Brazil and Peru: ఆ లాటిన్ అమెరికా దేశాల్లో... ‘లా’వొక్కింతయు లేదు!
దక్షిణ అమెరికాలో ముఖ్య దేశాలైన బ్రెజిల్, పెరు ఆందోళనలతో అట్టుడుకుతున్నాయి. బ్రెజిల్లో మాజీ అధ్యక్షుడే తన మద్దతుదారులను రెచ్చగొడుతూ దేశాన్ని రావణకాష్టం చేస్తుండగా, పెరులో పదవీచ్యుతుడైన అధ్యక్షునికి మద్దతుగా ప్రజలే దేశవ్యాప్తంగా భారీ సంఖ్యలో రోడ్లెక్కుతున్నారు! బ్రెజిల్లో నిరసనకారులు అధ్యక్ష భవనంతో పాటు ఏకంగా పార్లమెంటు, సుప్రీంకోర్టు వంటి రాజ్యాంగ సంస్థల భవనాలపైనే దాడికి దిగి విధ్వంసం సృష్టించారు. పెరులోనూ జనం రాజధానితో పాటు దేశమంతటా భారీగా ఆందోళనలకు దిగుతూ అట్టుడికిస్తున్నారు. వీటికి సమీప భవిష్యత్తులో కూడా తెర పడే సూచనలు కన్పించడం లేదు!
బ్రెజిల్ బేజారు
బోల్సొనారో అనుయాయుల అరాచకం
కొత్త అధ్యక్షుడు డ సిల్వా ఆపసోపాలు
దక్షిణ అమెరికాలో కొంతకాలంగా ‘గులాబి గాలి’ వీస్తోంది. చాలా దేశాల్లో ప్రధానంగా వామపక్ష భావజాలమున్న పార్టీలే అధికారంలోకి వస్తున్నాయి. ఈ ఖండంలోని అతి పెద్ద దేశమైన బ్రెజిల్‌లోనూ అదే జరిగింది. గత అక్టోబర్‌లో జరిగిన ఎన్నికల్లో రైట్ వింగ్ నాయకుడైన జెయిర్ బోల్సొనారో వెంట్రుకవాసి తేడాలో ఓటమి చవిచూశారు. 51 శాతం ఓట్లతో వామపక్ష నేత లూయిజ్ ఇనాసియో లులా డ సిల్వా నెగ్గారు. కానీ ఈ ఫలితాలను ఒప్పుకుని గద్దె దిగేందుకు బోల్సొనారో ససేమిరా అన్నారు.
తనకు వ్యతిరేకంగా ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని, వాటికి సుప్రీంకోర్టు మద్దతూ ఉందని ఆరోపణలు గుప్పించారు. ఈవీఎంలపైనా అనుమానాలు వ్యక్తం చేశారు. తర్వాతి పరిణామాల్లో అజ్ఞాతంలోకి వెళ్లిన ఆయన, అవినీతి ఆరోపణలపై విచారణను తప్పించుకునేందుకు అంతిమంగా అమెరికాలో తేలారు! కానీ, ‘‘అధికారం మీ చేతుల్లోనే ఉంది. సైన్యం ఇప్పటికీ నా మాటే వింటుంది. దొంగల పాలనను కూలదోయండి’’ అంటూ అక్కడినుంచే తన మద్దతుదారులను రెచ్చగొడుతూ వస్తున్నారు. ఫలితంగా కొంతకాలంగా బ్రెజిల్ అల్లర్లు, ఆందోళనలు, గొడవలతో అట్టుడుకుతోంది.
పార్లమెంటుపై దాడులు
ముఖ్యంగా జనవరి 8న కరడుగట్టిన బోల్సొనారో మద్దతుదారులు ఉన్నట్టుండి వేల సంఖ్యలో అధ్యక్ష భవనం, పార్లమెంటు, సుప్రీంకోర్టు భవనాల్లోకి చొరబడి విధ్వంసం సృష్టించారు. సైన్యం తిరగబడి ఎన్నికల ఫలితాలను రద్దు చేసి బోల్సొనారోను తిరిగి అధ్యక్షున్ని చేయాలనే డిమాండ్‌తో అరాచకానికి దిగారు. ఆ సమయంలో భద్రతా దళాలు చేష్టలుడిగి చూస్తూ ఉండిపోయాయి. పైగా ఆందోళనలు జరుగుతుండగానే పలువురు నేతలు, అధికారులు నవ్వుతూ ఫొటోలు తీసుకుంటూ కన్పించారు!
నిజానికి అప్పటికి పది వారాలుగా నిరసనకారులు ఏకంగా ఆర్మీ హెడ్ క్వార్టర్స్ ముందే టెంట్లు వేసుకుని మరీ ఆందోళనలు చేస్తున్నా వాటిని ఆదిలోనే తుంచేసేందుకు డ సిల్వా పెద్దగా ప్రయత్నాలు చేయలేదు. తిరుగులేని ప్రజాదరణ లులా డ సిల్వా సొంతమైనా కీలక సైన్యం మద్దతు ఆయనకు లేకపోవడమే ఇందుకు ప్రధాన కారణమన్న వ్యాఖ్యలు వినిపించాయి. దాంతో పరిస్థితిని ఏదోలా అదుపులోకి తెచ్చేందుకు డ సిల్వా కిందా మీదా పడుతున్నారు.
► మాజీ న్యాయ మంత్రి ఆండెర్సన్ టోరెస్‌తో పాటు పలువురు బోల్సొనారో సన్నిహితులను అరెస్టు చేశారు.
► సైన్యం తిరుగుబాటుకు ప్రయత్నిస్తోందన్న వార్త నేపథ్యంలో జనవరి 8 ఆందోళనలకు బాధ్యున్ని చేస్తూ ఆర్మీ చీఫ్‌ను తాజాగా తొలగించారు.
► అల్లర్ల వెనక బోల్సొనారో హస్తంపై విచారణ జరుపుతామని సుప్రీంకోర్టు ప్రకటించింది.
ఏం జరగనుంది...
పరిస్థితులను చూస్తుంటే దేశంలో అల్లర్లకు ఇప్పట్లో అడ్డుకట్ట పడే సూచనలు కన్పించడం లేదు. అవినీతి ఆరోపణలపై ఇటీవలే ఏడాదిన్నర పాటు ఊచలు లెక్కించిన డ సిల్వాకు దేశాన్ని పాలించే అర్హత లేదంటూ బోల్సొనారో మద్దతుదారులు ఇప్పటికీ దేశవ్యాప్తంగా చెలరేగిపోతూనే ఉన్నారు. సైన్యం పూర్తి మద్దతు లేకపోతే వాటికి డ సిల్వా ఏ మేరకు అడ్డుకట్ట వేయగలరన్నది ప్రశ్నార్థకంగా మారింది. ఇప్పటికే పలుమార్లు సైనిక కుట్రలను, నియంతల పాలనలను చవిచూసిన బ్రెజిల్లో మరోసారి అలాంటి పరిస్థితులు తలెత్తుతాయో, ప్రశాంత పరిస్థితులు నెలకొంటాయో వేచి చూడాల్సిందే.
పెరు.. పేదల తిరుగుబాటు
అధ్యక్షురాలు బొలార్టేపై వెల్లువెత్తిన వ్యతిరేకత
మాజీ అధ్యక్షుడు కాస్టిలోకు మద్దతుగా ఆందోళనలు
ఆమె పేరు మార్గరిటా కొండొరీ. పెరులో ఆండీస్ పర్వత శ్రేణుల్లోని అత్యంత వెనకబడ్డ పునో ప్రావిన్స్‌లో స్థానిక అయ్మారా తెగకు చెందిన వృద్ధురాలు. వయోభారాన్ని కూడా లెక్క చేయకుండా రెండు రోజుల పాటు అత్యంత కఠినమైన బస్సు ప్రయాణం చేసి మరీ రాజధాని లిమా చేరుకుంది. ‘‘మేమంతా పేదరికంలో మగ్గుతున్నాం. మాపై ఉగ్రవాద ముద్ర వేసినా పర్లేదు. బొలార్టే రాజీనామా చేసేదాకా రాజధాని నుంచి కదిలే ప్రసక్తే లేదు’’ అంటూ సహచర ఆందోళనకారులతో కలిసి పెద్దపెట్టున నినదిస్తోంది.
పెరులో దాదాపు ఆరు వారాలుగా ఇదే పరిస్థితి! స్థానిక తెగలకు చెందిన వామపక్ష ఫైర్ బ్రాండ్ నాయకుడు కాస్టిలోను అధ్యక్ష పదవి నుంచి కూలదోసి జైలుపాలు చేసి ఉపాధ్యక్షురాలు దినా బొలార్టే గత డిసెంబర్ 7న అధికారాన్ని చేజిక్కించుకున్నారు. అప్పటినుంచీ ఆమెకు వ్యతిరేకంగా మొదలైన ప్రజాందోళనలు నానాటికీ తీవ్ర రూపు దాలుస్తున్నాయి. దేశమంతటికీ వ్యాపించడమే గాక హింసాత్మకంగా మారుతున్నాయి. మార్గరిటా మాదిరిగా అత్యంత మారుమూల ప్రాంతాల నుంచి కూడా జనం అత్యంత వ్యయ ప్రయాసలకోర్చి మరీ లిమాకు ప్రవాహంలా వచ్చి పడుతున్నారు. బొలార్టే తప్పుకుని ఎన్నికలు ప్రకటించే దాకా దాకా ఇంచు కూడా కదిలేది లేదని భీష్మిస్తున్నారు. భద్రతా దళాలపైకి రాళ్లు రువ్వుతూ ఢీ అంటే ఢీ అంటున్నారు.
ఏమిటి సమస్య?
ప్రపంచంలో రెండో అతి పెద్ద రాగి ఉత్పత్తిదారు అయిన పెరులో 1990 నుంచి దశాబ్దకాలపు నియంతృత్వ పాలన అనంతరం 2000లో ప్రజాస్వామ్య పవనాలు వీచాయి. 2001 నుంచి 2014 దాకా జోరుగా సాగిన ఖనిజ నిల్వల ఎగుమతితో జీడీపీ రెట్టింపు వృద్ధి రేటుతో దూసుకుపోయింది. కార్మికుల వేతనాలూ ఇతోధికంగా పెరిగాయి. కానీ గ్రామీణ ప్రాంతాలు మాత్రం బాగా నిర్లక్ష్యానికి గురవుతూ వచ్చాయి. సంపదంతా ప్రధానంగా నగర ప్రాంతాల్లో కేంద్రీకృతమైంది. మరోవైపు అవినీతి, అవ్యవస్థ నానాటికీ పెచ్చరిల్లాయి. స్థానిక ప్రభుత్వ పెద్దలు బడ్జెట్ కేటాయింపులను ఇష్టారాజ్యంగా భోంచేయడం ప్రారంభించారు. దాంతో కొన్నేళ్లుగా దేశంలో రాజకీయ అస్థిరత రాజ్యమేలుతోంది.
గత రెండేళ్లలోనే ఏకంగా ఐదుగురు అధ్యక్షులు మారారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ఈ క్రమంలో లెఫ్టిస్టు అయిన కాస్టిలోపైనా పలు అవినీతి ఆరోపణలు వెల్లువెత్తాయి. విచారణల దాకా వెళ్లడమే గాక రెండుసార్లు అభిశంసన ప్రయయత్నాలూ జరిగాయి. గత డిసెంబర్లో మరోసారి అభిశంసనకు రంగం సిద్ధమవడంతో కాంగ్రెస్‌ను రద్దు చేసి డిక్రీ ద్వారా పాలించేందుకు కాస్టిలో విఫలయత్నం చేశారు. అదే అభియోగంపై చివరికి ఆయన్ను పదవి నుంచి దింపి ఖైదు చేసి బొలార్టే పదవిలోకి వచ్చారు. కానీ గ్రామీణ ప్రాంతాల్లో, ముఖ్యంగా పేదల్లో కాస్టిలోకు విపరీతమైన ఆదరణ ఉండటంతో ఈ పరిణామాన్ని వ్యతిరేకిస్తూ నిరసనలు మిన్నంటాయి. ఆందోళనలకు ఇప్పటిదాకా దేశవ్యాప్తంగా 50 మందికి పైగా బలయ్యారు.
అల్లకల్లోలం
► ఆందోళనల దెబ్బకు దేశంలో అవ్యవస్థ రాజ్యమేలుతోంది. ఇప్పటికే ఎమర్జెన్సీ విధించారు. రోడ్డు, రైలు, విమాన తదితర రవాణా సేవలన్నీ స్తంభించాయి.
► మైనింగ్ తదితర కార్యకలాపాలకూ తీవ్ర విఘాతం కలిగింది.
► అపారమైన ఖనిజ నిల్వలున్నా పేదరికంలో మగ్గుతున్న దక్షిణ ప్రాంతాల్లో నిరసనలు బాగా జరుగుతున్నాయి.
► వీటిపై బొలార్టే బలప్రయోగానికి దిగుతున్నారు. అవసరమైతే ఉక్కుపాదం మోపుతామని ప్రకటిస్తున్నారు. ఇది మరింత అస్థిరతకు, సామాజిక విభజనకు దారి తీస్తుందని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
– సాక్షి, నేషనల్ డెస్క్