స్పెయిన్ కంపెనీకి ‘చెత్త’ బాధ్యతలు!
బెంగళూరు : చెత్త డంపింగ్ యార్డ్ నిర్వహణ బాధ్యతలను స్పెయిన్ దేశానికి చెందిన కంపెనీకి అప్పగించాలని బీబీఎంపీ అధికారులు భావిస్తున్నారు. ఈ మేరకు వచ్చే పాలికె సర్వసభ్య సమావేశంలో తగిన నిర్ణయం తీసుకోవాలని నిర్ణయించారు. బీబీఎంపీ మేటర్ కట్టే సత్యనారాయణ, డిప్యూటీ మేయర్ ఇందిరా, పాలికె పరిపాల విభాగం నాయకుడు అశ్వథ్ నారాయణగౌడ, పాలికె ప్రతిపక్ష నేత మంజునాథరెడ్డి, అధికారులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా స్పెయిన్ కంపెనీ అధికారులతో బుధవారం సాయంత్రం చర్చించారు. రోజూ సుమారు 1,000 టన్నుల చెత్తను డంప్ చేస్తే విద్యుత్ ఉత్పత్తి చేస్తామని, అయితే ఆ ప్లాంట్ను ఏర్పాటు చేయడానికి 18 నెలలు పడుతుందని స్పెయిన్ అధికారులు స్పష్టం చేశారు. దీంతో కౌన్సిల్ సభలో, రాష్ట్ర ప్రభుత్వంతో దీనిపై చర్చించి తగు నిర్ణయం తీసుకుంటామని మేయర్ కట్టే సత్యనారాయణ తెలిపారు.
నేడు సీఎం సమావేశం
మండూరు చెత్త సమస్యపై ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తన క్యాంపు కార్యాలయం కృష్ణలో అధికారులతో శుక్రవారం సమావేశం కానున్నారు. బెంగళూరు నగర ఇన్చార్జ్ మంత్రి రామలింగారెడ్డి, బీబీఎంపీ కమిషనర్ లక్ష్మినారాయణ, మేయర్ కట్టే సత్యనారాయణ, డిప్యూటీ మేయర్ ఇందిరా తదితరులు ఈ సమావేశానికి హాజరు కానున్నారు. చెత్త తరలింపుపై ఈ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకునే అవకాశముంది.