manthri Shankar
-
ముగ్గురు భార్యలు.. మరో ముగ్గురితో సహజీవనం
సాక్షి,హైదరాబాద్: మంత్రి శంకర్..దాదాపు నలభై ఏళ్లుగా అన్ని పోలీసు విభాగాలకు సుపరిచితమైన పేరు. ఇతడి గురించి చెప్పాలంటే అనేక దొంగతనాల్లో ఆరితేరిన తస్కర యోధవృద్ధుడు..చోరకళా తపస్వి. అవును.. 256 నేరాలు..32 సార్లు జైలు శిక్ష..నాలుగుసార్లు పీడీ యాక్ట్..ఇదీ మంత్రి శంకర్ అలియాస్ శివన్న ట్రాక్ రికార్డు. అయితే..ఏంటి? అనుకుంటున్నారా?? ఇన్నిసార్లు జైలుకెళ్లినా అతగాడి దొంగబుద్ధి మాత్రం మారలేదు. మరీ!! ఇరవై ఏళ్ల వయసులోనే దొంగతనాలు ప్రారంభించిన మంత్రి శంకర్ 60 ఏళ్ల వయసొచ్చినా తన బుద్ధి మార్చుకోలేక పోలీసుల చేతికి మళ్లీ చిక్కాడు. ఈసారి ఆరు నేరాల్లో నిందితుడిగా ఉన్న మంత్రి శంకర్‌తో పాటు అతడికి సహకరించిన మరో ముగ్గురినీ కూడా అరెస్టు చేసినట్లు నగర పోలీసు కమిషనర్ అంజనీకుమార్ శుక్రవారం మీడియాకు వెల్లడించారు. సాధారణంగా బోయిన్పల్లి, బేగంపేట, మారేడ్‌పల్లి, కార్ఖానా, ఉస్మానియా వర్శిటీ ఠాణాల పరిధిల్లో ఒంటరిగానే చోరీలు చేసే మంత్రి శంకర్ వయసు మీదపడుతుండటంతో గత రెండేళ్లుగా ముఠాలను కట్టి దొంగతనాలు చేయడం మొదలుపెట్టాడు. చదవండి: న్యూ ఇయర్ వేడుకలపై నిషేధం గతంలో ఓ కేసులో జైలుకెళ్లిన మంత్రి శంకర్ ఈనెల 4న జైలు నుంచి బయటకొచ్చాడు. అయితే ఈసారి ఫలక్‌నుమాకు చెందిన అబ్దుల్ లతీఫ్ ఖాన్, భవానీనగర్ వాసి మహ్మద్ మజీద్, నల్లకుంట వాసి మహ్మద్ ఇంతియాజ్ అహ్మద్‌లతో కలసి మంత్రి శంకర్ ముఠాను ఏర్పాటు చేసుకుని నల్లకుంట, కుషాయిగూడ, వనస్థలిపురం ప్రాంతాల్లో తన చేతివాటం చూపించాడు. ఈనెల 11వ తేదీ రాత్రి బేగంపేటలో వరుసగా ఐదు ఇళ్ళ తాళాలు పగులకొట్టి ‘సోదా’చేయగా..రెండు ఇళ్ళల్లో మాత్రం బంగారం, నగదు లభించడంతో ఎత్తుకుపోయారు. బేగంపేటలో నమోదైన కేసుల దర్యాప్తు కోసం రంగంలోకి దిగిన నార్త్‌జోన్ టాస్క్‌ఫోర్స్ ఇన్స్పెక్టర్ కె.నాగేశ్వరరావు, ఎస్సైలు జి.రాజశేఖర్‌రెడ్డి, కె.శ్రీకాంత్, బి.పరమేశ్వర్లు మంత్రి శంకర్ తోపాటు అతడికి సహకరించిన ముగ్గురినీ మహారాష్ట్రలో పట్టుకున్నారు. వీరి నుంచి రూ.12 లక్షల నగదుతో పాటు బంగారం, వాహనాలు, చోరీకి వాడే వస్తువులు స్వా«దీనం చేసుకున్నారు. అలా దొంగగా మారి.. సికింద్రాబాద్‌లోని చిలకలగూడకు చెందిన మంత్రి శంకర్ అప్పట్లో తన తల్లితో తరచూ గొడవపడుతున్న వ్యక్తిపై హత్యాయత్నం చేశాడు. ఈ కేసులో జైలుకు వెళ్ళి వచ్చిన శంకర్ 1979 డిసెంబర్లో తొలిసారిగా ఓ చోరీ చేసి దొంగగా మారాడు. ఈ కేసులో ఆ తర్వాత చోరీ సొత్తు ఖరీదు చేసే రిసీవర్‌గా మారాడు. ఈ నేరం కింద పోలీసులకు చిక్కడంతో రిమాండ్ నిమిత్తం అప్పటి ముషీరాబాద్ సెంట్రల్ జైలుకు వెళ్ళాడు. అక్కడే శంకర్‌కు నాటి ఛత్రినాక పోలీసుస్టేషన్ పరిధికి చెందిన దొంగలు నాగిరెడ్డి, బల్వీందర్ సింగ్, దీపక్ సక్సేనా, నాగులు వద్ద తాళం ఎలా పగులకొట్టాలో నేర్చుకున్నాడు. అక్కడే జైలులోని వంటగది తాళం పగులకొట్టించి చోరీ చేయిస్తూ వంట సామాను బయటకు తెప్పించి వండుకుని తినేవాళ్ళు. మీడియాకు వివరాలు వెల్లడిస్తున్న నగర సీపీ అంజనీకుమార్. దొంగే..దొరబాబులా దొరబాబులా ఖరీదైన వస్త్రాలు, బూట్లు, టై ధరించి కార్లలో తిరుగుతూ రెక్కీలు చేసేవాడు. తాళం వేసి ఉన్న ఇల్లు రోడ్డు మీదికి కనిపిస్తే చాలు కాస్త దూరంలో వాహనాన్ని ఆపి దర్జాగా వెళ్ళి ‘పని’పూర్తి చేసుకుని వచ్చేవాడు. చిన్న రాడ్డు, స్క్రూ డ్రైవర్లను తనతో ఉంచుకునే శంకర్ ఎలాంటి తాళాన్నైనా కేవలం పది సెకన్లలో పగులకొట్టేవాడు. అర్ధరాత్రి దొంగతనం చేసి ఆ ఇంటి మిద్దె మీద తెల్లవారే వరకు కూర్చుని..మార్నింగ్ వాకర్స్ హడావుడి మొదలైనప్పుడు వారితో కలసిపోయేవాడు. ఇతడు పోలీసుల నిఘాకు చిక్కకుండా ఉండేందుకు వరుసగా మూడు రోజుల పాటు ఏ ఒక్క ప్రాంతంలోనూ ఉండకుండా మకాం మారుస్తూ ఉంటాడు. చోరీల ద్వారా వచ్చే సొమ్ముతో జల్సాలు చేసే ఇతగాడికి వ్యభిచారం ప్రధాన బలహీనత. వ్రస్తాలు, బూట్లతో సహా ప్రతీదీ బ్రాండెడ్వే ఖరీదు చేసి వాడతాడు. ఇతగాడికి ముగ్గురు భార్యలు, ఆరుగురు సంతానం ఉన్నారు. ప్రస్తుతం మరో ముగ్గురు యువతులతో సహజీవనం చేస్తున్నాడు. -
దొంగ మంత్రి శంకర్.. పమేరియన్‌ను చూస్తే పరుగే!
సాక్షి, సిటీబ్యూరో: మంత్రి శంకర్... ఈ పేరు చెబితే పోలీసులకే కాదు, నగరవాసులకూ హడలే. ఒంటరిగా తిరుగుతూ తాళం వేసి ఉన్న ఇళ్లను గుర్తించి పంజా విసురుతాడు. 39 ఏళ్ల క్రితం తన 20వ ఏట తొలి నేరం చేసిన ఇతడిపై ఇప్పటి వరకు 255 కేసులు ఉన్నాయి. 32 సార్లు జైలుకు వెళ్లిన శంకర్‌పై ఇప్పటికి మూడుసార్లు పీడీ యాక్ట్ ప్రయోగించారు. ఇంతటి ఘరానా చరిత్ర ఉన్న మంత్రి శంకర్‌కు పమేరియన్ డాగ్స్ అంటే హడల్. అందుకే అవి ఉన్న ఇళ్లల్లో చోరీకి వెనుకడుగు వేస్తానంటూ పోలీసుల విచారణలో వెల్లడించాడు. ఈ ఘరానా దొంగతో పాటు అతడి సహాయకుడు దినకర్‌ను గత వారం కార్ఖానా పోలీసులు అరెస్టు చేసిన విషయం విదితమే. ముషీరాబాద్ జైలులోనే నేర పాఠాలు... చిలకలగూడ ప్రాంతానికి చెందిన మంత్రి శంకర్ (59) అలియాస్ శివన్న అలియాస్ శివప్రసాద్ తన 19వ ఏట 1979లో తొలిసారిగా నేరం చేశాడు. తన తల్లితో ఘర్షణ పడుతున్న వ్యక్తిపై హత్యాయత్నం చేసి జైలుకు వెళ్ళాడు. అక్కడ ఏర్పడిన పరిచయాలతో తన పంథా మార్చుకున్నాడు. ఆ కేసులో బెయిల్‌పై వచ్చిన అతను చోరీ సొత్తు ఖరీదు చేసే రిసీవర్‌గా మారాడు. ఈ నేరంపై పోలీసులకు చిక్కడంతో అప్పటి ముషీరాబాద్ సెంట్రల్ జైలుకు రిమాండ్‌కు తరలించారు. అక్కడే అతడికి ఘరానా దొంగలు నాగిరెడ్డి, బల్వీందర్ సింగ్, దీపక్ సక్సేనా, నాగులుతో పరిచయం ఏర్పడింది. తాళం ఎలా పగులకొట్టాలో శంకర్‌కు నేర్పిన వీరు తొలిసారిగా జైలులోని వంటగది తాళాన్ని పగులగొట్టించారు. అక్కడే పదేపదే చోరీ చేయిస్తూ వంట సామగ్రి బయటికి తెప్పించి వండుకుని తినేవారు. దీంతో అతను జైలు నుంచి బయటికి వచ్చేసరికి తాళాలు పగులగొట్టడంలో ఆరితేరాడు. చిలకలగూడ, రామాంతపూర్, నేతాజీనగర్ ప్రాంతాల్లో మకాం ఏర్పాటు చేసుకున్న ఇతను ఒంటరిగా కేవలం తాళం వేసు ఉన్న ఇళ్లను మాత్రమే టార్గెట్‌గా చేసుకుని రెచ్చిపోయేవాడు. సూటు, బూటుతో.. ఓ చిన్న రాడ్డు, నాలుగు స్క్రూడ్రైవర్లను తనతో ఉంచుకునే శంకర్ ఎలాంటి తాళాన్నైనా కేవలం మూడు సెకన్లలో పగులకొడతాడు. ఖరీదైన వస్త్రాలు, బూట్లు, టై ధరించి కాలనీల్లో తిరుగుతూ రెక్కీ నిర్వహించేవాడు. తాళం వేసి ఉన్న ఇళ్లు కనిపిస్తే దర్జాగా వెళ్లి చోరీ చేసుకుని వెళ్తాడు. లేని పక్షంలో తాళం వేసున్న ఇల్లు దొరికే వరకు పిట్ట గోడలు దూకుతూ పక్కనున్న ఇళ్లల్లోకి వెళ్తూనే ఉంటాడు. ఇలా ఓ లైన్ పూర్తయిన తర్వాత మరో లైన్లోకి వెళ్లి తన టార్గెట్ పూర్తి చేసేవాడు. సాధారణంగా అర్ధరాత్రి ఒంటి గంట నుంచి తెల్లవారుజామున నాలుగు గంటల మధ్యే దొంగతనం పూర్తి చేసేస్తాడు. చోరీ చేసిన అనంతరం ఆ ఇంటి మిద్దెపైనే తెల్లవారే వరకు కూర్చుంటాడు. మార్నింగ్ వాకర్స్ హడావుడి మొదలైనప్పుడు వారితో కలిసిపోయి తప్పించుకుంటాడు. తరచూ మకాం మారుస్తూ... మంత్రి శంకర్ ప్రధానంగా బోయిన్పల్లి, బేగంపేట, మారేడ్‌పల్లి, కార్ఖానా, ఉస్మానియా వర్శిటీ ఠాణాల పరిధిలోనే పంజా విసిరేవాడు. ఆయా ప్రాంతాల్లో ప్రతి అంగుళం ఇతడికి తెలిసి ఉండటంతో వీటినే టార్గెట్‌గా చేసుకుంటాడు. 38 ఏళ్లుగా చోరీలు చేస్తున్న ఇతడికి ముగ్గురు భార్యలు, ఆరుగురు పిల్లలు. ప్రస్తుతం మరో యువతితో సహజీవనం చేస్తున్నాడు. 32 సార్లు అరెస్టైన ఇతను పోలీసుల నిఘాకు చిక్కకుండా ఉండేందుకు జాగ్రత్తలు తీసుకుంటాడు. వరుసగా మూడు రోజుల పాటు ఏ ఒక్క ప్రాంతంలోనూ ఉండకుండా మకాం మారుస్తూ ఉంటాడు. చోరీల ద్వారా వచ్చే సొమ్ముతో జల్సాలు చేసే ఇతడికి వ్యభిచారం ప్రధాన బలహీనత. దుస్తులు, బూట్లతో సహా ప్రతీది బ్రాండెడ్‌వి కొనుగోలు చేస్తాడు. జైల్లో లేని సమయంలో ప్రతి నెలా కనీసం 3–4 చోరీలు చేస్తుంటాడు. దాదాపు 255 కేసుల్లో నిందితుడిగా ఉన్న ఇతడిపై 2015, 2017, 2018ల్లో మూడుసార్లు పీడీ యాక్ట్ ప్రయోగించారు. గత నెల 19న జైలు నుంచి బయటకు వచ్చాడు. కొన్నాళ్లుగా ముఠా.. శంకర్ దాదాపు 37 ఏళ్ల పాటు ఒంటరిగానే పంజా విసిరాడు. అయితే వయస్సు మీరడంతో రెండేళ్లుగా ముఠా కడుతున్నాడు. పాతబస్తీకి చెందిన ఒబేద్, జాఫర్‌ఖాన్‌లతో పాటు బన్సీలాల్‌పేటకు చెందిన దినకర్ ఇతడి అనుచరులు. వీరే ఇతడికి ఆశ్రయం కూడా కల్పిస్తుంటారు. సాధారణంగా చోరీ చేసిన సొత్తును కొన్ని ఫైనాన్స్ సంస్థల్లో తాకట్టు పెట్టి సొమ్ము చేసుకుంటాడు. 1998 నుంచి 2009 వరకు రామాంతపూర్‌లోని నేతాజీనగర్‌లో నివసించాడు. 2009 నుంచి తన మకాంను మహారాష్ట్రలోని లాథూర్ జిల్లా, ఔసా పట్టణానికీ మార్చి కొన్నాళ్లు అక్కడ ఉన్నాడు. మంత్రి శంకర్ తండ్రి మాజీ రైల్వే ఉద్యోగి.శంకర్ తల్లి గృహిణి కాగా ఇతను ఏకైన సంతానం. భారీ శునకాలకూ భయపడని శంకర్ పమేరియన్ డాగ్స్ ఉంటే మాత్రం ఆ ఇంట్లో చోరీకి వెనుకడుగు వేస్తుంటాడు. అవి అరిచి గోల చేస్తాయని, సముదాయించడం కష్టమనే అలా చేస్తుంటానని విచారణలో వెల్లడించినట్లు పోలీసులు పేర్కొన్నారు. -
ఘరానా దొంగ మంత్రి శంకర్ మళ్లీ దొరికాడు
రసూల్‌పురా: ఇళ్ళ తాళాలు పగులగొట్టి చోరీలకు పాల్పడే ఘరానా దొంగ మంత్రి శంకర్ మరోసారి పోలీసులకు పట్టుబడ్డాడు. 250 పైగా నేరాలు. 209 కేసులతో పాటు మూడుసార్లు పీడీ యాక్ట్‌పై జైలుకు వెళ్లివచ్చినా అతను తన పంథా మార్చుకోలేదు. మంగళవారం మంత్రి శంకర్‌తో పాటు అతని అనుచరుడు దినకర్‌ను కార్ఖానా పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి 100 గ్రాముల బంగారం, ఆటో, హోండా యాక్టివా స్వాధీనం చేసుకున్నారు. ఇతనిపై మరోసారి పీడీ యాక్ట్ నమోదు చేసేందుకు చర్యలు చేపట్టారు. మంగళవారం కార్ఖాన సీఐ మధుకర్‌స్వామి వివరాలు వెల్లడించారు. నార్త్‌జోన్ పరిధిలోని తుకారం గేట్, నేరేడ్మెట్, కుషాయిగూడ, కార్ఖాన ప్రాంతాల్లో వరుస దొంగతనాలు జరుగుతుండడంతో నార్త్‌జోన్ డీసీపీ కల్మేశ్వర్ ఆదేశాల మేరకు రెండు బృందాలు ఏర్పాటు చేశామన్నారు. మంగళవారం జేబీఎస్ వద్ద అనుమానస్పదంగా కనిపించిన మంత్రి శంకర్, అతని అనుచరుడు దినకర్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా నేరాలు అంగీకరించినట్లు తెలిపారు. మూడోసారి పీడీ యాక్ట్ కింద అరెస్టయిన శంకర్ గత నెల 19న చర్లపల్లి జైలు నుంచి విడుదలైనట్లు తెలిపారు. మరుసటి రోజు నుంచే పలు పీఎస్‌ల పరిధిలో రెక్కీ నిర్వహించి రాత్రుళ్లు దినకర్‌తో కలిసి చోరీలకు పాల్పడినట్లు తెలిపారు. గత నెల 29న శ్రీపురికాలనీలోని రెండు ఆపార్ట్ మెంట్లలో చోరీకి యత్నిచినట్లు తెలిపారు. ఇతర పీఎస్‌ల పరిధిలో జరిగిన దొంగతనాలపై దృష్టి సారించి రెండు బృందాలు ఏర్పాటు చేసి నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. -
మంత్రి శంకర్‌పై మళ్లీ పీడీయాక్ట్
ఉస్మానియా యూనివర్సిటీ: ఘరాన దొంగ మంత్రి శంకర్‌పై ఓయూ పోలీసులు రెండోసారి పీడీయాక్టు నమోదు చేశారు. ఆదివారం సీఐ అశోక్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం... 1979 నుంచి చోరీలు చేస్తున్న మంత్రి శంకర్ 155 కేసుల్లో నిందితుడు. ఓయూ పోలీసులు 2015లో శంకర్ పై పీడీయాక్టు నమోదు చేసి జైలుకు తరలించారు. ఏడాది పాటు జైలు జీవితాన్ని గడిపి మే నెలలో విడుదలైన శంకర్ మళ్లీ చోరీలు చేస్తున్నాడు. ఇటీవల హబ్సిగూడ స్ట్రీట్ నంబర్.8లో ఓ ఇంట్లో చోరీకి పాల్పడ్డాడు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితుడు శంకర్‌పై రెండవసారి పీడీ యాక్ట్ నమోదు చేసి అరెస్టు చేశారు. మహారాష్ట్ర లాతూర్ జిల్లాకు చెందిన మంత్రి శంకర్ మూడు పెళ్లిళ్లు చేసుకొని నగరంలో స్థిరపడ్డాడని పోలీసులు తెలిపారు. 11 కేజీల గంజాయి పట్టివేత సీతాఫల్మండి డివిజన్ రవీంద్రనగర్ (పిట్టల బస్తీ)లోని ఓ ఇంటిపై ఓయూ పోలీసులు దాడి చేశారు. 11 కేజీల గంజాయిని పట్టుకొని ఓ వ్యక్తిని అరెస్ట్ చేశారు. ఇన్స్పెక్టర్ అశోక్‌రెడ్డి కథనం ప్రకారం...రవీంద్రనగర్‌లో గంజాయి విక్రయిస్తున్నారనే పక్కా సమాచారంతో పోలీసులు కామిని సాయి ఇంటిపై దాడి చేసి 11 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం సాయిని అరెస్ట్ చేసి రిమాండ్ తరలించారు.