సాక్షి, న్యూఢిల్లీ: బాలీవుడ్‌లో తన తొలి సినిమా ‘దేవ్ డీ’ తో మంచి మార్కులు కొట్టేసిన మహీ గిల్.. సినిమా రంగంలో దుమారం రేపుతున్న క్యాస్టింగ్ కౌచ్ పై స్పందించారు. సినిమాల్లో అవకాశాల కోసం వెళ్లినప్పుడు నిర్మాతలు, దర్శకులు, హీరోలు... అమ్మాయిలతో వ్యవహరించే తీరును ఆమె ఎండగట్టారు. ఒక జాతీయ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తనకు ఎదురైన చేదు అనుభవాలను మహీ గిల్ వెల్లడించారు.
సినిమా ఛాన్సుల కోసం తిరిగే సమయంలో ఒక సినీ నిర్మాత తన పట్ల అనుచితంగా ప్రవర్తించిన తీరును ఆమె గుర్తు చేసుకున్నారు. కెరీర్ ప్రారంభంలో సినిమాలో అవకాశం కోసం ఒక దర్శకుని దగ్గరకు వెళ్లినప్పుడు ‘సల్వార్ కమీజ్ ధరించి ఇలా నిండుగా వస్తే ఎవరూ నీకు అవకాశాలు ఇవ్వర’ని అతను హేళనగా మాట్లాడిన సందర్భాన్ని వివరించారు. మరోసారి ఓ నిర్మాతను సంప్రదించడానికి వెళ్లినప్పుడు ‘నువ్ నైటీలో ఎలా ఉంటావో చూసిన తర్వాతే నీకు సినిమాలో అవకాశం ఇవ్వడం గురించి ఆలోచిస్తాన’ని వెకిలిగా, అసభ్యంగా మాట్లాడిన తీరును వెల్లడించారు.
తనకు ఎదురైన చేదు అనుభవాలతో ....క్యాస్టింగ్ కౌచ్ రొంపిలోకి దిగకుండా జాగ్రత్త పడ్డానని తెలిపారు. సమాజంలో ఇలాంటి కామ పిశాచాలకు కొదవ లేదని మండిపడ్డారు. తనతో చెడుగా వ్యవహరించిన ఆ సినీ ప్రముఖుల పేర్లు వెల్లడించలేనని మహీ అన్నారు. కాగా, ‘దేవ్ డీ’ లో తన అద్భుత నటనతో మహీ 2010లో ఉత్తమ నటిగా ఫిల్మ్‌ఫేర్ అవార్డు అందుకున్నారు. స్త్రీలపై కొనసాగుతున్న పురుషాధిక్య సమాజపు ఆగడాలే ఇతివృత్తంగా ‘దేవ్ డీ’ రూపుదిద్దుకుంది.
Comments
Please login to add a commentAdd a comment