పార్లమెంట్‌పై దాడి:100 మందికి గాయాలు
స్కోప్జే: మాసిడోనియన్ పార్లమెంట్ భవనంపై నిరనన కారులు జరిపిన దాడిలో 100 మందికి పైగా గాయాలపాలయ్యారు. పార్లమెంట్ స్పీకర్‌గా ఆల్బేనియన్ జాతీయుడు ఎన్నిక కావటం పట్ల తీవ్రంగా అసంతృప్తి చెందిన కొందరు పెద్ద సంఖ్యలో గురువారం సాయంత్రం పార్లమెంట్ భవనంపైకి తరలివచ్చారు. జాతీయ పతాకాలు చేతబూని, జాతీయ గీతం ఆలపించుకుంటూ పోలీసుల కార్డాన్ ఛేదించుకుని భవనం లోపలికి దూసుకెళ్లారు. చేతికందిన కుర్చీలు, బెంచీలను విరిచిపారేశారు. అడ్డువచ్చిన పోలీసులపైకి దూకారు.
ఈ దాడిలో గాయపడిన దాదాపు 102 మందికి స్థానిక ఆస్పత్రిలో చికిత్స చేసినట్లు వైద్యులు తెలిపారు. కొందరు పార్లమెంట్ సభ్యులు చిరిగిన దుస్తులు, గాయాలతో ప్రాణభయంతో భవనం వెలుపలికి పరుగెత్తుకుంటూ వచ్చారని భద్రతా విభాగం తెలిపింది. పదిమంది వరకు ఎంపీలు, మీడియా సిబ్బంది గాయపడినట్లు ప్రభుత్వం తెలిపింది. ఈ ఘటనను యూరోపియన్ యూనియన్‌తోపాటు అమెరికా కూడా తీవ్రంగా ఖండించింది.