పాల కల్తీపై విజి‘లెన్స్‌’ | vigilance on mixed milk | Sakshi
Sakshi News home page

పాల కల్తీపై విజి‘లెన్స్‌’

Published Wed, Aug 2 2017 10:48 PM | Last Updated on Sun, Sep 17 2017 5:05 PM

పాల కల్తీపై విజి‘లెన్స్‌’

పాల కల్తీపై విజి‘లెన్స్‌’

ఏడావులపర్తిలో అధికారుల మెరుపు దాడులు
అదుపులోకి పాల తయారీదారుడు


బుక్కరాయసముద్రం: కల్తీ పాలతయారీపై విజిలెన్స్‌ దృష్టి సారించింది. ఏడావులపర్తి గ్రామంలో ‘విజిలెన్స్‌’ అధికారులు దాడులు నిర్వహించి కల్తీ పాల తయారీదారుడిని అదుపులోకి తీసుకున్నారు. వివరాల్లోకెళితే.. ఏడావులపర్తిలో లక్ష్మీపతి అనే వ్యక్తి పాల వ్యాపారం చేస్తున్నాడు. గేదెల ద్వారా రోజుకు 40 నుంచి 60 లీటర్లు వరకు పాలు వస్తున్నాయి. అయితే త్వరగా ధనవంతుడు కావాలనే అత్యాశతో కల్తీపాల తయారీపై దృష్టిసారించాడు. తన ఇంట్లోని ప్రత్యేక గదిలో ఉదయాన్నే పాలు తయారు చేసేవాడు. అలా రోజుకు 200 నుంచి 250 లీటర్లు పాలను అనంతపురంలోని హోటళ్లకు, టీస్టాళ్లకు విక్రయించేవాడు. రోజుకు రూ.10వేల మేర సంపాదించేవాడు. ఏడాది కాలంగా నిరాటంకంగా కొనసాగిస్తూ వస్తున్నాడు.

ఇంతపెద్ద మొత్తంలో పాలు ఎలా ఉత్పత్తి చేస్తున్నాడని గ్రామంలో కొంతమందికి అనుమానం వచ్చింది. ఏదో జరుగుతోందని భావించి విజిలెన్స్‌ అధికారులకు, ఫుడ్‌ ఇన్‌స్పెక్టర్లకు సమాచారం ఇచ్చారు. జిల్లా విజిలెన్స్‌ ఎస్పీ అనిల్‌బాబు ఆదేశాల మేరకు విజిలెన్స్‌ సీఐ రెడ్డప్ప,  ఫుడ్‌ ఇన్‌స్పెక్టర్‌ శివశంకర్‌రెడ్డి, అసిస్టెంట్‌ ఫుడ్‌ ఇన్‌స్పెక్టర్‌ నాగేశ్వరరావు, విజిలెన్స్‌ కమర్షియల్‌ ఆఫీసర్‌ చెన్నయ్య, పోలీసు బృందంతో బుధవారం లక్ష్మీపతి ఇంటిపై మెరుపు దాడి నిర్వహించారు. పాలలోకి కల్తీకి ఉపయోగించే 25 కేజీల గోల్డన్‌ ఆయిల్, 50 కేజీల చక్కెర, పాలపొడి, లిక్విడ్‌తోపాటు కృత్రిమ పదార్థాలతో తయారు చేసిన 200 లీటర్ల కల్తీపాలను స్వాధీనం చేసుకున్నారు. పాల శ్యాంపిల్స్‌ను ల్యాబ్‌కు పంపుతున్నట్లు అధికారులు తెలిపారు. లక్ష్మీపతిపై చీటింగ్‌ కేసు నమోదు చేసి పోలీసులకు అప్పగించామని సీఐ రెడ్డప్ప తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement