Malabar Hill area
-
రూ.1000 కోట్లు పెట్టి ఇల్లు కొన్న డీమార్ట్ ఓనర్
సాక్షి, ముంబై: వ్యాపారవేత్త, బిలియనీర్, డీమార్ట్ సంస్థ యజమాని రాధాకిషన్ దమాని సుమారు 1,000 కోట్ల రూపాయలకు పైగా వెచ్చించి ఇంటిని కొనుగోలు చేశారు. దక్షిణ ముంబైలోని సంపన్న ప్రాంతాల్లో ఒకటైన మలబార్ హిల్‌లో ఆయన ఈ ఇంటిని తన సోదరుడు గోపీకిషన్ దమానితో కలిసి కొనుగోలు చేశారు. 5,752.22 చదరపు అడుగుల విస్తీర్ణం గల ఈ ఇంటి ఖరీదు1,001 కోట్ల రూపాయలు. దీని కొనుగోలు నిమిత్తం స్టాంప్ డ్యూటీ కోసం దమాని మహారాష్ట్ర రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ శాఖకు ఇప్పటికే రూ.30 కోట్లు చెల్లించారు. ఇక దీని మార్కెట్ విలువ 724 కోట్ల రూపాయలుగా అంచాన వేస్తున్నారు. ఈ ఇంటిని దమాని సౌరభ్ మెహతా, వర్షా మెహతా, జయేశ షా వద్ద నుంచి కొనుగోలు చేస్తున్నారు. ప్రస్తుతం దమాని ముంబైలోని ఆల్టమౌంట్ రోడ్‌లోని పృథ్వి అపార్ట్మెంట్లో నివాసం ఉంటున్నారు. ఈ ఇంటిని దమాని పురచంద్ రాయ్‌చంద్ అండ్ సన్స్ ఎల్ఎల్పీ, పరేష్‌చంద్ రాయ్‌చంద్ అండ్ సన్స్ ఎల్ఎల్పీ, ప్రేమ్‌చంద్ రాయ్‌చంద్ అండ్ సన్స్ ఎల్ఎల్పీ భాగస్వాముల నుంచి కొనుగోలు చేశారు. హురున్ ఇండియా రిచ్ లిస్ట్ 2021 ప్రకారం, రాధాకిషన్ దమాని 14.5 బిలియన్ డాలర్ల ఆస్తితో భారతీయ సంపన్నుల జాబితాలో ఎనిమిదవ స్థానంలో ఉన్నారు. భారతదేశంలో 209 మంది బిలియనీర్లు ఉండగా, వారిలో 177 మంది ప్రస్తుతం దేశంలో నివసిస్తున్నారు. రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు చెందిన ముకేష్ అంబానీ 85 బిలియన్ డాలర్ల ఆస్తులతో భారతీయ సంపన్నుల జాబితాలో ప్రథమ స్థానంలో నిలిచారు. చదవండి: కరోనా వల్ల లాభపడింది ఆ ఒక్కరే -
అపార్ట్మెంట్లో 21 మందికి కరోనా
ముంబై : మహారాష్ర్టలో కరోనా విజృంభిస్తోంది. తాజాగా ముంబైలోని మలబార్ హిల్స్ ప్రాంతంలోని అపార్ట్మెంట్లో కోవిడ్ కలకలం సృష్టించింది. గడిచిన వారం రోజుల్లో 21 మందికి కరోనా సోకడంతో ఆ ప్రాంతాన్ని కంటైన్మెంట్ జోన్‌గా ప్రకటించినట్లు ముంబై మునిసిపల్ కార్పొరేషన్ సోమవారం ప్రకటించింది. దీంతో వీరిని క్వారంటైన్ కేంద్రాలకు తరలించి అపార్ట్మెంట్ చుట్టు పక్కల ప్రాంతాల్లో శానిటైజేషన్ నిర్వహించారు. వైరస్ సోకిన వారిలో 19 మంది వివిధ ఇళ్లలో పనిచేసేవారు, డ్రైవర్లు, సెక్యురిటీ సిబ్బంది తదితరులు ఉన్నారని పేర్కొంది. దీంతో వీరి ద్వారా వైరస్ మరింత మందికి సోకే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. దీంతో మిగతా అపార్ట్మెంట్ వాసులకి కూడా విస్తృతంగా కరోనా పరీక్షలు నిర్వహిస్తామని ముంబై మునిసిపల్ కార్పొరేషన్ తెలిపింది. కరోనా పరీక్షలు తేలాల్సి ఉందని పేర్కొన్నారు. (60 వేలు దాటిన కరోనా కేసులు.. మదురైలో మళ్లీ లాక్డౌన్ ) దేశవ్యాప్తంగా నమోదవుతున్న కరోనా కేసుల్లో అత్యధికంగా మహారాష్ర్టలోనే రికార్డు స్థాయిలో కేసులు వెలుగుచూస్తున్నాయి. ఆ తర్వాత తమిళనాడు, గుజరాత్, ఉత్తరప్రదేశ్ రాష్ర్టాల్లో కరోనా కేసులు అధికంగా నమోదవుతున్నాయి. ఇక ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసుల్లో భారత్ మూడో స్థానంలో ఉంది. భారత్‌లో 24 గంటల్లోనే 14,821 కొత్త కరోనా కేసులు నమోదు కాగా, మొత్తంలో కేసుల సంఖ్య 4,25,282కు చేరిందని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. ( ఎమ్మెల్యేతో పాటు కుటుంబమంతా పాజిటివ్ ) -
రూ. 425 కోట్లతో ఇల్లు కొన్న బిర్లా
- ప్రసిద్ధ జతియా హౌస్ కోసం కుమార మంగళం బిర్లా డీల్ ముంబై: పారిశ్రామిక దిగ్గజం కుమార మంగళం బిర్లా భారీ రియల్టీ డీల్‌కు తెరతీశారు. ముంబైలోని మలబార్ హిల్ ప్రాంతంలో జతియా హౌస్‌ను రూ. 425 కోట్లకు వేలంలో కొనుగోలు చేశారు. వాణిజ్య అవసరాలకు కాకుండా, వ్యక్తిగత వినియోగం కోసం ప్రాపర్టీ కొనుగోలుకు ఇది చాలా భారీ మొత్తం అని పరిశ్రమవర్గాలు తెలిపాయి. వేలంలో మొత్తం అయిదుగురు బిడ్డర్లు పాల్గొన్నారు. మరో పారిశ్రామిక దిగ్గజం అజయ్ పిరమాల్ కూడా పోటీపడినట్లు సమాచారం. ముంబైలో ప్రసిద్ధిపొందిన హౌస్‌ల్లో జతియా హౌస్ ఒకటి. ఆదిత్య బిర్లా గ్రూప్ వర్గాలు దీనిపై స్పందించేందుకు నిరాకరించగా.. ఒప్పందం కుదిరినట్లు డీల్ అడ్వైజర్ అంతర్జాతీయ కన్సల్టెన్సీ సంస్థ జోన్స్ లాంగ్ లాసలె (జేఎల్ఎల్) తెలిపింది. జేఎస్‌డబ్ల్యూ గ్రూప్ అధినేత సజ్జన్ జిందాల్.. 2011లో మహేశ్వరి హౌస్‌ను కొనుగోలు చేసేందుకు వెచ్చించిన రూ. 400 కోట్ల కన్నా ఈ డీల్ విలువ అధికం కావడం గమనార్హం. సముద్రానికి అభిముఖంగా ఉండే రెండంతస్తుల జతియా హౌస్ బంగళా.. బిల్టప్ ఏరియా సుమారు 25,000 చ.అ. ఉంటుంది. 1970లలో వై జతియా దీన్ని ఎంసీ వకీల్ నుంచి కొనుగోలు చేశారు. ప్రస్తుతం పదమ్జీ ఇండస్ట్రీస్ నిర్వహించే జతియా సోదరులు అరుణ్, శ్యామ్ ప్రస్తుతం ఇందులో నివాసముంటున్నారు. వ్యక్తిగత అవసరాల కోసం స్థిరాస్తిని కొనేటప్పుడు వాటి వ్యాపారపరమైన విలువ గురించి కొనుగోలుదారులు పెద్దగా పట్టించుకోరని, ఇలాంటి వాటిపై నిర్ణయాలు తీసుకునేందుకు సరైన మార్కెట్ పరిస్థితులు వచ్చే దాకా వేచి చూడరని కన్సల్టెన్సీ సంస్థ పీడబ్ల్యూసీ ఈడీ శశాంక్ జైన్ పేర్కొన్నారు.