యువ ప్రతిభా ప్రదర్శనకు ‘బీమస్’
విజయవాడ (గుణదల): విద్యార్థుల్లో ఉన్న నిగూఢమైన ప్రతిభను వెలికితీయటానికి తమ కళాశాల యాజమాన్యం కృషి చేస్తుందని ఆంధ్రా లయోలా కళాశాల వైస్ ప్రిన్సిపల్ ఫాదర్ మెల్కియార్ అన్నారు. మేనేజ్మెంట్ విద్యార్థులంటే ప్రతి అంశంలో రాణించాలనే నేపథ్యంలో తాను 2007వ సంవత్సరం నుంచి నిర్వహిస్తున్న బీమస్ కార్యక్రమం ఈ నెల 19, 20వ తేదీల్లో నిర్వహిస్తున్నామని ఆయన అన్నారు. ఆదివారం కళాశాల్లో విలేకరులతో మాట్లాడారు. బీమస్–2016 ఫాదర్ దేవయ్య ఆడిటోరియంలో ఉదయం 9 గంటలకు ప్రారంభమవుతుందని, ముఖ్య అతిథిగా రాష్ట్ర కస్టమ్స్ కమిషనర్ ఎస్.ఖదీర్ రెహమాన్ పాల్గొంటారని తెలిపారు. బీమస్లో డిగ్రీ విద్యార్థులకు జాతీయ స్థాయిలో, ఇంటర్మీడియట్ విద్యార్థులకు రాష్ట్ర స్థాయిలో పోటీలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ పోటీలకు తమిళనాడు, కేరళ, తెలంగాణా, కర్నాటక, పశ్చిమబంగా రాష్ట్రాల నుంచి 50 డిగ్రీ కళాశాలలు, 30 ఇంటర్మీడియట్ కళాశాలల నుంచి విద్యార్థులు హాజరవుతున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో నోవాలోవా అనే పేరుతో క్విజ్, జలపెనో పేరుతో గ్రూప్ డిస్కషన్, బిజ్మార్ట్ పేరుతో ప్రోడక్ట్ లాంచింగ్, మిస్టర్ జీనియస్ పేరుతో కేస్ స్టడీ, ప్లీన్గ్నో పేరుతో బిజినెస్ ప్లాన్, ఫ్యూ మినిట్స్ టు ఫ్రేమ్ పేరుతో పర్సనాలిటీ కాంటెస్ట్ పోటీలను నిర్వహిస్తున్నామని వివరించారు. అనంతరం బీమస్–2016 పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సమావేశంలో బీమస్ కో–ఆర్డినేటర్ ఫాదర్ బుచ్చిబాబు, డాక్టర్ ఫ్రాన్సిస్ జేవియర్ పాల్గొన్నారు.