బతుకులు శిథిలం
ఖద్దరు కబ్జా...పేదలకు శిక్ష
– కబ్జాలు, భూదందాలకు తెగబడుతున్న టీడీపీ నేతలు
– వత్తాసు పలుకుతున్న యంత్రాంగం
– అప్పనంగా రూ.కోట్లు విలువ చేసే స్థలాల ఆరగింపు
– అధికారపార్టీ నేతల ఆగడాలకు బలైపోతున్న పేదలు
సాక్షిప్రతినిధి, అనంతపురం: బుక్కరాయసముద్రం చెరువు స్థలంలో 200 మంది నిరుపేదలు ఏడాది కిందట ఇళ్లు నిర్మించుకున్నారు. కొందరు రేకుల షెడ్లు...ఇంకొందరు పక్కా ఇళ్లు ఏర్పాటు చేసుకున్నారు. ఈ స్థలంలో ఇళ్లు నిర్మించుకోండని కొందరు టీడీపీ నేతలు వీరికి అండగా నిలిచారు. తీరా ఇళ్లు నిర్మించుకున్నాక ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా జేసీబీతో వాటిని కూల్చేశారు. కూలి పనికి వెళ్లి పైసా పైసా కూడబెట్టి కష్టపడి నిర్మించుకున్న ఇళ్లు కళ్లెదుట కూలిపోతుంటే అంతా బోరున విలపించారు. ఉండేందుకు నివాసం లేక చిన్నపిల్లలు, వృద్ధులు రాత్రంగా శిథిల స్థలంలోనే జాగారం చేశారు.
ఇక్కడ కనిపిస్తున్న చిత్రాలు చూశారా? అధికారపార్టీ భూదాహానికి బలైన నిరుపేద కుటుంబాలివి. అనంతపురం సమీపంలోని కక్కలపల్లిలో ప్రభుత్వ స్థలంలో 132 కుటుంబాల వారు గుడిసెలు వేసుకుని జీవించేవారు. వీటన్నిటికీ పట్టాలిప్పిస్తామని పరిటాల సునీత ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చారు. కానీ అధికారం దక్కిన తర్వాత మొత్తం ఇళ్లను కూల్చేశారు. మంత్రి పరిటాల సునీత తమ్ముడు మురళీ, బంధువు మహేంద్ర వచ్చి ఖాళీ చేయాలని చెప్పారని, తాము ససేమిరా అనడంతో ఇళ్లను కూల్చేసి నీడలేకుండా చేశారని అప్పట్లో బాధితులు ఆరోపించారు.
ఇక్కడ పరిటాల, పామురాయి వెంకటేశ్ పేరుతో కన్పిస్తున్న పచ్చజెండాలు అనంతపురం రూరల్ పరిధిలోని సోములదొడ్డి ప్రాంతంలోని ప్రభుత్వ భూమిలో నాటారు. 2013లో పేదలకు ఇళ్లస్థలాల కోసం పట్టాలిచ్చిన 4.90 ఎకరాలను స్వాధీనం చేసుకునేందుకు అధికార పార్టీ నేతలు ఈ స్థలాన్ని కబ్జా చేసేందుకు తెగించారు. రెవెన్యూ అధికారుల సహకారంతోనే ఈ స్థలంలో జెండాలు పాతినట్లు తెలుస్తోంది.
కక్కలపల్లిలో ఐదెకరాల ప్రభుత్వస్థలంలో కొంతమంది టీడీపీ నేతలు పరిటాల రవీంద్రకాలనీ పేరుతో బోర్డుపెట్టారు. దాదాపు 200 గుడిసెలు వేయించారు. వీరికి పట్టాలిప్పిస్తామని కొందరు భారీగా దండుకున్నారు. ఇందులో కూడా రెండెకరాలు పేదలకు ఇచ్చి, మూడెకరాలను స్వాధీనం చేసుకోవాలనే కుట్రతోనే ‘తమ్ముళ్లు’ వ్యూహం పన్నట్లు తెలుస్తోంది.
...ఈ నాలుగే కాదు...చెప్పుకుంటూ పోతే మూడేళ్ల అధికారాన్ని అడ్డుపెట్టుకుని టీడీపీ నేతలు అనంతపురం నగరంలో నలుమూలలా స్థలాలను ఆక్రమించారు. మంత్రుల పేరుతో కొందరు, ఎమ్మెల్యేల పేరుతో ఇంకొందరు..యథేచ్ఛగా స్థలాలు ఆక్రమించేశారు. కబ్జా చేసిన స్థలాలన్నీ కార్పొరేషన్ పరిధికి అతిదగ్గరగా ఉన్న ప్రాంతాలే కావడం...అన్నీ కోట్ల రూపాయల విలువ చేసేవే కావడం గమనార్హం. వీరి ఆగడాలకు అధికారులు కూడా అడ్డు చెప్పడం లేదు. అడ్డుచెబితే బదిలీలు...అవసరమైతే భౌతికదాడులకు దిగుతారనే ఆందోళనతో వారి ఆగడాలను చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు. దీంతో అధికారపార్టీనేతల అరాచకాలకు అడ్డూ, అదుపు లేకుండా పోతోంది. వీరి దౌర్జన్యాల వల్ల వందలాది పేద కుటుంబాలు బలవుతున్నాయి.
అంతా ఓట్ల రాజకీయం
కక్కలపల్లి...విజయనగర్ కాలనీ..ప్రాంతం ఏదైనా నిరుపేదల బతుకుతో అధికారపార్టీ ప్రజాప్రతినిధులు ఆటలు ఆడుకుంటున్నారు. కక్కలపల్లిలో ప్రభుత్వ స్థలంలో ఇళ్లు నిర్మించుకున్నవారి వద్దకు వెళ్లి ఈ ఇళ్లకు పట్టాలిప్పిస్తామని హామీ ఇచ్చారు. కక్కలపల్లి రాప్తాడు నియోజకవర్గం పరిధిలోకి వస్తుంది. సునీత గెలిస్తే ఉన్న ఇళ్లకు పట్టాలిప్పిస్తుంది...పక్కా ఇళ్లు కట్టిస్తుందని ఆశపడి నిరుపేదలంతా టీడీపీకి ఓట్లేసి గెలిపించారు. ఇవన్నీ మంత్రి, ఆమె బంధువులు ఆలోచించలేదు. తమ అవసరాలకే ప్రాధాన్యం ఇచ్చి అధికారులను అడ్డుగా పెట్టి ఇళ్లను కూల్చేశారు. దీంతో వారంతా నెలల పాటు ఖాళీ జాగాల్లో ప్లాస్టిక్ కవర్ల కింద కాలం వెళ్లదీశారు.
రోడ్డునపడ్డ 200 కుటుంబాలు
విజయనగర్ కాలనీలోని బుక్కరాయసముద్రం చెరువు స్థలంలో 200 మంది పేదలు ఇళ్లు నిర్మించుకున్నారు. వీరంతా ఎంపీ జేసీదివాకర్‌రెడ్డి వర్గీయుల హామీతోనే ఇళ్లు నిర్మించుకున్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని ఆత్మహత్యకు తెగించిన కార్పొరేటర్ ఉమామహేశ్వరరావు కూడా స్పష్టం చేశారు. ఎంపీ హామీ ఇచ్చారనే కారణంతో ఎమ్మెల్యే ప్రభాకర్‌చౌదరి ఇళ్లను కూల్చేయించారనేది వారి ఆరోపణ. ఇళ్లు కూల్చివేత సమయంలో ఘటనాస్థలికి వచ్చిన జయరాంనాయుడు, కోగటం విజయభాస్కర్‌రెడ్డి, ఉమామహేశ్వరావులు ఎంపీ వర్గీయులు. ఈ పరిణామాలన్నీ చూస్తే ఎంపీ, ఎమ్మెల్యే మధ్య విభేదాలు పేదల కుటుంబాలను బలిచేశాయనేది స్పష్టమవుతోంది. ఇళ్లు నిర్మించుకోండని ఎంపీ హామీ ఇచ్చిన మాటే నిజమైతే, కూల్చే సమయంలో ఎందుకు ఎంపీ అడ్డుకోలేకపోయారనేది తేలియాల్సి ఉంది? అలాగే ఎంపీతోనే విభేదాలతోనే ఎమ్మెల్యే ఇళ్లను కూల్చివేయండని చెప్పిందే నిజమైతే రాజకీయకోణంలో కాకుండా మానవీయ కోణంలో ప్రభాకర్‌చౌదరి ఆలోచించలేదనేది తెలుస్తోంది. కారణమేదైనా వందలాది కుటుంబాలు వీధినపడ్డాయి. 200 కుటుంబాలు రోడ్డునపడితే ఎమ్మెల్యే, మేయర్ ఆ వైపు కనీసం తొంగి చూడలేదు. తమకు ఓట్లేసిన పేదలు వీధినపడితే అండగా ఉండాల్సిన బాధ్యత తమదే అనే కనీస ధర్మాన్ని కూడా వారిద్దరూ విస్మరించారు.
అధికారులు ఎక్కడున్నారో!?:
చెరువు స్థలంలో అక్రమంగా ఇళ్లు నిర్మించారనే కారణంతో ఆర్డీఓ మలోలా ఆధ్వర్యంలో రెవెన్యూ, పోలీసు అధికారులు ప్రొక్లెయిన్లతో ఇళ్లు కూల్చారు. వీరికి ముందస్తుగా నోటీసులు కూడా ఇవ్వలేదు. ప్రభుత్వ స్థలంలో ఇళ్లు నిర్మించకూడదని, భవిష్యత్తులో కూల్చేస్తామని నిర్మాణ సమయంలో ఎందుకు రెవెన్యూ అధికారులు అడ్డుకోలేదనేది సమాధానం చెప్పాల్సి ఉంది. ఏడాది నుంచి 200 మందికిపైగా ఇళ్లు నిర్మించుకున్నారు. అప్పటి వరకూ మౌనంగా ఉండి, ఇళ్లు నిర్మించాక కూల్చేయడం చూస్తే పేదబతుకులపై ప్రభుత్వానికి, యంత్రాంగానికి కాసింత కనికరం కూడా లేదనేది స్పష్టమవుతోంది.
నేతల కబ్జాలకు గ్రీన్‌సిగ్నల్
అనంతపురంతో పాటు జిల్లా వ్యాప్తంగా అసైన్డ్ భూములు, ప్రభుత్వ స్థలాల్లో పేదలకు ఇళ్లపట్టాలిచ్చి ఖాళీగా ఉన్న స్థలాలపై టీడీపీ నేతలు కన్నేశారు. అధికారుల అండతో కబ్జాలకు తెగిస్తున్నారు. అనంతపురం నగరం చుట్టూ రాప్తాడు నియోజకవర్గం ఉంది. ఈ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి సునీత మండలానికి ఓ ఇన్‌చార్జ్‌ని నియమించారు. వీరి కనుసన్నల్లోనే ఈ తంతు సాగుతోందనే ఆరోపణలు ఉన్నాయి. రూరల్ నియోజకవర్గానికి పరిటాల మహేంద్ర ఇన్‌చార్జ్‌గా ఉన్నారు.
కబ్జాల వివరాలు చిట్టా ఇదీ...
కురుగుంటలో సర్వే నంబర్ 95–3లోని 5.25ఎకరాల స్థలాన్ని నగరంలోని ఒక వ్యక్తికి 1987లో ప్రభుత్వం డి పట్టా మంజూరు చేసింది. ఇదే స్థలాన్ని నాయీబ్రాహ్మణులు 2013లో కొనుగోలు చేసి ప్లాట్లుగా విభజించుకున్నారు. ఈ స్థలాన్ని అధికార పార్టీకి చెందిన ఓ దళిత నాయకుడు ఆక్రమించి ప్లాట్లు వేశారు. ప్లాట్లు విక్రయించారు. పట్టాలు లేకుండానే ఇక్కడ పేదలు ఇళ్లు నిర్మించుకున్నారు. ఇది ప్రభుత్వం స్థలం అని రేపు రెవెన్యూ అధికారులు వీటిని కూల్చే ప్రమాదముంది.
–ఆకుతోటపల్లిలో సర్వే నంబర్ 132–4ఏలోని 2 ఎకరాల ప్రభుత్వ స్థలంలో పట్టాలు లేకుండా పేదలు ఇళ్లు నిర్మించుకున్నారు. ఇక్కడ ఎవ్వరికీ పట్టాలివ్వలేదు. ప్రభుత్వ స్థలంలో ఇళ్లు నిర్మిస్తున్నా, రెవెన్యూ అధికారులు ఏ మాత్రం అడ్డు చెప్పలేదు. ప్రస్తుతం ఇళ్లు నిర్మాణంలో ఉన్నాయి. మంత్రి సునీత సూచనలతో ఇళ్లు నిర్మించుకుంటున్నారని తెలిసింది. అటు ఇటు అయితే ఇక్కడ నిర్మించిన ఇళ్లను కూడా అధికారులు కూల్చేసే ప్రమాదం ఉంది. ఇక్కడ సెంటు రూ.3 లక్షలకుపైగా ఉంది. ఇక్కడ ప్లాట్లు ఇచ్చినందుకు స్థానికంగా ఉన్న ఓ టీడీపీ నేత ప్రజల నుంచి భారీగానే వసూలు చేసినట్లు తెలుస్తోంది.
– నగర సమీపంలోని ప్రసన్నాయపల్లి రైల్వే స్టేషన్ సమీపంలో సర్వే నంబర్ 343–2ఏలోని 77సెంట్ల స్థలంలో అధికార పార్టీకి చెందిన చోటా నేత ఇళ్లు వేయించారు. ఇక్కడా సెంటు రూ.5 లక్షలకుపైగా ఉంది. ఇక్కడ కూడా ప్రజల నుంచి డబ్బులు వసూలు చేసినట్లు తెలుస్తోంది.
– రాజీవ్‌కాలనీలో ఓ టీడీపీ నేత ప్రభుత్వ పోరంబోకు స్థలానికి నకిలీ పట్టాలు సృష్టించారు. ఎర్రనేలకొట్టాలకు చెందిన ఈ వ్యక్తి తహశీల్దార్ సంతకం పోర్జరీ చేసి ఈ పట్టాలు పేదల చేతల్లో పెట్టి, లక్షలు దండుకున్నారు.
– జేఎన్‌టీయూ పరిధిలో ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో 3.80 ఎకరాల పొలంలో అక్రమంగా ఇళ్లు నిర్మించి దీనికి నారాలోకేశ్‌బాబు కాలనీకి పేరు పెట్టారు. ఈ స్థలం కూడా రూ.కోట్లు విలువ చేస్తుంది.
– బుక్కరాయసముద్రం మండలం సిద్ధరాంపురం సమీపంలో సర్వే నెంబర్ 777లో 10 ఎకరాల చెరువు పోరంబోకు స్థలం ఉంది. ఇందులో చెట్లు పెంచుకునేందుకు స్థానికులైన ఐదుమందికి లీజుకిచ్చారు. అయితే ఇక్కడి టీడీపీ నేతలు ఎన్‌టీఆర్ కాలనీ పేరుతో గుడిసెలు వేశారు. పట్టాలిప్పిస్తామని ఒక్కొక్కరి వద్ద భారీగానే డబ్బులు వసూలు చేశారు. నిజానికి పట్టాల పేరుతో ఆ స్థలాన్ని దక్కించుకోవాలనే వ్యూహంతోనే ఈ పన్నాగం పన్నారు.