ఈ బడ్జెట్ లో పన్నులు బాగా తగ్గుతాయా?
న్యూఢిల్లీ: పెద్ద నోట్ల రద్దుతో విమర్శల పాలైన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ ఆర్థికబడ్జెట్ లో పన్నుల కోతను ప్రతిపాదించే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం రూపొందిస్తున్న సార్వత్రిక బడ్జెట్‌పై పలు అంచనాలున్నాయి. వివిధ రంగాలు ప్రభుత్వం నుంచి పలు ప్రోత్సాహకాలు, సంస్కరణలు రానున్నాయని మార్కెట్ వర్గాలు పేర్కొంటున్నారు. ఫిబ్రవరి 1న ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ లోక్‌సభలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్న సంగతి తెలిసిందే. ప్రధానంగా కార్పొరేట్ పన్నుల తగ్గింపును, వ్యక్తిగత ఆదాయ పన్ను శ్లాబు పరిమితి పెంపుపై విశ్లేషకులు విశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నారు.
కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఫిబ్రవరి 1 న పార్లమెంట్ లో ప్రవేశ పెట్టనున్న 2017 ఆర్థిక బడ్జెట్ లో కొన్ని తాయిలాలు ప్రకటించే అవకాశం ఉందని భావిస్తున్నారు. ముఖ్యంగా తక్కువ పన్నులు, ఆదాయం పన్ను మినహాయింపు పరిమితిని రెట్టింపు తదితర అంశాలను ప్రస్తావిస్తున్నారు. వినిమయ శక్తి దారుణంగా పడిపోయిందన్న నివేదికల నేపథ్యంలో వినియోగదారుల కొనుగోలు శక్తికి బూస్ట్ ఇచ్చే లా బడ్జెట్లో ప్రతిపాదనలు ఉండనునన్నాయని భావిస్తున్నారు. అలాగే ఇన్‌ఫ్రా, హౌసింగ్, పట్టణాభివృద్ధి వంటి రంగాలకు కొత్త పెట్టుబడులు పెరుగనున్నాయంటున్నారు. తద్వారా బ్యాంకింగ్ వ్యవస్థకూ మేలు చేకూరనుంది. అంతేకాకుండా బడ్జెట్‌లో ప్రభుత్వ బ్యాంకులకు కొత్త పెట్టుబడులను ప్రకటించే అవకాశముంది.
రాబోయే కాలంలో ఆర్ధిక వృద్ధిపై నెలకొన్న సందేహాల నేపథ్యంలో ప్రభుత్వం విశ్వసనీయత మెరుగుపర్చడానికి చర్యలు చేపట్టవచ్చని ఖైతాన్ఎ గ్జిక్యూటివ్ డైరెక్టర్ నిహాల్ కొఠారి తెలిపారు. వస్తువులు మరియు సేవల డిమాండ్ ను మెరుగుపరిచేందుకుగాను వ్యక్తిగత ఆదాయం పన్ను స్లాబ్ లేదా రేటు ను తగ్గించే అవకాశం ఉందన్నారు. అలాగే ఆదాయ పన్ను మినహాయింపును రెట్టింపు చేసే అవకాశంఉందని మరికొంతమంది విశ్లేషకులు భావిస్తున్నారు. యూనియన్ బడ్జెట్ లో ఒక మోస్తరు పన్ను రేట్లును, విస్తృత ఆధారిత పన్ను వ్యవస్థను రాబయే ఒకటి రెండు సంవత్సరాలకు అంచనా వేస్తున్నామని ముంబైకి చెందిన ఎనలిస్టు సంజీవ్ ప్రసాద్ తెలిపారు. కాగా నికర ప్రత్యక్ష పన్నుల వసూళ్లు నవంబర్ 2016 నాటికి 26.2 శాతం భారీగా పెరిగింది. కస్టమ్స్, ఎక్సైజ్, సర్వీస్ పన్నుల నికర ఆదాయం గత ఏప్రిల్-డిసెంబర్లో 25 శాతం పెరిగిన సంగతి తెలిసిందే.