లుంగీలు, నైటీలపై తిరగొద్దు.. చూడలేకపోతున్నాం!
నోయిడా: నోయిడాలోని ఒక అపార్ట్ మెంట్ సముదాయంలో వింత నోటీసు ఒకటి జారీ చేసింది సొసైటీ కమిటీ. సాయంత్రం వేళ సొసైటీలో వాకింగ్ చేస్తున్న కొందరు మహిళలు నైటీలలో వస్తుంటే పురుషులు మాత్రం లుంగీలలో వచ్చి పార్కు చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారట. వారలా తిరగడం కొందరికి అసౌకర్యం కలిగించడంతో నేరుగా వెళ్లి సొసైటీ పెద్దలకు ఫిర్యాదు చేశారు. ఇంకేముంది సొసైటీ పెద్దలు సీరియస్ గా రియాక్టయి ఇకపై కాలనీ బహిరంగ ప్రదేశాల్లో నైటీలను, లుంగీలను నిషేదిస్తూ సొసైటీ నివాసులందరికీ నోటీసులు పంపించారు.
నోయిడాలోని హిమసాగర్ అపార్ట్ మెంట్స్ లోని సుమారు 200 కుటుంబాలు నివసిస్తున్నాయి. ఆ కాలనీ వాసులు రోజంతా భగభగ మండుతున్న ఎండ తాకిడికి ఉక్కిరిబిక్కిరై ఉండటంతో ఉపశమనం కోసం సాయంత్రం పూట చల్లగాలికి కాలనీ కామన్ ఏరియాల్లోనూ, కమ్యూనిటీ పార్కుల్లోనూ వాకింగ్ చేస్తుంటారు. వేసవికాలం కాబట్టి చాలామందికి ఇది దైనందిన జీవితంలో భాగమే.
చూడలేకపోతున్నాం..
కానీ ఆ కాలనీలోని వాసులు మహళలైతే నైటీల్లోనూ పురుషులైతే లుంగీల్లోనూ వాకింగ్ చేస్తుండటమే అసలు తగువుకు తెరతీసింది. వారలా తిరుగుతుండటం చూసి కొందరికి అసౌకర్యంగా అనిపించి వెంటనే సొసైటీ పెద్దలను కలిసి.. బహిరంగ ప్రదేశాల్లో లుంగీ, నైటీల్లో వాకింగ్ చేస్తుంటే చూడలేకున్నాం తక్షణమే చర్యలు తీసుకోండని ఫిర్యాదు చేశారట. ఇంకేముంది అప్పటికప్పుడు సమావేశమై అపార్ట్ మెంట్ వాసుల వస్త్రధారణ విషయమై కూలంకషంగా చర్చించి హిమసాగర్ వాసులకు డ్రెస్ కోడ్ విధిస్తూ నోటీసు సిద్ధం చేసి జూన్ 10న కాలనీ వాసులందరికీ పంపించారు సొసైటీ పెద్దలు.
ఇదే నోటీసు..
సోసైటీ పరిధిలో తిరిగేవారికి డ్రెస్ కోడ్.. మన కాలనీలోని పార్కుల్లోనూ, బహిరంగ ప్రదేశాల్లోనూ తిరిగేటప్పుడు మీ వస్త్రధారణ ఇతరులకు అభ్యంతరకరంగానూ అసౌకర్యంగానూ ఉండకుండా చూసుకోగలరు. ఇకపై ఎవ్వరూ ఈ పరిసర ప్రాంతాల్లో ఇళ్లల్లో వేసుకునే లుంగీలు, నైటీలు వంటి దుస్తులు వేసుకుని తిరగవద్దని అభ్యర్ధిస్తున్నామని రాశారు.
తప్పేముంది - ముమ్మాటికీ తప్పే
దీంతో కాలనీ వాసుల్లో కొందరు ఒక్కసారిగా ఖంగుతున్నారు. అసలే వేసవికాలం.. ఎండలు భగ్గుమంటున్నాయి.. రిలాక్స్ గా ఉంటుందని లుంగీలు, నైటీలు వేస్తుకుంటుంటాం. ఎవరికో అసౌకర్యంగా ఉందని వద్దంటే ఎలా అని వాపోతున్నారు. మరికొంత మంది మాత్రం ఇది చాలా మంచి నిర్ణయమని ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారు. హిమసాగర్ అపార్ట్ మెంట్ కమిటీ జారీ చేసిన ఈ నోటీసు ఇప్పుడు ఇంటర్నెట్లో వైరల్ గా మారింది.
ఇది కూడా చదవండి: మధ్యప్రదేశ్ ఎన్నికల్లో కూడా గెలిచేది మేమే..