చలివేంద్రాల్లోనూ చేతివాటం
బుక్కరాయసముద్రం మండలంలో 19 పంచాయతీలున్నాయి. వీటిలో ఎక్కడా ప్రభుత్వం తరఫున చలివేంద్రాలు ఏర్పాటు చేయలేదు. మండల కేంద్రంలో మాత్రం డీఆర్‌డీఏ - వెలుగు ఆధ్వర్యంలో చలివేంద్రం ఉంది. శింగనమల మండల కేంద్రం, తరిమెలలోనూ పంచాయతీ తరఫున చలివేంద్రాలు ఏర్పాటు చేశారు. మిగిలిన 16 పంచాయతీల్లో వాటి ఊసే లేదు. అదేవిధంగా జిల్లాలో కొన్ని పంచాయతీల్లో మొదట్లో చలివేంద్రాలు ఏర్పాటు చేసినా వారం తర్వాత బంద్ చేశారు. సుమారు అన్ని మండలాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది.
అనంతపురం అర్బన్ : వేసవిలో ప్రజల దాహార్తి తీర్చేందుకు చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కొందరు అ«ధికారులకు వరంగా మారింది. ఈ మాటున వారు నిధులు కాజేసేందుకు శ్రీకారం చుట్టినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. జిల్లాలోని పంచాయతీలు, మునిసిపల్ వార్డుల్లో చలివేంద్రాల నిర్వహణ కోసం ప్రభుత్వం రూ.1 కోటి మంజూరు చేసింది. ప్రతి చలివేంద్రం వద్ద బ్యానర్ కట్టి మూడు నెలల పాటు నిర్వహించాలని ఆదేశాలు కూడా జారీ చేసింది. నీటితో పాటు మజ్జిగ, ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు ఇవ్వాలని నిర్ణయించింది. జిల్లాలోని 1,003 పంచాయతీల్లో చాలా చోట్ల చలివేంద్రాలు ఏర్పాటు చేయలేదు. కాగా అధికారులు మాత్రం జిల్లాలో 1,200 చలివేంద్రాలు ఏర్పాటు చేసినట్లు రికార్డుల్లో చూపిస్తూ ప్రభుత్వానికి నివేదించారు.
ఈ నిధులకు లెక్కలుండవట
వేసవిలో చలివేంద్రాల ఏర్పాటు, నిర్వహణకు ప్రభుత్వం మంజూరు చేసి రూ.1 కోటికి లెక్కలు చూపాల్సిన అవసరం లేదని తెలిసింది. ఇదే అదనుగా కొందరు అధికారులు నిధులను స్వాహా చేశారనే విమర్శలు లేకపోలేదు. చలివేంద్రంలో పని చేసే వ్యక్తికి రోజుకు రూ.150 ఇవ్వాలి. ఇలా మూడు నెలలకు కూలి కింద ఆ వ్యక్తికి రూ.13,500 చెల్లించాలి. ఇక మజ్జిగ, ఓఆర్‌ఎస్ ప్యాకెట్లకూ కొంత మొత్తం వెచ్చించాలి. మూడు నెలల పాటు చలివేంద్రాలు నిర్వహించామని చెప్పి ఈ మొత్తం నొక్కేసే ప్రయత్నం జరుగుతోందని ఉద్యోగవర్గాలే చెప్పడం గమనార్హం.