madhu sudhan rao
-
తప్పుడు కేసు పెట్టి వేదనకు గురిచేశారు
హైదరాబాద్ సిటీ: చట్టవిరుద్దంగా తనపై తప్పుడు కేసు నమోదు చేసి తీవ్ర మానసిక వేదనకు గురిచేసిన సీఐ నాగేశ్వర్రావు, ఎస్ఐ మధుసూదన్‌రావులపై చట్టపరమైన చర్యలు చేపట్టాలని కోరుతూ దొండపాడుకు చెందిన విత్తనాల తయారీ నిపుణుడు జీవీ కోటిరెడ్డి లోకాయుక్తను ఆశ్రయించారు. ఈ మేరకు కోటిరెడ్డి లోకాయుక్త జస్టిస్ బి.సుభాషణ్‌రెడ్డిని కలిసి ఫిర్యాదు చేశారు. తాను ఎమ్మెస్సీ (ప్లాంట్ బ్రీడింగ్, జెనెటిక్స్) పూర్తి చేశానని, విత్తన చట్టం ప్రకారం మంచి విత్తనాలు తయారు చేసి విక్రయించేందుకు తమకు అనుమతి ఉందన్నారు. ఇందులో భాగంగా జీవనోపాధి కోసం కర్ణాటకలో ప్లాంట్ ఏర్పాటు చేసుకొని నాణ్యతా ప్రమాణాలతో సబ్సిడీ మిర్చి విత్తనాలను తయారుచేసి రైతులకు విక్రయిస్తుంటానని తెలిపారు. ఈ క్రమంలో 2010 జూన్ 30న మంగళగిరి ప్రాంతానికి చెందిన గుట్ట నరేష్ అనే వ్యక్తి విజ్ఞప్తి మేరకు 20.8 కిలోల మిరప విత్తనాలను విక్రయించానని తెలిపారు. విత్తనాలను తీసుకెళ్తున్న నరేష్‌ను మంగళగిరి సీఐ నాగేశ్వర్రావు, ఎస్ఐ మధుసూదన్‌రావులు తమ బృందంతో అదుపులోకి తీసుకున్నారని చెప్పారు. విత్తనాలు విక్రయించేందుకు తనకు అనుమతి ఉందని చెప్పినా...రూ.లక్ష రూపాయలు ఇస్తేనే కేసు పెట్టకుండా వదిలేస్తామని తనపై ఒత్తిడి తెచ్చారని వాపోయారు. పోలీసుల వేధింపులు భరించలేక రూ.లక్ష ఇచ్చానని, అయినా అక్రమంగా కేసు నమోదు చేసి తనను రిమాండ్‌కు పంపారని ఆవేదన వ్యక్తం చేశారు. సీడ్ చట్టం ప్రకారం వ్యవసాయ శాఖ అధికారులు ఫిర్యాదు చేస్తేనే కేసు నమోదు చేయాలని, పోలీసులు మాత్రం చట్టాలను ఉల్లంఘించి తనపై తప్పుడు కేసు పెట్టారన్నారు. సీఐ, ఎస్ఐ సమక్షంలోనే విత్తనాలను సీజ్ చేశారని, ఈ మేరకు పత్రికల్లో ఫోటోతో వచ్చిన కథనాన్ని ఆయన లోకాయుక్త దృష్టికి తెచ్చారు. సీజ్ చేసిన విత్తనాలు కోర్టుకు సమర్పించకుండా కిలో లక్ష చొప్పున అమ్ముకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తాను నేరం చేశాననేందుకు పోలీసులు ఎటువంటి ఆధారాలు చూపలేకపోవడంతో న్యాయస్థానం ఇటీవల తనపై కేసును కొట్టివేస్తూ నిర్ధోషిగా ప్రకటించిందని తెలిపారు. అయితే విత్తనాలు సీజ్ చేసిన సమయంలో తాను సంఘటనా స్థలంలోలేనని సీఐ తప్పుడు సాక్ష్యం ఇచ్చారన్నారు. న్యాయస్థానంలో తప్పుడు సాక్ష్యం ఇవ్వడంతోపాటు తప్పుడు కేసు నమోదు చేసి జైలుకు పంపడంతోపాటు కోర్టుల చుట్టూ తిరిగేలా చేసి తీవ్రమానసిక వేదనకు గురిచేసిన సీఐ, ఎస్ఐలపై చట్టపరమైన చర్యలు తీసుకొని తనకు న్యాయం చేయాలని వాపోయారు. సీఐ, ఎస్ఐలపై చర్యలు తీసుకోవాలని గుంటూరు జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసిన స్పందన లేదన్నారు. ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన లోకాయుక్త...ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి వచ్చే నెల 14లోగా నివేదిక సమర్పించాలని ఆంధ్రప్రదేశ్ డీజీపీని ఆదేశిస్తూ నోటీసులు జారీచేశారు. -
మీసేవ ద్వారా సబ్సిడీ విత్తనాలు
కలెక్టరేట్, న్యూస్‌లైన్: మీసేవ ద్వారా రబీ సీజన్‌కు సంబంధించి అన్ని రకాల విత్తనాలను రైతులకు అందించనున్నట్లు వ్యవసాయశాఖ కమిషనర్ మధుసూదన్ రావు వెల్లడించారు. బుధవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడారు. ఈ విధానంలో రైతులు పాస్‌బుక్ లు తీసుకెళ్లి మీసేవ కౌంటర్లో విత్తనాలకు సంబంధించి పూర్తి డబ్బులు చెల్లించి, అక్కడ ఇచ్చే రశీదులు తీసుకొచ్చి వ్యవసాయాధికారులకు ఇస్తే విత్తనాలకు అందిస్తారన్నారు. అయితే ఇదివరకు ఉన్న తరహాలో కాకుండా రైతులు ముందుగా విత్తనాలకు సంబంధించిన పూర్తి డబ్బులు చెల్లించాల్సి ఉంటుంద ని, ఆ తర్వాత సబ్సిడీని మూడు రోజుల్లో రైతుల బ్యాంక్ ఖాతాలో జమ చేస్తామని ఆయన వివరించారు. ఈ రబీ సీజన్లో వేరుశనగ, శనగ విత్తనాలు పంపిణీకి సిద్ధంగా ఉన్నాయని, వీటిని మీసేవ ద్వారా రైతులు పొందే సదుపాయాన్ని ఏర్పాటు చేశామన్నారు. ఈ విధానం వల్ల అక్రమాలను అరికట్టడంతో పాటు నేరుగా రైతులు సబ్సిడీ పొందే అవకాశం ఉంటుందన్నారు. మీసేవ ద్వారా పంపిణీపై జిల్లా వ్యాప్తంగా విస్తృతంగా ప్రచారాన్ని నిర్వహించాల్సిందిగా అధికారులను ఆదేశించారు. మరో నెలరోజుల్లో వరి విత్తనాలు వస్తాయని, వాటిని మీసేవ ద్వారానే అందిస్తామని ఆయన తెలిపారు. అనంతరం రబీకి సంబంధించిన ప్రణాళికలు వివరించాల్సిందిగా అధికారులను కోరారు. జేడీఏ కేవీ రామరాజు మాట్లాడుతూ... ఖరీఫ్‌లో ముందస్తు ప్రణాళికలతో 105 శాతాన్ని చేరుకున్నామని వివరించారు. ప్రస్తుతం సీజన్ అధికంగానే ఉన్నా, రైతులకు విత్తనాలు, ఎరువులు అందించడంలో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకున్నామన్నారు. యూరియా 79 వేల మెట్రిక్ టన్నుల కోటా వచ్చిందని, అదేవిధంగా వేరుశనగ 77 వేల మెట్రిక్ టన్నుల కోటా వచ్చిందన్నారు. ఖరీఫ్ తరహాలోనే రబీ సీజన్‌ని అధిగమించేందుకు తగిన చర్యలు తీసుకొంటున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో డీడీ జయచంద్ర, ఏడీ రఘురాములు, తదితరులు పాల్గొన్నారు.