ఈక్విటీ మార్కెట్ల ర్యాలీ కొనసాగుతుంది
న్యూఢిల్లీ: దేశీయ ఈక్విటీ మార్కెట్లలో ర్యాలీ కొనసాగుతుందని ప్రముఖ మార్కెట్ నిపుణుడు, కోటక్ మహీంద్రా అస్సెట్ మేనేజ్మెంట్ కంపెనీ (మ్యూచువల్ఫండ్/ఏఎంసీ) ఎండీ నీలేష్ షా అభిప్రాయపడ్డారు. కరోనా రెండో విడత వల్ల తాత్కాలిక సమస్యలున్నా కానీ.. దీర్ఘకాలంలో కంపెనీల లాభదాయకత మెరుగుపడడం ర్యాలీకి మద్దతునిచ్చే అంశంగా ఆయన పేర్కొన్నారు. అసోసియేషన్ ఆఫ్ నేషనల్ ఎక్సే్ఛంజ్ మెంబర్స్ ఆఫ్ ఇండియా (ఏఎన్ఎంఐ) ‘ఈక్విటీ మార్కెట్ల భవిష్యత్తు’ అనే అంశంపై నిర్వహించిన వెబినార్లో నీలేష్ షా మాట్లాడారు. ‘‘కంపెనీల లాభాల్లో పురోగతిని స్టాక్ మార్కెట్ సానుకూలంగా పరిగణిస్తోంది. 2020 జూన్ త్రైమాసికంలో రూ.32,000 కోట్లుగా ఉన్న లాభం.. 2021 మార్చి త్రైమాసికం నాటికి రూ.2,10,000 కోట్లకు పెరిగింది. దీంతో కరోనా కారణంగా స్వల్పకాలంలో ఉండే సమస్యలను మార్కెట్ పట్టించుకోవడం లేదు. దీర్ఘకాలంలో కంపెనీల లాభదాయకతను సానుకూలంగా చూస్తోంది. 2021 జూన్ త్రైమాసికంలో కంపెనీల లాభాలు తగ్గుతాయి. అయితే ఆ తర్వాత మళ్లీ పుంజుకుంటాయన్నది మార్కెట్ అంచనాగా ఉంది’’ అని నీలేష్షా తెలిపారు.
ఇవీ సానుకూలతలు..
అందరికీ టీకాలు ఇచ్చే కార్యక్రమం, ఆరోగ్యసంరక్షణ కోసం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, తక్కువ వడ్డీ రేట్లు, తక్కువ నిర్వహణ వ్యయాలు, ప్రజల జీవనానికి మద్దతుగా ఉద్దీపన చర్యలు అన్నవి మార్కెట్లకు వచ్చే ఆరు నెలల కాలంలో ఎగువవైపు దిశగా మద్దతునిస్తాయని నీలేష్ అంచనా వేశారు. దీర్ఘకాలానికి భారత్ మూలాలు బలంగా ఉండనున్నట్టు చెప్పారు. ద్రవ్యోల్బణం మోస్తరు స్థాయిలో ఉండేందుకు తీసుకున్న చర్యలు, ద్రవ్యలోటు స్థిరత్వం, విదేశీ మారక నిల్వలు దండిగా ఉండడం, బ్యాంకింగ్ రంగం బలోపేతం కావడడం, భౌతిక, డిజిటల్ సదుపాయాలు అందుబాటులో ఉండడం ఆర్థిక ప్రగతికి తోడ్పడే అంశాలుగా వివరించారు. గృహ ఆధునికీకరణ, రియల్ ఎస్టేట్, ఇండస్ట్రియల్, డిజిటలైజేషన్ దీర్ఘకాలంలో మంచి పనితీరు చూపిస్తాయని అంచనా వేశారు. ఇదే సమావేశంలో ఏఎన్ఎంఐ ప్రత్యామ్నాయ ప్రెసిడెంట్ కమలేష్షా మాట్లాడుతూ.. రిటైల్ ఇన్వెస్టర్లు ఇంతకుముందు ఎన్నడూ లేని విధంగా స్టాక్ మార్కెట్లలో పాల్గొంటున్న తీరు ఆనందాన్నిస్తుందన్నారు. ఆది ఆశ, భయం సిద్ధాంతాన్ని గుర్తు చేస్తోందని ఆయన వ్యాఖ్యానించారు.