luxury markets
-
ప్రపంచ లగ్జరీ మార్కెట్లో ఢిల్లీకి 9వ స్థానం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రపంచవ్యాప్తంగా శరవేగంగా అభివృద్ధి చెందుతున్న నివాస మార్కెట్లో మన దేశం నుంచి మూడు నగరాలు చోటు దక్కించుకున్నాయి. దేశ రాజధాని ఢిల్లీ 9వ స్థానంలో నిలవగా.. బెంగళూరు 20, ముంబై 28వ స్థానంలో నిలిచాయి. గ్లోబల్ ప్రాపర్టీ కన్సల్టెన్సీ నైట్ ఫ్రాంక్ ‘ప్రైమ్ గ్లోబల్ సిటీ ఇండెక్స్’ స్థానిక మార్కెట్లో రియల్టీ ధరల ఆధారంగా ర్యాంక్‌లను కేటాయిస్తుంది. 2019 రెండో త్రైమాసికం నివేదిక ప్రకారం లగ్జరీ రెసిడెన్షియల్ మార్కెట్లో మొదటి స్థానంలో రష్యా రాజధాని మాస్కో నిలిచింది. గత ఏడాది కాలంలో ఇక్కడ గృహాల ధరలు 11.1 శాతం వృద్ధి చెందాయి. ‘‘మన దేశంలో ప్రభుత్వ విధాన నిర్ణయాలు అఫర్డబుల్, మధ్య స్థాయి గృహాల అభివృద్ధికే పరిమితమయ్యాయి. దీంతో లగ్జరీ ప్రాపర్టీలు సంఘటిత కంపెనీలు, నిధులు సమృద్ధిగా ఉన్న కంపెనీలు మాత్రమే చేస్తున్నాయి’’ అని నైట్‌ఫ్రాంక్ ఇండియా సీఎండీ శిశీర్ బైజాల్ వ్యాఖ్యానించారు. -
జోరుగా లగ్జరీ మార్కెట్
న్యూఢిల్లీ: భారత్‌లో ఆర్థిక పరిస్థితులు అనిశ్చితిగా ఉన్నప్పటికీ, లగ్జరీ మార్కెట్ మాత్రం జోరు గా ఉందని ఆసోచామ్ తాజా సర్వే పేర్కొంది. విలాస వస్తువులు, సేవల కొనుగోళ్లకు భారత సంపన్నులు వెనదీయడం లేదంటున్న ఈ సర్వే పేర్కొన్న కొన్ని ముఖ్యాంశాలు.., 2012లో 650 కోట్ల డాలర్లుగా ఉన్న భారత లగ్జరీ మార్కెట్ గతేడాది 30 శాతం వృద్ధితో 850 కోట్ల డాలర్లకు పెరిగింది. మూడేళ్లలో 1,400 కోట్ల డాలర్లకు పెరుగుతుందని అంచనా. అమెరికా, యూరప్‌ల్లో కుటుంబంతో విహార యాత్రకు వెళ్లడం, బ్రాండెడ్ ఆభరణాలు కొనుగోలు చేయడం, లగ్జరీ కార్లు, ఎస్‌యూవీలు కొన డం, ఫైవ్‌స్టార్ హోటళ్లలో విందు ఆరగించడం వంటి వాటికి అధిక మొత్తాల్లో ఖర్చు పెట్టడానికి సంపన్నులు సంశయించడం లేదు. యువ జనాభా పెరుగుతుండడం, మిలియనీర్ల సంఖ్య పెరుగుతుండడం, ఉన్నత స్థాయికి ఎదగాలన్న ఆకాంక్షలు అధికం కావడం తదితర కారణాల వల్ల లగ్జరీ మార్కెట్ జోరుగా పెరుగుతోంది.