భివండీలో శివసేన విస్తృత ప్రచారం
భివండీ, న్యూస్‌లైన్: భివండీలో శివసేన పార్టీ విస్తృతంగా ఎన్నికల ప్రచారం చేస్తోంది. 136-పడమర భివండీ నియోజక వర్గం నుంచి శివసేన అభ్యర్థిగా ఎన్నికల బరిలోకి దిగిన మనోజ్ కాటేకర్ ప్రచార జోరును పెంచారు. శివాజీ చౌక్‌లోగల శివాజీ మహరాజ్ విగ్రహానికి పూలమాల వేసి ప్రచార మహార్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో భారీ సంఖ్యలో మరాఠీలు, ఉత్తర భారతీయులు, గుజరాతీలు, ముస్లింలతోపాటు తెలుగు ప్రజలు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు. శివాజీ చౌక్ నుంచి ప్రారంభమైన ర్యాలీ పాంజలాపూర్, మండాయి, తీన్‌బత్తి, కుంబార్‌వాడ, అజయ్‌నగర్ తదితర ప్రాంతాలగుండా సాగింది.
ఈసారి ఎన్నికల్లో తనకు మద్దతు పలకాలని మనోజ్ కాటేకర్ కోరారు. 23 సంవత్సరాలుగా కార్పొరేటర్‌గా, ప్రస్తుతం డిప్యూటీ మేయర్‌గా సేవలందిస్తున్నాని గుర్తు చేశారు. పవర్లూమ్ కార్మికులకు సొంత ఇల్లు ఉండేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. మండాయిలో భాజీ మార్కెట్ ఏర్పాటు చేస్తానని, సీసీ రోడ్లు వేయిస్తానని, దొంగతనాలు అరికట్టేందుకు పట్టణ వ్యాప్తంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తానని, ప్రభుత్వ ఆసుపత్రి, వృద్ధుల కోసం విశ్రాంతి ఉధ్యానవనం, ప్రభుత్వ ఇంజనీరింగ్, మెడికల్ డిగ్రీ కళాశాల ఏర్పాటుకు కృషి చేస్తానని చెప్పారు. ఈ ర్యాలీలో పట్టణ మాజీ అధ్యక్షుడు మోహన్ వల్లాల్, కార్పొరేటర్లు కమ్లాకర్ పాటిల్, వందనా కాటేకర్, సుభాష్ మానే, బాలారామ్ చౌదరి, గుల్వీ, మధన్ బువ్వా, ఉప విభాగ అధ్యక్షుడు శ్రీరాం కుమార్, మనోజ్ చిల్కేవార్తోపాటు భారీ సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు.