ఉద్యాన పంటలకు భారీ రాయితీలు
కీసర: తెలంగాణ రాష్ట్రంలో ఉద్యానవన పంటల సాగు కోసం ప్రభుత్వం పెద్ద ఎత్తున్న రాయితీ(సబ్సిడీ)ని అందజేస్తుందని రాష్ట్ర ఉద్యానవన శాఖ కమిషనర్ ఎల్.వెంకట్రామిరెడ్డి అన్నారు. సోమవారం రంగారెడ్డి జిల్లా కీసర మండలంలోని కుందన్‌పల్లి గ్రామ రెవెన్యూ పరిధిలో ఉద్యాన పంటల సాగులో భాగంగా రైతు సత్యనారాయణరెడ్డి కొత్తగా ఏర్పాటు చేసిన పాలీహౌస్ షెడ్‌ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా వెంకట్రామిరెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రభుత్వం అందజేస్తున్న 75 శాతం సబ్సిడీ కింద మొదటి పాలీహౌస్ షెడ్‌ను ఇక్కడ నిర్మించారన్నారు.
గతంలో ఉద్యానవన పంటల సాగుకోసం నిర్మించే షెడ్లకు 50 శాతం మాత్రమే సబ్సిడీ లభించేదన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలో ఉద్యానవన పంటల సాగును పెంచేందుకు గానూ సబ్సిడీని 50 శాతం నుంచి 70 శాతానికి పెంచారన్నారు. రాజధానికి 100 కిలోమీటర్ల వరకు ఉద్యానవన పంటల సాగు ఇటీవల కాలంలోనే విస్తరించడం హర్షనీయమని ఉద్యానవన శాఖ కమిషనర్ ఎల్.వెంకట్రామిరెడ్డి అన్నారు.