brahmothsavas
-
యాదాద్రికి పోటెత్తిన భక్తులు
సాక్షి, యాదగిరి కొండ : యాదాద్రి పుణ్యక్షేత్రంలో రెండో రోజు బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఉదయం ధ్వజారోహణం నిర్వహించారు. సాయంత్రం భేరీపూజ, దేవతాహ్వానం కార్యక్రమాలు నిర్వహించనున్నారు. సెలవుదినం కావడంతో భక్తులు యాదాద్రిశ్రీ లక్ష్మినరసింహస్వామిని దర్శించుకోవడానికి పోటెత్తారు. దీంతో యాదాద్రి పరిసరాలు జనంతో కిక్కిరిసిపోయాయి. స్వామి వారి దర్శనం కోసం భక్తులు క్యూలైన్లలో బారులు తీరారు. ధర్మదర్శనానికి 3 గంటల సమయం, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి గంటన్నర సమయం పడుతున్నది. రద్దీ కారణంగా కొండపైకి వాహనాలను పోలీసులు అనుమతించట్లేదు. -
ముగిసిన పెన్నోహోబిలం బ్రహ్మోత్సవాలు
ఉరవకొండ రూరల్ : పెన్నహోబిలం లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు శుక్రవారం ముగిశాయి. ఉదయం స్వామి వారికి అభిషేకం మహా మంగళహారతి, కుంకమార్చన కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం ప్రత్యేక పల్లకీలో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీవారి ఉత్సవ మూర్తులను ఆలయ అర్చకులు ద్వారకనాథాచార్యులు ఆధ్వర్యంలో ఆమిద్యాల గ్రామంలోని పెన్నోబులేసుని ఆలయానికి ఊరేగింపుగా తీసుకెళ్లారు. -
పెన్నహోబిలంలో ప్రారంభమైన బ్రహ్మోత్సవాలు
ఉరవకొండ రూరల్ : పెన్నహోబిలం లక్ష్మీనారసింహుడి బ్రహోత్సవాలు ఆదివారం వైభవంగా ప్రారంభమయ్యాయి. మండలంలోని ఆమిద్యాల గ్రామం పెన్నబిళేసుడి ఆలయం నుంచి శ్రీవారి ఉత్సవమూర్తులను తీసుకోరావడానికి ప్రత్యేక పల్లకిను పెన్నహోబిలం నుంచి తీసుకెళ్లారు. ఈఓ రమేష్‌బాబు, ప్రధాన అర్చకుడు ద్వారాకానాథ్చార్యుల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజల అనంతరం మేళతాళాల మధ్య శ్రీవారి ఉత్సవ మూర్తులను పెన్నహోబిళానికి తీసుకొచ్చారు. -
వేమన బ్రహ్మోత్సవాలు ప్రారంభం
కటారుపల్లి(గాండ్లపెంట) : మండల పరిధిలోని కటారుపల్లి యోగివేమన బ్రహ్మోత్సవాలు ఆదివారం స్వామివారి గొడుగుల ప్రదక్షిణతో ప్రారంభమయ్యాయి. భక్తులు వేమన సమాధి వద్ద ప్రత్యేక పూజలు చేశారు. ఆదివారం సాయంత్రానికే ఆలయ పరిసర ప్రాంతాలు కిటకిటలాడాయి. వచ్చిన భక్తులు తలనీలాలు తీయించుకున్నారు. సేదతీరేందుకు సరైన సౌకర్యాలు లేకపోవడంతో ఆలయ ప్రాంగణంలోనే ఉండిపోయారు. ఆలయం వెలుపల గాజులు, బొమ్మలు, మిఠాయి షాపులు వెలిశాయి. సోమవారం తెల్లవారుజామున ఆలయం ఎదుట జొన్నధాన్యాలతో రాసి పోసి ప్రత్యేక పూజలు చేస్తారు. ఈ కుంభకూడును(ప్రసాదాన్ని) భక్తులు పెద్ద ఎత్తున పోటీపడి తీసుకుంటారు. నేడు బండ్ల మెరవణి వేమన బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని సోమవారం రాత్రి బండ్ల మెరవణి, పానక పందేరం కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఈ సందర్బంగా భక్తులు ఎండ్లబండ్లను అలంకరించుకుని ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేసి మొక్కుబడులు చెల్లించుకుంటారు. -
5 నుంచి రంగనాథుడి బ్రహ్మోత్సవాలు
ఆలూరు కోన రంగనాథస్వామి బ్రహ్మోత్సవాలు బుధవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు ఆలయ కార్యానిర్వాహణాధికారి చంద్రమౌళి తెలిపారు. ఇందులో భాగంగా ఆలయం వద్ద అన్ని ఏర్పాట్లు చేపట్టారు. క్రీ.శ. 14వ శతాబ్ధంలో హరిహర బుక్కరాయలు కాలంలో ఎర్రమ తిమ్మరాజు ఈ ఆలయాన్ని నిర్మించినట్లు ఆలయ చరిత్ర స్పష్టం చేస్తోంది. ఆలయంలోని మూలవిరాట్ రంగనాథుడు ఐదు అడుగుల పొడవుతో శేషతల్పంపై శయనించినట్లుగా ఉంటుంది.. - తాడిపత్రి రూరల్ బ్రహోత్సవాలు ఇలా.. 5న అంకురార్పణ, ధ్వజారోహణము, కలశస్థాపన, దీక్ష హోమ పూజలు ఉంటాయి. 6న సింహ వాహనంపై గ్రామోత్సవం, 7న శేష వాహనం, 8న హనుమద్ వాహనం, 9న గరుడ వాహనం, 10న గజవాహనంపై గ్రామోత్సవాలు ఉంటాయి. 11న స్వామివారి కల్యాణం, రథోత్సవం, 12న అశ్వ వాహనంపై గ్రామోత్సవం, 13న కోనలో తీర్థవాది, వసంతోత్సవం, చక్ర స్నానం, హంస వాహనంపై గ్రామోత్సవం ఉంటాయి. -
ఘనంగా బ్రహ్మోత్సవాలు
కదిరి : ఖాద్రీ లక్ష్మీనరసింహ స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహించాలని నిర్ణయించారు. మార్చి 7 నుంచి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. రాజకీయ పార్టీల నేతలు, అన్ని ప్రభుత్వ శాఖల అధికారులతో ఆలయ ప్రాంగణంలో బుధవారం సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యేలు ఎంఎస్ పార్థసారథి, కందికుంట వెంకట ప్రసాద్, బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షులు విష్ణువర్దన్‌రెడ్డి, ఆలయ కమిటీ చైర్మన్ పచ్చిపులుసు నరేంద్రబాబు మాట్లాడారు. తిరువీధుల్లో ఆక్రమణలు స్వచ్ఛందంగా తొలగించుకుని నారసింహుడి బ్రహ్మోత్సవాలకు సహకరించాలన్నారు. చేపట్టాల్సిన చర్యలపై సమీక్షించారు. ఎస్సీ కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్ గుడిసె దేవానంద్, డీఎస్పీ ఎన్వి రామాంజనేయులు, ఆలయ సహాయ కమిషనర్ దొడ్డా వెంకటేశ్వరరెడ్డి, మున్సిపల్ కమిషనర్ పి.భానుప్రసాద్, కౌన్సిలర్ రాజశేఖరాచారి, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు. -
శనైశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు ప్రారంభం
పావగడ : స్థానిక శనైశ్వరస్వామి ఆలయంలో స్వామి వారి బ్రహ్మోత్సవాలు బుధవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో ఉదయం 7 గంటలకు స్వామి వారికి తైలాభిషేకం, గణపతి పూజది కార్యక్రమాలు వైభవంగా నిర్వహించారు. సాయంత్రం ఆవాహిత దేవతారాధన, వేద పారాయణ తదితర కార్యక్రమాలు నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో తరలి వచ్చి స్వామి వారిని దర్శించుకున్నారు. సర్వ సేవా పూజల్లో భాగంగా గదలు మోసి గర్భగుడి చుట్టూ ప్రదక్షణలు చేసి మొక్కులు తీర్చుకున్నారు. మహిళలు శీతలాంభ దేవికి ఘనంగా పూజలు నిర్వహించారు. ఆలయ కమిటీ అధ్యక్షుడు ధర్మపాల్, ఉపాధ్యక్షుడు శ్రీనివాస్ తదితర డైరెక్టర్లు భక్తులకు సేవలందించారు. -
నేటి నుంచి కొండమీదరాయుని బ్రహ్మోత్సవాలు
బుక్కరాయసముద్రం : మండలంలో కొండమీదరాయుని ఉత్సవాలు నేటి నుంచి ప్రారంభం కానున్నారు. అంగరంగ వైభవంగా స్వామివారి ఉత్సవాలు నిర్వహించేందుకు ఇప్పటికే మండలవాసులు ఏర్పాట్లు పూర్తి చేశారు. 3న శ్రీలక్ష్మీ నారాయణస్వామి ఆలయం నుంచి స్వామి వారి ఉత్సవ మూర్తి విగ్రహాలను సాయంత్రం కొండపైకి తీసుకెళతారు. 4న దేవరకొండపై ఉత్సవ విగ్రహాలకు పుణ్యహవచనము, అంకురార్పణ నిర్వహిస్తారు. 5న సింహవాహనం, 6న శేష వాహనం,7న హనుమద్వాహనం,8న గరుడ వాహనం, 9న గజ వాహనంపై ఊరేగిస్తారు.10న కళ్యాణ మహోత్సవం అనంతరం సూర్యప్రభ వాహనంపై ఊరేగిస్తారు. 11న అశ్వవాహనంపై , 12న హంస వాహనంపై ఊరేగిస్తారు. -
కలియుగదైవం.. కొండమీద రాయుడు
దేవరకొండపై కొలువైన వేంకటేశ్వరుడు 3 నుంచి బ్రహ్మోత్సవాలు కలియుగ దైవం శ్రీ వెంకటరమణ స్వామి కొండమీద రాయుడుగా భక్తులకు కోర్కెల తీరుస్తూ.. ఆపదలో ఉన్న వారికి అనాథ రక్షకునిగా వెలుగొందుతున్నాడు. కొండమీద వెంకటరమణ స్వామిని మాఘ మాసంలో దర్శించుకుంటే భక్తులు కోర్కెలు సిద్ధిస్తాయని ప్రతీతి. ఏటా మాఘ మాసంలో బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతాయి. - బుక్కరాయసముద్రం (శింగనమల) ఇదీ చరిత్ర.. అనంతపురానికి ఐదు కిలో మీటర్ల దూరంలో బుక్కరాయసముద్రం మండల కేంద్రంలోని సిద్దరాంపురం రోడ్డు సమీపాన దేవరకొండపై శ్రీలక్ష్మీ సహిత వేంకటేశ్వరుడు (కొండమీద రాయడు) వెలిశాడు. ఆహ్లాదకరమైన వాతావరణంలో దేవరకొండ శిఖర భాగాన కొండమీద రాయుడు కొలువు తీరాడు. పూర్వం ఈ దేవరకొండపై గార్గేయ మహర్షి నిరంతర తపః ఫలంగానే శ్రీ వేంకటేశ్వరుని ప్రత్యక్షమై కోర్కెలు తీర్చాడనీ పురాణాలు చెబుతున్నాయి. అనంతరం శ్రీ వేంకటేశ్వరుడు దేవరకొండపై కొండమీద రాయునిగా స్థిరంగా నిలిచి పోయాడని ప్రతీతి. శిల రూపంలో ఉన్న కొండమీదరాయుడు భక్తులకు సాక్షాత్కరిస్తున్నాడు. స్వామివారు వేంచేసి ఉండే స్థలానికి వెనుక వైపున ఒక గుహ ఉంది. ఈ గుహ ప్రవేశ ద్వారం మొదట చిన్నగా ఉండి రాను రాను చాలా విశాలంగా కనబడుతుంది. వెకటరమణ స్వామి తిరుణాల ఉత్సవాలను విజయనగర పాలన నుంచి హరిహర బుక్కరాయలు నిర్వహిస్తూ వచ్చారు. అదే విదంగా మాఘ మాసంలో కొండమీద వెంకటరమణ స్వామిని దర్శించుకుంటే సాక్ష్యాత్తు వైకుంఠంలో వెంకటేశ్వరుని చూసి తరించినట్లేనని ప్రజల ప్రగాఢ విస్వాసం. 3 నుంచి కొండమీద రాయుని బ్రహ్మోత్సవాలు ఫిబ్రవరి 3 నుంచి 12 వరకు కొండమీద రాయుని బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. 3న శ్రీలక్ష్మీ నారాయణస్వామి దేవాలయంలో నుంచి స్వామి వారి ఉత్సవ మూర్తి విగ్రహాలను సాయంత్రం కొండపైకి తీసుకెళతారు. 4న ఉదయం 8 గంటలకు దేవరకొండపై ఉత్సవ విగ్రహాలకు పుణ్యాహవచనం, ఆంకురార్పణ నిర్వహిస్తారు. 10 గంటలకు ధ్వజారోహణం, రాత్రి 8 గంటలకు స్వామి వారికి పుష్ప పల్లకీ సేవ నిర్వహిస్తారు. 5న రాత్రి 8 గంటలకు స్వామి వారిని సింహ వాహనంపై పుర వీధులలో ఊరేగిస్తారు. 6న రాత్రి 8 గంటలకు స్వామి వారిని శేష వాహనంపై ఊరేగిస్తారు. 7న రాత్రి 8 గంటలకు స్వామి వారిని హనుమద్వాహనంపై, 8న రాత్రి 8 గంటలకు గరుడ వాహనంపై ఊరేగింపు నిర్వహిస్తారు. 9న రాత్రి 8 గంటలకు శ్వేత గజవాహనంపై ఊరేగిస్తారు. 10న మాఘ శుద్ధ పౌర్ణమి సందర్భంగా వేకువ జామున స్వామి వారి కల్యాణోత్సవం నిర్వహింస్తారు. అనంతరం ఉదయం 10 గంటలకు స్వామి వారిని సూర్యప్రభ వాహనంపై పురవీధుల్లో ఊరేగించి కనుల పండువగా రథోత్సవం నిర్వహిస్తారు. 11న రాత్రి 7 గంటలకు స్వామి వారిని అశ్వవాహనంపై ఊరేగిస్తారు. 12న ఉదయం 7 గంటలకు తీర్థవాది వసంతోత్సవం, నిర్వహించి రాత్రి 7.గంటలకు స్వామి వారిని హంస వాహనంపై ఊరేగిస్తారు. -
హనుమద్ వాహనంపై చింతల రాయుడు
తాడిపత్రి టౌన్ : చింతల వెంకటరమణ స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారు శుక్రవారం రాత్రి హనుమద్ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. ఉదయం తిరుచ్చి ఉత్సవం నిర్వహించారు. శ్రీదేవి, భూదేవి సహిత చింతల రాయుడిని పుర వీధుల్లో ఊరేగించారు. అలాగే రాత్రికి స్వామి వారి విగ్రహాన్ని హనుమద్ వాహనంపై ఉంచి పురవీధుల్లో ఊరేగించారు. స్థానిక ఆలయం నుంచి గాంధీకట్ట, మెయిన్‌బజారు, పోలీస్‌స్టేషన్ సర్కిల్‌తో పాటు సీబీరోడ్డు పురవీధుల గుండా ఊరేగింపు కొనసాగింది. కార్యక్రమంలో చింతల, బుగ్గ ధర్మకర్తల మండలి అధ్యక్షులు దామోదర్‌దాసు, కష్ణారెడ్డి, సభ్యులు భూమా సూర్యనారాయణ, రవిప్రసాదు, పరిసె చంద్రశేఖర్, ఓబిరెడ్డి, వెంకటశేషాపణి, వెంకటేశ్వర్లు, వెంకటరాముడు భక్తులు పాల్గొన్నారు. -
బ్రహ్మోత్సవాలకు తగ్గిన భక్తుల రద్దీ
తిరుమల: తిరుమలలో జరిగిన బ్రహ్మోత్సవాలకు భక్తుల రద్దీ తక్కువగానే ఉందని టీటీడీ ఈవో సాంబశివరావు తెలిపారు. ఆయన గురువారం ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ.. బ్రహ్మోత్సవాలు జరిగిన 8 రోజుల్లో 5 లక్షల 21 వేల మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారన్నారు. మొత్తం 22 లక్షల 60 వేల లడ్డూలను భక్తులకు అందించామని తెలిపారు. ఈసారి బ్రహ్మోత్సవాల్లో 2 లక్షల 3 వేల మంది తలనీలాలు సమర్పించినట్టు పేర్కొన్నారు. ఈ ఏడాది రూ.19 కోట్ల హుండీ ఆదాయం వచ్చిందని ఈవో సాంబశివరావు మీడియాతో వెల్లడించారు.