మృత్యు పీడనం | Four Persons Died In Boiler Blasting Penuballi | Sakshi
Sakshi News home page

మృత్యు పీడనం

Published Tue, Feb 26 2019 7:15 AM | Last Updated on Fri, Jul 23 2021 8:13 PM

కష్టాన్నే నమ్ముకున్న కూలీలు పనుల్లో నిమగ్నమయ్యారు.. పొద్దంతా కష్టిస్తేనే కడుపుకింత తిండి దొరికే కష్ట జీవులు పనులు చేస్తూనే ప్రాణాలొదిలారు. మొక్కజొన్న ఫ్యాక్టరీలో ఒక్కసారిగా బాయిలర్‌ భారీ శబ్దంతో పేలుడు ధాటికి పిట్టల్లా రాలిపోయారు. తునా తునకలైన శరీర భాగాలు.. విసిరేసినట్లుగా పడిన క్షతగాత్రులు.. రక్తమోడుతూనే ఆర్తనాదాలు, హాహాకారాలు.. ఎవరెక్కడున్నారో.. కటిక చీకట్లో ఎవరు మృతిచెందారో.. ఎవరు ప్రాణాలతో ఉన్నారో అర్థంకాని పరిస్థితి. పగిలిపోయిన ఫ్యాక్టరీ గోడలు.. పరిసరాల్లో ధ్వంసమైన కార్లు, లారీల అద్దాలు. రాష్ట్రాలు దాటొచ్చినవారు కొందరైతే.. ఉన్న ఊరిలో పని చేసుకుంటున్న వారు మరికొందరు. భయానక వాతావరణాన్ని తలపించేలా మారింది బయ్యన్నగూడెంలోని మొక్కజొన్న ఫ్యాక్టరీ ప్రాంతం. నలుగురు కార్మికులు అక్కడికక్కడే మృతిచెందగా.. పది మందికి తీవ్ర గాయాలయ్యాయి.   
 

పెనుబల్లి:  మండలంలోని బయ్యన్నగూడెం పంచాయతీ పరిధిలోని నాయకులగూడెం గ్రామ సమీపంలో మొక్కజొన్న ఫ్యాక్టరీలో సోమవారం రాత్రి జరిగిన ఘోర ప్రమాదంలో నలుగురు కార్మికులు దుర్మరణం చెందారు. ఫ్యాక్టరీలోని బాయిలర్‌ భారీ శబ్దంతో పేలడంతో అక్కడ పనిచేస్తున్న కార్మికులు 10 మీటర్ల నుంచి 20 మీటర్ల దూరంలో చెల్లా చెదురుగా పడిపోయారు. మూడు మృతదేహాలు భయానక పరిస్థితుల్లో కనిపించాయి. పదిమందికి తీవ్ర గాయాలు కాగా సత్తుపల్లి, పెనుబల్లి ప్రభుత్వ ఆస్పత్రులకు తరలించారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ కార్మికులంతా బిహార్‌ వాసులా? స్థానికులా? అనేది ఇంకా నిర్ధారించలేదు. సత్తుపల్లికి చెందిన మురళీకృష్ణ అనే వ్యాపారి నెల రోజుల క్రితమే మొక్కజొన్న ఫ్యాక్టరీని ఇక్కడ ప్రారంభించారు. కంకుల నుంచి విత్తనాలను వేరుచేశాక బెండులను బాయిలర్‌లో వేడి చేస్తారు. ఈ బాయిలర్‌ ద్వారా వచ్చిన ఆవిరితో విత్తనాలను శుద్ధి చేసి, ప్యాకింగ్‌ చేసి తరలిస్తారు.

అయితే..ఈ బాయిలర్‌ వద్ద పీడనం పెరిగి రాత్రి 7 గంటల సమయంలో ఒక్కసారిగా భారీ పేలుడు చోటు చేసుకోవడంతో 5 కిలోమీటర్ల మేర భారీ శబ్దం వినిపించి జనం ఉలిక్కిపడ్డారు. ఈ పేలుడు తీవ్రతకు ఫ్యాక్టరీలోని సగ భాగం, ప్రహరీ కుప్పకూలాయి. కర్మాగారం చట్టుపక్కల ఉన్న కార్లు, లారీల అద్దాలు పగిలి ధ్వంసమయ్యాయి. క్షత గాత్రులను పెనుబల్లి, సత్తుపల్లి వైద్యశాలలకు తరలించారు. పేలుడు రాత్రి సమయంలో చోటు చేసుకోవడంతో అప్పటికే కొందరు కార్మికులు విధులు ముగించుకుని ఇళ్లకు వెళ్లిపోవడంతో భారీగా ప్రాణనష్టం తగ్గింది. సంఘటనా స్థలాన్ని కల్లూరు ఏసీపీ బి.ఆంజనేయులు, కల్లూరు ఆర్డీఓ బి.శివాజీ, సత్తుపల్లి రూరల్‌ సీఐ టి.రవికుమార్, వీఎం.బంజర్‌ ఎస్సై తోట నాగరాజు, కల్లూరు ఎస్సై మేడ ప్రసాద్, తహసీల్దార్‌ వై.శ్రీనివాసులు సందర్శించి, సహాయక చర్యలు ప్రారంభించారు. జనరేటర్‌ వెలుగుల్లో అర్ధరాత్రి దాకా సహాయక చర్యలు కొనసాగాయి.

రాత్రి 9వరకు  సహాయక చర్యల్లేవ్‌.. 
మూడు షిఫ్టులు..బిహార్‌ కార్మికులని నిర్ధారణ బాయిలర్‌ పేలుడు సంఘటనలో మృత దేహాలను వెలికితీసే పనుల్లో తీవ్ర జాప్యం చోటు చేసుకుంది. రాత్రి 7 గంటలప్పుడు బాయిలర్‌ విధ్వంసం జరగ్గా ఆ తర్వాత సంఘటనా స్థలానికి కల్లూరు ఏసీపీ బి.ఆంజనేయులు, ఆర్డీఓ శివాజీ ఆధ్వర్యంలో పోలీసు, రెవెన్యూ సిబ్బంది చేరుకున్నారు. అయితే..సత్తుపల్లి నుంచి ఫైర్‌ సిబ్బంది, 108 సిబ్బంది వచ్చినప్పటికీ సింగరేణి రెస్క్యూ సిబ్బంది మాత్రం రాత్రి 9 గంటల వరకు ఎవ్వరూ చేరుకోలేదు. ఖమ్మం పోలీస్‌ కమిషనర్‌ తప్సీర్‌ ఇక్బాల్‌ చేరుకుని అప్రమత్తం చేశారు. ఈ ఫ్యాక్టరీలో బిహార్‌కు చెందిన కార్మికులతో పాటు స్థానిక కార్మికులు ఒక్కొక్క షిప్టుకు 50 మంది చొప్పున మూడు షిఫ్టుల్లో 150 మంది పనిచేస్తున్నారు.  సాయంత్రం వేళ చాలామంది ఇళ్లకు వెళ్లడంతో..పెను ప్రమాదం తప్పింది. రెస్క్యూ సిబ్బంది చేరని కారణంగా సహాయక చర్యలు వేగవంతం కాలేదు. శిథిలాల కింద మృతదేహాలు, క్షతగాత్రులకు సంబంధించిన స్పష్టత రాలేదు.

బాధ్యులపై చర్యలు తీసుకుంటాం: సీపీ తఫ్సీర్‌ 

మొక్కజొన్న ఫ్యాక్టరీ బాయిలర్‌ పేలుడు ఘటనలో యాజమాన్యంపై చర్యలు తప్పవని ఖమ్మం పోలీస్‌ కమిషనర్‌ తఫ్సీర్‌ ఇక్బాల్‌ వెల్లడించారు. సోమవారం రాత్రి ఆయన బయ్యన్నగూడెం వద్ద ప్రమాదస్థలాన్ని సందర్శించి..పేలుడు సంభవించిన తీరును స్థానికులను అడిగి తెలుసుకున్నారు. ఫ్యాక్టరీ యజమానులను అదుపులోకి తీసుకొని, విచారణ చేపట్టాలని కల్లూరు ఏసీపీ బి.ఆంజనేయులను ఆదేశించారు.    

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement