లంచం ఇవ్వలేదని.. నదిలోకి తోసేశారు
మెయిన్ పూరి: లంచం ఇవ్వలేదనే కోపంతో ఇద్దరు వ్యక్తులను చితక్కొట్టిన పోలీసులు వారిని నదిలో పడేసి చంపిన దారుణ సంఘటన ఉత్తరప్రదేశ్ లోని మెయిన్ పూరిలో శుక్రవారం చోటు చేసుకుంది. ములాయం సింగ్ యాదవ్ వర్గానికి చెందిన ఇద్దరు వ్యక్తులు ట్రాక్టర్ లో రాళ్లను పట్టణానికి తీసుకెళ్తున్నారు. చెకింగ్ పేరుతో వీరిని అడ్డగించిన పోలీసులు రూ.1,200 లంచం ఇవ్వాలని డిమాండ్ చేశారు. లంచం ఇవ్వడానికి ఇద్దరూ నిరాకరించడంతో వారిని చితక్కొట్టారు.
ఆ తర్వాత వారిద్దరినీ నదిలోకి తోసేసినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. సంఘటనపై స్పందించిన పోలీసులు ఇద్దరు వ్యక్తులు తప్పించుకు పారిపోతూ జారి నదిలో పడినట్లు చెప్పారు. మరణించిన ఇద్దరు వ్యక్తులను దిలీప్ యాదవ్(22), పంకజ్ యాదవ్(24)లుగా గుర్తించారు.
ట్రాక్టర్ ను ఆపి లంచం డిమాండ్ చేసిన పోస్ట్ ఇన్ చార్జ్, ఇద్దరు కానిస్టేబుళ్లు, ఇద్దరు హోమ్ గార్డులపై హత్య నేరం కింద కేసు నమోదయింది. ఘటనపై స్పందించిన బీజేపీ సీఎం అఖిలేశ్ యాదవ్ రాష్ట్రంలో శాంతిభద్రతలు నెలకొల్పడంలో విఫలమయ్యారని విమర్శించింది. చనిపోయన వారి కుటుంబసభ్యులు సీఎం అఖిలేశ్ యాదవ్ తమ కుటుంబాలను కలవాలని డిమాండ్ చేశారు.