Mahie Gill
-
ఔను.. నాకు మూడేళ్ల కూతురుంది: హీరోయిన్
2008లో వచ్చిన సూపర్‌హిట్ సినిమా ‘దేవ్ డీ’లో హీరోయిన్గా నటించిన మహీ గిల్ గుర్తుందా? ఆ సినిమాతో దేశవ్యాప్తంగా మంచి ప్రతిభ గల నటిగా మహీ పేరు తెచ్చుకున్నారు. తన వ్యక్తిగత జీవితం గురించి ఇప్పటివరకు నోరు మెదపని ఈ అమ్మడు.. తాజాగా పలు ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నారు. తనకు మూడేళ్ల కూతురు ఉందని వెల్లడించారు. తన కూతురి వివరాలు తెలిపారు. నవభారత్ టైమ్స్‌కు ఇంటర్వ్యూ ఇచ్చిన మహీ గిల్.. ‘ఒక బిడ్డగా తల్లిగా ఉండటం ఎంతో గర్వంగా ఉంది. నేను ఇంకా పెళ్లి చేసుకోలేదు. పెళ్లి చేసుకోవాలనిపించినప్పుడు చేసుకుంటాను. ఈ ఏడాది ఆగస్టు నెలకు నా కూతురికి మూడేళ్లు వస్తాయి’ అని తెలిపారు. గతంలో మీకు కూతురు ఉన్న సంగతి ఎందుకు వెల్లడించలేదని ప్రశ్నించగా.. ఆ ప్రశ్న అడగలేదని, అందుకే తాను చెప్పలేదని పేర్కొన్నారు. మరి, పెళ్లి ఎప్పుడు అని ప్రశ్నించగా.. ‘పెళ్లి అవసరం ఏముంది? ఇదంతా మన ఆలోచనాధోరణిపైనే ఆధారపడి ఉంటుంది. పెళ్లి లేకపోయినా.. పిల్లలు, కుటుంబాన్ని కలిగి ఉండవచ్చు. పెళ్లి చేసుకోకుండా పిల్లల్ని కనడంలో ఎలాంటి ఇబ్బంది లేదు. ఇదొక సమస్య అని నేను అనుకోవడం లేదు. ప్రతి ఒక్కరికీ ఒక జీవితం ఉంటుంది. కొన్ని సిద్ధాంతాలు ఉంటాయి. పెళ్లి అనేది అందమైనదే. కానీ పెళ్లి చేసుకోవడమనేది పర్సనల్ చాయిస్’ అని మహీ గిల్ చెప్పుకొచ్చారు. ‘దేవ్ డీ’ సినిమా తర్వాత ‘సాహిబ్ బీవీ ఔర్ గ్యాంగ్‌స్టర్’సిరీస్ సినిమాలతో మహీ గిల్ బాలీవుడ్ ప్రేక్షకులను అలరించారు. -
చేదు అనుభవాల్ని వెల్లడించిన హీరోయిన్
సాక్షి, న్యూఢిల్లీ: బాలీవుడ్లో తన తొలి సినిమా ‘దేవ్ డీ’ తో మంచి మార్కులు కొట్టేసిన మహీ గిల్.. సినిమా రంగంలో దుమారం రేపుతున్న క్యాస్టింగ్ కౌచ్ పై స్పందించారు. సినిమాల్లో అవకాశాల కోసం వెళ్లినప్పుడు నిర్మాతలు, దర్శకులు, హీరోలు... అమ్మాయిలతో వ్యవహరించే తీరును ఆమె ఎండగట్టారు. ఒక జాతీయ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తనకు ఎదురైన చేదు అనుభవాలను మహీ గిల్ వెల్లడించారు. సినిమా ఛాన్సుల కోసం తిరిగే సమయంలో ఒక సినీ నిర్మాత తన పట్ల అనుచితంగా ప్రవర్తించిన తీరును ఆమె గుర్తు చేసుకున్నారు. కెరీర్ ప్రారంభంలో సినిమాలో అవకాశం కోసం ఒక దర్శకుని దగ్గరకు వెళ్లినప్పుడు ‘సల్వార్ కమీజ్ ధరించి ఇలా నిండుగా వస్తే ఎవరూ నీకు అవకాశాలు ఇవ్వర’ని అతను హేళనగా మాట్లాడిన సందర్భాన్ని వివరించారు. మరోసారి ఓ నిర్మాతను సంప్రదించడానికి వెళ్లినప్పుడు ‘నువ్ నైటీలో ఎలా ఉంటావో చూసిన తర్వాతే నీకు సినిమాలో అవకాశం ఇవ్వడం గురించి ఆలోచిస్తాన’ని వెకిలిగా, అసభ్యంగా మాట్లాడిన తీరును వెల్లడించారు. తనకు ఎదురైన చేదు అనుభవాలతో ....క్యాస్టింగ్ కౌచ్ రొంపిలోకి దిగకుండా జాగ్రత్త పడ్డానని తెలిపారు. సమాజంలో ఇలాంటి కామ పిశాచాలకు కొదవ లేదని మండిపడ్డారు. తనతో చెడుగా వ్యవహరించిన ఆ సినీ ప్రముఖుల పేర్లు వెల్లడించలేనని మహీ అన్నారు. కాగా, ‘దేవ్ డీ’ లో తన అద్భుత నటనతో మహీ 2010లో ఉత్తమ నటిగా ఫిల్మ్‌ఫేర్ అవార్డు అందుకున్నారు. స్త్రీలపై కొనసాగుతున్న పురుషాధిక్య సమాజపు ఆగడాలే ఇతివృత్తంగా ‘దేవ్ డీ’ రూపుదిద్దుకుంది. -
అలా జరిగిపోయింది..!
దేవ్ డీ, సాహిబ్ బీవీ ఔర్ గ్యాంగ్‌స్టర్, పాన్‌సింగ్ తొమార్ వంటి చిత్రాల్లో అద్భుతమైన నటనను ప్రదర్శించి, విమర్శకుల ప్రశంసలను అందుకున్న బాలీవుడ్ నటి మహీ గిల్ నిజానికి తాను నటిని అవుతానని ఎప్పుడూ అనుకోలేదట. అసలు నటిని కావాలన్న కోరిక లేకుండానే బాలీవుడ్‌లోకి అడుగుపెట్టడం, సినిమాల్లో నటించడం జరిగిపోయాయట. తొలి సినిమాలో నటించడం నుంచి ఇప్పటిదాకా నటించిన చిత్రాలన్నింటిని తాను ఇక్కడ కెరీర్‌ను నిర్మించుకుందామనే యోచనతో అంగీకరించలదేట. మొదటి సినిమా తర్వాత మరో చిత్రంలో నటించాల్సిందిగా, ఆ తర్వాత ఇంకో సినిమాలో నటించాల్సిందిగా.. ఇలా తనపై సన్నిహితులు, కుటుంబ సభ్యులు, అభిమానులు ఒత్తిడి చేయడంతోనే అంగీకరించడం, ఆ తర్వాత నటించడం జరిగిపోయాయట. అయితే నటించిన అన్ని చిత్రాల్లో తన నటనకు ప్రేక్షకులు మంచి మార్కులు వేయడంతో చాలా సంతోషంగా ఉందని, అందుకు దేవుడికి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నానని ఓ వార్తాసంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పింది. ఎటువంటి అనుభవం లేకుండానే కెమెరా ముందుకు వచ్చే ధైర్యం చేశానని, అదే తెగువతో ఇన్ని సినిమాల్లో నటించానని, చివరిసారిగా ‘గ్యాంగ్ ఆఫ్ ఘోస్ట్’ చిత్రంలో కనిపించానని చెప్పిన ఈ సుందరి ప్రస్తుతం ‘క్యారీ ఆన్ జట్టా 2’లో నటిస్తున్నట్లు చెప్పింది. ప్రత్యేకమైన పాత్రలంటే ఇష్టపడే తనకు అంటువంటి అవకాశాలే వస్తున్నాయని, ప్రతి పాత్రను సవాలుగా తీసుకొని నటించడాన్ని ఎంజాయ్ చేస్తున్నాని చెప్పింది. పరిశ్రమలోకి రాకముందు- వచ్చిన తర్వాత మీలో వచ్చిన మార్పేంటి? అని అడిగిన ప్రశ్నకు మహీ సమాధానమిస్తూ.. చండీగఢ్‌లో ఉన్నప్పుడు తనకు జుట్టు బాగా ఉండేదని, ముంబైకి వచ్చిన తర్వాత కాలుష్యం కారణంగా జుట్టు సన్నబడిందని చెబుతూ నవ్వేసింది.