సాక్షి, న్యూఢిల్లీ : ప్రముఖ బెంగాలీ రచయిత శరత్‌చంద్ర ఛటోపాధ్యాయ్ వందేళ్ల క్రితం రాసిన ‘దేవదాస్’ నవల ఎన్నో భాషల్లో సినిమా తీయడానికి ఎంతోమంది సినీ నిర్మాతలకు స్ఫూర్తినిచ్చింది. భగ్న ప్రేమికుడిగా మద్యానికి బానిసై చివరకు చావును ఆశ్రయించిన ఓ దేవదాసు విషాధభరిత ప్రేమ కథను వేదాంతం రాఘవయ్య, విజయ నిర్మల తెలుగులో, బిమల్ రాయ్, సంజయ్ లీలా బన్సాలీ, అనురాగ్ కాష్యప్‌లు హిందీలో, దిలీప్ రాయ్ , చాశి నజ్రుల్ ఇస్లాం, శక్తి సమంత బెంగాలీలో తెరకెక్కించగా పీసీ బార్గువా బెంగాలీలో (1935), హిందీలో (1935), అస్సామీస్‌లో (1937) తీశారు.
అనురాగ్ కాష్యప్ 2009లో ‘దేవ్ డీ’ పేరుతో తీసిన సినిమాలో మినహా అన్ని దేవదాస్ చిత్రాల్లో విషాధాంతమే ఉంటుంది. పిరికితనంతో ప్రేయసిని దూరం చేసుకొని మద్యానికి బానిసై అంతా విధి రాతంటూ తనలో తాను కుమిలిపోతూ స్వీయసానుభూతిని కోరుకుంటూ మత్యువును కౌగిలించుకొని దేవదాసునే వీరంతా ఆవిష్కరించారు. చావు పరిష్కారం కాదంటూ ‘చంద్రముఖి’తో దేవదాస్‌కు కొత్త జీవితాన్ని ప్రసాదిస్తారు అనురాగ్ కాష్యప్ తన దేవ్ డీలో. ఇప్పుడు దేవదాస్‌ను మరో రకంగా చూపించేందుకు ముందుకు వచ్చారు ప్రముఖ హిందీ దర్శకుడు సుధీర్ మిశ్రా. ఆయన దేవదాస్ పాత్రను తనదైన శైలిలో వెనక నుంచి ముందుకు నడిపించారు. అంటే భగ్న ప్రేమికుడై మద్యం మత్తులో మునిగితేలుతున్న దేవదాస్ ఉత్తరప్రదేశ్ రాజకీయాలకు విచలితుడై రాజకీయ నాయకుడిగా ఎదగడాన్ని ఈ సినిమాలో చూపిస్తారు.
అందుకనే దర్శకుడు ఈ సినిమాకు ‘దాస్ దేవ్’గా టైటిల్ పెట్టారు. రాహుల్ భట్, అదిత్ రావ్ హైదరి హీరోహోరోయిన్లుగా నటించిన ఈ సినిమా ఈ నెల 23వ తేదీన దేశవ్యాప్తంగా విడుదలవుతోంది. దేవదాస్ నవలకు సుధీర్ మిశ్రా చెప్పిన సరికొత్త భాష్యానికి, చిత్రంలోని పాటలకు ఏకంగా ఐదుగురు సంగీత దర్శకులు సంగీతాన్ని సమకూర్చారు. పీసీ బారువా నుంచి నేటి సుధీర్ మిశ్రా వరకు తీసిన అన్ని దేవదాస్ చిత్రాల్లో సినిమా దర్శకుడి తాత్వికతను ప్రతిబింబించే పాటలు ఒకటి, రెండైనా ఉన్నాయి. దాస్ దేవ్ సినిమాలో డాక్టర్ సాగర్ రాసిన అలాంటి పాట ‘సెహ్‌మీ హై దడ్కన్’ విపిన్ పట్వా సంగీతం సమకూర్చగా, ఆతిమ్ అస్లాం పాడారు.
పీసీ బారువా 1935లో హిందీలో తీసిన దేవదాస్ చిత్రంలో ‘చూటీ ఆసీర్ తో’ కూడా అలాంటి పాటే. కేదార్‌నాథ్ శర్మ రాసిన ఈ పాటకు తిమిర్ బారన్ సంగీతం సమకూర్చగా పహాడి సన్యాల్ పాడారు. ఈ చిత్రంలో దేవదాస్‌గా కేఎల్ సైగల్, పార్వతిగా జమున నటించారు. వేదాంతం రాఘవయ్య 1953లో తెలుగులో తీసిన ‘దేవదాసు’లో కుడి ఎడమైతే పొరపాటు లేదోయ్’ అనే పాటను సీఆర్ సుబ్బరామన్ రాయగా, ఘంటసాల వేంకటేశ్వరరావు పాడారు. ఈ చిత్రంలో అక్కినేని నాగేశ్వరరావు, సావిత్రి నటించిన విషయం తెల్సిందే. 1955లో బిమల్ రాయ్ తీసిన హిందీ దేవదాస్‌లో ‘జైసే తూ ఖుబూల్ కర్లే’ పాటను సాహిర్ లుథియాన్వీ రాయగా, ఎస్డీ బర్మన్ సంగీత దర్శకత్వంలో లతా మంగేష్కర్ పాడారు. ఈ చిత్రంలో దేవదాస్‌గా దిలీప్ కుమార్, పార్వతిగా సుచిత్రసేన్ నటించారు.
సంజయ్ లీలా బన్సాలీ 2002లో తీసిన దేవ్‌దాస్‌లో దేవదాస్ ఉడుకుతనం, కోపం వ్యక్తం వెనక దాగున్న ఆప్యాయత పట్ల పార్వతి కరుణ రసం చూపే ‘బయిరీ పియా’ పాటను నస్రత్ బదర్ రాయగా శ్రేయా గోషాల్, ఉదిత్ నారాయణ్ పాడారు. ఇస్మాయిల్ దర్బార్ సంగీతం సమకూర్చారు. ఈ చిత్రంలో షారూక్ ఖాన్, ఐశ్యర్యరాయ్‌లు నటించారు. ఇక అనురాగ్ కాష్యప్ తీసిన దేవ్ డీ చిత్రంలో దేవదాస్ ఎంతదూరం పరుగెత్తినా ఏదో ఒక రాజు వెనక్కి రావాల్సిందే సమస్యలను ఎదుర్కోవాల్సిందే అన్న భావంతో సాగే ‘దునియా’ పాటను షెల్లీ రాయగా, స్వీయ సంగీత దర్శకత్వంలో అమిత్ త్రివేది పాడారు. చిత్రంలో హీరోహీరోయిన్లుగా అభయ్ డియోల్, మహీ గిల్ నటించారు.
ఇప్పుడు దాస్ దేవ్‌కు దర్శకత్వం వహించిన సుధీర్ మిశ్రా ఉత్తమ చిత్ర దర్శకుడిగా జాతీయ అవార్డును అందుకున్నారు. ఆయన హిందీలో తీసిన ‘హజారో క్వాయిష్ ఐసీ, ధారవి, చమేలి’ చిత్రాలు ప్రేక్షకులు, విశ్లేషకుల ప్రశంసలు అందుకున్నారు. ఆయన గతంలో కుందన్ షా దర్శకత్వంలో వచ్చిన ‘జానే భీ దో యారో’, విధు వినోద్ చోప్రా దర్శకత్వంలో వచ్చిన ‘కామోష్’ చిత్రాలకు సహాయక దర్శకులుగా పనిచేశారు.
Comments
Please login to add a commentAdd a comment