ముంబై: పారిశ్రామిక దిగ్గజం కుమారమంగళం బిర్లా కుమార్తె అనన్య బిర్లాకు చెందిన సూక్ష్మ రుణాల సంస్థ ’స్వతంత్ర’ తాజాగా చైతన్య ఇండియా ఫిన్ క్రెడిట్‌ను కొనుగోలు చేయనుంది. ఇందుకోసం రూ. 1,479 కోట్లు వెచ్చించనుంది ఈ లావాదేవీ 2023 చివరి నాటికి పూర్తవుతుందని కంపెనీ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపింది.
ఫ్లిప్‌కార్ట్ సహ–వ్యవస్థాపకుడు సచిన్ బన్సల్‌కి చెందిన నవీ గ్రూప్‌లో చైతన్య ఇండియా భాగంగా ఉంది. చైతన్య కొనుగోలు ద్వారా 36 లక్షల మంది యాక్టివ్ కస్టమర్లు, 20 రాష్ట్రాల్లో 1,517 శాఖలు, రూ. 12,409 కోట్ల అసెట్స్ (ఏయూఎం)తో స్వతంత్ర దేశీయంగా రెండో అతి పెద్ద మైక్రోఫైనాన్స్ సంస్థగా ఆవిర్భవించనుంది.
2013లో అనన్య బిర్లా ప్రారంభించిన స్వతంత్రలో రూ. 7,499 కోట్ల ఏయూఎం, 7,000 మంది పైచిలుకు ఉద్యోగులు, 22 లక్షల గ్రామీణ కస్టమర్లు ఉన్నారు. చైతన్య ఇండియా ఫిన్ క్రెడిట్‌కు రూ. 4,900 కోట్ల ఏయూఎం, 6,000 మంది ఉద్యోగులు, 14 లక్షల మంది కస్టమర్లు ఉన్నారు. చైతన్య ఇండియా, దాని మాతృ సంస్థ నవీ ఫిన్‌సర్వ్‌ను 2019లో బన్సల్ కేవలం రూ. 150 కోట్లకు కొనుగోలు చేశారు. గత నాలుగేళ్లలో చైతన్య ఆరు రెట్లు వృద్ధి చెందినట్లు బన్సల్ తెలిపారు. ఈ కొనుగోలుతో తమ సంస్థ విస్తృతి మరింత పెరగగలదని అనన్య బిర్లా తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment