పెళ్లి బంధం ఎంత గట్టిది?
తమిళసినిమా, న్యూస్‌లైన్ : ప్రేమతో మనసులు కలిస్తే పెళ్లితో బంధం బలపడుతుంది. ప్రేమలో ఆకర్షణ ఉన్నా పెళ్లి మాత్రం ఆదర్శంగా ఉండాలి. అయితే ఈ కాలంలో ఇదంతా చెప్పుకోవడానికే బాగుంటుంది.
ఈ బంధం ఎంత గట్టిదో కొన్ని జంటలను పరిశీలిస్తే తెలుస్తుంది. చాలామంది ప్రేమించి పెళ్లి చేసుకుంటున్నారు. ఎన్నో పెళ్లిళ్లు సుఖ సంసారంగా మారుతున్నాయి? మరి కొన్ని కలహాల కాపురాలుగా మారుతున్నాయి? ఇక సినిమా వాళ్ల విషయానికొస్తే ప్రేమ పెళ్లిళ్ల సక్సెస్ శాతం తక్కువే. కలహాలతో విడిపోయిన వారి శాతమే అధికం అని చెప్పచ్చు. పెళ్లి విషయంలో నేటి తరం హీరోయిన్లు ఆచి తూచి అడుగేస్తున్నారు.
చాలామంది హీరోయిన్లు వ్యాపారవేత్తలనే మనువాడటానికి ఆసక్తి చూపుతున్నారు. కారణం ఏమిటో తెలుసా? ఆర్థిక ఇబ్బందులు ఉండవు. లైఫ్‌కు సెక్యూరిటీ ఉంటుంది. అదీ కాకుండా సినిమాకు సంబంధం లేని కుటుంబం కాబట్టి సమస్యలు తలెత్తే అవకాశం ఉండదు. ఇవన్నీ ఆలోచించే చాలామంది హీరోయిన్లు ఇతర రాష్ట్రాల, ఇతర దేశాలకు చెందిన వ్యాపారవేత్తలను పెళ్లి చేసుకుంటున్నారు.
సినిమావారైతే సమస్యలే :
సినిమా రంగానికి చెందిన వారు ప్రేమించి పెళ్లి చేసుకుని అన్యోన్యంగా ఉండటం లేదా? అన్న తలంపు రావచ్చు. అలాంటి వారు లేకపోలేదు. అలా సక్సెస్ అయిన జంటలు చాలా తక్కువ. చాలామంది ప్రేమిం చి పెళ్లి చేసుకుని కొంతకాలం సంతోషంగా ఉన్నా ఆ తరువాత రకరకాల కారణాలతో విడిపోతున్న జంటలే అధికం. ఇది దృష్టిలో పెట్టుకునే అధికశాతం హీరోయిన్లు సినిమాకు సంబంధం లేని వ్యాపారవేత్తలను పతులుగా చేసుకోవడానికి ఆసక్తి చూపుతున్నారు.
అన్యోన్యం:
వ్యాపారవేత్తలను పతులుగా పొంది సౌకర్యంగా ఉన్న జంటలను తెలుసుకుందాం. 1980లో గ్లామర్ హీరోయిన్గా ఒక వెలుగు వెలిగిన నటి రాధ ముంబయికి చెందిన హోటల్ అధినేత రాజశేఖర్‌ను పెళ్లి చేసుకున్నారు. అనంతరం సినిమాకు దూరంగా భర్త వ్యాపారంలో పాలు పంచుకుంటూ ఇద్దరు పిల్లలకు తల్లి అయ్యారు. ఆ పిల్లలే నేటి యువ హీరోయిన్లుగా కార్తీక, తులసి సినీ రంగంలో అడుగు పెట్టారు. మలయాళ నటి నవ్యనాయర్ ముంబ యికి చెందిన వ్యాపారవేత్త సంతోష్ మీనన్‌ను జీవిత భాగస్వామిగా చేసుకున్నారు. నటి సమీరా రెడ్డి ఇటీవలే మోటార్‌బైక్ తయూరీదారు అక్షయ్వర్దేను వివాహమాడారు. బాలీ వుడ్ హీరోయిన్లు అధిక శాతం ఇదే సూత్రాన్ని అనుసరిస్తున్నారు. నటి మాధురీదీక్షిత్, శిల్పాశెట్టి, జుహ్లీ చావ్లా తదితరులందరూ వ్యాపారవేత్తలనే పెళ్లాడారు.
కలసి రాని బంధం :
ఇకపోతే సినిమాకు చెందిన వారు ప్రేమించి పెళ్లి చేసుకుని కాలం కలిసి రాకో మరో విధంగానో విడిపోయి విడాకులు పొందిన వారిలో కమలహాసన్ - సారిక, పార్తీపన్ - సీత, ప్రకాష్‌రాజ్ - లలితకుమారి, మనోజ్ కె జయన్ - ఊర్వశి, ముఖేష్ - సరిత తది తరులు ఉదాహరణగా తీసుకోవచ్చు. ఇంకా దర్శకులు, నిర్మాతలు పలువురు ప్రేమ వివాహం చేసుకుని మనస్పర్థల కారణంగా విడిపోయిన వారున్నారు. దర్శకుడు సెల్వరాఘవన్ - సోనియా అగర్వాల్ ప్రేమించి పెళ్లాడి ఆ తరువాత విడిపోయారు. గత కొన్ని రోజుల క్రితం దర్శకుడు ప్రియదర్శన్ - నటి విజి మధ్య మనస్పర్థలు విడాకుల వరకు దారి తీశాయి. ఆ తరువాత సన్నిహితులు రాయబారంతో వివాదం సమసిపోయింది.
ఆదర్శ సినీ దంపతులు :
ముందే చెప్పినట్లుగా సినిమావాళ్లలో ప్రేమించి పెళ్లి చేసుకున్న వాళ్లలో ఆదర్శ దంపతులుగా జీవిస్తున్న వాళ్లూ ఉన్నారు. సూర్య - జ్యోతిక, అజిత్ - శాలిని, ప్రసన్న - స్నేహ, దేవయాని - రాజ్‌కుమార్, శ్రీదేవి - బోనీ కపూర్, జెనీలియా - రితేష్ దేశ్‌ముఖ్ ఈ కోవలోకి వస్తారు. అయితే వీరి శాతం తక్కువేనంటున్నారు విశ్లేషకులు.