పూల్ పార్టీలు.. బర్గర్లతో లొంగదీసుకున్నారు
సాక్షి, న్యూఢిల్లీ: దేశ రాజధానిలో ప్రతిష్టాత్మక విశ్వవిద్యాలయం ఢిల్లీ యూనివర్సిటీకి జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ అనుబంధ సంస్థ ఎన్ఎస్యూఐ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. బీజేపీ విద్యార్థి విభాగం ఏబీవీపీని దారుణంగా మట్టికరిపించి సాధించిన గెలుపుపై కాంగ్రెస్ శ్రేణులు ఇప్పటికీ సంబరాలు చేసుకుంటున్నాయి.
అయితే ఎన్‌ఎస్‌యూఐది నిజమైన గెలుపు కానే కాదని అంటోంది ఏబీవీపీ. తప్పుడు ప్రచారంతో వాళ్లు విజయం సాధించారని ఏబీవీపీ నేత, డీయూఎస్‌యూ కార్యదర్శి మహమేధా నగర్ ఆరోపిస్తున్నారు. ’ పూల్ పార్టీలు, బర్గర్లను విద్యార్థులకు ఆశగా చూపి లొంగదీసుకున్నారు. ప్రలోభాల పర్వంగా సాగిన ఈ ఎన్నికల్లో వారిది నైతిక విజయమే కాదు‘ అని ఓ టీవీ ఛానెల్ చర్చా వేదికలో మహమేధా తెలిపారు.
అయితే ఎన్ఎస్యూఐ మాత్రం ఆ ఆరోపణలను ఖండించింది. విద్యార్థులు ఈసారి రాజకీయాలు కాదు.. మార్పును కోరుకున్నారు. పురోగతి కోసమే తమకు బాధ్యతలు అప్పజెప్పారు ఢిల్లీ యూనివర్సిటీ కొత్త అధ్యకుడు రాఖీ టస్సీడ్ తెలిపారు. ఇక నిరుద్యోగ నిర్మూలనలో కేంద్రప్రభుత్వం విఫలం అయినందుకే ఈ ఫలితం వెలువడిందని ఆప్ చెబుతోంది. అయితే ఎన్నికల్లో ఓట్లు వేసేందుకు విద్యార్థులకు చాలా స్వేచ్ఛ ఉంటుందని, బీజేపీపై వ్యతిరేకత మొదలైందని చెప్పటానికి ఇదొక ఉదాహరణ మాత్రమేనని సీనియర్ పాత్రికేయుడు శేఖర్ గుప్తా అభిప్రాయం వ్యక్తం చేశారు.