హైదరాబాద్ సిటీ: చట్టవిరుద్దంగా తనపై తప్పుడు కేసు నమోదు చేసి తీవ్ర మానసిక వేదనకు గురిచేసిన సీఐ నాగేశ్వర్‌రావు, ఎస్‌ఐ మధుసూదన్‌రావులపై చట్టపరమైన చర్యలు చేపట్టాలని కోరుతూ దొండపాడుకు చెందిన విత్తనాల తయారీ నిపుణుడు జీవీ కోటిరెడ్డి లోకాయుక్తను ఆశ్రయించారు. ఈ మేరకు కోటిరెడ్డి లోకాయుక్త జస్టిస్ బి.సుభాషణ్‌రెడ్డిని కలిసి ఫిర్యాదు చేశారు. తాను ఎమ్మెస్సీ (ప్లాంట్ బ్రీడింగ్, జెనెటిక్స్) పూర్తి చేశానని, విత్తన చట్టం ప్రకారం మంచి విత్తనాలు తయారు చేసి విక్రయించేందుకు తమకు అనుమతి ఉందన్నారు. ఇందులో భాగంగా జీవనోపాధి కోసం కర్ణాటకలో ప్లాంట్ ఏర్పాటు చేసుకొని నాణ్యతా ప్రమాణాలతో సబ్సిడీ మిర్చి విత్తనాలను తయారుచేసి రైతులకు విక్రయిస్తుంటానని తెలిపారు.
ఈ క్రమంలో 2010 జూన్ 30న మంగళగిరి ప్రాంతానికి చెందిన గుట్ట నరేష్ అనే వ్యక్తి విజ్ఞప్తి మేరకు 20.8 కిలోల మిరప విత్తనాలను విక్రయించానని తెలిపారు. విత్తనాలను తీసుకెళ్తున్న నరేష్‌ను మంగళగిరి సీఐ నాగేశ్వర్‌రావు, ఎస్‌ఐ మధుసూదన్‌రావులు తమ బృందంతో అదుపులోకి తీసుకున్నారని చెప్పారు. విత్తనాలు విక్రయించేందుకు తనకు అనుమతి ఉందని చెప్పినా...రూ.లక్ష రూపాయలు ఇస్తేనే కేసు పెట్టకుండా వదిలేస్తామని తనపై ఒత్తిడి తెచ్చారని వాపోయారు. పోలీసుల వేధింపులు భరించలేక రూ.లక్ష ఇచ్చానని, అయినా అక్రమంగా కేసు నమోదు చేసి తనను రిమాండ్‌కు పంపారని ఆవేదన వ్యక్తం చేశారు. సీడ్ చట్టం ప్రకారం వ్యవసాయ శాఖ అధికారులు ఫిర్యాదు చేస్తేనే కేసు నమోదు చేయాలని, పోలీసులు మాత్రం చట్టాలను ఉల్లంఘించి తనపై తప్పుడు కేసు పెట్టారన్నారు.
సీఐ, ఎస్‌ఐ సమక్షంలోనే విత్తనాలను సీజ్ చేశారని, ఈ మేరకు పత్రికల్లో ఫోటోతో వచ్చిన కథనాన్ని ఆయన లోకాయుక్త దృష్టికి తెచ్చారు. సీజ్ చేసిన విత్తనాలు కోర్టుకు సమర్పించకుండా కిలో లక్ష చొప్పున అమ్ముకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తాను నేరం చేశాననేందుకు పోలీసులు ఎటువంటి ఆధారాలు చూపలేకపోవడంతో న్యాయస్థానం ఇటీవల తనపై కేసును కొట్టివేస్తూ నిర్ధోషిగా ప్రకటించిందని తెలిపారు. అయితే విత్తనాలు సీజ్ చేసిన సమయంలో తాను సంఘటనా స్థలంలోలేనని సీఐ తప్పుడు సాక్ష్యం ఇచ్చారన్నారు.
న్యాయస్థానంలో తప్పుడు సాక్ష్యం ఇవ్వడంతోపాటు తప్పుడు కేసు నమోదు చేసి జైలుకు పంపడంతోపాటు కోర్టుల చుట్టూ తిరిగేలా చేసి తీవ్రమానసిక వేదనకు గురిచేసిన సీఐ, ఎస్‌ఐలపై చట్టపరమైన చర్యలు తీసుకొని తనకు న్యాయం చేయాలని వాపోయారు. సీఐ, ఎస్‌ఐలపై చర్యలు తీసుకోవాలని గుంటూరు జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసిన స్పందన లేదన్నారు. ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన లోకాయుక్త...ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి వచ్చే నెల 14లోగా నివేదిక సమర్పించాలని ఆంధ్రప్రదేశ్ డీజీపీని ఆదేశిస్తూ నోటీసులు జారీచేశారు.
తప్పుడు కేసు పెట్టి వేదనకు గురిచేశారు
Published Tue, Aug 18 2015 8:01 PM | Last Updated on Sat, Aug 11 2018 8:12 PM
Advertisement
Advertisement