిధి మొత్తం ట్రైజరీ సీనియర్ అకౌంటెంట్ మనోజ్ అక్రమంగా సంపాదించినదే దర్యాప్తులో తేలింది. వాటిని తన ఇంట్లో పెట్టుకుంటే భద్రత ఉండదని భావించిన మనోజ్ తన డ్రైవర్ నాగలింగ ఇంట్లో వీటిని దాచిపెట్టారని గుర్తించారు. ఒక రివాల్వర్, మరొక ఎయిర్ పిస్టల్‌తో పాటు రెండున్నర కిలోల బంగారం, 84 కిలోల వెండిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఏసీబీ, ఆదాయపన్ను శాఖ దృష్టికి వివరాలు పంపుతామని అనంతపురం ఓఎస్డీ రామకృష్ణ ప్రసాద్ తెలిపారు. మనోజ్‌కు కారు డ్రైవర్ నాగలింగతో పాటు మామ బాలప్ప సహకారం ఉన్నట్లు తెలిపారు. (8 ట్రంకు పెట్టెల్లో బంగారం, వెండి, నగదు) ఊహకందని విధంగా ట్రెజరీ ఉద్యోగి మనోజ్ కారు డ్రైవర్ బంధువు ఇంట్లో.. భారీఎత్తున అవినీతి 'ఖజానా' బయటపడిన విషయం తెలిసిందే. అచ్చం సినిమాను తలపించే విధంగా మారుమూల ప్రాంతంలోని ఓ చిన్న ఇంట్లో ఎనిమిది ట్రంకు పెట్టెల్లో దాచిపెట్టిన కిలోలకొద్దీ బంగారం, వెండి, పెద్దఎత్తున నగదును పోలీసులు స్వాధీనం చేసుకోవడం సంచలనమైంది. అయితే ఇదంతా అనంతపురం జిల్లా ఖజానా కార్యాలయంలో పనిచేసే ఓ సీనియర్ అకౌంటెంట్‌కు చెందిన అవినీతి సంపాదన అని తెలిసి.. అంతా ముక్కున వేలేసుకుంటున్నారు స్థానికులు. (ఇంట్లో తవ్వకాలు; బంగారు నిధి పట్టివేత) -
యువతిపై కానిస్టేబుల్ అత్యాచారం!
సాక్షి, అనంతపురం: బుక్కరాయసముద్రంలో మంగళవారం దారుణం చోటు చేసుకుంది. పోలీసులమంటూ ఇద్దరు వ్యక్తులు ఓ ప్రేమికుల జంటపై బెదిరింపులకు పాల్పడుతూ అమానుషంగా ప్రవర్తించారు. వివరాల్లోకి వెళితే.. కానిస్టేబుల్ సురేంద్ర, తన స్నేహితుడు రాజశేఖర్‌తో కలిసి ఓ ప్రేమజంటను బెదిరించారు. అంతటితో ఆగకుండా ప్రియుడు నవీన్‌పై దాడి చేసి యువతిని అపహరించారు. దీంతో ప్రియుడు నవీన్ డయల్ 100కు ఫోన్ చేసి సమాచారం అందించాడు. మరోవైపు కానిస్టేబుల్ చెర నుంచి బయటపడ్డ బాధితురాలు తనను సురేంద్ర అత్యాచారం చేశాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటనకు పాల్పడ్డ నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ చేపడుతున్నారు. (విదేశీ యువతులతో మంత్రి బంధువు రేవ్ పార్టీ..) చదవండి: ఇద్దరు బాలికలపై అత్యాచారం -
బతుకులు శిథిలం
ఖద్దరు కబ్జా...పేదలకు శిక్ష – కబ్జాలు, భూదందాలకు తెగబడుతున్న టీడీపీ నేతలు – వత్తాసు పలుకుతున్న యంత్రాంగం – అప్పనంగా రూ.కోట్లు విలువ చేసే స్థలాల ఆరగింపు – అధికారపార్టీ నేతల ఆగడాలకు బలైపోతున్న పేదలు సాక్షిప్రతినిధి, అనంతపురం: బుక్కరాయసముద్రం చెరువు స్థలంలో 200 మంది నిరుపేదలు ఏడాది కిందట ఇళ్లు నిర్మించుకున్నారు. కొందరు రేకుల షెడ్లు...ఇంకొందరు పక్కా ఇళ్లు ఏర్పాటు చేసుకున్నారు. ఈ స్థలంలో ఇళ్లు నిర్మించుకోండని కొందరు టీడీపీ నేతలు వీరికి అండగా నిలిచారు. తీరా ఇళ్లు నిర్మించుకున్నాక ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా జేసీబీతో వాటిని కూల్చేశారు. కూలి పనికి వెళ్లి పైసా పైసా కూడబెట్టి కష్టపడి నిర్మించుకున్న ఇళ్లు కళ్లెదుట కూలిపోతుంటే అంతా బోరున విలపించారు. ఉండేందుకు నివాసం లేక చిన్నపిల్లలు, వృద్ధులు రాత్రంగా శిథిల స్థలంలోనే జాగారం చేశారు. ఇక్కడ కనిపిస్తున్న చిత్రాలు చూశారా? అధికారపార్టీ భూదాహానికి బలైన నిరుపేద కుటుంబాలివి. అనంతపురం సమీపంలోని కక్కలపల్లిలో ప్రభుత్వ స్థలంలో 132 కుటుంబాల వారు గుడిసెలు వేసుకుని జీవించేవారు. వీటన్నిటికీ పట్టాలిప్పిస్తామని పరిటాల సునీత ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చారు. కానీ అధికారం దక్కిన తర్వాత మొత్తం ఇళ్లను కూల్చేశారు. మంత్రి పరిటాల సునీత తమ్ముడు మురళీ, బంధువు మహేంద్ర వచ్చి ఖాళీ చేయాలని చెప్పారని, తాము ససేమిరా అనడంతో ఇళ్లను కూల్చేసి నీడలేకుండా చేశారని అప్పట్లో బాధితులు ఆరోపించారు. ఇక్కడ పరిటాల, పామురాయి వెంకటేశ్ పేరుతో కన్పిస్తున్న పచ్చజెండాలు అనంతపురం రూరల్ పరిధిలోని సోములదొడ్డి ప్రాంతంలోని ప్రభుత్వ భూమిలో నాటారు. 2013లో పేదలకు ఇళ్లస్థలాల కోసం పట్టాలిచ్చిన 4.90 ఎకరాలను స్వాధీనం చేసుకునేందుకు అధికార పార్టీ నేతలు ఈ స్థలాన్ని కబ్జా చేసేందుకు తెగించారు. రెవెన్యూ అధికారుల సహకారంతోనే ఈ స్థలంలో జెండాలు పాతినట్లు తెలుస్తోంది. కక్కలపల్లిలో ఐదెకరాల ప్రభుత్వస్థలంలో కొంతమంది టీడీపీ నేతలు పరిటాల రవీంద్రకాలనీ పేరుతో బోర్డుపెట్టారు. దాదాపు 200 గుడిసెలు వేయించారు. వీరికి పట్టాలిప్పిస్తామని కొందరు భారీగా దండుకున్నారు. ఇందులో కూడా రెండెకరాలు పేదలకు ఇచ్చి, మూడెకరాలను స్వాధీనం చేసుకోవాలనే కుట్రతోనే ‘తమ్ముళ్లు’ వ్యూహం పన్నట్లు తెలుస్తోంది. ...ఈ నాలుగే కాదు...చెప్పుకుంటూ పోతే మూడేళ్ల అధికారాన్ని అడ్డుపెట్టుకుని టీడీపీ నేతలు అనంతపురం నగరంలో నలుమూలలా స్థలాలను ఆక్రమించారు. మంత్రుల పేరుతో కొందరు, ఎమ్మెల్యేల పేరుతో ఇంకొందరు..యథేచ్ఛగా స్థలాలు ఆక్రమించేశారు. కబ్జా చేసిన స్థలాలన్నీ కార్పొరేషన్ పరిధికి అతిదగ్గరగా ఉన్న ప్రాంతాలే కావడం...అన్నీ కోట్ల రూపాయల విలువ చేసేవే కావడం గమనార్హం. వీరి ఆగడాలకు అధికారులు కూడా అడ్డు చెప్పడం లేదు. అడ్డుచెబితే బదిలీలు...అవసరమైతే భౌతికదాడులకు దిగుతారనే ఆందోళనతో వారి ఆగడాలను చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు. దీంతో అధికారపార్టీనేతల అరాచకాలకు అడ్డూ, అదుపు లేకుండా పోతోంది. వీరి దౌర్జన్యాల వల్ల వందలాది పేద కుటుంబాలు బలవుతున్నాయి. అంతా ఓట్ల రాజకీయం కక్కలపల్లి...విజయనగర్ కాలనీ..ప్రాంతం ఏదైనా నిరుపేదల బతుకుతో అధికారపార్టీ ప్రజాప్రతినిధులు ఆటలు ఆడుకుంటున్నారు. కక్కలపల్లిలో ప్రభుత్వ స్థలంలో ఇళ్లు నిర్మించుకున్నవారి వద్దకు వెళ్లి ఈ ఇళ్లకు పట్టాలిప్పిస్తామని హామీ ఇచ్చారు. కక్కలపల్లి రాప్తాడు నియోజకవర్గం పరిధిలోకి వస్తుంది. సునీత గెలిస్తే ఉన్న ఇళ్లకు పట్టాలిప్పిస్తుంది...పక్కా ఇళ్లు కట్టిస్తుందని ఆశపడి నిరుపేదలంతా టీడీపీకి ఓట్లేసి గెలిపించారు. ఇవన్నీ మంత్రి, ఆమె బంధువులు ఆలోచించలేదు. తమ అవసరాలకే ప్రాధాన్యం ఇచ్చి అధికారులను అడ్డుగా పెట్టి ఇళ్లను కూల్చేశారు. దీంతో వారంతా నెలల పాటు ఖాళీ జాగాల్లో ప్లాస్టిక్ కవర్ల కింద కాలం వెళ్లదీశారు. రోడ్డునపడ్డ 200 కుటుంబాలు విజయనగర్ కాలనీలోని బుక్కరాయసముద్రం చెరువు స్థలంలో 200 మంది పేదలు ఇళ్లు నిర్మించుకున్నారు. వీరంతా ఎంపీ జేసీదివాకర్‌రెడ్డి వర్గీయుల హామీతోనే ఇళ్లు నిర్మించుకున్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని ఆత్మహత్యకు తెగించిన కార్పొరేటర్ ఉమామహేశ్వరరావు కూడా స్పష్టం చేశారు. ఎంపీ హామీ ఇచ్చారనే కారణంతో ఎమ్మెల్యే ప్రభాకర్‌చౌదరి ఇళ్లను కూల్చేయించారనేది వారి ఆరోపణ. ఇళ్లు కూల్చివేత సమయంలో ఘటనాస్థలికి వచ్చిన జయరాంనాయుడు, కోగటం విజయభాస్కర్‌రెడ్డి, ఉమామహేశ్వరావులు ఎంపీ వర్గీయులు. ఈ పరిణామాలన్నీ చూస్తే ఎంపీ, ఎమ్మెల్యే మధ్య విభేదాలు పేదల కుటుంబాలను బలిచేశాయనేది స్పష్టమవుతోంది. ఇళ్లు నిర్మించుకోండని ఎంపీ హామీ ఇచ్చిన మాటే నిజమైతే, కూల్చే సమయంలో ఎందుకు ఎంపీ అడ్డుకోలేకపోయారనేది తేలియాల్సి ఉంది? అలాగే ఎంపీతోనే విభేదాలతోనే ఎమ్మెల్యే ఇళ్లను కూల్చివేయండని చెప్పిందే నిజమైతే రాజకీయకోణంలో కాకుండా మానవీయ కోణంలో ప్రభాకర్‌చౌదరి ఆలోచించలేదనేది తెలుస్తోంది. కారణమేదైనా వందలాది కుటుంబాలు వీధినపడ్డాయి. 200 కుటుంబాలు రోడ్డునపడితే ఎమ్మెల్యే, మేయర్ ఆ వైపు కనీసం తొంగి చూడలేదు. తమకు ఓట్లేసిన పేదలు వీధినపడితే అండగా ఉండాల్సిన బాధ్యత తమదే అనే కనీస ధర్మాన్ని కూడా వారిద్దరూ విస్మరించారు. అధికారులు ఎక్కడున్నారో!?: చెరువు స్థలంలో అక్రమంగా ఇళ్లు నిర్మించారనే కారణంతో ఆర్డీఓ మలోలా ఆధ్వర్యంలో రెవెన్యూ, పోలీసు అధికారులు ప్రొక్లెయిన్లతో ఇళ్లు కూల్చారు. వీరికి ముందస్తుగా నోటీసులు కూడా ఇవ్వలేదు. ప్రభుత్వ స్థలంలో ఇళ్లు నిర్మించకూడదని, భవిష్యత్తులో కూల్చేస్తామని నిర్మాణ సమయంలో ఎందుకు రెవెన్యూ అధికారులు అడ్డుకోలేదనేది సమాధానం చెప్పాల్సి ఉంది. ఏడాది నుంచి 200 మందికిపైగా ఇళ్లు నిర్మించుకున్నారు. అప్పటి వరకూ మౌనంగా ఉండి, ఇళ్లు నిర్మించాక కూల్చేయడం చూస్తే పేదబతుకులపై ప్రభుత్వానికి, యంత్రాంగానికి కాసింత కనికరం కూడా లేదనేది స్పష్టమవుతోంది. నేతల కబ్జాలకు గ్రీన్‌సిగ్నల్ అనంతపురంతో పాటు జిల్లా వ్యాప్తంగా అసైన్డ్ భూములు, ప్రభుత్వ స్థలాల్లో పేదలకు ఇళ్లపట్టాలిచ్చి ఖాళీగా ఉన్న స్థలాలపై టీడీపీ నేతలు కన్నేశారు. అధికారుల అండతో కబ్జాలకు తెగిస్తున్నారు. అనంతపురం నగరం చుట్టూ రాప్తాడు నియోజకవర్గం ఉంది. ఈ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి సునీత మండలానికి ఓ ఇన్చార్జ్ని నియమించారు. వీరి కనుసన్నల్లోనే ఈ తంతు సాగుతోందనే ఆరోపణలు ఉన్నాయి. రూరల్ నియోజకవర్గానికి పరిటాల మహేంద్ర ఇన్చార్జ్గా ఉన్నారు. కబ్జాల వివరాలు చిట్టా ఇదీ... కురుగుంటలో సర్వే నంబర్ 95–3లోని 5.25ఎకరాల స్థలాన్ని నగరంలోని ఒక వ్యక్తికి 1987లో ప్రభుత్వం డి పట్టా మంజూరు చేసింది. ఇదే స్థలాన్ని నాయీబ్రాహ్మణులు 2013లో కొనుగోలు చేసి ప్లాట్లుగా విభజించుకున్నారు. ఈ స్థలాన్ని అధికార పార్టీకి చెందిన ఓ దళిత నాయకుడు ఆక్రమించి ప్లాట్లు వేశారు. ప్లాట్లు విక్రయించారు. పట్టాలు లేకుండానే ఇక్కడ పేదలు ఇళ్లు నిర్మించుకున్నారు. ఇది ప్రభుత్వం స్థలం అని రేపు రెవెన్యూ అధికారులు వీటిని కూల్చే ప్రమాదముంది. –ఆకుతోటపల్లిలో సర్వే నంబర్ 132–4ఏలోని 2 ఎకరాల ప్రభుత్వ స్థలంలో పట్టాలు లేకుండా పేదలు ఇళ్లు నిర్మించుకున్నారు. ఇక్కడ ఎవ్వరికీ పట్టాలివ్వలేదు. ప్రభుత్వ స్థలంలో ఇళ్లు నిర్మిస్తున్నా, రెవెన్యూ అధికారులు ఏ మాత్రం అడ్డు చెప్పలేదు. ప్రస్తుతం ఇళ్లు నిర్మాణంలో ఉన్నాయి. మంత్రి సునీత సూచనలతో ఇళ్లు నిర్మించుకుంటున్నారని తెలిసింది. అటు ఇటు అయితే ఇక్కడ నిర్మించిన ఇళ్లను కూడా అధికారులు కూల్చేసే ప్రమాదం ఉంది. ఇక్కడ సెంటు రూ.3 లక్షలకుపైగా ఉంది. ఇక్కడ ప్లాట్లు ఇచ్చినందుకు స్థానికంగా ఉన్న ఓ టీడీపీ నేత ప్రజల నుంచి భారీగానే వసూలు చేసినట్లు తెలుస్తోంది. – నగర సమీపంలోని ప్రసన్నాయపల్లి రైల్వే స్టేషన్ సమీపంలో సర్వే నంబర్ 343–2ఏలోని 77సెంట్ల స్థలంలో అధికార పార్టీకి చెందిన చోటా నేత ఇళ్లు వేయించారు. ఇక్కడా సెంటు రూ.5 లక్షలకుపైగా ఉంది. ఇక్కడ కూడా ప్రజల నుంచి డబ్బులు వసూలు చేసినట్లు తెలుస్తోంది. – రాజీవ్‌కాలనీలో ఓ టీడీపీ నేత ప్రభుత్వ పోరంబోకు స్థలానికి నకిలీ పట్టాలు సృష్టించారు. ఎర్రనేలకొట్టాలకు చెందిన ఈ వ్యక్తి తహశీల్దార్ సంతకం పోర్జరీ చేసి ఈ పట్టాలు పేదల చేతల్లో పెట్టి, లక్షలు దండుకున్నారు. – జేఎన్టీయూ పరిధిలో ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో 3.80 ఎకరాల పొలంలో అక్రమంగా ఇళ్లు నిర్మించి దీనికి నారాలోకేశ్‌బాబు కాలనీకి పేరు పెట్టారు. ఈ స్థలం కూడా రూ.కోట్లు విలువ చేస్తుంది. – బుక్కరాయసముద్రం మండలం సిద్ధరాంపురం సమీపంలో సర్వే నెంబర్ 777లో 10 ఎకరాల చెరువు పోరంబోకు స్థలం ఉంది. ఇందులో చెట్లు పెంచుకునేందుకు స్థానికులైన ఐదుమందికి లీజుకిచ్చారు. అయితే ఇక్కడి టీడీపీ నేతలు ఎన్టీఆర్ కాలనీ పేరుతో గుడిసెలు వేశారు. పట్టాలిప్పిస్తామని ఒక్కొక్కరి వద్ద భారీగానే డబ్బులు వసూలు చేశారు. నిజానికి పట్టాల పేరుతో ఆ స్థలాన్ని దక్కించుకోవాలనే వ్యూహంతోనే ఈ పన్నాగం పన్నారు. -
పాల కల్తీపై విజి‘లెన్స్’
ఏడావులపర్తిలో అధికారుల మెరుపు దాడులు అదుపులోకి పాల తయారీదారుడు బుక్కరాయసముద్రం: కల్తీ పాలతయారీపై విజిలెన్స్ దృష్టి సారించింది. ఏడావులపర్తి గ్రామంలో ‘విజిలెన్స్’ అధికారులు దాడులు నిర్వహించి కల్తీ పాల తయారీదారుడిని అదుపులోకి తీసుకున్నారు. వివరాల్లోకెళితే.. ఏడావులపర్తిలో లక్ష్మీపతి అనే వ్యక్తి పాల వ్యాపారం చేస్తున్నాడు. గేదెల ద్వారా రోజుకు 40 నుంచి 60 లీటర్లు వరకు పాలు వస్తున్నాయి. అయితే త్వరగా ధనవంతుడు కావాలనే అత్యాశతో కల్తీపాల తయారీపై దృష్టిసారించాడు. తన ఇంట్లోని ప్రత్యేక గదిలో ఉదయాన్నే పాలు తయారు చేసేవాడు. అలా రోజుకు 200 నుంచి 250 లీటర్లు పాలను అనంతపురంలోని హోటళ్లకు, టీస్టాళ్లకు విక్రయించేవాడు. రోజుకు రూ.10వేల మేర సంపాదించేవాడు. ఏడాది కాలంగా నిరాటంకంగా కొనసాగిస్తూ వస్తున్నాడు. ఇంతపెద్ద మొత్తంలో పాలు ఎలా ఉత్పత్తి చేస్తున్నాడని గ్రామంలో కొంతమందికి అనుమానం వచ్చింది. ఏదో జరుగుతోందని భావించి విజిలెన్స్ అధికారులకు, ఫుడ్ ఇన్స్పెక్టర్లకు సమాచారం ఇచ్చారు. జిల్లా విజిలెన్స్ ఎస్పీ అనిల్‌బాబు ఆదేశాల మేరకు విజిలెన్స్ సీఐ రెడ్డప్ప, ఫుడ్ ఇన్స్పెక్టర్ శివశంకర్‌రెడ్డి, అసిస్టెంట్ ఫుడ్ ఇన్స్పెక్టర్ నాగేశ్వరరావు, విజిలెన్స్ కమర్షియల్ ఆఫీసర్ చెన్నయ్య, పోలీసు బృందంతో బుధవారం లక్ష్మీపతి ఇంటిపై మెరుపు దాడి నిర్వహించారు. పాలలోకి కల్తీకి ఉపయోగించే 25 కేజీల గోల్డన్ ఆయిల్, 50 కేజీల చక్కెర, పాలపొడి, లిక్విడ్‌తోపాటు కృత్రిమ పదార్థాలతో తయారు చేసిన 200 లీటర్ల కల్తీపాలను స్వాధీనం చేసుకున్నారు. పాల శ్యాంపిల్స్‌ను ల్యాబ్‌కు పంపుతున్నట్లు అధికారులు తెలిపారు. లక్ష్మీపతిపై చీటింగ్ కేసు నమోదు చేసి పోలీసులకు అప్పగించామని సీఐ రెడ్డప్ప తెలిపారు. -
రోడ్డు ప్రమాదంలో విద్యార్థి మృతి
బుక్కరాయసముద్రం: మండల కేంద్రంలోని నార్పల క్రాస్ వద్ద గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ విద్యార్థి చనిపోయాడు. పోలీసులు తెలిపిన వివరాలు మేరకు... శింగనమల మండలం కొరివిపల్లి గ్రామానికి చెంది ఈశ్వరయ్య బీకేఎస్‌లోని ఐకేపీలో సీసీగా పని చేస్తున్నాడు. ఇతని కుమారుడు జితేంద్ర (11) నగరంలోని శారదానగర్ కాలనీలో శ్రీసాయి పాఠశాలలో 6వ తరగతి చదువుతున్నాడు. జితేంద్రకు అక్కడ పాఠశాలలో చదవడం ఇష్టం లేకపోవడంతో పాఠశాల నుంచి కొరివిపల్లి ఇంటికి నడుచుకుంటూ బయలు దేరాడు. అయితే బీకేఎస్ మండల కేంద్రంలోని నార్పల క్రాస్ వద్ద తాడిపత్రి నుంచి అనంతపురం వెళ్తున్న ఓ కారు జితేంద్రను ఢీ కొంది. కారు డ్రైవరే ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లగా అక్కడ చికిత్స పొందుతూ బాలుడు చనిపోయాడు. పోలీసులు కేసు నమెదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
చలివేంద్రాల్లోనూ చేతివాటం
బుక్కరాయసముద్రం మండలంలో 19 పంచాయతీలున్నాయి. వీటిలో ఎక్కడా ప్రభుత్వం తరఫున చలివేంద్రాలు ఏర్పాటు చేయలేదు. మండల కేంద్రంలో మాత్రం డీఆర్డీఏ - వెలుగు ఆధ్వర్యంలో చలివేంద్రం ఉంది. శింగనమల మండల కేంద్రం, తరిమెలలోనూ పంచాయతీ తరఫున చలివేంద్రాలు ఏర్పాటు చేశారు. మిగిలిన 16 పంచాయతీల్లో వాటి ఊసే లేదు. అదేవిధంగా జిల్లాలో కొన్ని పంచాయతీల్లో మొదట్లో చలివేంద్రాలు ఏర్పాటు చేసినా వారం తర్వాత బంద్ చేశారు. సుమారు అన్ని మండలాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. అనంతపురం అర్బన్ : వేసవిలో ప్రజల దాహార్తి తీర్చేందుకు చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కొందరు అ«ధికారులకు వరంగా మారింది. ఈ మాటున వారు నిధులు కాజేసేందుకు శ్రీకారం చుట్టినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. జిల్లాలోని పంచాయతీలు, మునిసిపల్ వార్డుల్లో చలివేంద్రాల నిర్వహణ కోసం ప్రభుత్వం రూ.1 కోటి మంజూరు చేసింది. ప్రతి చలివేంద్రం వద్ద బ్యానర్ కట్టి మూడు నెలల పాటు నిర్వహించాలని ఆదేశాలు కూడా జారీ చేసింది. నీటితో పాటు మజ్జిగ, ఓఆర్ఎస్ ప్యాకెట్లు ఇవ్వాలని నిర్ణయించింది. జిల్లాలోని 1,003 పంచాయతీల్లో చాలా చోట్ల చలివేంద్రాలు ఏర్పాటు చేయలేదు. కాగా అధికారులు మాత్రం జిల్లాలో 1,200 చలివేంద్రాలు ఏర్పాటు చేసినట్లు రికార్డుల్లో చూపిస్తూ ప్రభుత్వానికి నివేదించారు. ఈ నిధులకు లెక్కలుండవట వేసవిలో చలివేంద్రాల ఏర్పాటు, నిర్వహణకు ప్రభుత్వం మంజూరు చేసి రూ.1 కోటికి లెక్కలు చూపాల్సిన అవసరం లేదని తెలిసింది. ఇదే అదనుగా కొందరు అధికారులు నిధులను స్వాహా చేశారనే విమర్శలు లేకపోలేదు. చలివేంద్రంలో పని చేసే వ్యక్తికి రోజుకు రూ.150 ఇవ్వాలి. ఇలా మూడు నెలలకు కూలి కింద ఆ వ్యక్తికి రూ.13,500 చెల్లించాలి. ఇక మజ్జిగ, ఓఆర్ఎస్ ప్యాకెట్లకూ కొంత మొత్తం వెచ్చించాలి. మూడు నెలల పాటు చలివేంద్రాలు నిర్వహించామని చెప్పి ఈ మొత్తం నొక్కేసే ప్రయత్నం జరుగుతోందని ఉద్యోగవర్గాలే చెప్పడం గమనార్హం. -
దేవరకొండ చూసొద్దాం.. రండి
జిల్లాలో ప్రసిద్ధిగాంచిన ఆధ్యాత్మిక క్షేత్రాల్లో దేవరకొండ ఒకటి. జిల్లా కేంద్రం అనంతపురానికి ఐదు కిలోమీటర్ల దూరంలో బుక్కరాయసముద్రం మీదుగా సిద్దరాంపురం రోడ్డు మార్గంలో ఉన్న ఈ కొండపై శ్రీదేవి, భూదేవి సమేత వేంకటేశ్వర స్వామి కొలువుదీరాడు. ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణంలో దేవరకొండ శిఖర భాగాన వెలిసిన ఈ ఆలయం వద్ద పూర్వం గార్గేయ మహర్షి తపస్సు చేసినట్లు ఆలయ చరిత్ర చెబుతోంది. మూలవిరాట్ వెనుక ఉన్న గుహ గురించి పలు కథనాలు ఉన్నాయి. గుహ ప్రవేశద్వారం చిన్నగాను.. పోనుపోను విశాలంగాను ఉన్నట్లు సమాచారం. విజయనగర రాజుల పాలన కాలం నుంచి ఈ ఆలయంలో బ్రహ్మోత్సవాలను నిర్వహిస్తూ వస్తున్నట్లు తెలుస్తోంది. కొండపై చేరుకునేందుకు మెట్ల దారితో పాటు వాహనాలు వెళ్లేందుకు ఇటీవల రోడ్డు కూడా వేశారు. కొండ చుట్టూ గిరిప్రదక్షణ కోసం రోడ్డు మార్గం ఉంది. మెట్లదారి గుండా వెళుతుంటే తిరుమల గిరిని ఎక్కుతున్నంత అనుభూతిని భక్తులు పొందుతుంటారు. కొండ కింద ఆంజనేయస్వామి ఆలయంలోనూ నిత్యపూజలు జరుగుతుంటాయి. - బుక్కరాయసముద్రం (శింగనమల) -
కొండమీదరాయుడా.. కోటి దండాలయ్యా
బుక్కరాయసముద్రం సమీపంలోని దేవరకొండపై వెలసిన కొండమీదరాయుడి రథోత్సవం శుక్రవారం నేత్రపర్వంగా సాగింది. స్థానిక లక్ష్మీనారాయణ స్వామి ఆలయంలో వేకువజామునే శ్రీదేవి, భూదేవి సమేత కొండమీదరాయుడి కల్యాణోత్సవాన్ని నిర్వహించారు. మధ్యాహ్నం 12.30 గంటలకు ఉత్సవమూర్తులను సూర్యప్రభ వాహనంపై ఊరేగిస్తూ తీసుకొచ్చి రథంపై అధిష్టింపజేశారు. మధ్యాహ్నం ఒంటి గంటకు పురవీధుల్లో అశేష భక్తుల గోవింద నామస్మరణ నడుమ రథాన్ని ముందుకు లాగారు. ఉత్సవానికి జిల్లాలోని పలు ప్రాంతాల నుంచే కాకుండా.. కర్ణాటక, తమిళనాడు నుంచి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. - బుక్కరాయసముద్రం -
కలియుగదైవం.. కొండమీద రాయుడు
దేవరకొండపై కొలువైన వేంకటేశ్వరుడు 3 నుంచి బ్రహ్మోత్సవాలు కలియుగ దైవం శ్రీ వెంకటరమణ స్వామి కొండమీద రాయుడుగా భక్తులకు కోర్కెల తీరుస్తూ.. ఆపదలో ఉన్న వారికి అనాథ రక్షకునిగా వెలుగొందుతున్నాడు. కొండమీద వెంకటరమణ స్వామిని మాఘ మాసంలో దర్శించుకుంటే భక్తులు కోర్కెలు సిద్ధిస్తాయని ప్రతీతి. ఏటా మాఘ మాసంలో బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతాయి. - బుక్కరాయసముద్రం (శింగనమల) ఇదీ చరిత్ర.. అనంతపురానికి ఐదు కిలో మీటర్ల దూరంలో బుక్కరాయసముద్రం మండల కేంద్రంలోని సిద్దరాంపురం రోడ్డు సమీపాన దేవరకొండపై శ్రీలక్ష్మీ సహిత వేంకటేశ్వరుడు (కొండమీద రాయడు) వెలిశాడు. ఆహ్లాదకరమైన వాతావరణంలో దేవరకొండ శిఖర భాగాన కొండమీద రాయుడు కొలువు తీరాడు. పూర్వం ఈ దేవరకొండపై గార్గేయ మహర్షి నిరంతర తపః ఫలంగానే శ్రీ వేంకటేశ్వరుని ప్రత్యక్షమై కోర్కెలు తీర్చాడనీ పురాణాలు చెబుతున్నాయి. అనంతరం శ్రీ వేంకటేశ్వరుడు దేవరకొండపై కొండమీద రాయునిగా స్థిరంగా నిలిచి పోయాడని ప్రతీతి. శిల రూపంలో ఉన్న కొండమీదరాయుడు భక్తులకు సాక్షాత్కరిస్తున్నాడు. స్వామివారు వేంచేసి ఉండే స్థలానికి వెనుక వైపున ఒక గుహ ఉంది. ఈ గుహ ప్రవేశ ద్వారం మొదట చిన్నగా ఉండి రాను రాను చాలా విశాలంగా కనబడుతుంది. వెకటరమణ స్వామి తిరుణాల ఉత్సవాలను విజయనగర పాలన నుంచి హరిహర బుక్కరాయలు నిర్వహిస్తూ వచ్చారు. అదే విదంగా మాఘ మాసంలో కొండమీద వెంకటరమణ స్వామిని దర్శించుకుంటే సాక్ష్యాత్తు వైకుంఠంలో వెంకటేశ్వరుని చూసి తరించినట్లేనని ప్రజల ప్రగాఢ విస్వాసం. 3 నుంచి కొండమీద రాయుని బ్రహ్మోత్సవాలు ఫిబ్రవరి 3 నుంచి 12 వరకు కొండమీద రాయుని బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. 3న శ్రీలక్ష్మీ నారాయణస్వామి దేవాలయంలో నుంచి స్వామి వారి ఉత్సవ మూర్తి విగ్రహాలను సాయంత్రం కొండపైకి తీసుకెళతారు. 4న ఉదయం 8 గంటలకు దేవరకొండపై ఉత్సవ విగ్రహాలకు పుణ్యాహవచనం, ఆంకురార్పణ నిర్వహిస్తారు. 10 గంటలకు ధ్వజారోహణం, రాత్రి 8 గంటలకు స్వామి వారికి పుష్ప పల్లకీ సేవ నిర్వహిస్తారు. 5న రాత్రి 8 గంటలకు స్వామి వారిని సింహ వాహనంపై పుర వీధులలో ఊరేగిస్తారు. 6న రాత్రి 8 గంటలకు స్వామి వారిని శేష వాహనంపై ఊరేగిస్తారు. 7న రాత్రి 8 గంటలకు స్వామి వారిని హనుమద్వాహనంపై, 8న రాత్రి 8 గంటలకు గరుడ వాహనంపై ఊరేగింపు నిర్వహిస్తారు. 9న రాత్రి 8 గంటలకు శ్వేత గజవాహనంపై ఊరేగిస్తారు. 10న మాఘ శుద్ధ పౌర్ణమి సందర్భంగా వేకువ జామున స్వామి వారి కల్యాణోత్సవం నిర్వహింస్తారు. అనంతరం ఉదయం 10 గంటలకు స్వామి వారిని సూర్యప్రభ వాహనంపై పురవీధుల్లో ఊరేగించి కనుల పండువగా రథోత్సవం నిర్వహిస్తారు. 11న రాత్రి 7 గంటలకు స్వామి వారిని అశ్వవాహనంపై ఊరేగిస్తారు. 12న ఉదయం 7 గంటలకు తీర్థవాది వసంతోత్సవం, నిర్వహించి రాత్రి 7.గంటలకు స్వామి వారిని హంస వాహనంపై ఊరేగిస్తారు. -
వృద్ధుడు ఆత్మహత్య
బుక్కరాయసముద్రం : ఒంటరి జీవితంపై విరక్తి చెందిన ఓ వృద్ధుడు ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన మేరకు.. రెడ్డిపల్లికి చెందిన లక్ష్మన్న (80), సుంకమ్మ దంపతులు. వీరికి ఒక కుమార్తె. ఆమెకు వివాహమై బెంగుళూరులో ఉంటోంది. సుంకమ్మ ఆరు నెలల క్రితం చనిపోయింది. అప్పటి నుంచి ఒంటరిగా ఉంటున్న లక్ష్మన్న ఇరుగుపొరుగు వారు పెట్టే ఆహారం తింటూ కాలం వెళ్లదీసేవాడు. ఇటీవల అనారోగ్యం బారినపడటం, ఒంటరి జీవితంపై విరక్తి చెందడంతో మంగళవారం మధ్యాహ్నం ఇంటిలోనే ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించి, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం అనంతపురం ఆస్పత్రికి తరలించారు. -
నిరుద్యోగి బలవన్మరణం
బుక్కరాయసముద్రం : కనగానపల్లికి చెందిన భాగ్యలక్ష్మి, దాసరి రామచంద్ర దంపతుల కుమారుడు దాసరి మనోజ్(23) ఆదివారం ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. ఐటీ ఐ చేసిన మనోజ్ ఉద్యోగం కోసం ఎంత ప్రయత్నించినా దొరక లే దు. ఈ నేపథ్యంలో శనివారం రాత్రి ఇంట్లో నిద్రపోయిన మనోజ్ తె ల్లారేసరికి ఉరికి వేలాడుతున్నట్లు వివరించారు. ఎస్ఐ విశ్వనాథ్ చౌద రి ఘటనా స్థలికి చేరుకున్నారు. మృతదేహాన్ని పరిశీలించారు. పోస్టుమార్టం కోసం అనంతపురం పెద్దాస్పత్రికి తరలించారు. -
అనంతలో వృద్ధుడి దారుణ హత్య
గుర్తుతెలియని దుండగులు రియల్ ఎస్టేట్ వ్యాపారిని హతమార్చారు. ఈ ఘటనలో అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రం మండలం పామురాలు గ్రామానికి చెందిన లక్ష్మినారాయణ (55) మృతి చెందారు. శనివారం రాత్రి అనంతపురం నుంచి పనులు ముగించుకొని వస్తుండగా గుత్తి రోడ్డులో ఈ దారుణం జరిగింది. విషయం తెలిసిన పోలీసులు అక్కడకు చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
అనంతలో వ్యభిచార గృహాలపై దాడులు
అనంతపురం జిల్లా బుక్కరాయ సముద్రంలో వ్యభిచార గృహాలపై జిల్లా పోలీసులు శనివారం దాడులు నిర్వహించారు. ఈ సందర్బంగా ఇద్దరు మహిళలతోపాటు నలుగురు నిర్వాహకులను పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం వారిని పోలీసులు స్టేషన్‌కు తరలించారు.ఆరుగురిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బుక్కరాయ సముద్రంలో ఇటీవల కాలంలో వ్యభిచారం జోరుగా సాగుతుంది. ఈ నేపథ్యంలో స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతో పోలీసులు శనివారం దాడులు నిర్వహించారు.