కడప సెవెన్‌రోడ్స్ : జిల్లాను టూరిజం స్పాట్‌గా, హార్టికల్చర్ హబ్‌గా మార్చేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు దృష్టి సారించారని రాష్ట్ర పర్యాటకాభివృద్ధి సంస్థ చైర్మన్ వీరపురెడ్డి జయరామిరెడ్డి అన్నారు. టూరిజం ఎక్స్‌లెన్స్ అవార్డు–2017 గ్రహీత పంతుల పవన్‌కుమార్ అభినందన సభ సందర్భంగా ఆదివారం సీపీ బ్రౌన్ భాషా పరిశోధనా కేంద్రంలో కొండూరు పిచ్చమ్మ, వెంకట్రాజు స్మారక సంస్థ అధ్యక్షుడు కొండూరు జనార్దన్‌రాజు ఆధ్వర్యంలో జిల్లాలో పర్యాటకాభివృద్ధిపై నిర్వహించిన సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా విచ్చేశారు.
గండికోటకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకు వచ్చేందుకు కృషి చేస్తామని, యునెస్కో నిధులు వస్తే మరింత అభివృద్ధి అవుతుందన్నారు. గండికోటలో సాహస క్రీడల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామని, వంతెన నిర్మాణానికి ఇప్పటికే రూ. 3 కోట్లు విడుదల చేశామన్నారు. బ్రౌన్ నివసించిన స్థలంలో ఏర్పాటైన పరిశోధన కేంద్రాన్ని రాష్ట్ర పర్యాటక ప్రదేశాల జాబితాలో చోటు కల్పిస్తామని, అలాగే అధికారిక వెబ్‌సైట్‌లో పొందుపరుస్తామని హామీ ఇచ్చారు. ఒంటిమిట్ట చెరువును నీటితో నింపి బోటింగ్ ఏర్పాటు చేస్తామన్నారు. టూరిస్టులు జిల్లాలోని పర్యాటక ప్రదేశాలను సందర్శించి సాయంత్రానికి తిరిగి తిరుపతి వెళ్లే విధంగా బస్సులను ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలిస్తామన్నారు.
సదస్సుకు అధ్యక్షత వహించిన విద్వాన్ కట్టా నరసింహులు మాట్లాడుతూ జిల్లాలో ఎంతో ప్రాధాన్యత ఉన్న మోపూరు, నందలూరు సౌమ్యనాథస్వామి ఆలయాల శాసనాల్లోని చరిత్రను వెలికి తీయాల్సిన అవసరం ఉందన్నారు. రాయలసీమలో నందలూరులో ఏకైక బౌద్ధారామం ఉందని, దాన్ని అభివృద్ధి చేయాలని కోరారు. ప్రభుత్వ విప్ మేడా మల్లికార్జునరెడ్డి మాట్లాడుతూ తిరుపతి నుంచి గండికోట వరకు పర్యాటక హబ్‌లు ఏర్పాటు చేస్తామన్నారు. శాసనమండలి మాజీ డిప్యూటీ చైర్మన్ ఎస్వీ సతీష్‌రెడ్డి మాట్లాడుతూ ప్రకృతిని ధ్వంసం చేయకుండా పర్యాటక ప్రదేశాల అభివృద్ధి జరగాలన్నారు.
పర్యాటకశాఖ రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మేడా బాలసుబ్రమణ్యంరెడ్డి మాట్లాడుతూ గండికోట అభివృద్దికి మాస్టర్‌ప్లాన్ రూపొందించి ప్రపంచ వారసత్వ ప్రదేశంగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నామన్నారు. రీజినల్ డైరెక్టర్ జి.గోపాల్ మాట్లాడుతూ గండికోటకు సంబంధించి 20 మంది టూర్ గైడ్స్‌కు శిక్షణ ఇచ్చామన్నారు. యునెస్కో గుర్తింపునకు చర్యలు ప్రారంభించామన్నారు. ప్రభుత్వం గండికోట అభివృద్ధికి రూ. 500 కోట్లతో పలు చర్యలు చేపట్టిందని టీడీపీ జిల్లా అధ్యక్షుడు ఆర్.శ్రీనివాసులురెడ్డి పేర్కొన్నారు. జానమద్ది విజయభాస్కర్ నిర్వహణలో సాగిన ఈ కార్యక్రమంలో అలపర్తి పిచ్చయ్యచౌదరి, మూల మల్లికార్జునరెడ్డి మాట్లాడారు. యలమర్తి మధుసూదన్ ప్రార్థనా గీతాన్ని ఆలపించారు. తొలుత పర్యాటకాభివృద్ధి సంస్థ చైర్మన్ జిల్లా పర్యాటక ప్రాంతాల ఫొటో ఎగ్జిబిషన్‌ను ప్రారంభించారు.
‘పంతుల’కు ఘన సన్మానం
టూరిజం ఎక్స్‌లెన్స్ అవార్డు–2017 అందుకున్న పాత్రికేయుడు పంతుల పవన్‌కుమార్‌ను రాష్ట్ర టూరిజం అభివృద్ధి సంస్థ చైర్మన్ వీరపురెడ్డి జయరామిరెడ్డి ఘనంగా సన్మానించారు. ఆయనతోపాటు పలు పర్యాటక సంఘాల ప్రతినిధులు, పర్యాటకాభిమానులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment