ఈ అమ్మాయి చాలా గ్రేట్..
మంచానికే పరిమితమైన కవలల్ని వివాహమాడిన యువతులు
పెద్దలు కాదన్నా ఒప్పించి మరీ తాళి కట్టించుకున్న వైనం
చెన్నై, సాక్షి ప్రతినిధి: అవయవాలన్నీ సక్రమంగా ఉండి, సరైన ఆదాయం ఉంటేనే వివాహమవడం కష్టం. అటువంటిది రెండు దశాబ్దాలుగా పడకకే పరిమితమైన కవలలను ఇద్దరు యువతులు వివాహమాడారు. మానవత్వం చాటారు. జీవితాంతం తోడుంటామని బాస చేశారు. ఇందుకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. తమిళనాడులోని కన్యాకుమారి జిల్లా సామియార్ మఠానికి చెందిన జార్జి విలియమ్, అన్నమ్మాళ్ దంపతుల కుమారులైన విజయకుమార్, జయకుమార్ అనారోగ్యంతో పదేళ్ల వయసులోనే మంచం పట్టారు. తల్లిదండ్రులు ఎన్ని చికిత్సలు చేసినా ఫలితం దక్కలేదు.
వారిప్పుడు 30 ఏళ్ల వయసుకు చేరుకున్నారు. 20 ఏళ్లుగా మంచానికే పరిమితమైపోయిన ఆ అన్నదమ్ముల గురించి తెలుసుకున్న కేరళకు చెందిన మంజూష సామియార్ మఠానికి చేరుకుని వారిపట్ల సానుభూతి ప్రకటించింది. అన్నదమ్ముల్లో పెద్దవాడైన విజయకుమార్‌ను 2012లో పెళ్లి చేసుకుంది. తిరునల్వేలి జిల్లా నాంగునేరీకి చెందిన శివకులదేవి సెల్‌ఫోన్ ద్వారా జయకుమార్తో పరిచయం పెంచుకుంది. వీరి పరిచయం క్రమేణా ప్రేమగా మారి పెళ్లికి దారితీసింది. పెద్దలు తొలుత తిరస్కరించినప్పటికీ శివకులదేవి వారిని మెల్లగా ఒప్పించింది. ఈ నెల 22వ తేదీన జయకుమార్ మంచంపై నుంచి లేవలేని స్థితిలోనే ఆమెను వివాహం చేసుకున్నాడు.