రూ. 425 కోట్లతో ఇల్లు కొన్న బిర్లా
- ప్రసిద్ధ జతియా హౌస్ కోసం కుమార మంగళం బిర్లా డీల్
ముంబై: పారిశ్రామిక దిగ్గజం కుమార మంగళం బిర్లా భారీ రియల్టీ డీల్‌కు తెరతీశారు. ముంబైలోని మలబార్ హిల్ ప్రాంతంలో జతియా హౌస్‌ను రూ. 425 కోట్లకు వేలంలో కొనుగోలు చేశారు. వాణిజ్య అవసరాలకు కాకుండా, వ్యక్తిగత వినియోగం కోసం ప్రాపర్టీ కొనుగోలుకు ఇది చాలా భారీ మొత్తం అని పరిశ్రమవర్గాలు తెలిపాయి. వేలంలో మొత్తం అయిదుగురు బిడ్డర్లు పాల్గొన్నారు. మరో పారిశ్రామిక దిగ్గజం అజయ్ పిరమాల్ కూడా పోటీపడినట్లు సమాచారం. ముంబైలో ప్రసిద్ధిపొందిన హౌస్‌ల్లో జతియా హౌస్ ఒకటి. ఆదిత్య బిర్లా గ్రూప్ వర్గాలు దీనిపై స్పందించేందుకు నిరాకరించగా.. ఒప్పందం కుదిరినట్లు డీల్ అడ్వైజర్ అంతర్జాతీయ కన్సల్టెన్సీ సంస్థ జోన్స్ లాంగ్ లాసలె (జేఎల్‌ఎల్) తెలిపింది. జేఎస్‌డబ్ల్యూ గ్రూప్ అధినేత సజ్జన్ జిందాల్.. 2011లో మహేశ్వరి హౌస్‌ను కొనుగోలు చేసేందుకు వెచ్చించిన రూ. 400 కోట్ల కన్నా ఈ డీల్ విలువ అధికం కావడం గమనార్హం.
సముద్రానికి అభిముఖంగా ఉండే రెండంతస్తుల జతియా హౌస్ బంగళా.. బిల్టప్ ఏరియా సుమారు 25,000 చ.అ. ఉంటుంది. 1970లలో వై జతియా దీన్ని ఎంసీ వకీల్ నుంచి కొనుగోలు చేశారు. ప్రస్తుతం పదమ్‌జీ ఇండస్ట్రీస్ నిర్వహించే జతియా సోదరులు అరుణ్, శ్యామ్ ప్రస్తుతం ఇందులో నివాసముంటున్నారు. వ్యక్తిగత అవసరాల కోసం స్థిరాస్తిని కొనేటప్పుడు వాటి వ్యాపారపరమైన విలువ గురించి కొనుగోలుదారులు పెద్దగా పట్టించుకోరని, ఇలాంటి వాటిపై నిర్ణయాలు తీసుకునేందుకు సరైన మార్కెట్ పరిస్థితులు వచ్చే దాకా వేచి చూడరని కన్సల్టెన్సీ సంస్థ పీడబ్ల్యూసీ ఈడీ శశాంక్ జైన్ పేర్కొన్నారు.