మరో షాక్.. ట్రంప్‌కు మూసుకుపోతున్న దారులు
అగస్టా: అగ్రరాజ్య అధ్యక్షుడిగా వైట్‌హౌజ్‌కు రెండోసారి చేరుకునే క్రమంలో డొనాల్డ్ ట్రంప్‌కు దారులు ఒక్కొక్కటిగా మూసుకుపోతున్నాయి. రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థిత్వానికి పోటీ చేసేందుకు ఆయన అనర్హుడంటూ కొలరాడో న్యాయస్థానం ప్రకటించిన పట్టుమని పదిరోజుల గడవక ముందే.. మరో రాష్ట్రం షాక్ ఇచ్చింది. ట్రంప్ పోటీకి అనర్హుడంటూ మైనే(Maine) స్టేట్ గురువారం ప్రకటించింది.
అమెరికా చట్టసభ క్యాపిటల్(US Capitol Hill)పై 2021, జనవరి 6వ తేదీన ట్రంప్ మద్దతుదారులు దాడి చేశారు. అయితే ఆ దాడికి అప్పటి దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంపే ప్రధాన కారణమని ఆరోపణలు వెల్లువెత్తుతున్న సంగతీ తెలిసిందే. దీంతో.. వచ్చే ఏడాది జరగబోయే అధ్యక్ష ఎన్నిక మైనే స్టేట్ తరఫున పోటీ చేసేందుకు ట్రంప్ అనర్హుడంటూ అక్కడి ఎన్నికల విభాగం నిర్ణయించింది. దీంతో.. మైనే రాష్ట్ర కార్యదర్శి షెన్నా బెల్లోస్ గురువారం ప్రకటన చేశారు.
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 2024 అధ్యక్ష ఎన్నికలకు సంబంధించి.. రిపబ్లికన్ పార్టీ తరఫున నామినేషన్లో ముందంజలో ఉన్నారు. కానీ 2020 ఎన్నికలకు సంబంధించి తప్పుడు ప్రచారంతో ఆయన తిరుగుబాటును ప్రేరేపించారు. క్యాపిటల్‌పైకి కవాతు చేయాలని ట్రంప్ తన మద్దతుదారులను కోరారు అని షెన్నా బెల్లోస్ పేర్కొన్నారు.
ఇక.. రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థిత్వానికి పోటీ చేసేందుకు ఆయన అనర్హుడంటూ కొలరాడో కోర్టు ప్రకటించింది. ఈ మేరకు ఆ రాష్ట్ర రిపబ్లికన్ ప్రైమరీ ఎన్నికల్లో పోటీ చేయకుండా ఆయనపై అనర్హత వేటు వేసిన సంగతి తెలిసిందే. క్యాపిటల్ భవనంపై దాడికి సంబంధించిన కేసులోనే కోర్టు ఈ మేరకు సంచలన తీర్పు వెలువరించింది. అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్న నేతపై ఇలా అనర్హత పడటం అమెరికా చరిత్రలో ఇదే తొలిసారి కావడం గమనార్హం.
ప్రభుత్వానికి వ్యతిరేకంగా ట్రంప్ హింసను ప్రేరేపించారనడానికి బలమైన సాక్ష్యాలున్నాయని కోర్టు తీర్పు సందర్భంగా వ్యాఖ్యానించింది. అమెరికా రాజ్యాంగంలోని 14వ సవరణ సెక్షన్ 3 నిబంధన ప్రకారం.. ఆయన ప్రైమరీ ఎన్నికల్లో పోటీకి అనర్హుడని తేల్చింది. అయితే దీనిపై యూఎస్ సుప్రీంకోర్టులో అప్పీల్ చేసుకునేందుకు ట్రంప్‌నకు అవకాశం కల్పించింది. అందుకోసం వచ్చే ఏడాది జనవరి 4వ తేదీ వరకు ఈ ఉత్తర్వుల అమలును నిలిపివేస్తున్నట్లు తెలిపింది. దీంతో ట్రంప్ భవితవ్యాన్ని అమెరికా సుప్రీంకోర్టు తేల్చనుంది.
తాజా పరిణామాలతో (సర్వోన్నత న్యాయస్థానంలో ఊరట లభిస్తే తప్ప).. రిపబ్లికన్ పార్టీ తరఫున అధ్యక్ష అభ్యర్థిత్వానికి కొలరాడో, మైనే స్టేట్ జరిగే ఎన్నికల్లో అభ్యర్థుల జాబితా నుంచి ట్రంప్ పేరును తొలగించాల్సి ఉంటుంది. వచ్చే ఏడాది మార్చి 5న అక్కడ జరిగే రిపబ్లికన్ పార్టీ ప్రైమరీ ఎన్నికలు.. నవంబరు 5న జరగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి.