LPG Gas Dealers
-
వ్యాక్సిన్ వేయకుంటే గ్యాస్ పంపిణీ నిలిపేస్తాం...!
సాక్షి, హైదరాబాద్: గ్యాస్ పంపిణీదారులకు వెంటనే వ్యాక్సిన్ ఇవ్వాలని ప్రభుత్వాన్ని తెలంగాణ ఎల్పీజీ డిస్ట్రిబ్యూషన్స్ అసోసియేషన్ కోరింది. వ్యాక్సినేషన్ చేపట్టకుంటే ఈ నెల 29 నుంచి గ్యాస్ డెలివరీ నిలిపేస్తామని అసోసియేషన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎం.వెంకటేశ్వరరావు, కె.జగన్మోహన్రెడ్డి పేర్కొన్నారు. కోవిడ్ కారణంగా ఇప్పటికే అనేక మంది పంపిణీదారులు వైరస్ బారిన పడ్డారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. సిబ్బంది ప్రాణాలను పణంగా పెట్టి ఇంటింటికీ వెళ్లి ఎల్పీజీ సిలిండర్లు అందజేయాల్సి ఉంటుందన్నారు. రాష్ట్రంలో రోజుకు రెండు లక్షల గ్యాస్ సిలిండర్లను పంపిణీ చేస్తున్నారని తెలిపారు. -
ధర మండే.. దారి మళ్లే!
సాక్షి, సిటీబ్యూరో: ఎల్పీజీ కమర్షియల్ (వాణిజ్య) సిలిండర్ల ధర మండుతోంది. మూడు నెలల్లోనే రూ.90 పెరిగింది. ఫలితంగా 19 కిలోల వాణిజ్య సిలిండర్ ధర ప్రస్తుతం రూ.1470.23కి చేరింది. దీంతో గృహావసరాలకు వినియోగించాల్సిన డొమెస్టిక్ సిలిండర్ దారి మళ్లుతోంది. హోటళ్లు, ఇతర వాణిజ్య సంస్థల అవసరాలు తీరుస్తోంది. గ్రేటర్లో పెద్ద హోటళ్లు 5వేలకు పైగా ఉండగా... చిన్న హోటళ్లు, టీ, టిఫిన్, మిర్చి సెంటర్లు దాదాపు లక్ష వరకు ఉంటాయని అంచనా. పెద్ద హోటళ్లు, రెస్టారెంట్లలో వాణిజ్య సిలిండర్లు వినియోగమవుతుండగా.. మిగిలిన చిన్న హోటళ్లు, టీ, టిఫిన్ సెంటర్లు, మిర్చి బండ్లు తదితరాల్లో డొమెస్టిక్ సిలిండర్లు దర్శనమిస్తున్నాయి. ఈ లెక్కన ప్రతిరోజు లక్ష వరకు డొమెస్టిక్ సిలిండర్లు దారి మళ్లుతున్నట్లు తెలుస్తోంది. ప్రత్యేక టాస్క్‌పోర్స్, స్పెషల్ ఆపరేషన్ టీమ్ (ఎస్ఓటీ), పోలీసులు అప్పుడప్పుడు చేసే తనిఖీల్లో ఈ అక్రమదందా వెలుగుచూస్తూనే ఉంది. కానీ వంటగ్యాస్ అమలుతీరును పర్యవేక్షించాల్సిన పౌరసరఫరాల శాఖ నిద్రమత్తులో ఉండడం విస్మయానికి గురిచేస్తోంది. ఫిర్యాదులు వస్తే గానీ సంబంధిత అధికారులు స్పందించకపోవడం ఆ శాఖ నిర్లక్ష్యానికి పరాకాష్టగా నిలుస్తోంది. కనెక్షన్లు 60 వేలే... గ్రేటర్ పరిధిలోని హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో కలిపి మూడు చమురు సంస్థలకు సంబంధించి మొత్తం వాణిజ్య కనెక్షన్లు 60 వేలకు మించిలేవని అధికారిక గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. మరోవైపు వాణిజ్య సిలిండర్ ధర అధికంగా ఉండడం, డొమెస్టిక్‌ది తక్కువ ఉండడంతో... వ్యాపారులు వీటిపైనే ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. గ్రేటర్ పరిధిలో డొమెస్టిక్ కనెక్షన్లు 26.21 లక్షల వరకు ఉంటాయి. నగరంలో మొత్తం 135 ఎల్పీజీ ఏజెన్సీలు ఉండగా.. ప్రతిరోజు 1.50 లక్షల వరకు డొమెస్టిక్ సిలిండర్లు అవసరం ఉంటాయి. కానీ ప్రస్తుతం 60 వేలకు మించి డోర్ డెలివరీ కావడం లేదని తెలుస్తోంది. కానీ వాణిజ్య అవసరాలకు మాత్రం కొరత లేకుండా బ్లాక్ మార్కెట్లో లభిస్తుండడం గమనార్హం. ఇక 5కిలోల సిలిండర్ ధర కూడా భారీగా ఉంటోంది. దీని ధర బహిరంగ మార్కెట్లో రూ.417.78 ఉండగా.. బ్లాక్ మార్కెట్లో రూ.800 ఉంది. ఎంతోమంది నిరుద్యోగులు, చిన్నాచితక ఉద్యోగులు, విద్యార్థులు నగరానికి వచ్చి ఉంటున్నారు. వీరంతా ఈ చిన్న సిలిండర్లపైనే ఆధారపడి ఉంటారు. వీటికి అధికారికంగా కనెక్షన్లు లేని కారణంగా బ్లాక్‌లోనే గ్యాస్ నింపుతున్నారు. ఇదే అదనుగా వ్యాపారులు ఇష్టానుసారంగా వసూల్ చేస్తున్నారు. కమర్షియల్ సిలిండర్ ధర పెరిగిందిలా... మార్చి రూ.1,380.87 ఏప్రిల్ రూ.1,448.50 మే రూ.1,470.23 గ్రేటర్లో ఎల్పీజీ ధరలు ఇలా... సిలిండర్ ప్రభుత్వ ధర బ్లాక్ మార్కెట్ ధర 14.2 కిలోల డొమెస్టిక్ రూ.768.36 రూ.1,000 19 కిలోల కమర్షియల్ రూ.1,470.23 రూ.1,600 5 కిలోల సిలిండర్ రూ.417.78 రూ.800 -
‘గ్యాస్’ గలాట
సాక్షి, ఏలూరు : వంట గ్యాస్ పంపిణీకి ఆధార్ అనుసంధానం, నగదు బదిలీ పథకాన్ని వర్తింపజేయటంతో నిన్నామొన్నటి వరకు వినియోగదారులు గగ్గోలు పెడుతూ వచ్చారు. అది ఇప్పుడు గ్యాస్ ఏజెన్సీల డీలర్ల వంతూ అయింది. సబ్సిడీ సొమ్ము వినియోగదారుల బ్యాంకు ఖాతాలో జమకాకపోతే తమను నిలదీస్తున్నారని, గ్యాస్ కనెక్షన్లకు ఆధార్ అనుసంధానంపై స్పష్టత లేదని డీలర్లు ఆరోపణ. తూకంలో వచ్చే తేడాలను నివారించటానికి సీల్డ్ ప్రూఫ్ సిలిండర్లు సరఫరా చేయాలనేది వారి మరో డిమాండ్. తమ సమస్యల పరిష్కారం కోసం వారు మంగళవారం నుంచి నిరవధిక సమ్మెకు దిగుతున్నారు. గ్యాస్ ఏజెన్సీల డీలర్లు సమ్మెతో తమకు ఇక్కట్లే అని వినియోగదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో 48 గ్యాస్ ఏజన్సీల కింద సుమారు 9.50 లక్షల గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. వీటిలో దాదాపు 2 లక్షల సిలిండర్లు బ్లాక్‌మార్కెటీర్ల చేతుల్లో ఉన్నాయని అంచనా. జిల్లాలో ప్రతి రోజూ గరిష్టంగా 15 వేల సిలిండర్ల వరకు ఏజెన్సీల నుంచి వినియోగదారులకు సరఫరా అవుతున్నాయి. ప్రస్తుతం గృహావసర వంట గ్యాస్ సిలిండర్ ధర రూ.1211, వాణిజ్య అవసరాల సిలిండర్ రూ.2వేల 45 ఉంది. డీలర్లు సమ్మె చేస్తే సిలిండర్ల సరఫరా నిలిచిపోతుందని, దీంతో బ్లాక్ మార్కెట్లో ధరలు చుక్కలనంటుతాయని వినియోగాదారుల భయం. ఇప్పటికీ బ్లాక్‌లో సిలిండర్‌కు రూ.300 నుంచి రూ.600 వరకు అధికంగా విక్రయిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. డీలర్ల పనితీరుపై ఆరోపణలు గ్యాస్ ఏజెన్సీల పనితీరుపై పలు ఆరోపణలున్నాయి. ఒక్కో ఏజెన్సీకి పరిమితికి మించి గ్యాస్ కనెక్షన్లు ఉండటం వల్ల వారు వినియోగదారులకు జవాబుదారీగా ఉండటం లేదనేది ప్రధాన ఆరోపణ. ఏ స్థాయిలో జరుగుతున్నా సిలిండర్లలో గ్యాస్ చౌర్యం సాగుతోందనే ఫిర్యాదులు ఉన్నాయి. బుక్ చేసుకుంటే నిర్ణీణ వ్యవధిలో సిలిండర్ సరఫరా చేయరని మరో ఆరోపణ. చమురు సంస్థల కొత్త విధానాలు ఏజెన్సీలను కట్టడి చేయటానికి చమురు సంస్థలు కొత్త విధానాలను అవలంబిస్తున్నాయి. అక్రమ గ్యాస్ కనెక్షన్లను క్రమబద్ధీకరించుకునే అవకాశాన్ని వినియోగదారులకు కల్పించాయి. సంబంధిత చమురు సంస్థ వెబ్‌సైట్‌కు వెళ్లి డీలర్‌కు రేటింగ్ ఇచ్చే ఏర్పాటు చేశాయి. తక్కువ రేటింగ్ వచ్చిన డీలర్లపై విచారణ చేసి చర్యలు తీసుకుంటున్నాయి. పరిమితికి మించి ఉన్న కనెక్షన్లను వేరే డీలర్లకు ఇవ్వాలనేది వారి విధానాల్లో ఉంది. వినియోగదారులు తమ కనెక్షన్‌ను వేరే తమకు నచ్చిన ఏజెన్సీకి బదిలీ చేసుకునే వెసులబాటు కల్పించనున్నారు. ఆధార్‌తో సమస్యలు పెరిగాయంటున్న డీలర్లు గ్యాస్ సిలిండర్ ధర విపరీతంగా పెంచేసి సబ్సిడీ సొమ్మును బ్యాంకులో వేస్తామని, దానికి ఆధార్ నంబర్‌ను అనుసంధానం చేయించుకోవాలని ప్రభుత్వం నిబంధన విధించినప్పటి నుంచి సమస్యలు మొదలయ్యాయని ఏజెన్సీల ఆరోపణ. ఆధార్ అనుసంధానం చేయించుకోని వినియోగదారులతోపాటు సబ్సిడీ సొమ్ము రాకపోవడంతో డీలర్లను నిలదీస్తున్నారు. సిలిండర్ తూకం తగ్గితే డీలర్లను బాధ్యుల్ని చేసి కేసులు పెడుతున్నారు. ఈ రెండు సమస్యలతో తమకు సంబంధం లేదని, అకారణంగా తమను బలిచేస్తున్నారని డీలర్లు వాపోతున్నారు. ఆధార్‌పై స్పష్టత ఇవ్వడంతో పాటు తూనికల్లో లోపాల కేసుల నుంచి డీలర్లను తప్పించేందుకు సిలిండర్ సీలు తీసే వీలు లేకుండా సీల్డ్ప్రూఫ్ సిలిండర్లను బాట్లింగ్ పాయింట్ల నుంచే పంపాలని కోరుతున్నారు. క్రమశిక్షణ పేరుతో తమపై లక్షలాది రూపాయల జరిమానా విధించటాన్ని మానుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.