make a wish
-
ఆసీస్ జట్టులో ఏడేళ్ల కుర్రాడు!
మెల్బోర్న్: మరో రెండు రోజుల్లో ప్రారంభం కానున్న ‘బాక్సింగ్ డే’ టెస్టుకు ముందు క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) ఓ భావోద్వేగ నిర్ణయం తీసుకుంది. ఈ మ్యాచ్ కోసం ఆసీస్ జట్టులో 7 ఏళ్ల చిన్నారిని ఎంపిక చేసింది. 15 మంది సభ్యుల జట్టులో అతడికి చోటు కల్పించడంతో పాటు కో–కెప్టెన్‌గా కూడా నియమించింది. హృద్రోగంతో బాధపడుతున్న ఆర్కీ షిల్లర్ అనే చిన్నారి కోరిక తీర్చేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సీఏ ప్రకటించింది. గుండె నరాలకు సంబంధించిన వ్యాధితో బాధపడుతున్న అతనికి ఏడో పుట్టిన రోజు సందర్భంగా ‘మేక్ ఏ విష్’ ఆస్ట్రేలియా ఫౌండేషన్ ద్వారా మరపురాని బహుమతినిచ్చింది. ఆసీస్ క్రికెట్ జట్టు కెప్టెన్‌గా ఎదగాలని కలలు కన్న ఆ చిన్నారి ఆశలను ఈ రకంగా పూర్తి చేసింది. ఆదివారం ఆసీస్ జట్టు ప్రాక్టీస్ సెషన్లో కూడా ఆర్కీ పాల్గొనడం విశేషం. -
శశాంక్.. 12 ఏళ్లకే ఎస్ఐ
12 ఏళ్ల బాలుడు శశాంక్ సబ్ ఇన్స్పెక్టర్ అయ్యాడు. అక్రమ మద్యం, నేరాలను నిరోధించాలని కానిస్టేబుళ్లకు కఠిన ఆదేశాలు ఇచ్చాడు. అలాగే సార్.. అని వారుఅణకువతో సెల్యూట్ కొట్టారు. ఆనందంతో చిన్నారి తల్లి కంట కన్నీరు ఆగలేదు. బనశంకరి: నయం కాని జబ్బులతో బాధపడుతున్న శశాంక్ అనే బుడతని ఆకాంక్షను పోలీసులు పెద్దమనసుతో తీర్చారు. బెంగళూరు విశ్వేశ్వరపురం పోలీస్‌స్టేషన్‌లో ఒక్కరోజు ఎస్ఐ అయ్యారు. వివరాలు.... చింతామణి నారాయణహళ్లి గ్రామానికి చెందిన మునిరాజ్, సుజాత దంపతుల కుమారుడు శశాంక్ ప్రభుత్వ పాఠశాలలో 7 తరగతి చదువుతున్నాడు. అతడు 5 నెలల పసికందుగా ఉన్న సమయంలోనే తలస్సేమియా జబ్బు తలెత్తింది. రెండేళ్ల నుంచి మధుమేహం కూడా పీడిస్తోంది. రెండు జబ్బులతో నగరంలోని వాణివిలాస్ ఆసుపత్రిలోని చికిత్స పొందుతున్నాడు. శశాంక్‌కు బాగా చదివి పోలీసు కావాలనే కోరిక ఉంది. కానీ అనారోగ్యంతో చదువు సాగడం లేదు. కోరిక తీరిందిలా బాలుని ఆశను మేక్ ఏ విష్ పౌండేషన్, వాణివిలాస్ ఆసుపత్రి ప్రతినిధులు నేరవేర్చాలని తీర్మానించారు. మంగళవారం విశ్వేశ్వరపురం పోలీస్‌స్టేషన్ ఎస్ఐ అయ్యే అవకాశం కల్పించారు. ఆ పోలీస్‌స్టేషన్ ఎస్ఐ రాజు మంగళవారం ఉదయం 9.30 గంటలకు బాలుడు శశాంక్‌కు ఎస్ఐగా అధికార బాధ్యతలు అప్పగించారు. పోలీస్ యూనిఫాంలో వచ్చిన శశాంక్‌కు పోలీస్‌స్టేషన్ సిబ్బంది ఘన స్వాగతం పలికారు. బాధ్యతలు చేపట్టగానే అన్ని కేసుల వివరాలను ఎస్ఐ శశాంక్ పరిశీలించారు. ఫైళ్లను చూసి పెండింగ్ కేసుల గురించి ఆరా తీశారు. పోలీస్‌స్టేషన్‌కు కొత్త ఎస్ఐ వచ్చినప్పుడు ఎలాంటి లాంఛనాలు పాటిస్తారో వాటన్నిం టినీ అధికారులు నెరవేర్చారు. డీసీపీశరణప్ప ఈకార్యక్రమాన్ని పర్యవేక్షించారు. పోలీస్ యూనిఫారంలో తన కుమారుడిని చూసి తల్లికి ఆనందభాష్పాలు వెల్లువెత్తాయి. అక్కడున్న అందరికీ కళ్లు చెమర్చాయి. సంతోషంగా ఉంది: శశాంక్ సంపూర్ణ మద్య నిషేధం చేయాలని, మందుబాబులను సన్మార్గంలోకి తీసుకువచ్చి ఉత్తమ సమాజ నిర్మాణానికి కృషిచేయాలని ఎస్ఐ శశాంక్ చెప్పారు. ఎంతో సంతోషంగా ఉందని, పోలీస్ కావాలనే చిరకాల కోరిక నేరవేరిందని అన్నారు. తన కుమారుడికి బాగా చదివేవాడని, దురదృష్టవశాత్తూ తలస్సేమియా, మధుమేహం బారినపడ్డాడని తల్లి సుజాతచెప్పారు. అతడి ఆశలను ఆసుపత్రి సిబ్బంది, పోలీసులు తీర్చారని చెప్పారు. నగర పోలీస్ కమిషనర్ సునీల్‌కుమార్, దక్షిణ విభాగ డీసీపీ శరణప్పలకు కృతజ్ఞతలు తెలిపారు. సాయంత్రం పోలీసు వాహనంలో ఆస్పత్రికి పంపించారు. -
వన్ డే సీపీ ఇషాన్
‘సమయం మధ్యాహ్నం మూడు గంటలు. గచ్చిబౌలిలోని రాచకొండ పోలీసు కమిషనరేట్ కార్యాలయంలో సందడి నెలకొంది. రాచకొండ పోలీసు కమిషనర్ మహేశ్ భగవత్‌తో పాటు ఇతర పోలీసు ఉన్నతాధికారులు, సిబ్బంది ప్రవేశద్వారం వద్ద కోలాహలం కనిపించింది. అంతలోనే పోలీసు కమిషనర్ కారులో సీపీ డ్రెస్‌లో ఉన్న ఓ బాలుడు దిగాడు. మహేశ్ భగవత్ పుష్పగుచ్ఛం ఇచ్చి అతనికి స్వాగతం పలికారు. ఆరుగురు సాయుధ పోలీసులు ఆయుధాలతో గౌరవ వందనం చేశారు.భగవత్ ఆ చిన్నారిని మూడో అంతస్తులోని తన చాంబర్‌కు తీసుకెళ్లి అక్కడున్న ఆయన సీటులో కూర్చొబెట్టాడు. అతను నవ్వుతూ తన చేతిలోని కమిషనర్ కర్రను తిప్పుతూ అందరినీ చూస్తూ ఉండిపోయాడు’. ఏంటీ ఇదంతా చూస్తుంటే రాచకొండ పోలీసు కమిషనర్‌గా కొత్తగా వచ్చిన వ్యక్తికి మహేశ్ భగవత్ బాధ్యతలు అప్పగిస్తున్నట్టు అనిపిస్తుందా.. అయితే చదవండి. సాక్షి, సిటీబ్యూరో/రాయదుర్గం: విషయమేమిటంటే బ్లడ్ క్యాన్సర్‌తో బాధపడుతూ నగరంలోని ఎంఎన్‌జే క్యాన్సర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మెదక్ జిల్లా, కూచన్‌పల్లికి చెందిన ఆరేళ్ల బాలుడు దూదేకుల ఇషాన్. తన కోరికను నెరవేర్చేందుకు మహేష్ భగవత్ ‘వన్ డే పోలీసు కమిషనర్’గా అవకాశం కల్పించారు. పోలీసు ఆఫీసర్ కావాలన్న అతడి కోరికను మేక్ ఏ విష్ ఫౌండేషన్ సభ్యులు శశిచంద్ర, ప్రియాజోషి సీపీ దృష్టికి తీసుకెళ్లడంతో ఆయన అంగీకరించారు. ఈ సందర్భంగా ఆయన ఆ కుర్రాడి మోములో ఆనందం చూశారు. ఒకరోజు రాచకొండ కమిషనర్‌గా ఎలా అనిపిస్తుందని మీడియా ఇషాన్‌ను ప్రశ్నించగా ‘భహుత్ కుష్ హూ’ అని నవ్వుతూ తెలిపాడు. అందరితో కరచలనం చేస్తూ ఎంతో సంతోషంగా చేతిలోని కర్రను తిప్పుతున్న దృశ్యాన్ని చూసిన అతని తల్లిదండ్రులు చాంద్‌పాషా, హసీనా కన్నీటి బాష్ఫాలు రాల్చారు. కోరిక తీరిందిలా... మెదక్ జిల్లా కూచన్‌పల్లిలో వాల్‌పేయింటింగ్ చేస్తూ జీవనం సాగించే దూదేకుల చాంద్‌పాషా, హసీనా దంపతులకు ముగ్గురు సంతానం. స్థానిక ప్రభుత్వ పాఠశాలలో సోఫియా మూడో తరగతి, ఇషాన్ రెండో తరగతి చదువుతున్నారు. ఐదేళ్ల తహసీన్ ఇంటివద్దే ఉంటుంది. భార్య హసీనా బీడీలు చుడతారని తెలిపాడు. చిన్నతనం నుంచే పోలీసు అవుతానని చెప్పే ఇషాన్‌కు బ్లడ్ క్యాన్సర్ ఉందని తేలడంతో తమకు దిక్కుతోచడం లేదన్నాడు. నగరంలోని ఎంఎన్‌జే ఆస్పత్రిలో చేర్పించామని, వైద్యులు బాగానే చికిత్స చేస్తున్నట్లు తెలిపాడు. ఇదే సమయంలో ‘మేక్ ఏ విష్ ఫౌండేషన్’ సభ్యులు తమ పిల్లాడి కోరికను తెలుసుకొని రాచకొండ కమిషనర్ మహేశ్ భగవత్ దృష్టికి తీసుకొచ్చి నెరవేర్చడం ఆనందంగా ఉందన్నారు. ఒకరోజు సీపీతో మహేశ్‌భగవత్ సంభాషణ మహేశ్‌భగవత్: కైసా లగ్రే... ఇషాన్...? ఇషాన్: అచ్చా లగ్రా... హ.. హ.. హ..(నవ్వుతూ..) మహేశ్‌భగవత్: క్యాకరింగే పోలీస్ ఆఫీసర్ బన్కే ? ఇషాన్: లా అండ్ ఆర్డర్‌కు కంట్రోల్ కర్తా.. మహేశ్‌భగవత్: ఔర్ క్యా కరేగా.. ? ఇషాన్: చోరోంకో పకడ్కే జైల్ మే దాలూంగా.. ఔర్ సిగరేట్ పీనేవాలోంకో, గుట్కా కానేవాలోంకో జైల్‌మే దాలూంగా. మహేశ్‌భగవత్: ఔర్తోం కో క్యాకరేగా.. ? ఇషాన్: ఔరతోంకో ముష్కిల్ పైదా కర్నే వాలోంకో జైల్‌మే దాల్కే మార్తా మహేశ్‌భగవత్: ఔరతోంకో కైసా హెల్ప్ కర్తే.. ? ఇషాన్: నవ్వుతూ.. నైమాలూమ్... త్వరగా కోలుకోవాలి ఇషాన్‌కు ఆరేళ్లకే క్యాన్సర్ వ్యాధి సోకడం చాలా బాధగా ఉంది. బాలుడు త్వరగా కోలుకోవాలి. మేక్ ఏ విష్ సంస్థ ప్రతినిధులు కలిసి బాలుడి కోరిక వివరించగా వెంటనే అం గీకరించాను. క్యాన్సర్ ఆస్పత్రిలో చికిత్స బాగా సాగుతోందని, తల్లిదండ్రులు కూడా చికిత్స తీరుపట్ల సంతృప్తిగా ఉన్నారు. విద్యార్థులు, యువకులు పోలీసులు, పోలీస్ ఆఫీస ర్లు కావాలనే కోరికను నెరవేర్చుకోవాలన్నారు. ఇప్పుడిప్పుడే చాలా మందికి పోలీసులమై ప్రజలకు న్యాయం చేయాలనే భావన కలుగుతోందన్నారు. –సీపీ మహేశ్‌భగవత్ -
ముంబై పోలీసుల ఔదార్యం
న్యూ ఢిల్లీ : ఆడుతూ, పాడుతూ స్నేహితులతో కలిసి హుషారుగా బడికి వెళ్లాల్సిన ఆ చిన్నారి పై విధి కక్ష కట్టింది. మరికొన్ని రోజుల్లో ఆ పసివాడు బాల్యాన్నే కాదు జీవితాన్నే కోల్పోనున్నాడు. నిండా ఏడేళ్లు కూడా లేని పసివాడిని క్యాన్సర్ రూపంలో విధి వెక్కిరించింది. మృత్యువు ఎప్పుడు తనను కబళిస్తుందో తెలియని ఆ చిన్నారికి ఒక కోరిక ఉంది. అందరి పిల్లల్లానే తాను బాగా చదువుకుని పెద్దయ్యాక పోలీసాఫీసర్ కావాలనుకున్నాడు. మరి ఇప్పుడు ఆ కల నెరవేరెందుకు అవకాశం లేదు. కానీ ఆ కోరికను ముంబై పోలీసుల సహకారంతో ‘మేక్ ఏ విష్ ఫౌండేషన్’ వారు తీర్చారు. పోలీసుల ఔదార్యాన్ని తెలిపే ఈ సంఘటన ముంబైలో జరిగింది. అర్పిత్ మండల్ అనే ఏడేళ్ల బాలుడు క్యాన్సర్‌తో బాధపడుతున్నాడు. అతని చివరి కోరిక పోలీసు ఆఫీసర్ కావడం. మేక్ ఏ విష్ వారి ద్వారా ఈ విషయం తెలుసుకున్న ముంబై పోలీసులు అర్పిత్‌ను ఒక రోజు ములంద్ పోలీస్ స్టేషన్‌కు ఇన్స్పెక్టర్గా నియమించారు. అర్పిత్ పోలీస్ దుస్తుల్లో రాగ మిగితా పోలీసు అధికారులు అతనికి గౌరవ వందనం చేశారు. వారి సెల్యూట్‌ని స్వీకరించి డెస్కులో కూర్చున్న అర్పిత్ కళ్లలో సంతోషం అంతా ఇంతా కాదు. ఇందుకు సంబంధించిన ఫోటోలను ముంబై పోలీసులు తమ ట్విటర్లో పోస్టు చేశారు. ముంబై పోలీసుల ఔదర్యాన్ని పలువురు మెచ్చుకుంటున్నారు. ప్రాణాంతక వ్యాధులతో బాధపడుతున్న చిన్నపిల్లల కోరికలను తీరుస్తున్న మేక్ ఏ విష్ సంస్థ 2015లో కూడా బ్లడ్ క్యాన్సర్‌తో బాధపడుతున్న ఐదేళ్ల బాలుడిని బోయవాడ పోలీస్‌స్టేషన్‌కు ఒక రోజు పోలీసాఫిసర్గా చేసింది. -
జైపూర్ కమిషనర్‌గా పదేళ్ల బాలుడు
జైపూర్: రాజస్థాన్ లోని జైపూర్ పోలీస్ కమిషనర్‌గా పదేళ్ల బాలుడు బాధ్యతలు స్వీకరించారు. వెంట వెంటనే తన దిగువ అధికారులకు ఆదేశాలు జారీ చేశాడు. అదేంటి పదేళ్ల బాలుడు పోలీస్ కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించడమా.. అని ఆశ్చర్యపోతున్నారా.. మరేంలేదు. రాజస్థాన్‌కు చెందిన గిరీశ్ శర్మ అనే బాలుడు గత కొద్ది కాలంగా తీవ్ర కిడ్నీ సమస్యలతో బాధపడుతున్నాడు. అతని పరిస్థితి కాస్తంత విషాధంగానే ఉంది. అయితే, ఆ బాలుడికి ఐపీఎస్ చదివి పోలీస్ కమిషనర్ కావాలని కోరిక. అతడి కోరికను గుర్తించిన ప్రముఖ స్వచ్ఛంద సంస్థ మేక్ ఏ విష్ పౌండేషన్ ఈ విషయాన్ని పోలీస్ కమిషనర్ జంగా శ్రీనివాసరావుకు వివరించింది. దీంతో ఆయన అనుమతించి ఒకరోజు పోలీస్ కమిషనర్‌గా బాధ్యతలు అప్పగించి అతడి కోరికను తీర్చారు. బాధ్యతలు స్వీకరించిన వెంటనే ప్రత్యేక చాంబర్లో గిరీశ్ శర్మ సమావేశం ఏర్పాటు చేశాడు. కింది స్థాయి అధికారులతో మాట్లాడారు. అనంతరం చాలా ఫైళ్లపై సంతకాలు కూడా చేశాడు. అనంతరం వారందరి నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ఈ దేశానికి ద్రోహం చేసేది ఎక్కువ దొంగలేనని వారిని అరెస్టు చేయడమే తన లక్ష్యమని ఈ సందర్భంగా చెప్పాడు. గిరీశ్ శర్మ మూడో తరగతి చదువుతున్నాడు.