బడ్జెట్ 2018: టీవీ, ఫ్రిజ్, ఏసీ ధరలు తగ్గుతాయా?
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం లోక్‌సభలో ప్రవేశపెట్టనున్న సార్వత్రిక బడ్జెట్‌పై వ్యాపారవర్గాలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి. ఫిబ్రవరి 1న(గురువారం) ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ నేతృత్వంలోని పూర్తిస్థాయి బడ్జెట్లో తమకెలాంటి రాయితీలు లభించనున్నాయోననే ఉత్కంఠ నెలకొంది. దీంతోపాటు తమకు కల్సించాల్సిన రాయితీలు, ప్రోత్సాహకాలపై పలు అంచనాలను వ్యక్తపరుస్తున్నాయి. పన్నులను తగ్గించాలని, స్థానిక తయారీదారులకు ప్రోత్సాహకాలను కల్పించాలని గృహోపకరణాల తయారీ సంస్థలు ప్రభుత్వాన్ని కోరుతున్నాయి. తద్వారా సరసమైన ధరలకు గృహోపకరణాలన్నింటినీ వినియోగదారులకు అందించాలంటున్నాయి..
కన్స్యూమర్ డ్యూరబుల్స్, హోమ్ అప్లైన్సెస్ కు చెందిన పలు కంపెనీలు ఈమేరకు తక్కువ పన్ను రేట్లు, రాయితీలు, కల్పించాలని భావిస్తున్నాయి. ముఖ్యంగా పానసోనిక్, గోద్రెజ్ గృహోపకరణాలు, ఇంటెక్స్, ఫిలిప్స్ తదితర కంపనీలు దిగుమతులపై కస్టమ్స్ డ్యూటీని పెంచాలని కోరుకుంటున్నాయి. అలాగే ఇంధన సామర్థ్య ఉత్పత్తుల ఉత్పత్తిని ప్రోత్సహించాలని హోం అప్లైన్సెస్ & కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ ఇండస్ట్రీ కోరుకుంటోంది.
ఫ్రిజ్‌లు, వాషింగ్ మెషీన్లు, ఎసీలు లాంటి ఉపకరణాలు ప్రస్తుతం విలాసవస్తువుల కిందికి రావని.. ఈ నేపథ్యంలో వీటిని మరింత సరసమైన ధరల్లో వినియోగదారులకు అందుబాటులోకి తేవాలని గోద్రెజ్ అప్లైన్సెస్ బిజినెస్ హెడ్ కమల్ నంది పేర్కొన్నారు. మరోవైపు స్థానిక తయారీదారులకు ప్రోత్సాహమిచ్చేలా దిగుమతులపై సుంకాన్ని పెంచాలని మరో సంస్థ పానసోనిక్ కోరుతోంది.స్మార్ట్ఫోన్లు, టీవీలు తదితర ఉత్పత్తులపై పెంచినట్టుగానూ గృహోపకరణాలపై కూడాబీసీడీ (బేసిక్ కస్టమ్స్ డ్యూటీ) పెంచాలని పానసోనిక్ ఇండియా సీఈవో మనీష్ శర్మ తెలిపారు. మొబైల్ ఫోన్ల తయారీలో ప్రస్తుతం ఉన్న జీఎస్టీ 28 శాతం నుంచి 12 శాతానికి తగ్గించాలని ఇంటెక్స్‌కోరుతోంది. మొబైల్ ఫోన్ల తయారీలో ఉపయోగించే అన్ని భాగాలపై ఉన్న అధిక జిఎస్టీ రేట్లతో ఖర్చుపెరిగి భారతదేశంలో ఫోన్ల తయారీని దెబ్బతీస్తుందని ఇంటెక్స్ సీఈవో రాజీవ్ జైన్ అభిప్రాయపడ్డారు. అలాగే అన్ని పూర్తిస్థాయి లైటింగ్ ఉత్పత్తులపై కస్టమ్స్ డ్యూటీ పెంచాలని ఫిలిప్స్ లైటింగ్ ఇండియా వైస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ సుమిత్ జోషి చెప్పారు.
మరోవైపు మరికొద్ది రోజుల్లో పార్లమెంటు ముందుకు రానున్న బడ్జెట్‌పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఆర్ధిక వృద్ధే ప్రధాన టార్గెట్ అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇటీవల స్పష్టం చేసినప్పటికీ రానున్న ఆరు రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికల నేపథ్యంలో బీజేపీ సర్కార్ ప్రజాకర్షక బడ్జెట్‌తో వస్తోందన్న అంచనాలు భారీగా నెలకొన్నాయి.