పరీక్ష హాల్లో పెన్నులకు బ్లూటూత్‌లు..
ఇద్దరు హైటెక్ కాపీరాయుళ్ల అరెస్టు
మణికొండ,న్యూస్‌లైన్: హైటెక్ పద్ధతిలో కాపీయింగ్‌కు పాల్పడుతూ ఇద్దరు విద్యార్థులు అడ్డంగా దొరికిపోయారు. నార్సింగి సీఐ సంజయ్‌కుమార్ వివరాల ప్రకారం...షాదన్ ఇంజనీరింగ్ కళాశాలకు చెందిన విద్యార్థులు కోకాపేటలోని మహాత్మాగాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో నాలుగురోజులుగా సెమిస్టర్ పరీక్షలు రాస్తున్నారు.
బీటెక్ కంప్యూటర్స్ థర్డియర్ చదువుతున్న డబీర్‌పురాకు చెందిన సయ్యద్ అబ్దుల్ ఖదీర్, ఐటీ థర్డియర్ చదువుతున్న సయ్యద్ ఖాజాలు.. హైటెక్ పద్ధతిలో పెన్నులకు బ్లూటూత్‌లు ఏర్పాటు చేసుకొని బయట మిత్రుల నుంచి చిన్నగా మాట్లాడుతూ సమాధానాలు రాస్తున్నారు. వారిద్దరి పెన్నులకు చిన్నగా లైటు వెలగటాన్ని గమనించిన అధ్యాపకుడు అనుమానంతో సదరు విద్యార్థులను ప్రశ్నించగా కాపీయింగ్ వెలుగులోకి వచ్చింది. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయగా ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. వీరికి సహాయపడేందుకు బయట వేచి ఉన్న వ్యక్తులు మాత్రం పరారయ్యారు. కేసు దర్యాప్తులో ఉంది