chalivendram
-
కొణిదెల ప్రొడక్షన్స్.. ‘మెగా చలివేంద్రం’
హైదరాబాద్: గత ఐదు సంవత్సరాల నుంచి జూబ్లీహిల్స్‌లోని చిరంజీవి బ్లడ్‌బ్యాంక్ వద్ద కొణిదెల ప్రొడక్షన్స్ తరఫున ‘మెగాచలివేంద్రం’ నిర్వహిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఈ ఏడాది కూడా మండుతున్న ఎండల నుంచి ప్రజల దాహార్తిని తీర్చే ఉద్దేశంతో మోడల్ ‘మెగా చలివేంద్రాన్ని’ ఏర్పాటు చేశారు. అయితే దీని ఏర్పాట్లు, నిర్వహణపై మెగాస్టార్ చిరంజీవి ప్రత్యేక దృష్టి పెట్టినట్లు సిబ్బంది చెబుతున్నారు. ఖర్చుకు వెనకాడకుండా ప్రజలకు చల్లని, పరిశుభ్రమైన నీరు అందించాలని, అంతా హైజెనిక్ మెయిన్టైన్ చేయ్యాలని మెగాస్టార్ ఆదేశించారని వారు పేర్కొన్నారు. ‘ఈ మెగా చలివేంద్రం ప్రతిరోజు మూడు వేల మందికిపైగా ప్రజల దాహార్థిని తీరుస్తుంది. మోడల్ చలివేంద్రాన్ని ఖరీదైన సెట్‌తో అత్యంత శుభ్రంగా ఉంచుతాం. ఇక్కడ నిత్యం నలుగురు సిబ్బంది నీరందించడానికి అందుబాటులో ఉంటారు. ప్రతిరోజు ఈ చలివేంద్రం వద్ద అనేక వాహనాలతో పాటు, సిటీబస్సులు, ఆటోలు, బైక్‌లు, పాదాచారులు ఆగి నీరు తాగి వెళుతుంటారు. ఉదయం 8 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు చలివేంద్రం ప్రజలకు అందుబాటలో ఉంటుంది. ఇప్పటివరకు ఈ చలివేంద్రంలో సుమారు 1,41,000 మంది తమ దాహార్థి తీర్చుకున్నట్లు’ మెగా చలివేంద్రం సిబ్బంది తెలిపారు. -
చలివేంద్రాల్లోనూ చేతివాటం
బుక్కరాయసముద్రం మండలంలో 19 పంచాయతీలున్నాయి. వీటిలో ఎక్కడా ప్రభుత్వం తరఫున చలివేంద్రాలు ఏర్పాటు చేయలేదు. మండల కేంద్రంలో మాత్రం డీఆర్డీఏ - వెలుగు ఆధ్వర్యంలో చలివేంద్రం ఉంది. శింగనమల మండల కేంద్రం, తరిమెలలోనూ పంచాయతీ తరఫున చలివేంద్రాలు ఏర్పాటు చేశారు. మిగిలిన 16 పంచాయతీల్లో వాటి ఊసే లేదు. అదేవిధంగా జిల్లాలో కొన్ని పంచాయతీల్లో మొదట్లో చలివేంద్రాలు ఏర్పాటు చేసినా వారం తర్వాత బంద్ చేశారు. సుమారు అన్ని మండలాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. అనంతపురం అర్బన్ : వేసవిలో ప్రజల దాహార్తి తీర్చేందుకు చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కొందరు అ«ధికారులకు వరంగా మారింది. ఈ మాటున వారు నిధులు కాజేసేందుకు శ్రీకారం చుట్టినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. జిల్లాలోని పంచాయతీలు, మునిసిపల్ వార్డుల్లో చలివేంద్రాల నిర్వహణ కోసం ప్రభుత్వం రూ.1 కోటి మంజూరు చేసింది. ప్రతి చలివేంద్రం వద్ద బ్యానర్ కట్టి మూడు నెలల పాటు నిర్వహించాలని ఆదేశాలు కూడా జారీ చేసింది. నీటితో పాటు మజ్జిగ, ఓఆర్ఎస్ ప్యాకెట్లు ఇవ్వాలని నిర్ణయించింది. జిల్లాలోని 1,003 పంచాయతీల్లో చాలా చోట్ల చలివేంద్రాలు ఏర్పాటు చేయలేదు. కాగా అధికారులు మాత్రం జిల్లాలో 1,200 చలివేంద్రాలు ఏర్పాటు చేసినట్లు రికార్డుల్లో చూపిస్తూ ప్రభుత్వానికి నివేదించారు. ఈ నిధులకు లెక్కలుండవట వేసవిలో చలివేంద్రాల ఏర్పాటు, నిర్వహణకు ప్రభుత్వం మంజూరు చేసి రూ.1 కోటికి లెక్కలు చూపాల్సిన అవసరం లేదని తెలిసింది. ఇదే అదనుగా కొందరు అధికారులు నిధులను స్వాహా చేశారనే విమర్శలు లేకపోలేదు. చలివేంద్రంలో పని చేసే వ్యక్తికి రోజుకు రూ.150 ఇవ్వాలి. ఇలా మూడు నెలలకు కూలి కింద ఆ వ్యక్తికి రూ.13,500 చెల్లించాలి. ఇక మజ్జిగ, ఓఆర్ఎస్ ప్యాకెట్లకూ కొంత మొత్తం వెచ్చించాలి. మూడు నెలల పాటు చలివేంద్రాలు నిర్వహించామని చెప్పి ఈ మొత్తం నొక్కేసే ప్రయత్నం జరుగుతోందని ఉద్యోగవర్గాలే చెప్పడం గమనార్హం. -
చలివేంద్రాల నిర్వహణకు రూ.కోటి
అనంతపురం అర్బన్ : వేసవిలో చలివేంద్రాలు, మజ్జిగ సరఫరా, ఓఆర్ఎస్ ప్యాకెట్ల పంపిణీ, షెల్టర్లు, అవగాహన కార్యక్రమాలు నిర్వహించేందుకు జిల్లాకు రూ.కోటి మంజూరు చేస్తూ ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. వేసవిలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చేయదగిన పనులు, చేయకూడనవి ప్రజలకు తెలియజేస్తూ కరపత్రాలు పంచాలని, బ్యానర్లను ఏర్పాటు చేయాలని సూచించింది. -
'చల్ల'గా దోచేశారు
మంచినీళ్లు ఇచ్చి, మజ్జిగ అంటున్నారు ఓఆర్ఎస్ ప్యాకెట్లు, అవగాహన సదస్సుల ఊసే లేదు రోజుల తరబడి మజ్జిగ సరఫరా చేసినట్టుగా బిల్లులు జిల్లాలో 233 కేంద్రాలకు రూ.1.02 కోట్లు డ్రా కనికట్టు విద్యతో మాంత్రికులు మాయలు చేస్తుంటారు. జనం చూస్తుండగా.. అప్పటి కప్పుడు మాయలు చేయడమే వారికివచ్చు. కొంతమంది ప్రభుత్వ అధికారులైతే.. అప్పుడెప్పుడో తాగిన నీటిని కూడా మజ్జిగగా మార్చేస్తున్నారు. ప్రభుత్వ రికార్డుల్లో తిమ్మిని బమ్మిని చేసి, కోటి రూపాయలు స్వాహా చేసిన మహా మాంత్రికులు వీరు. మరో రెండు కోట్ల రూపాయలను ‘మాయం’ చేసేందుకు ఇప్పుడు సిద్ధమయ్యారు. పిఠాపురం : వేసవిలో ప్రజలు ఇబ్బంది పడకుండా ప్రభుత్వం ఏర్పాటు చేసిన మజ్జిగ చలివేంద్రాల పేరిట కొందరు అధికారులు భారీగా దండుకుంటున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. జిల్లాలో రెవెన్యూ అధికారుల పర్యవేక్షణలో వేసవి మజ్జిగ చలివేంద్రాల ఏర్పాటుకు ఈ ఏడాదిఏప్రిల్ 25న జీఓ నంబరు 57తో పాటు రూ.3 కోట్లను ప్రభుత్వం విడుదల చేసింది. ఈ చలివేంద్రాల్లో మజ్జిగ సరఫరా చేయడంతో పాటు ఓఆర్ఎస్ ప్యాకెట్ల పంపిణీ, వడదెబ్బపై అవగాహన సదస్సులు నిర్వహించాలని ఆదేశించింది. ఈ నిధులను ఎంపీడీఓల ద్వారా తహసీల్దార్లు డ్రా చేయాలని నిర్దేశించింది. జిల్లాలో అన్ని మండలాల్లో తూతూమంత్రంగా ఒకటి రెండు రోజులు ఈ చలివేంద్రాలు ఏర్పాటు చేసిన అధికారులు, భారీగా బిల్లులు డ్రా చేసినట్టు తెలిసింది. కాకినాడ డివిజన్లో 39 చలివేంద్రాలు ఏర్పాటు చేసినట్టు లెక్కలు చూపించిన అధికారులు, రూ.18 లక్షలు డ్రా చేశారు. అమలాపురం డివిజన్లో 39 కేంద్రాలకు గాను రూ.32 లక్షలు, రంపచోడవరం డివిజన్లో 39 కేంద్రాలకు గాను రూ.14 లక్షలు, రామచంద్రపురం డివిజన్లో 59 కేంద్రాలకు గాను రూ.6 లక్షలు, రాజమహేంద్రవరం డివిజన్లో 29 కేంద్రాలకు గాను రూ.16 లక్షలు, పెద్దాపురం డివిజన్లో 28 కేంద్రాలకు గాను రూ.16 లక్షలు అధికారులు డ్రా చేశారు. పట్టించుకోని ఉన్నతాధికారులు ఏ కేంద్రంలోను ఓఆర్ఎస్ ప్యాకెట్లను పంపిణీ చేసిన, అవగాహన సదస్సులు ఏర్పాటు చేసిన దాఖలాలు లేకపోయినా, వాటిని చేసినట్టు రికార్డుల్లో చూపి, బిల్లులు తయారు చేసినా ఉన్నతాధికారులు పట్టించుకోకపోవడంపై సర్వత్రా అనుమానాలకు తావిస్తోంది. పిఠాపురం పరిధిలో 6 కేంద్రాలు ఏర్పాటు చేసినట్టు చెబుతున్న రెవెన్యూ అధికారులు, తొలివిడతగా రెండు కేంద్రాలకు రూ.2 లక్షలు డ్రా చేశారు. ఒక్కో కేంద్రంలో రోజుకు 50 లీటర్ల చొప్పున మజ్జిగ పంపిణీ జరిగినట్టు చెబుతున్నారు. ఇక్కడ కనీసం మూడు రోజులు కూడా మజ్జిగ పంపిణీ చేయలేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. రూ.కోటికి పైగా డ్రా జిల్లాలో తొలివిడతగా 233 కేంద్రాలు ఏర్పాటు చేసినట్టు, ప్రతి రోజు 50 లీటర్ల మజ్జిగ సరఫరా చేసినట్టు లెక్కలు చూపించిన రెవెన్యూ అధికారులు రూ 1.02 కోట్ల నిధులు డ్రా చేశారు. మరో విడత అదనంగా 300 కేంద్రాలు ఏర్పాటు చేసినట్టు, మరో రూ.1.98 కోట్లు డ్రా చేయడానికి రంగం సిద్ధం చేస్తున్నారు. నిజానికి ఏ ఒక్క మండలంలోనూ ఈ చలివేంద్రాల్లో ప్రారంభం రోజున మినహా, ఎక్కడా మజ్జిగ సరఫరా చేయలేదని ప్రజలు చెబుతున్నారు. తూతూమంత్రంగా ఒకటి, రెండు రోజులు మాత్రమే ఈ కేంద్రాలు నిర్వహించిన అధికారులు, ఆ తర్వాత వాటిని పట్టించుకోవడం మానేశారు. ఒక్కో కేంద్రం 20 రోజులు కంటే ఎక్కువగా నిర్వహించినట్టు, ప్రతి రోజు మజ్జిగ పంపిణీ చేసినట్టు బిల్లులు సృష్టించారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. పట్టుమని పది మందికి కూడా మజ్జిగ ఇవ్వకుండా, మంచినీళ్లతో సరిపెట్టి ఇప్పుడు బిల్లులు మాత్రం అంతా మజ్జిగే వేసినట్టు చూపించడం అవినీతికి నిదర్శనమంటున్నారు. విచారణజరుపుతాం వేసవి తీవ్రతను దృష్టిలో ఉంచుకుని మజ్జిగ చలివేంద్రాల ఏర్పాటుకు ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. వీటి నిర్వహణ కోసం జిల్లాకు రూ.3 కోట్లు మంజూరు చేసింది. వీటి నిర్వహణలో అక్రమాలు జరిగినట్టు ఆరోపణలు వస్తే, వాటిపై విచారణ నిర్వహించి, అవకతవకలు జరిగినట్టు తేలితే చర్యలు తీసుకుంటాం. - హెచ్.అరుణ్‌కుమార్, కలెక్టర్