కలియుగదైవం.. కొండమీద రాయుడు
దేవరకొండపై కొలువైన వేంకటేశ్వరుడు
3 నుంచి బ్రహ్మోత్సవాలు
కలియుగ దైవం శ్రీ వెంకటరమణ స్వామి కొండమీద రాయుడుగా భక్తులకు కోర్కెల తీరుస్తూ.. ఆపదలో ఉన్న వారికి అనాథ రక్షకునిగా వెలుగొందుతున్నాడు. కొండమీద వెంకటరమణ స్వామిని మాఘ మాసంలో దర్శించుకుంటే భక్తులు కోర్కెలు సిద్ధిస్తాయని ప్రతీతి. ఏటా మాఘ మాసంలో బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతాయి. - బుక్కరాయసముద్రం (శింగనమల)
ఇదీ చరిత్ర..
అనంతపురానికి ఐదు కిలో మీటర్ల దూరంలో బుక్కరాయసముద్రం మండల కేంద్రంలోని సిద్దరాంపురం రోడ్డు సమీపాన దేవరకొండపై శ్రీలక్ష్మీ సహిత వేంకటేశ్వరుడు (కొండమీద రాయడు) వెలిశాడు. ఆహ్లాదకరమైన వాతావరణంలో దేవరకొండ శిఖర భాగాన కొండమీద రాయుడు కొలువు తీరాడు. పూర్వం ఈ దేవరకొండపై గార్గేయ మహర్షి నిరంతర తపః ఫలంగానే శ్రీ వేంకటేశ్వరుని ప్రత్యక్షమై కోర్కెలు తీర్చాడనీ పురాణాలు చెబుతున్నాయి.
అనంతరం శ్రీ వేంకటేశ్వరుడు దేవరకొండపై కొండమీద రాయునిగా స్థిరంగా నిలిచి పోయాడని ప్రతీతి. శిల రూపంలో ఉన్న కొండమీదరాయుడు భక్తులకు సాక్షాత్కరిస్తున్నాడు. స్వామివారు వేంచేసి ఉండే స్థలానికి వెనుక వైపున ఒక గుహ ఉంది. ఈ గుహ ప్రవేశ ద్వారం మొదట చిన్నగా ఉండి రాను రాను చాలా విశాలంగా కనబడుతుంది. వెకటరమణ స్వామి తిరుణాల ఉత్సవాలను విజయనగర పాలన నుంచి హరిహర బుక్కరాయలు నిర్వహిస్తూ వచ్చారు. అదే విదంగా మాఘ మాసంలో కొండమీద వెంకటరమణ స్వామిని దర్శించుకుంటే సాక్ష్యాత్తు వైకుంఠంలో వెంకటేశ్వరుని చూసి తరించినట్లేనని ప్రజల ప్రగాఢ విస్వాసం.
3 నుంచి కొండమీద రాయుని బ్రహ్మోత్సవాలు
ఫిబ్రవరి 3 నుంచి 12 వరకు కొండమీద రాయుని బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. 3న శ్రీలక్ష్మీ నారాయణస్వామి దేవాలయంలో నుంచి స్వామి వారి ఉత్సవ మూర్తి విగ్రహాలను సాయంత్రం కొండపైకి తీసుకెళతారు. 4న ఉదయం 8 గంటలకు దేవరకొండపై ఉత్సవ విగ్రహాలకు పుణ్యాహవచనం, ఆంకురార్పణ నిర్వహిస్తారు. 10 గంటలకు ధ్వజారోహణం, రాత్రి 8 గంటలకు స్వామి వారికి పుష్ప పల్లకీ సేవ నిర్వహిస్తారు. 5న రాత్రి 8 గంటలకు స్వామి వారిని సింహ వాహనంపై పుర వీధులలో ఊరేగిస్తారు. 6న రాత్రి 8 గంటలకు స్వామి వారిని శేష వాహనంపై ఊరేగిస్తారు.
7న రాత్రి 8 గంటలకు స్వామి వారిని హనుమద్‌వాహనంపై, 8న రాత్రి 8 గంటలకు గరుడ వాహనంపై ఊరేగింపు నిర్వహిస్తారు. 9న రాత్రి 8 గంటలకు శ్వేత గజవాహనంపై ఊరేగిస్తారు. 10న మాఘ శుద్ధ పౌర్ణమి సందర్భంగా వేకువ జామున స్వామి వారి కల్యాణోత్సవం నిర్వహింస్తారు. అనంతరం ఉదయం 10 గంటలకు స్వామి వారిని సూర్యప్రభ వాహనంపై పురవీధుల్లో ఊరేగించి కనుల పండువగా రథోత్సవం నిర్వహిస్తారు. 11న రాత్రి 7 గంటలకు స్వామి వారిని అశ్వవాహనంపై ఊరేగిస్తారు. 12న ఉదయం 7 గంటలకు తీర్థవాది వసంతోత్సవం, నిర్వహించి రాత్రి 7.గంటలకు స్వామి వారిని హంస వాహనంపై ఊరేగిస్తారు.