Dev D
-
వేశ్య అని వేధించేవారు: బాలీవుడ్ నటి
ప్రస్తుతం సమాజంలో జరుగుతున్న సంఘటనలు, వివాదాలపై ఏ మాత్రం జంకకుండా తన అభిప్రాయాలను వెల్లబుచ్చడంలో బాలీవుడ్ నటి కల్కి కొచ్లిన్ ఎప్పుడూ ముందుంటారు. ఫ్రాన్స్‌కు చెందిన కల్కి బాలీవుడ్లో మంచి నటిగా గుర్తింపుపొందారు అంతేకాకుండా ఏ విషయంలోనైనా నిక్కశ్చిగా, ముక్కుసూటిగా మాట్లాడతారు. అయితే తన జీవితంలో ఎదుర్కొన్న కొన్ని అవమాన సంఘటనలు తాజాగా అభిమానులతో పంచుకున్నారు. తొలి చిత్రం ‘దేవ్ డి’తర్వాత ఎన్నో అవమానాలతో పాటు పరోక్షంగా లైంగిక వేధింపులను ఎదుర్కొన్న విషయాన్ని బయటపెట్టారు. ఈ చిత్రంలో వేశ్య పాత్ర పోషించడంతో తనను రష్యన్ వేశ్య అని వేధించేవారని ఆవేదన వ్యక్తం చేశారు. (చదవండి: బిడ్డ సరే... మరి నీ భర్త ఎక్కడ?) ‘దేవ్ డి చిత్రం విడుదలైన తర్వాత ఓ ఆంగ్ల పత్రికలో ఇలాంటి రష్యన్ వేశ్యలను బాలీవుడ్‌కు ఎందుకు తీసుకొస్తారో తెలియదు అని పరోక్షంగా నా గురించి ఓ వార్త రాశారు. ఇది చదివాక నేను చాలా బాధపడ్డాను. అయితే నేను రష్యా నుంచి రాలేదు కదా అనుకున్నా. ఇక 2013లో కల్కి.. రణ్‌బీర్ కపూర్, దీపికా పదుకొణే కలిసి ‘యే జవానీ హై దివానీ’ వంటి సూపర్ హిట్ సినిమాలో నటించినా నాకు సరైన అవకాశాలు రాలేదు. దీంతో కొంత కాలం ఖాళీగా ఉన్నాను. ఈ క్రమంలో ఓ సినిమా నిర్మాత సినిమా అవకాశం ఇస్తానని చెప్పి పరోక్షంగా లైంగికంగా వేధించాడు. ఈ లైంగిక వేధింపులు, అవమానాలు కేవలం బాలీవుడ్లోనే కాదు హాలీవుడ్లో కూడా ఉంటాయి. ఒక సారి హాలీవుడ్లో నటించడానికి వెళితే ఓ వ్యక్తి నా దగ్గరకు వచ్చి నువ్వు రష్యన్ వేశ్య అని అసభ్యకరంగా ప్రవర్తించారు. అంతేకాకుండా ఓ మహిళ నా దగ్గరకు వచ్చి నీ ముఖ్యంపై ముడతలు కనిపించడంలేదు, ఎక్కువగా నవ్వకు, జట్టు పైకి కట్టుకో అంటూ బెదిరించింది. ఇలా అన్ని చోట్లా అవమానాలు, వేధింపులు భరించాను. అంతేకాకుండా నేను పెళ్లికి ముందే ఓ బిడ్డకు జన్మనివ్వబోతుండటంతో అందరూ ఆ బిడ్డకు తండ్రెవరు అంటూ సూటిపోటి మాటలతో ఇబ్బందులకు గురిచేస్తున్నారు. పెళ్లికి ముందే పిల్లల్ని కనడం అంటే ఇప్పటికీ సమాజం ఓ తప్పుగా భావిస్తుంది. నా ఇంట్లోవారికి నా పక్కింటి వారికి నేనుంటున్న కాలనీ మొత్తానికి నాకు పెళ్లి కాలేదని తెలుసు. కానీ వాళ్లెప్పుడూ నన్ను వేలెత్తి ప్రశ్నించింది లేదు. ఇక నేను తల్లిని కాబోతుండటంతో నన్ను సోషల్ మీడియా ట్రోల్ చేస్తున్నారు ఈ ఆలోచనా విధానం మారాలి’అని కల్కి పేర్కొన్నారు. రీసెంట్గా ఈ భామ సైఫ్ అలీ ఖాన్, నవాజుద్దీన్ సిద్దిఖీ నటించిన నెట్‌ఫ్లిక్స్ ‘సేక్రెడ్ గేమ్స్’ లో కనిపించిన విషయం తెలిసిందే. -
చేదు అనుభవాల్ని వెల్లడించిన హీరోయిన్
సాక్షి, న్యూఢిల్లీ: బాలీవుడ్లో తన తొలి సినిమా ‘దేవ్ డీ’ తో మంచి మార్కులు కొట్టేసిన మహీ గిల్.. సినిమా రంగంలో దుమారం రేపుతున్న క్యాస్టింగ్ కౌచ్ పై స్పందించారు. సినిమాల్లో అవకాశాల కోసం వెళ్లినప్పుడు నిర్మాతలు, దర్శకులు, హీరోలు... అమ్మాయిలతో వ్యవహరించే తీరును ఆమె ఎండగట్టారు. ఒక జాతీయ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తనకు ఎదురైన చేదు అనుభవాలను మహీ గిల్ వెల్లడించారు. సినిమా ఛాన్సుల కోసం తిరిగే సమయంలో ఒక సినీ నిర్మాత తన పట్ల అనుచితంగా ప్రవర్తించిన తీరును ఆమె గుర్తు చేసుకున్నారు. కెరీర్ ప్రారంభంలో సినిమాలో అవకాశం కోసం ఒక దర్శకుని దగ్గరకు వెళ్లినప్పుడు ‘సల్వార్ కమీజ్ ధరించి ఇలా నిండుగా వస్తే ఎవరూ నీకు అవకాశాలు ఇవ్వర’ని అతను హేళనగా మాట్లాడిన సందర్భాన్ని వివరించారు. మరోసారి ఓ నిర్మాతను సంప్రదించడానికి వెళ్లినప్పుడు ‘నువ్ నైటీలో ఎలా ఉంటావో చూసిన తర్వాతే నీకు సినిమాలో అవకాశం ఇవ్వడం గురించి ఆలోచిస్తాన’ని వెకిలిగా, అసభ్యంగా మాట్లాడిన తీరును వెల్లడించారు. తనకు ఎదురైన చేదు అనుభవాలతో ....క్యాస్టింగ్ కౌచ్ రొంపిలోకి దిగకుండా జాగ్రత్త పడ్డానని తెలిపారు. సమాజంలో ఇలాంటి కామ పిశాచాలకు కొదవ లేదని మండిపడ్డారు. తనతో చెడుగా వ్యవహరించిన ఆ సినీ ప్రముఖుల పేర్లు వెల్లడించలేనని మహీ అన్నారు. కాగా, ‘దేవ్ డీ’ లో తన అద్భుత నటనతో మహీ 2010లో ఉత్తమ నటిగా ఫిల్మ్‌ఫేర్ అవార్డు అందుకున్నారు. స్త్రీలపై కొనసాగుతున్న పురుషాధిక్య సమాజపు ఆగడాలే ఇతివృత్తంగా ‘దేవ్ డీ’ రూపుదిద్దుకుంది. -
‘దేవ్‌దాస్’ నుంచి ‘దాస్ దేవ్’ వరకు
సాక్షి, న్యూఢిల్లీ : ప్రముఖ బెంగాలీ రచయిత శరత్చంద్ర ఛటోపాధ్యాయ్ వందేళ్ల క్రితం రాసిన ‘దేవదాస్’ నవల ఎన్నో భాషల్లో సినిమా తీయడానికి ఎంతోమంది సినీ నిర్మాతలకు స్ఫూర్తినిచ్చింది. భగ్న ప్రేమికుడిగా మద్యానికి బానిసై చివరకు చావును ఆశ్రయించిన ఓ దేవదాసు విషాధభరిత ప్రేమ కథను వేదాంతం రాఘవయ్య, విజయ నిర్మల తెలుగులో, బిమల్ రాయ్, సంజయ్ లీలా బన్సాలీ, అనురాగ్ కాష్యప్లు హిందీలో, దిలీప్ రాయ్ , చాశి నజ్రుల్ ఇస్లాం, శక్తి సమంత బెంగాలీలో తెరకెక్కించగా పీసీ బార్గువా బెంగాలీలో (1935), హిందీలో (1935), అస్సామీస్లో (1937) తీశారు. అనురాగ్ కాష్యప్ 2009లో ‘దేవ్ డీ’ పేరుతో తీసిన సినిమాలో మినహా అన్ని దేవదాస్ చిత్రాల్లో విషాధాంతమే ఉంటుంది. పిరికితనంతో ప్రేయసిని దూరం చేసుకొని మద్యానికి బానిసై అంతా విధి రాతంటూ తనలో తాను కుమిలిపోతూ స్వీయసానుభూతిని కోరుకుంటూ మత్యువును కౌగిలించుకొని దేవదాసునే వీరంతా ఆవిష్కరించారు. చావు పరిష్కారం కాదంటూ ‘చంద్రముఖి’తో దేవదాస్‌కు కొత్త జీవితాన్ని ప్రసాదిస్తారు అనురాగ్ కాష్యప్ తన దేవ్ డీలో. ఇప్పుడు దేవదాస్‌ను మరో రకంగా చూపించేందుకు ముందుకు వచ్చారు ప్రముఖ హిందీ దర్శకుడు సుధీర్ మిశ్రా. ఆయన దేవదాస్ పాత్రను తనదైన శైలిలో వెనక నుంచి ముందుకు నడిపించారు. అంటే భగ్న ప్రేమికుడై మద్యం మత్తులో మునిగితేలుతున్న దేవదాస్ ఉత్తరప్రదేశ్ రాజకీయాలకు విచలితుడై రాజకీయ నాయకుడిగా ఎదగడాన్ని ఈ సినిమాలో చూపిస్తారు. అందుకనే దర్శకుడు ఈ సినిమాకు ‘దాస్ దేవ్’గా టైటిల్ పెట్టారు. రాహుల్ భట్, అదిత్ రావ్ హైదరి హీరోహోరోయిన్లుగా నటించిన ఈ సినిమా ఈ నెల 23వ తేదీన దేశవ్యాప్తంగా విడుదలవుతోంది. దేవదాస్ నవలకు సుధీర్ మిశ్రా చెప్పిన సరికొత్త భాష్యానికి, చిత్రంలోని పాటలకు ఏకంగా ఐదుగురు సంగీత దర్శకులు సంగీతాన్ని సమకూర్చారు. పీసీ బారువా నుంచి నేటి సుధీర్ మిశ్రా వరకు తీసిన అన్ని దేవదాస్ చిత్రాల్లో సినిమా దర్శకుడి తాత్వికతను ప్రతిబింబించే పాటలు ఒకటి, రెండైనా ఉన్నాయి. దాస్ దేవ్ సినిమాలో డాక్టర్ సాగర్ రాసిన అలాంటి పాట ‘సెహ్మీ హై దడ్కన్’ విపిన్ పట్వా సంగీతం సమకూర్చగా, ఆతిమ్ అస్లాం పాడారు. పీసీ బారువా 1935లో హిందీలో తీసిన దేవదాస్ చిత్రంలో ‘చూటీ ఆసీర్ తో’ కూడా అలాంటి పాటే. కేదార్నాథ్ శర్మ రాసిన ఈ పాటకు తిమిర్ బారన్ సంగీతం సమకూర్చగా పహాడి సన్యాల్ పాడారు. ఈ చిత్రంలో దేవదాస్‌గా కేఎల్ సైగల్, పార్వతిగా జమున నటించారు. వేదాంతం రాఘవయ్య 1953లో తెలుగులో తీసిన ‘దేవదాసు’లో కుడి ఎడమైతే పొరపాటు లేదోయ్’ అనే పాటను సీఆర్ సుబ్బరామన్ రాయగా, ఘంటసాల వేంకటేశ్వరరావు పాడారు. ఈ చిత్రంలో అక్కినేని నాగేశ్వరరావు, సావిత్రి నటించిన విషయం తెల్సిందే. 1955లో బిమల్ రాయ్ తీసిన హిందీ దేవదాస్‌లో ‘జైసే తూ ఖుబూల్ కర్లే’ పాటను సాహిర్ లుథియాన్వీ రాయగా, ఎస్డీ బర్మన్ సంగీత దర్శకత్వంలో లతా మంగేష్కర్ పాడారు. ఈ చిత్రంలో దేవదాస్‌గా దిలీప్ కుమార్, పార్వతిగా సుచిత్రసేన్ నటించారు. సంజయ్ లీలా బన్సాలీ 2002లో తీసిన దేవ్‌దాస్‌లో దేవదాస్ ఉడుకుతనం, కోపం వ్యక్తం వెనక దాగున్న ఆప్యాయత పట్ల పార్వతి కరుణ రసం చూపే ‘బయిరీ పియా’ పాటను నస్రత్ బదర్ రాయగా శ్రేయా గోషాల్, ఉదిత్ నారాయణ్ పాడారు. ఇస్మాయిల్ దర్బార్ సంగీతం సమకూర్చారు. ఈ చిత్రంలో షారూక్ ఖాన్, ఐశ్యర్యరాయ్లు నటించారు. ఇక అనురాగ్ కాష్యప్ తీసిన దేవ్ డీ చిత్రంలో దేవదాస్ ఎంతదూరం పరుగెత్తినా ఏదో ఒక రాజు వెనక్కి రావాల్సిందే సమస్యలను ఎదుర్కోవాల్సిందే అన్న భావంతో సాగే ‘దునియా’ పాటను షెల్లీ రాయగా, స్వీయ సంగీత దర్శకత్వంలో అమిత్ త్రివేది పాడారు. చిత్రంలో హీరోహీరోయిన్లుగా అభయ్ డియోల్, మహీ గిల్ నటించారు. ఇప్పుడు దాస్ దేవ్‌కు దర్శకత్వం వహించిన సుధీర్ మిశ్రా ఉత్తమ చిత్ర దర్శకుడిగా జాతీయ అవార్డును అందుకున్నారు. ఆయన హిందీలో తీసిన ‘హజారో క్వాయిష్ ఐసీ, ధారవి, చమేలి’ చిత్రాలు ప్రేక్షకులు, విశ్లేషకుల ప్రశంసలు అందుకున్నారు. ఆయన గతంలో కుందన్ షా దర్శకత్వంలో వచ్చిన ‘జానే భీ దో యారో’, విధు వినోద్ చోప్రా దర్శకత్వంలో వచ్చిన ‘కామోష్’ చిత్రాలకు సహాయక దర్శకులుగా పనిచేశారు. -
అలా జరిగిపోయింది..!
దేవ్ డీ, సాహిబ్ బీవీ ఔర్ గ్యాంగ్‌స్టర్, పాన్‌సింగ్ తొమార్ వంటి చిత్రాల్లో అద్భుతమైన నటనను ప్రదర్శించి, విమర్శకుల ప్రశంసలను అందుకున్న బాలీవుడ్ నటి మహీ గిల్ నిజానికి తాను నటిని అవుతానని ఎప్పుడూ అనుకోలేదట. అసలు నటిని కావాలన్న కోరిక లేకుండానే బాలీవుడ్‌లోకి అడుగుపెట్టడం, సినిమాల్లో నటించడం జరిగిపోయాయట. తొలి సినిమాలో నటించడం నుంచి ఇప్పటిదాకా నటించిన చిత్రాలన్నింటిని తాను ఇక్కడ కెరీర్‌ను నిర్మించుకుందామనే యోచనతో అంగీకరించలదేట. మొదటి సినిమా తర్వాత మరో చిత్రంలో నటించాల్సిందిగా, ఆ తర్వాత ఇంకో సినిమాలో నటించాల్సిందిగా.. ఇలా తనపై సన్నిహితులు, కుటుంబ సభ్యులు, అభిమానులు ఒత్తిడి చేయడంతోనే అంగీకరించడం, ఆ తర్వాత నటించడం జరిగిపోయాయట. అయితే నటించిన అన్ని చిత్రాల్లో తన నటనకు ప్రేక్షకులు మంచి మార్కులు వేయడంతో చాలా సంతోషంగా ఉందని, అందుకు దేవుడికి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నానని ఓ వార్తాసంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పింది. ఎటువంటి అనుభవం లేకుండానే కెమెరా ముందుకు వచ్చే ధైర్యం చేశానని, అదే తెగువతో ఇన్ని సినిమాల్లో నటించానని, చివరిసారిగా ‘గ్యాంగ్ ఆఫ్ ఘోస్ట్’ చిత్రంలో కనిపించానని చెప్పిన ఈ సుందరి ప్రస్తుతం ‘క్యారీ ఆన్ జట్టా 2’లో నటిస్తున్నట్లు చెప్పింది. ప్రత్యేకమైన పాత్రలంటే ఇష్టపడే తనకు అంటువంటి అవకాశాలే వస్తున్నాయని, ప్రతి పాత్రను సవాలుగా తీసుకొని నటించడాన్ని ఎంజాయ్ చేస్తున్నాని చెప్పింది. పరిశ్రమలోకి రాకముందు- వచ్చిన తర్వాత మీలో వచ్చిన మార్పేంటి? అని అడిగిన ప్రశ్నకు మహీ సమాధానమిస్తూ.. చండీగఢ్‌లో ఉన్నప్పుడు తనకు జుట్టు బాగా ఉండేదని, ముంబైకి వచ్చిన తర్వాత కాలుష్యం కారణంగా జుట్టు సన్నబడిందని చెబుతూ నవ్వేసింది.