యువతలో మార్పు కోసమే ‘నైతిక’
ఆకర్షణకు గురై జీవితాలను ఛిద్రం చేసుకోవద్దు
విలువలకు, జీవిత గమ్యాలకు ప్రాధాన్యమివ్వాలి
అవగాహన సదస్సులో అర్బన్ ఎస్పీ వెంకటేశ్వర్రావు
వరంగల్ చౌరస్తా : చట్టాలను కట్టుదిట్టంగా అమలు చేస్తున్నా.. న్యాయస్థానాలు నేరస్తులకు శిక్షలు విధిస్తున్నా నిత్యం ఏదో ఒక చోట నేరాలు జరుగుతూనే ఉన్నాయని, వాటి మూలాలను గుర్తించి యువతలో మార్పు తీసుకొచ్చేందుకే ‘నైతిక’ కార్యక్రమం చేపట్టినట్లు అర్బన్ జిల్లా ఎస్పీ వెంకటేశ్వర్రావు తెలిపారు. వరంగల్ స్టేషన్ రోడ్డులోని మహేశ్వరీ గార్డెన్స్‌లో శుక్రవారం ‘నైతిక’ పేరిట యువత-వ్యక్తిత్వంపై పోలీస్‌శాఖ ఆధ్వర్యంలో నగరంలోని వివిధ కళాశాలకు చెందిన విద్యార్థినులకు అవగాహన సదస్సు నిర్వహించారు. వరంగల్ డీఎస్పీ హిమవతి అధ్యక్షతన జరిగిన సదస్సుకు ముఖ్యఅతిథిగా విచ్చేసిన అర్బన్ ఎస్పీ వెంకటేశ్వర్రావు జ్యోతి ప్రజ్వలన చేశారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ సమాజంలో నైతిక విలువ లు అంతరించిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. రోజురోజుకు కేసుల సంఖ్య పెరుగుతూనే ఉందన్నారు. అర్బన్ పరిధిలో రోజుకు 100 వరకు ఫిర్యాదులు వస్తే, అందులో 50 కేసులు మహిళల సమస్యలపై ఉంటున్నాయని పేర్కొన్నారు. యువత జీవిత గమ్యాన్ని నిర్ణంచుకునే శక్తి కలిగి ఉండాలన్నారు. అర్బన్ పరిధిలో సదస్సులను విసృ్తతంగా నిర్వహిస్తామని తెలిపారు.
గుర్తింపు కోసం సంఘర్షణ : డాక్టర్ ఎర్ర శ్రీధర్‌రాజు, సైక్రియాట్రిస్ట్
యువతీ, యువకులు గుర్తింపు కోసం సంఘర్షణకు లోనవుతున్నారని నగరానికి చెందిన ప్రముఖ సైక్రియాట్రిస్టు డాక్టర్ ఎర్ర శ్రీధర్ రావు అన్నారు. యువతలో చాలా మంది తమకు గుర్తింపునివ్వడం లేదంటూ తల్లిదండ్రులపై కోపంతో తప్పుడు మార్గాల వైపు పయనిస్తున్నారని చెప్పారు. రోజూ 6 కిలోమీటర్లు జాగింగ్ చేస్తే అరోగ్యంగా ఉంటారని తెలిపారు.
లక్ష్యాల వైపు దృష్టిని మరల్చాలి : బరుపట్ల గోపి, సైక్రియాట్రిస్ట్
యుక్త వయస్సులో ఉన్న యువతీ,యువకులు పాశ్చాత్య పోకడల వైపు కాకుండా లక్ష్యాలను ఎంచుకుని ఉన్నత శిఖిరాలను అధిరోహించాలని కోరారు. రూపం కంటే గుణం మంచిదై ఉండాలని, అందం కంటే జ్ఞానం గొప్పదన్నారు. ఆకర్షణకు లోనై వికర్షణలో పడొద్దన్నారు.
ఆరోగ్య సమస్యలపై అప్రమత్తంగా ఉండాలి : ఐఎంఏ అధ్యక్షురాలు డాక్టర్ సంధ్యారాణి
యుక్త వయస్సులో వచ్చే ఆరోగ్య సమస్యలపై అప్రమత్తంగా ఉండాలని ఐఎంఏ అధ్యక్షురాలు డాక్టర్ సంధ్యారాణి సూచిం చారు. 11 నుంచి 14 ఏళ్ల లోపు రజస్వరాలు కాకపోవడంతో తల్లిదండ్రులు ఆందోళనకు గురవుతున్నారని, 18 వరకు అయ్యే చాన్స్ ఉంటుందన్నారు. ఈ వయసులో వారి ఆరోగ్య సమస్యలపై వైద్యులను సంప్రదిస్తే తగిన సలహాలు, సూచనలు ఇస్తారని తెలిపారు. ఏ సమస్యకైనా పరిష్కార మార్గం ఉందన్నారు.
చట్టం చేయలేని పని, నైతికత చేస్తోంది : ఎండీ.అఫ్జల్,
జిల్లా ఫ్యామిలీ కౌన్సిల్ సభ్యుడు చట్టాలు చేయలేని పనులను నైతికత చేస్తుందని రిటైర్డ్ ఉద్యోగి, జిల్లా ఫ్యామిలీ కౌన్సిల్ సభ్యుడు ఎండీ అఫ్జల్ అన్నారు. యువతకు అధ్యాత్మిక చింతన అవసరమన్నారు. అప్పుడే యువతకు పాపం, పుణ్యం, మోక్షం, మార్గం అంటే తెలుస్తుందన్నారు.
మహిళలు మేల్కొనాలి : డీఎస్పీ హిమవతి
అధునికక సమాజంలో మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని వరంగల్ డీఎస్పీ హిమవతి పిలుపునిచ్చారు. చెడు మార్గాలకు లోనుకాకుండా చదువుల్లో రాణించాలన్నారు. కార్యక్రమంలో డీఎస్పీలు మహేంద్రనాయక్, ప్రభాకర్, సీఐలు ఎస్ఎం అలీ, సతీష్, కృష్ణ, ఎస్సైలు, విద్యార్థినులు పాల్గొన్నారు.