నగదు రహిత లావాదేవీలకు ఎం పాస్ మిషన్లు
– ఆంధ్రాబ్యాంకు డీజీఎం వెల్లడి
కర్నూలు (అగ్రికల్చర్): ఆంధ్రాబ్యాంకులో నగదు రహిత లావాదేవీల నిర్వహణకు ఎం పాస్ మిషన్లు వినియోగిస్తున్నట్లు ఆ బ్యాంకు డిప్యూటీ జనరల్ మేనేజర్ గోపాలకృష్ణ తెలిపారు. బుధవారం కర్నూలు నగరంలోని వ్యాపారులకు ఎం పాస్ మిషన్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జోనల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. కర్నూలు రీజియన్‌కు ఎం.పాస్ మిషన్లు 80 వచ్చాయన్నారు. ఒక మిషన్‌కు ఒక కరంట్ ఖాతాతోనే లావాదేవీలు నిర్వహించవచ్చని, అయితే మొబైల్ ఫోన్లను మాత్రం ఒకటి కంటే ఎక్కువగా ఉపయోగించుకోవచ్చని తెలిపారు. డీఆర్డీఏ పీడీ రామకృష్ణ మాట్లాడుతూ.. జిల్లాలో 4.70 లక్షల మంది పొదుపు మహిళలు ఉన్నారని, వీరందరినీ నగదు రహిత లావాదేవీల వైపు మళ్లిస్తున్నామన్నారు. కార్యక్రమంలో ఏజీఎం, మేనేజర్లు బిజిలీ సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు.