ఉపాధికి వైకల్యం
= జిల్లాలో 20,377 మంది దివ్యాంగ కూలీలు
= 150 రోజుల పని కల్పించింది ముగ్గురికే
= వంద రోజులు పూర్తి చేసింది 145 మందే
= 365 పంచాయతీల్లో ఏర్పాటు కాని సంఘాలు
= క్షేత్రస్థాయిలో అవగాహన లోపమే కారణం
అనంతపురం టౌన్ / నల్లమాడ :
ఉపాధి హామీ పథకంలో దివ్యాంగులకు ప్రత్యేక ఏర్పాట్లు ఉన్నాయి. ఒక్కో దివ్యాంగుడికి ఏడాదికి 150 రోజుల పనిదినాలు కల్పించాలి. ఎక్కువగా నర్సరీల పెంపకం, మొక్కలు నాటడం, నీరు పోయడం, కూలీలకు నీరు అందించడం తదితర పనులు చేయించాలి. వారికి పనులు కల్పించాల్సిన బాధ్యత ఫీల్డ్ అసిస్టెంట్లది. అయితే చాలా మందికి ఈ విషయంపై అవగాహన లేదు. దివ్యాంగులకు కూడా తెలియని పరిస్థితి. జిల్లాలోని చాలా ప్రాంతాల్లో రాజకీయ అండతో ఫీల్డ్ అసిస్టెంట్లు కొనసాగుతుండడంతో ఉన్నతాధికారులు కూడా ఏం చేయలేని పరిస్థితి నెలకొంది. గ్రామాల్లో వికలాంగుల శ్రమ శక్తి సంఘాలు (వీఎస్‌ఎస్‌ఎస్) ఏర్పాటు చేసే అవకాశం ఉన్నా.. ఫీల్డ్ అసిస్టెంట్లు పట్టించుకోవడం లేదు. జిల్లాలో 1003 గ్రామ పంచాయతీల పరిధిలో 3,424 ఆవాస ప్రాంతాలున్నాయి. ఇందులో 638 గ్రామ పంచాయతీల పరిధిలోని 916 ఆవాస ప్రాంతాల్లో మాత్రమే వీఎస్‌ఎస్‌ఎస్‌లు ఏర్పాటయ్యాయంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. 365 పంచాయతీల్లో అసలు సంఘాలే ఏర్పాటు చేయలేదు. కొన్ని మండలాల్లో ఇద్దరు, ముగ్గురు దివ్యాంగులు ముందుకు వస్తున్నా వారిని గ్రూపులుగా తయారు చేయడానికి ఫీల్డ్ అసిస్టెంట్లు వెనుకంజ వేస్తున్నారు. కొన్ని చోట్ల చేసిన పనులకు సైతం నెలల తరబడి బిల్లులు మంజూరు కాకపోవడంతో దివ్యాంగులు ఇబ్బంది పడుతున్నారు.
150 రోజుల ఉపాధి ముగ్గురికే!
జిల్లాలో దివ్యాంగులకు 20,377 జాబ్‌కార్డులు జారీ చేశారు. వీఎస్‌ఎస్‌ఎస్‌లు 1,172 ఉన్నాయి. ఈ ఏడాది 519 సంఘాల్లోని 1,906 మందికి 77,822 పనిదినాలు కల్పించారు. కూలి కింద రూ. 1,37,67,291 చెల్లించారు. సగటున ఒక దివ్యాంగ కూలీకి ఏడాదిలో 41 రోజులు మాత్రమే పని కల్పించారు. ఉపాధి హామీ పథకం కింద ఒక్కో కూలీకి కచ్చితంగా 150 రోజుల పని కల్పించాల్సి ఉండగా.. ఈ ఏడాది ముగ్గురికి మాత్రమే ఆ మేరకు కల్పించారంటే అధికారులు ఏ మేరకు పనులు చూపిస్తున్నారో అర్థమవుతోంది. ఇక వంద రోజుల పని కూడా 145 మందికి మాత్రమే కల్పించారు. ఈ పథకంలో లోటుపాట్లకు క్షేత్రస్థాయి సిబ్బంది నిర్లక్ష్యమే కారణమన్నది స్పష్టంగా తెలుస్తున్నా.. ఉన్నతాధికారులు మాత్రం ఎలాంటి చర్యలూ తీసుకోవడం లేదు. కొన్ని మండలాల్లో అతి తక్కువ గ్రూపులను ఏర్పాటు చేశారు. మరికొన్ని మండలాల్లో ఉన్న గ్రూపులకూ పనులు కల్పించడం లేదు.