కాళరాత్రి
క్షణికావేశం.. వారిని ఆత్మహత్య చేసుకునేలా చేస్తోంది. రోజురోజుకూ రాష్ర్టంలో బవన్మరణాల సంఖ్య పెరుగుతూనే ఉంది. బెంగళూరు నగరంలోనే అధిక సంఖ్యలో ఆత్మహత్యలు చోటుచేసుకుంటున్నాయి. కుటుంబ కలహాలతో వివాహితులు.. చదువు ఒత్తిళ్లతో విద్యార్థులు.. ప్రేమ విఫలమై యువకులు.. ఇలా కారణం ఏదైనా చివరకు ఆత్మహత్యే శరణ్యమంటున్నారు. గత శుక్రవారం రాత్రే బెంగళూరులో 11 మంది ఆత్మహత్య చేసుకున్నారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ఆత్మహత్య పరిష్కారం కాదంటూ పలు స్వచ్ఛంద సంస్థలు ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నా.. ఫలితం శూన్యం.
బెంగళూరు : నగరం పాలిట శుక్రవారం రాత్రి కాళరాత్రిగా మారింది. ఒకరో, ఇద్దరో కాదు... ఏకంగా 11 మంది బలవన్మరణాలకు పాల్పడ్డారు. జీవితంపై విరక్తి చెంది కొందరు.. అనుకున్నదాన్ని సాధించలేక పోయామని మరి కొందరు... ఇలా వివిధ కారణాలతో 11 మంది తనువు చాలించారు. ఈ కేసులన్నిటినీ దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు శనివారం తెలిపారు.
= స్థానిక చెన్మనె అచ్చుకట్టలో ప్రవీణ (36) అనే సైంటిస్టు కుటుంబ సమస్యలతో సతమతమవుతున్నాడు. శుక్రవారం రాత్రి అందరూ నిద్రపోయాక, ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
= పరప్పన అగ్రహార పోలీసు స్టేషన్ పరిధిలోని శాంతిపురకు చెందిన రేవతి (15) ఇటీవలే ఎస్ఎస్ఎల్సీ పాసైంది. కళాశాలకు పంపించడానికి కుటుంబ సభ్యులు నిరాకరించారు. కుటుంబ సభ్యులందరూ కూలీలే. ఉన్నత విద్యాభ్యాసం యోగం లేదని గ్రహించిన రేవతి ఉరి వేసుకుని మరణించింది.
= శ్రీరాంపుర పోలీసు స్టేషన్ పరిధి ఓకలీపురానికి చెందిన పెరుమాల్ కుమార్తె కోకిల (16) మాగడి రోడ్డులోని బాపూజీ స్కూల్లో 10వ తరగతి చదువుతోంది. ఇంగ్లీషు సరిగా అర్థం కావడం లేదని, పరీక్షల్లో ఫెయిల్ అవుతానేమోనని ఆందోళన చెందుతూ ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది.
= శ్రీరాంపురలోని లక్ష్మీనారాయణపురకు చెందిన విజయలక్ష్మి (34) అనారోగ్యంతో బాధ పడుతోంది. చికిత్స చేయించడానికి భర్త నిరాకరిస్తున్నాడని ఆరోపిస్తూ ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.
= శ్రీరాంపురలోని రామచంద్రాపురంలో నివాసముంటున్న రత్న (45) అనారోగ్యంతో బాధపడుతోంది. చికిత్సకు భయపడి ఇంటిలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది.
= శ్రీరాంపురకు చెందిన రాజమాణిక్యం (50) కుటుంబ సభ్యులకు దూరంగా ఉంటున్నాడు. రాత్రి భార్య ఇంటి దగ్గరకు వెళ్లాడు. ఆమెతో గొడవ పడి అక్కడే విషం తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
= కళాసిపాళ్య పోలీసు స్టేషన్ పరిధి గుడ్డదహళ్లిలో భార్య వేధింపులు తాళలేక సంపంగి (30) ఆత్మహత్య చేసుకున్నాడు. అతను కూరగాయల వ్యాపారం చేస్తున్నాడు. రోజూ భార్య అతన్ని వేధిస్తుండటంతో విషం తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.
= కేఆర్ పురం పోలీస్ స్టేషన్ పరిధి కేవీ లేఔట్లో శ్రీ గాలి ఆంజనేయస్వామి దేవాలయం సమీపంలో జావేద్, రేష్మా (22) దంపతులు నివాసముంటున్నారు. రెండు సంవత్సరాల కిందట వీరికి పెళ్లయింది. జావేద్ కొరియర్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. కుటుంబ సమస్యలతో రేష్మా ఇంటిలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది.
= బయ్యప్పనహళ్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని భువనేశ్వరి నగరలో సునీల్ కుమార్, సునంద (36) దంపతులు నివాసముంటున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు. కుటుంబ సమస్యలతో శుక్రవారం రాత్రి సునంద ఇంటిలో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.
= శ్రీరాంపురలో ఆనంది (21) అనే మహిళ కుటుంబ సమస్యలతో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.
= వసంత నగరంలోని ఎంటీ స్ట్రీట్‌లో రాజు (27) అనే ఎలక్ట్రీషియన్ నివాసముంటున్నాడు. అతను ఒక యువతిని ప్రేమించాడు. ప్రేమ విఫలం కావడంతో శివాజీ నగర పోలీస్ స్టేషన్ పరిధిలోని రాజీవ్‌గాంధీ కాలనీలో నిర్మాణంలో ఉన్న కట్టడంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.