ప్రకృతి గీసిన చిత్రంలా కనులను కట్టిపడేసే సహజ సౌందర్యం.. మనసును ఆహ్లాదపరిచి సేద తీర్చే సుందర సువిశాల సాగరతీరం.. విశ్వవిఖ్యాతినొందిన కేంద్రాల్లో ప్రశాంతతను చేకూర్చే ఆధ్యాత్మిక సమీరం.. ఇలా అనిర్వచనీయ అనుభూతిని సందర్శకులకు అందించే ఆకర్షణీయ కేంద్రం విశాఖ.. దేశవిదేశాల నుంచి వచ్చే సందర్శకులను ఆకట్టుకునేలా అరకు పర్యాటక వైభవాన్ని సంతరించుకుంటోంది. ప్రోత్సాహకాలు, రాయితీలతో పెట్టుబడులను ఆకర్షించేలా ప్రభుత్వం రూపొందించిన నూతన పాలసీతో పర్యాటకం పరుగులు తీయనుంది. సందర్శకుల మనసు దోచేలా ఈ సౌందర్యసీమను పర్యాటకంలో అగ్రభాగాన నిలిపేందుకు కొత్త ప్రాజెక్టులెన్నో పట్టాలెక్కనున్నాయి.
సాక్షి, విశాఖపట్నం: పర్యాటకాభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం పక్కా ప్రణాళికతో ముందుకెళ్తోంది. టీడీపీ పాలనలో గతితప్పిన పర్యాటకానికి ఊపిరిపోసి కొత్త చిగురులు తొడిగేందుకు నూతన టూరిజం పాలసీ (2020–2025)ని ప్రవేశపెట్టంది. అనేక ప్రోత్సాహకాలు, రాయితీలతో పాటు కరోనా కారణంగా కోలుకోని టూరిజం ఆధారిత యూనిట్లకు ఊపిరి పోసే రీస్టార్ట్ ప్యాకేజీతో ప్రపంచాన్ని ఆకట్టుకునే పాలసీని రూపొందించింది. ఈ పాలసీతో ప్రతి జిల్లా ప్రముఖ పర్యాటక కేంద్రంగా భాసిల్లుతుందనడంలో ఎలాంటి అతిశయోక్తీ లేదు. చదవండి: ఆంధ్రా ఊటి అరకు
స్టార్ హోటల్స్.. రిసార్టులు
సాధారణంగా ఒక పర్యాటక రంగ ప్రాజెక్టు స్థాపించాలంటే 6 ప్రభుత్వ కార్యాలయాల నుంచి అనుమతులు తప్పనిసరి. దీనికి మూడు నుంచి ఆరు నెలల సమయం పడుతుంది. దీని బదులు సింగిల్ డెస్క్ విధానం మాదిరిగా కేవలం 30 నుంచి 90 రోజుల్లోపునే అనుమతులు వచ్చేలా విధానాన్ని మార్చారు. అదేవిధంగా.. 90 ఏళ్ల లీజుగడువు, పలు విభాగాల్లో 100 శాతం రీయింబర్స్‌మెంట్, యూనిట్ విద్యుత్ రూ.2 కే అందివ్వడం.. ఇలా ఎన్నో కొత్త రాయితీల కారణంగా విశాఖ జిల్లాకు సరికొత్త ప్రాజెక్టులు వచ్చే అవకాశాలున్నాయి. జిల్లా చుట్టూ.. పర్యాటకానికి కావల్సినంత ప్రకృతి సంపద ఉంది. దీన్ని అభివృద్ధి చేసేందుకు అనుగుణంగా ఉన్న భూములపై ఇప్పటికే దృష్టి సారించారు. టూరిజం శాఖకు సంబంధించిన 650 ఎకరాల స్థలాల్లో కొత్త ప్రాజెక్టులు తీసుకొచ్చేందుకు కసరత్తులు చేస్తున్నారు. ఇందులో ఏయే ప్రాంతాల్లో ఎలాంటి ప్రాజెక్టులు అమలు చేస్తే పర్యాటకుల నుంచి మంచి స్పందన వస్తుందనే అంశంపై ఇప్పటికే నివేదిక సిద్ధం చేసి పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావుకు పంపించారు. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతంలో హోటల్స్, రిసార్టులతో కొత్త కళ తీసుకువచ్చేలా, నగర పరిధిలోనూ వినూత్న ప్రాజెక్టులకు అనుమతులిచ్చి దేశ విదేశీ పర్యాటకులను ఆకట్టుకునే దిశగా పాలసీలో పొందుపరిచిన అంశాలు అనుకూలిస్తాయి. త్వరితగతిన ప్రాజెక్టులు వచ్చి పర్యాటక విశాఖ మరింత అభివృద్ధి చెంది పెద్ద ఎత్తున ఆదాయం వచ్చే అవకాశాలున్నాయని అధికారులు చెబుతున్నారు. చదవండి: ఎగసిన ఉత్తేజం.. పర్యాటకం కళకళ..
ఫ్లోటింగ్ రెస్టారెంట్.. వాచ్ టవర్..
జిల్లాలో మూడు టూరిజం సర్క్యూట్‌లు అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇప్పటికే దీనికి సంబంధించిన ప్రణాళికలు సిద్ధం చేసింది. అరకు టూరిజం సర్క్యూట్‌కు కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతుల రావాల్సి ఉండగా మిగిలిన సర్క్యూట్‌లు కూడా కొత్త పాలసీ వచ్చాక ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే రూ.156 కోట్లతో అరకు ఎకో టూరిజం సరూŠయ్క్‌ట్ త్వరలోనే అమల్లోకి రానుంది. బౌద్ధ కేంద్రాలైన బొజ్జనకొండ, తొట్లకొండ, బావికొండను సందర్శించేలా రూ.20.70 కోట్లతో బుద్ధిస్ట్ సర్క్యూట్ అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు సిద్ధమయ్యాయి. అదేవిధంగా తెన్నేటి పార్కు సమీపానికి కొట్టుకొచ్చిన బంగ్లాదేశ్ షిప్‌ను ఫ్లోటింగ్ రెస్టారెంట్‌గా మార్చేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు మంత్రి అవంతి ప్రకటించారు. షిప్ యాజమాన్యంతో చర్చలు చివరిదశలో ఉన్నాయని, అవి కొలిక్కి వచ్చాక స్పష్టత వస్తుందని తెలిపారు. కైలాసగిరిపై నుంచి సాగర తీరం అందా లు, విశాఖ నగర సొగసులు చూసేందుకు వాచ్ టవర్ నిర్మాణానికి సన్నాహాలు చేస్తున్నట్లు తెలిపారు. ఈ ప్రాజెక్టులు సిద్ధమైతే విశాఖ పర్యాటకానికి మరింత సొబగులు చేకూరనున్నాయి.
ఎస్‌పీవీ ద్వారా పారదర్శకంగా..
టూరిజం పాలసీ చాలా అద్భుతంగా ఉందని ఇప్పటికే స్టేక్ హోల్డర్లు, టూరిజం ఆపరేటర్లు కితాబిచ్చారు. పెట్టుబడులను ఆకర్షించేలా ఫ్రెండ్లీ పాలసీ రూపొందించాలన్న ముఖ్యమంత్రి సూచనలకు అనుగుణంగా కొత్త పర్యాటక విధానం తీసుకొచ్చాం. స్పెషల్ పర్పస్ వెహికల్(ఎస్‌పీవీ) ద్వారా పెట్టుబడులకు పారదర్శకంగా, అవినీతికి తావులేకుండా అనుమతులిస్తాం. చిన్న హోటల్స్, రెస్టారెంట్లు రీస్టార్ట్ ప్యాకేజీ ద్వారా తీసుకునే రుణాలపై 4.5 శాతం వడ్డీ ప్రభుత్వమే భరిస్తుంది. ప్రస్తుతం అసంఘటితంగా ఉన్న టూర్ ఆపరేటర్లు, గైడ్‌లకు వృత్తిపరమైన శిక్షణ ఇచ్చి ప్రొఫెషనలిజం ఉండేలా మారుస్తాం. అతిథి దేవోభవ సంప్రదాయాన్ని పాటిస్తాం. రాష్ట్రంలోని అన్ని పర్యాటక కేంద్రాలు కొత్త పాలసీతో టూరిజం పరంగా భాసిల్లుతాయి. ముఖ్యంగా విశాఖ జిల్లా పర్యాటక ఖిల్లాగా మారుతుంది.
– ముత్తంశెట్టి శ్రీనివాసరావు, పర్యాటక శాఖ మంత్రి
Comments
Please login to add a commentAdd a comment